చెన్నై: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీని సైతం దద్దరిల్లిపోయేలా చేసిన ఈ ఘటనపై బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ప్రకటించారాయన. అయితే..
అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు సీఎం స్టాలిన్(CM Stalin) మాట్లాడుతూ.. ‘‘అన్నా వర్సిటీ ఘటనలో నిందితుడు కేవలం డీఎంకే మద్దతుదారుడేనని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు పార్టీ సభ్యుడు ఎంతమాత్రం కాదు’’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. మహిళల భద్రతే ప్రాధాన్యంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం.. నిందితుడికి రక్షణ కల్పించలేదని, భవిష్యత్తులోనూ కల్పించబోదని, పైగా అతనిపై గుండా యాక్ట్ ప్రయోగించామని ప్రకటించారు. అన్నా వర్సిటీ ఘటన.. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.
‘‘విద్యార్థినిపై లైంగిక దాడి(Sexual Assault) క్రూరమైన ఘటన. అయితే.. చట్ట సభ్యులు ఇవాళ ఈ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే అంతా పనిగా పెట్టుకున్నారు. బాధితురాలి తరఫు నిలబడి సత్వర న్యాయం చేకూర్చాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా.. ఘటన జరిగాక నిందితుడు తప్పించుకుంటేనో.. అరెస్ట్‌లో జాప్యం జరిగితేనో.. లేకుంటే నిందితుడ్ని రక్షించే ప్రయత్నాలు జరిగితేనో విమర్శలు వినిపిస్తాయి. కానీ, ఇక్కడ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాద్ధాంతం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారాయన.
అన్నా వర్సిటీ(Anna University) ఘటనకు నిరసనగా ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. వాళ్లను ఉద్దేశిస్తూ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలో ఇదే ప్రతిపక్ష అన్నాడీఎంకే అధికారంలో ఉండగా.. పొల్లాచ్చి లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసింది?.. ఆలస్యంగా స్పందించడంతో నిందితుడు పారిపోలేదా? అని ప్రశ్నించారాయన.
ప్రతిపక్షాలంతా నిందితుడు ఎవరు? మీ పార్టీ వాడు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అవును.. అతను మా పార్టీ మద్దతుదారుడే. కానీ, సభ్యుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని మేం ముందు నుంచే చెబుతున్నాం. అరెస్ట్ విషయంలోనూ ఎక్కడా రాజకీయ జోక్యం జరగలేదు. ఒకవేళ.. అలా జరిగిందని ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించండి. దర్యాప్తు అయ్యేదాకా ఎదురుచూడడండి. అంతేగానీ స్వప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దు అని ప్రతిపకక్షాలను ఉద్దేశించి హితవు పలికారాయన. ఈ తరుణంలో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.
ఇదిలా ఉంటే.. అన్నా వర్సిటీ ఉందంతంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలోనూ మదద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది.
డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో.. క్యాంపస్‌కు దగ్గర్లో బిర్యానీ సెంటర్ నడిపే జ్ఞానేశ్వర్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను డీఎంకే సభ్యుడంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు.. ఈ కేసులో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని.. వాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.
ఇదీ చదవండి: బీజేపీ నేత నోటి దురుసు! ఫలితంగా..
Comments
Please login to add a commentAdd a comment