షాకింగ్ నిజాలు వెల్లడించిన పన్నీర్ సెల్వం!
చెన్నై: జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతూ.. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తాజాగా మరికొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించిన వైద్యులు తనతో కొన్ని షాకింగ్ నిజాలను వెల్లడించారని చెప్పారు. అయితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు, ఆమె కుటుంభసభ్యులకు తాను వ్యతిరేకంగా ఉన్నానని నిర్దారించుకున్న తర్వాతే వైద్యులు తనను కలిసి విలువైన సమాచారాన్ని వెల్లడించారని మీడియాతో మాట్లాడుతూ పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతున్న కొన్ని రోజులకే జయలలిత మృతిచెందారని ఇందుకు కారకురాలు శశికళేనని పన్నీర్ ఆరోపించారు.
జయ మృతిపై ఎలాంటి దర్యాప్తు చర్యలు చేపట్టకపోతే మార్చి 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు హెచ్చరించారు. 'అపోలో ఆస్పత్రిలో జయలలితకు చికిత్స చేసిన వైద్యులు నాతో పలుమార్లు మాట్లాడారు. అమ్మకు మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకెళ్లాలని అప్పట్లో నేను సూచించాను. అయితే తమకు అందుకు కొందరు అనుమతి ఇవ్వలేదని డాక్టర్లు నాకు చెప్పారు. విదేశాలకు అమ్మను తీసుకెళ్లకుండా కుట్రతో శశికళ అడ్డుకున్నారని' పన్నీర్ సెల్వం వివరించారు.
ఒకవేళ శశికళ సీఎం అయితే మళ్లీ ఎన్నికలకు వెళ్దామని అన్నాడీఎంకే నేతలు తనతో చర్చించారని.. పరిస్థితుల ప్రభావంతో ఇప్పుడు అదే నేతలు రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. శశికళ పదే పదే అందరికీ అడ్డుచెప్పడంతోనే జయలలితకు మెరుగైన చికిత్స ఇప్పించ లేకపోయామని వైద్యులు వెల్లడించిన తర్వాత ఇక ఆలస్యం చేయవద్దని దర్యాప్తు జరిపించాలని పన్నీర్ వర్గీయులు అంటున్నారు. జయలలితను ఆమె నివాసం పోయెస్ గార్డెన్ లో కిందకి తోసేశారని, ఆపై వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహించినందునే ఆమె మృతి చెందారని, ఇందుకు శశికళే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.