
కార్యకర్తలకు మిఠాయిలు పంచుతున్న శశికళ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరోమారు చాటుకున్నారు. అన్నాడీఎంకే స్వర్ణోత్సవ వేడుకల శిలాఫలకంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తానే అని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే నాయకత్వ పగ్గాలపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలో సమన్వయ కమిటీ ఓ శిబిరంగా, శశికళ నేతృత్వంలో మరో శిబిరంగా అన్నాడీఎంకే కేడర్ విడిపోయింది. చెన్నై మెరీనా తీరంలోని ఎంజీఆర్, జయలలిత సమాధులను శనివారం శశికళ సందర్శించి నివాళులరి్పంచిన విషయం తెలిసిందే. ఆదివారం అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టింది. పార్టీకి తానే ప్రధాన కార్యదర్శి అని చాటుకునే ప్రయత్నం శశికళ చేయడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఏకమవుదాం.. పార్టీని గెలిపిద్దాం
పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. శశికళ నేతృత్వంలో చెన్నై టీనగర్‌లోని ఎంజీఆర్ స్మారక మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని శశికళ ఆవిష్కరించారు. ఇందులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అని రాసి ఉంది. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో ఆమె ప్రయాణించారు. ఎంజీఆర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు. ముందుగా టీనగర్‌లో జరిగిన సేవా కార్యక్రమంలో శశికళ మాట్లాడారు. అందరం ఏకం అవుదాం.. అన్నాడీఎంకేను గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు.
ఎంజీఆర్, జయలలిత తమిళనాడును అన్నాడీఎంకే కంచుకోటగా మార్చారని, ఈ వైభవం మళ్లీ రావాలంటే అందరం ఒక్కటి కావాలి్సందేనని స్పష్టం చేశారు. తనను గతంలో సమస్యలు చుట్టుముట్టినా, అన్నాడీఎంకేకు చెందిన వారినే ప్రభుత్వ పాలనలో కూర్చోబెట్టానని పరోక్షంగా పళని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడు, తమిళ ప్రజలే తనకు ముఖ్యమని.. ఎంజీఆర్, అమ్మ ఆశయాల సాధనే లక్ష్యమని తేల్చిచెప్పారు. అయితే, శశికళ చర్యలను అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వ్యవహారం కోర్టులో ఉందని గుర్తుచేశారు. శిలాఫలకంలో ఆమె పేరును ఎలా పొందుపరిచారు? అని ప్రశ్నించారు. ఇది కోర్టు ధిక్కార చర్య అని, చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment