చెన్నె: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి 24 గంటలు కూడా కాలేదు.. అప్పుడే ఓటర్లకు ప్రలోభాల పర్వం మొదలైంది. తమిళనాడులో ప్రెజర్ కుక్కర్లు పంచిపెట్టారు. అయితే వాటి సమాచారం అందుకున్న పోలీసులు స్పందించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్లను స్వాధీనం చేసుకోవడంతో తమిళనాడులో కలకలం రేపింది. శశికళ వర్గానికి చెందిన వారు ఈ కుక్కర్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని అరియలూరు జిల్లాలో రెండు లారీల్లో భారీగా ప్రెజర్ కుక్కర్లు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. మొదట వరణాసి సమీపంలోని సమతువపురం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒక లారీని తనిఖీ చేయగా డ్రైవర్లు ఖాళీ డబ్బాలు అని చెప్పడంతో పోలీసులు వదిలేశారు. అనంతరం రెండో లారీ కూడా వచ్చింది. అనుమానం వచ్చి తనిఖీ చేయగా 1,500 ప్రెజర్ కుక్కర్లు కనిపించాయి. వెంటనే మొదట లారీని కూడా ఆపేసి చూడగా అందులో 1,700 కుక్కర్లు ఉన్నాయి. మొత్తం 3,300 కుక్కర్లను (విలువ రూ.12 లక్షలు) పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ కుక్కర్లపై మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత, శశికళ, ఏఎఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, ఆ పార్టీ నాయకుడు వేలు కార్తికేయన్ ఫొటోలతో ఆ కుక్కర్లు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో తంజావూరుకు తీసుకెళ్తున్నారని తెలిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ కుక్కర్లు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే దినకరన్ పార్టీ ఏఎఎంకే గుర్తు ప్రెజర్ కుక్కరే కావడం గమనార్హం. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ కుక్కర్లు తరలిస్తున్నారని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment