చెన్నై: దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు అందించారు. గతంలో ఏఐఏడీ ఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఆమె ఆ పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. త్వరలోనే మంచి నిర్ణయం ప్రకటిస్తానంటూ తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలతో పేర్కొనడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిక లకు ముందు శశికళ..అంతర్గతపోరు కారణంగా పార్టీ నాశనమైపోవడం తాను చూడలేననీ, రాజకీ యాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు.
ఆమె ఆ సమయంలో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, ఏఐఏడీఎంకే నాయకత్వం కోసం అగ్ర నేతలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య విభేదాల గురించేనని స్పష్టమైంది. తాజాగా, శశికళ తన అనుయాయులైన ఇద్దరు నేతలతో చేసిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పులు చర్చనీయాంశంగా మారాయి. మొదటి వీడియోలో శశికళ ‘పార్టీని కచ్చితంగా గాడిలో పెడదాం, నేను తప్పక వస్తాను’అని అన్నట్లుగా ఉంది. రెండో ఆడియోలో ఏఐఏడీఎంకేను ఉద్దేశించి.. ‘నాతోపాటు అనేక మంది నేతల కృషితోనే పార్టీ ఏర్పడింది. ఆ ఇద్దరి మధ్య పోరుతో పార్టీ నాశనమై పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. కరోనా వేవ్ తగ్గాక మద్దతుదారులతో మాట్లాడతా. ఆందోళన వద్దు. త్వరలోనే వస్తా. పార్టీని బలోపేతం చేస్తా్త’అని శశికళ అన్నట్లుగా ఉంది. ఈ ఆడియో క్లిప్పులు చర్చనీయాంశమయ్యాయి.
శశికళ ఏఐఏ డీఎంకేపై మళ్లీ పట్టుబిగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తానంటూ సంకేతాలు ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. జయలలిత మరణా నంతరం 2016లో శశికళ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి అయ్యారు. అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో అరెస్టయి జైలుకు వెళ్లిన శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ పార్టీపై పట్టు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment