దశాబ్దాలుగా సినీ రంగ ప్రభావం అపారంగా వున్న తమిళనాడు రాజకీయాలు అచ్చం ఆ రంగాన్నే అనుకరిస్తూ జనంలో ఉత్కంఠను రేపుతున్నాయి. నిరుడు డిసెంబర్ 4న రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు ప్రకటించి, ఆ నెలాఖరుకల్లా యూటర్న్ తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ మాదిరే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత సహచరి శశికళ కూడా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు బుధవారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శశికళ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించి నిండా నెల్లాళ్లు కాలేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి, ఆ తర్వాత కరోనా మహమ్మారిని కూడా ఎదుర్కొని గత నెల 8న ఆమె బెంగళూరు నుంచి చెన్నై వచ్చారు. ఆ సందర్భంలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నట్టు ప్రకటించారు. కేవలం 24 రోజుల వ్యవధిలో ఆమె మనసు మార్చుకోవటానికి కారణమేమిటి? శశికళ రాష్ట్రంలో అడుగుపెట్టాక ఆమెపై చాలా చర్చే జరిగింది.
అన్నా డీఎంకేతో ఆమెకు సామరస్యత ఏర్పడటం మాట కల్లని కొందరు... మిత్రభేదం కనుక సర్దుబాటు కష్టం కాదని మరికొందరు జోస్యం చెప్పారు. కానీ ముఖ్యమంత్రి పళనిస్వామి మొదలుకొని అన్నా డీఎంకే నేతలందరికీ ఆమె కంట్లో నలుసు మాదిరే కనబడ్డారు. పార్టీని కబ్జా చేయాలన్న శశికళ ప్రయత్నాలు ఫలించబోవని పళనిస్వామి నేరుగానే అన్నారు. శశికళ సైతం వారిని అదే భాషలో దుయ్యబట్టారు. వారిని పిరికివాళ్లుగా అభివర్ణించారు. పళనిస్వామి అయినా, మరో మాజీ సీఎం పన్నీరుసెల్వమైనా గత నాలుగేళ్లుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ అధినేతల ఆశీర్వాద బలంతోనే కావొచ్చుగానీ... సొంతంగా నిర్ణయాలు తీసుకో గలుగుతున్నారు. జయలలిత హయాంలోనూ, ఆ తర్వాత శశికళ ఏలుబడిలో స్వల్పకాలం పార్టీ నేతలంతా ఎంత ఒదిగి వుండాల్సివచ్చిందో ఎవరికీ తెలియనిది కాదు. స్వతంత్రంగా వ్యవహరించటం తెలియనప్పుడు వేరే సంగతికానీ... అలవాటుపడ్డాక దాన్ని కోల్పోవటానికి సిద్ధపడేదెవరు?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాన్నాళ్ల సమయం వుందనుకున్నప్పుడే అక్కడి రాజకీయాలు వింత మలుపులు తిరిగాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ సంగతిని ప్రకటించాక రాష్ట్ర రాజకీయాలెలా వుండబోతున్నాయో చాలామంది కష్టపడి కూడికలు, తీసివేతలూ వేశారు. అవి ఇంకా పూర్తికాకుండానే ఆయన నిష్క్రమణ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడూ అలాగే జరిగింది. శశికళ రాకతో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవచ్చునో అంచనాలు వేసిన వారందరిదీ వృధా ప్రయాసగా మిగిలిపోయింది. శశికళ ఏం చెప్పినా...ఆమెలో కలిగిన ఈ హఠాత్ రాజకీయ వైరాగ్యానికి అసలు కారణమేమిటన్నదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఆమెకు లభించిన మద్దతు చిన్నదేమీ కాదు. బెంగళూరు నుంచి చెన్నైకి కారులో వెళ్లటానికి గరిష్టంగా 5, 6 గంటల సమయం మించి పట్టదు. కానీ ఆమె ఆ దూరాన్ని 23 గంటలు ప్రయాణించారు. మధ్యలో దేవాల యాల సందర్శనలున్నాయి. కానీ ఎక్కడికక్కడ ఎదురుచూసిన మద్దతుదార్లవల్లనే ఈ జాప్యం చోటుచేసుకుందని శశికళ అనుచరులు చెప్పారు. ఇది చరిత్రాత్మకమని ఆమె బంధువు, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్ ఉత్సాహపడ్డారు. ఇప్పుడు ఆయన కూడా శశికళ నిర్ణయంతో ఇరకాటంలో పడినట్టు కనబడుతోంది. ఆమె తాజా నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు ప్రభావితం చేసివుండొచ్చన్న ఊహాగానాలు కొంతమేరకు నిజమే కావొచ్చు. ఆమెతో సర్దుబాటు చేసుకోవాలని ప్రతిపాదించినట్టు కూడా కథనాలొచ్చాయి. పళనిస్వామి, పన్నీరుసెల్వం ససేమిరా అన్నారని చెబుతున్నారు.
శశికళ ప్రత్యక్ష రాజకీయానుభవం తక్కువే కావొచ్చుగానీ... ఆమె జయలలిత వద్ద చాలానే నేర్చుకున్నారు. సునిశిత పరిశీలననూ ఒంటబట్టించుకున్నారు. కనుక ఆమె వస్తానన్నా, రానన్నా ఆ మాటల వెనక పరమార్థం వుంటుంది. తాజాగా తమిళనాట డీఎంకే గాలి వీస్తున్నదని ఇప్పటికే వచ్చిన ఒకటి రెండు సర్వేలు నిర్ద్వంద్వంగా ప్రకటించాయి. రజనీకాంత్ వస్తానన్నప్పుడు డీఎంకేకు ఏమేరకు నష్టం జరగొచ్చునని అందరూ లెక్కలు వేశారు తప్ప రజనీ సీఎం అవుతారని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు శశికళ రాక తర్వాత కూడా అంతే. ఆమె వల్ల నష్టం కలిగేది అన్నాడీఎంకే పార్టీకేనని తీర్మానించారు. ఆ పార్టీకి జరిగే నష్టమంతా శశికళకు లాభంగా మారదు. అది డీఎంకేకు తోడ్పడుతుంది. ఈమాత్రం దానికి ఇప్పుడు రాకపోతేనేం అని శశికళ ఆలోచించివుండొచ్చు. అయితే ఇదే ఆమె ఆఖరి నిర్ణయం అని చెప్పలేం. ఇప్పటికైతే ఇది విరామచిహ్నమే. ఆమె గత నిర్ణయాలే ఇందుకు ఉదాహరణ. 2011లో ఆమెను జయలలిత అన్నాడీఎంకేనుంచి బహిష్కరించినప్పుడు శశికళ క్షమాపణ చెప్పి, తనకు అక్కే(జయలలిత) ముఖ్యం తప్ప రాజకీయాలు కాదని ప్రకటించారు. మూడు నెలలు తిరక్కుండా మళ్లీ అధినేతకు చేరువయ్యారు. ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే బలహీనపడిన పక్షంలో ఆమెకు అది సువర్ణావకాశమవుతుంది. అప్పటికి పళనిస్వామి, పన్నీరు సెల్వం ప్రభావం క్షీణిస్తుంది. ఇప్పుడు కాదన్నవారే శశికళకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. అందుకే వ్యూహాత్మకంగా ఆమె వెనక్కి తగ్గివుండొచ్చు. ఏదేమైనా మున్ముందు తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా వుంటాయి.
వ్యూహాత్మక వెనకడుగు!
Published Fri, Mar 5 2021 1:14 AM | Last Updated on Fri, Mar 5 2021 3:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment