సాక్షి, బెంగళూర్ : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఘన విజయం తర్వాత ఆ ఆనందాన్ని తన అత్తతో పంచుకునేందుకు టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లి కలిసొచ్చిన విషయం తెలిసిందే. బెంగళూర్ పరప్పన అగ్రహార జైలులో దాదాపు ఆర గంట సేపు వీరు భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలుస్తోంది. అందుకు కారణం ఆమె మౌన వ్రతం పాటించటమేనంట.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత తొలి వర్థంతి సందర్భంగా ఆమె నెచ్చెలి అయిన శశికళ మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. డిసెంబర్ 5న జయలలిత తొలి వర్థంతి కాగా, ఆమెకు నివాళిగా నాటి నుంచి ఆమె ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఏఐఏడీఎంకే శశికళ వర్గం సెక్రెటరీ వీ పుహళెంది మీడియాకు వెల్లడించారు. దాదాపు అరగంట సేపు దినకరన్, తాను చెప్పాలనుకున్న విషయాలను శశికళకు చెప్పి, ఆమె అభిప్రాయాలను చూపులతోనే తెలుసుకుని వచ్చారని పుహళెంది చెప్పారు.
కేవలం చూపులతోనే పలకరించారని, చిరునవ్వే ఆమె మాటలైనాయని ఆయన అన్నారు. జనవరిలో ఆమె తన మౌనవ్రతాన్ని విరమిస్తారని ఆయన అన్నారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి శశికళ జైలు జీవితాన్ని గడుపుతుండగా, మొత్తం నాలుగేళ్ల శిక్షను అనుభవించాల్సి వుందన్న సంగతి తెలిసిందే. జైలుకు వెళ్లే సమయంలో అమ్మ సమాధిపై చిన్నమ్మ తట్టి శపథం చేయటం గుర్తుంది కదా.
Comments
Please login to add a commentAdd a comment