బాంబు పేల్చిన పన్నీర్ సెల్వం
- శశికళతో సహా విద్రోహాలంతా పార్టీ వీడాల్సిందే
- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదు
- అమ్మ బతికివుంటే శశికళను తరిమేసేవారు
- మరోసారి ఫైర్ అయిన సెల్వం
- జయలలిత మృతిపై మరోసారి విచారణకు డిమాండ్
చెన్నై: అన్నాడీఎంకే వైరి వర్గాలైన ఓపీఎస్-ఈపీఎస్ గ్రూపుల విలీనానికి రంగం సిద్ధమైందని భావిస్తుండగా.. అనూహ్యరీతిలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి శశికళపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శశికళ సహా విద్రోహులంతా పార్టీని వీడాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. జయలలితకు శశికళ కుటుంబం ద్రోహం చేసిందని, జయలలిత బతికి ఉంటే శశికళను ఎప్పుడో ఇంటికి పంపించి ఉండేవారని చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని తేల్చి చెప్పారు. శశికళ, ఆమె కుటుంబసభ్యలు పార్టీలో కొనసాగిస్తే.. అన్నాడీఎంకే అధికార (ఈపీఎస్) వర్గంతో విలీనం ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకేలోని తాజా రాకీజయ పరిణామాల నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
జయలలిత మృతిపై న్యాయవిచారణ జరగాల్సిందేనని, అదే తన మొదటి డిమాండ్ తేల్చిచెప్పారు. జయలలితకు అందించిన వైద్యచికిత్స వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో శశికళ కుటుంబాన్ని జయలలిత పోయెస్‌గార్డెన్ నుంచి పంపించారని గుర్తుచేశారు. రాజకీయాల్లోకి రానని జయలలిత బతికుండగా ఆమెకు శశికళ చెప్పిందని, ఇప్పుడు ఆ మాట తప్పి శశికళ కుటుంబం మోసం చేసిందని మండిపడ్డారు. శశికళ కుటుంబపాలనను తాను ఎంతమాత్రం అంగీకరించేది లేదని అన్నారు. అమ్మ ఆశయాలు నెరవేర్చడమే తమ లక్ష్యమని, ఆమె చూపిన బాటలోనే తామంతా నడుస్తామని చెప్పారు. శశికళను, ఆమె కుటుంబసభ్యులను పదవి నుంచి తప్పిస్తే..ప్రస్తుత సీఎం ఎడపాటి పళనిస్వామితో చేతులు కలిపేందుకు సిద్ధమని ఓపీఎస్ వర్గం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.