శశికళ జైలు నుంచి బయటకు వచ్చిందా?
బెంగళూరు: నల్లరంగు కుర్తా వేసుకొని చేతిలో బ్యాగు పట్టుకొని శశికళ జైలులోకి దర్జాగా వస్తున్న సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అక్రమాస్తుల కేసులో జయలలిత నెచ్చెలి అయిన శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, రూ. రెండు కోట్ల మేర లంచాలు ముట్టజెప్పి జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని, వీఐపీ తరహాలో జైలులో ఆమెకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని జైళ్లశాఖ డీఐజీ డీ రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. తన ఆరోపణలను సాక్ష్యంగా జైలు ప్రవేశద్వారంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను ఏసీబీకి సమర్పించారు. సాధారణ దుస్తుల్లో శశికళ జైలు లోపలికి దర్జాగా వస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. ఆమెకు రక్షణగా ఇద్దరు పురుష గార్డులు కూడా ఉన్నారు.
శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపించిన డీ రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలీచేసిన సంగతి తెలిసిందే. జైళ్ల శాఖ నుంచి ఆమెను తప్పించి బెంగళూరు నగరంలో ట్రాఫిక్ బాధ్యతలను అప్పగించింది. జైలులో శశికళకు రాజభోగాల వ్యవహారంపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సీసీటీవీ కెమెరా దృశ్యాలను డీ రూప సమర్పించారు.