
అన్నాడీఎంకేలో ఇక ఆ రెండు వర్గాలేనా?
చెన్నై: జయలలిత మరణం తరువాత మూడు ముక్కలైన అన్నాడీఎంకే రెండుగా మారనుందా? ఇక ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు మాత్రమే మిగలనున్నాయా? అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది.
ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు నిన్నమదురైలో ఘనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పాండికోయిల్ సమీపంలోని అమ్మ మైదానంలో భారీ వేదికను నిర్మించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శుక్రవారం మదురైకు వచ్చారు. అయితే పార్టీపరంగా జరపాల్సిన ఈ కార్యక్రమాలకు ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను ఎడపాడి దూరంగా పెట్టారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీకి డబ్బును ఎరవేసి దినకరన్ జైలు పాలైనప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేశారు.
అయితే బెయిల్‌పై బైటకు వచ్చిన తరువాత పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని దినకరన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభం కాగా దినకరన్‌ను దూరం పెట్టారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇందుకు తీవ్రంగా ఆగ్రహించారు. అంతేగాక మదురైలోనే పోటీగా మరో భారీ ఎత్తున ఎంజీఆర్ శతజయంతి సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఎంజీఆర్ శత జయంతికి హాజరు కాకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందనే భయంతో దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు తంగ తమిళ్‌సెల్వన్, బోస్ సభకు హాజరయ్యారు. దినకరన్ వర్గం ఎడపాడికి దాసోహమైందని కొందరు వ్యాఖ్యానించగా, ప్రభుత్వ కార్యక్రయం కావడంతో వచ్చామని వారు సమర్థించుకున్నారు.
దినకరన్ పేరుతో పేరవై
మరోవైపు దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించారు. 54 జిల్లాల నిర్వాహకులను నియమించి వారిని ఆయన స్వయంగా కలిశారు. 50 లక్షల మందిని పేరవైలో చేర్పించాలనేదే తమ లక్ష్యంగా భావిస్తున్నట్లు దినకరన్ తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లే ముందు దినకరన్, వెంకటేశ్‌లను పార్టీలో చేర్పించిన విషయం తెలిసిందే.
దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. అయితే దినకరన్‌కు, ఎడపాడి వర్గాలకు ఘర్షణ ఏర్పడడంతో ఆయన పార్టీ నుంచి కొంత దూరమయ్యారు. హఠాత్తుగా దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించడం దానికి ఒకే రోజు 54 మంది జిల్లా నిర్వాహక కార్యదర్శులను నియమించిన సంఘటన అన్నాడీఎంకేలో సంచలనం కలిగించింది.