సాక్షి, చెన్నై: ఆదాయపన్న శాఖ (ఐటీ) పెద్ద ఎత్తున జరిపిన దాడులతో శశికళ వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శశికళ ఆర్థిక సామ్రాజ్యం లక్ష్యంగా, ఆమె బంధువులు, కుటుంబసభ్యుల ఆస్తులపై ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి ఏకంగా 30 చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డ ఐటీ దాడులపై శశికళ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని, రాష్ట్రంలోని అన్నాడీఎంకే సర్కారుకు మద్దతుగా కేంద్రం తమ ఆస్తులపై ఐటీ దాడులు చేయించిందని శశికళ వర్గం ఆరోపించింది.
ఐటీ సోదాల నేపథ్యంలో శశికళ మేనల్లుడు దినకరన్ మీడియాతో మాట్లాడారు. శశికళను 20 ఏళ్లపాటు జైల్లో పెట్టినా.. బయటకు వచ్చిన అనంతరం తిరిగి రాజకీయాల్లో పాల్గొంటారని దినకరన్ అన్నారు. దాడులు తమకు కొత్త కాదని, అన్నింటినీ ఎదుర్కొంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే తమపై ఐటీ దాడులు జరిగాయని, ఎవరి బెదిరింపులకు లొంగబోమని దినకరన్ అన్నారు. పడిలేచిన కెరటంలో మళ్లీ విజృంభిస్తామని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని, శశికళ వర్గాన్ని రాజకీయాల నుంచి తొలగించడానికే ఈ కుట్ర జరుగుతోందని దినకరన్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment