Panner selvam
-
‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా’
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్ క్లిప్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్ క్లిప్‌లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం. ఆ ఏఐ క్లిప్‌లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం. மாண்புமிகு இதயதெய்வம் புரட்சித்தலைவி அம்மா அவர்களின் 76வது பிறந்தநாள் விழாவினை முன்னிட்டு, மாண்புமிகு கழக பொதுச்செயலாளர் புரட்சித்தமிழர் @EPSTamilNadu அவர்களின் வழிகாட்டுதலின்படி இன்றைக்கு தகவல் தொழில்நுட்பத்தின் உச்சமாகக் கருதப்படும் செயற்கை நுண்ணறிவு (Artificial Intelligence)… pic.twitter.com/APuSq7u6AW — AIADMK (@AIADMKOfficial) February 24, 2024 ...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్ నాయకత్వాని బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్ వచ్చింది. దీంతో జయలలిత ఏఐ వాయిస్ క్లిప్ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. -
అన్నాడీఎంకే మరో ట్విస్ట్.. పన్నీరు సెల్వం ప్లాన్ ఫలించేనా?
సాక్షి, చెన్నై: సర్వసభ్య సమావేశం సభ్యుల మద్దతు కోసం అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ పంపిన దరఖాస్తును ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందులో ఏక పక్షంలో అభ్యర్థి పేరును సూచించారని, తమ మద్దతుదారు పేరు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో శనివారం నాటికి 46 మంది నామినేషన్లు వేశారు.ఇందులో కాంగ్రెస్, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే అన్నాడీఎంకేలో విబేధాల నేపథ్యంలో ఆ పార్టీలోని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాలకు చెందిన అభ్యర్థులు ఇంత వరకు నామినేషన్లు దాఖలు చేయలేదు. మంగళవారంతో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండాకుల చిహ్నం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సర్వ సభ్య సమావేశం సభ్యుల మద్దతు సేకరణకు అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ శనివారం చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తును సిద్ధం చేశారు. ఆదివారం రాత్రిలోపు ఈ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సర్వసభ్య సమావేశం సభ్యులకు సమాచారం పంపించారు. మెజారిటీ మద్దతు అనుగుణంగా ఎన్నికల కమిషన్‌ను సోమవారం కలిసేందుకు తమిళ్ మగన్ హుస్సేన్ సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆ దరఖాస్తుకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం శిబిరం ఆదివారం గళం విప్పింది. తీవ్ర వ్యతిరేకత.. దరఖాస్తును ఏక పక్షంగా సిద్ధం చేశారని పన్నీరు శిబిరం నేతలు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంట్లో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ఆ దరఖాస్తులో పళణిస్వామి ప్రకటించిన అభ్యర్థి తెన్నరసు పేరును మాత్రం సూచించారని, తమ అభ్యర్థి పేరును నమోదు చేయలేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తమిళ్ మగన్ హుస్సేన్ వ్యవహరిస్తున్నారని, ఈ దరఖాస్తును తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాల్సిన చోట ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని సర్వసభ్య సభ్యుల్లో పళనిస్వామి శిబిరానికి 2,662 మంది మద్దతు ఉంది. అలాగే ముగ్గురు ఎంపీలు, 61 మంది ఎమ్మెల్యేలు, 70 మంది జిల్లాల కార్యదర్శుల మద్దతు కూడా ఆయన ప్రకటించిన అభ్యర్థి తెన్నరసుకే ఉండటం గమనార్హం. ఇక, పన్నీరు సెల్వం శిబిరానికి 148 మంది సర్వసభ్య సభ్యులు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు , ఐదుగురు జిల్లాల కార్యదర్శుల మద్దతు మాత్రమే ఉండడం గమనార్హం. మద్దతు తక్కువగా ఉన్నా, రెండాకుల వివాదాన్ని మళ్లీ మొదటికి తెచ్చే విధంగా దరఖాస్తును అస్త్రంగా చేసుకుని ఫిర్యాదు చేయడానికి పన్నీరు శిబిరం సిద్ధం అవుతోండడం అన్నాడీఎంకేలో ఆసక్తి రేపుతోంది. -
బీజేపీ పొలిటికల్ గేమ్.. పన్నీరు సెల్వానికి ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: ఎన్డీఏ కూటమితో కలిసే లోక్‌సభ ఎన్నికలను అన్నాడీఎంకే ఎదుర్కొంటుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని మాజీ మంత్రి, ఆపార్టీ సీనియర్ నేత వైద్యలింగం స్పష్టం చేశారు. ఇది కాస్త పన్నీరు శిబిరాన్ని ఇరకాటంలో పడేసినట్లయ్యింది. వివరాల ప్రకారం.. అన్నాడీఎంకేలో పన్నీరు, పళణి వర్గాలు వేర్వేరు గ్రూపులుగా పయనిస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు తమ నేతృత్వంలోనే సాగుతాయని, తామిచ్చిన సీట్లతో మిత్రులు సర్దుకోవాల్సి ఉంటుందనేలా ఇప్పటికే బీజేపీ నాయకులు వ్యాఖ్య లు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తిప్పికొట్టారు. అన్నాడీఎంకే నేతృత్వంలోనే రాష్ట్రంలో కూటమి అని, ఎవరైనా తమ గొడుగు నీడన మాత్ర మే ముందుకు సాగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, పన్నీరు సెల్వం మాత్రం ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేంద్రం మద్దతు తనకు అవశ్యం కావడంతో ఆయన కూటమి విషయంపై ఇప్పటి వరకు స్పందించ లేదు. అయితే, ఆయన శిబిరంలో సీనియర్‌గా ఉన్న వైద్యలింగం సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయంశంగామారింది. ఇది కాస్త పళణిస్వామి శిబిరానికి అను కూలంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కూటమిపై స్పష్టత.. పుదుకోట్టైలో వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేత పన్నీరు సెల్వం శిబిరానికి ఆపార్టీ చిహ్నం రెండాకులు చిక్కడం ఖాయమని అన్నారు. లోక్‌సభ ఎన్నికలను ఎన్డీఏ కూటమితోనే కలిసి ఎదుర్కొంటామని, ఆ కూటమిలోనే అన్నాడీఎంకే ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మార్పులేదన్నారు. ఎన్డీఏలో అన్నాడీఎంకే భాగస్వామ్యం ఉందని, అధిక సీట్లలో తమ అభ్యర్థులే రాష్ట్రంలో పోటీ చేస్తారని తెలిపారు. అయితే, ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని పన్నీరుకు వ్యతిరేకంగా పళణి శిబిరం వ్యూహాలకు పదునుపెట్టింది. అన్నాడీఎంకేను తాకట్టు పెట్టేందుకు పన్నీరు సిద్ధమయ్యారని విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. -
తమిళనాట శశికళ ప్లాన్ ఫలిస్తుందా.. పన్నీరు సెల్వానికి చెక్..?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి పళణి స్వామి సొంత జిల్లాలో చిన్నమ్మ శశికళ సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతానికి ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో జిల్లాలో తన పట్టు చేజారకుండా పళణి స్వామి ముందు జాగ్రత్తల్లో పడ్డారు. అన్నాడీఎంకేలో సాగుతున్న గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో అన్నాడీఎంకేను ఎప్పటికైనా తన గుప్పెట్లోకి తీసుకుంటానని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పటికే ప్రకటించారు. తన బలాన్ని చాటే విధంగా మద్దతు దారులతో భేటీలు, సంప్రదింపుల్లో ఆమె బిజీగా ఉన్నారు. దశల వారీగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన పళణి స్వామి సొంత జిల్లాపై చిన్నమ్మ దృష్టి పెట్టారు. బలం చాటే ప్రయత్నం.. పళణి స్వామి సొంత జిల్లా సేలంలో తనకు సైతం బలం ఉందని చాటాలని చిన్నమ్మ భావిస్తోంది. ఇందులో భాగంగా తన మద్దతు దారుల ద్వారా బల నిరూపణకు సిద్ధమయ్యారు. పళణిస్వామి సొంత జిల్లాలో ఉన్న అసంతృప్తి సెగను తనకు అనుకూలంగా మలచుకునే విధంగా చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. సోమవారం ఆ జిల్లా పరిధిలోని ఆత్తూరు, వాలప్పాడి, సేలం టౌన్ జంక్షన్ , దాదుగా పట్టి, శీలనాయకం పట్టి, సూరమంగళంలలో సభలకు నిర్ణయించారు. పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరించడమే కాకుండా, పళణిపై గుర్రుగా ఉన్న నేతలను ఆహ్వానించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. దీంతో అందరి దృష్టి సేలంపై పడింది. సోమవారం సేలంలో, ఆ మరుసటి రోజు పక్కనే ఉన్న ఈరోడ్ జిల్లాలో చిన్నమ్మ పర్యటన జరగనుంది. సేలంలో తిష్టవేసిన పళణి తన సొంత జిల్లాలో చిన్నమ్మ పర్యటన నేపథ్యంలో పట్టు జారకుండా ముందు జాగ్రత్తల్లో పళణి నిమగ్నమయ్యారు. చిన్నమ్మ పర్యటన వైపు ఏఒక్క నేత వెళ్లకుండా కట్టడికి సిద్ధమయ్యారు. తిరుపతి పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా సేలంకు వెళ్లడం గమనార్హం. రెండు రోజులు సేలంలోనే ఆయన ఉండనున్నారు. చిన్నమ్మ పర్యటన జరిగే సమయంలో తన మద్దతుదారులతో ప్రత్యేక సమావేశాలకు పళణి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితంగా సేలం వేదికగా అన్నాడీఎంకే రాజకీయం రసవత్తరంగా మారింది. -
మద్రాస్ హైకోర్టులో పన్నీరు సెల్వానికి షాక్
-
తమిళనాట ట్విస్టులు.. పళనిస్వామి, పన్నీరు సెల్వానికి షాకిచ్చిన మోదీ!
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే వారి జాబితాలో మాత్రమే అన్నాడీఎంకే నేతలు పన్నీరు, పళని స్వామికి అనుమతి దక్కింది. కానీ, రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ లభించలేదని సమాచారం. కాగా, అన్నాడీఎంకే అంతర్గత పోరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా వీరి మధ్య విబేధాలకు శుభం కార్డు పడే అవకాశం ఉంది.. అనే చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా మోదీని కలిసేందుకు అపాయిమెంట్ కోరినట్లు కూడా తెలిసింది. అయితే, ఈ ఇద్దరికీ మోదీతో ప్రత్యేక భేటీకి అనుమతి దక్కలేదు. చెన్నై విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే కార్యక్రమానికి మాత్రం ఈ ఇద్దరికి అధికారులు అనుమతిచ్చారు. ఢిల్లీ వెళ్లినా ప్రధానితో భేటీ కాలేకపోయిన నేపథ్యంలో చెన్నైలోనైనా అవకాశం వస్తుందని ఎదురు చూసిన పళని స్వామికి ఇది పెద్ద షాకే అని భావిస్తున్నారు. అదే సమయంలో మోదీ ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించిన పన్నీరుకూ ఇది భంగపాటే. ఒకరిపై ఒకరు.. అన్నాడీఎంకే కార్యాలయం ధ్వంసం విషయంపై పన్నీరు సెల్వంను ఇరకాటంలో పెట్టేందుకు పళని స్వామి శిబిరం దూకుడు పెంచింది. ఈ కార్యాలయంలో రికార్డులు, కీలక వస్తువులు మాయమైనట్లు ఇప్పటికే ఆ శిబిరం వర్గాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ పళని మద్దతు ఎంపీ సీవీ షణ్ముగం డీజీపీ శైలేంద్ర బాబును కలవడం గమనార్హం. అదే సమయంలో వీరి ఎత్తులకు పైఎత్తు వేయడానికి పన్నీరు సిద్ధమయ్యారు. తన కుమారుడు రవీంద్రనాథ్ను అన్నాడీఎంకే ఎంపీగా పరిగణించకూడదని పళనిస్వామి శిబిరం పార్లమెంట్ స్పీకర్‌కు లేఖ రాయడాన్ని పన్నీరు పరిగణనలోకి తీసుకున్నారు. అదే సమయంలో పళని స్వామి వెంట ఉన్న 63 మంది ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే సభ్యులుగా పరిగణించకూడదని పేర్కొంటూ, వారిపై వేటుకు పన్నీరు సెల్వం వ్యూహ రచన చేస్తున్నారు. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ అప్పావును కలిసి ఇందుకు లేఖ సమరి్పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక, అన్నాడీఎంకే కార్యాలయం తలుపులను కాలితో తన్ని పగలకొట్టిన వారి తొక్కి నలిపేద్దామని మద్దతు దారుల కు బుధవారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి పిలుపు నివ్వడంతో ఇద్దరు నేతల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
హైకోర్టు సంచలన తీర్పు.. తమిళనాట పాలి‘ట్రిక్స్’లో ట్విస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో నంబర్–1 అనే స్థాయికి పళనిస్వామి చేరుకుంటున్నారు. ఆధిపత్యపోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వస్తున్న ఆయనకు తాజాగా మరో విజయం దక్కింది. పార్టీ ప్రధాన కార్యాలయం సీలును తొలగించాలని, కార్యాలయం తాళాన్ని ఎడపాడికి అప్పగించాలని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య గత కొంతకాలంగా నువ్వా..నేనా అంటూ సాగుతున్న పోరు అనేక మలుపులు తిరుగుతోంది. ఈనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పన్నీర్ దూకుడుకు పగ్గాలు వేశారు. ఇక ఆ తరువాత పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచవర్గంలోని కొందరిపై బహిష్కరణ వేటు కూడా పడింది. ఎడపాడిని కట్టడిచేసేందుకు అదేరోజున పన్నీర్, ఆయన అనుచరవర్గం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగింది. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి మద్దతుదారులు పన్నీర్ వర్గంతో తలపడ్డారు. పలువురు గాయపడటం, పోలీసుల లాఠీచార్జీతో పార్టీ కార్యాలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. శాంతి భద్రతల సమస్యలు వస్తాయనే అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసింది. సీలు తొలగించాలని ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఎడపాడికి అప్పగింత–ఆనందోత్సాహాలు ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం..అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని బుధవారం తీర్పు చెప్పింది. అయితే పార్టీ కార్యకర్తలు నెలరోజులపాటూ కార్యాలయానికి రాకూడదని షరతు విధించింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎడపాడి వర్గీయులకు ఆనందం మిన్నంటింది. అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నాయకత్వంలో వందలాది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు చెన్నై అడయార్ గ్రీన్‌వేస్ రోడ్డులో విజయోత్సాహంతో చిందులు వేశారు. ఎంజీఆర్, జయలలిత, ఎడపాడి చిత్రపటాలను చేతబూని ర్యాలీ నిర్వహించారు. క్యాంప్ ఆఫీస్‌కు చేరుకుని ఎడపాడిని అభినందనలతో ముంచెత్తారు. ఇక కోర్టు తీర్పుతో పన్నీర్ మద్దతుదారులు డీలా పడిపోయారు. ఇది కూడా చదవండి: యూపీ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏకంగా మంత్రి రాజీనామా -
పొలిటికల్ వార్: పన్నీరు సెల్వానికి ఊహించని షాకిచ్చిన పళనిస్వామి
పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి యత్నిస్తున్నారా? అవుననే సమాధానం అన్నాడీఎంకేలో వినిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులపై బహిష్కరణ వేటు వేసిన పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తొలగించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం తన ఉనికి కాపాడుకునేందుకు తన మద్దతుదారులతో మూడోసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై : ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి’లా తయారైంది. జూన్ 23వ తేదీ, జూలై 11వ తేదీ సర్వసభ్య సమావేశం జరగ్గా, తన వర్గీయులతో మూడోసారి సర్వసభ్య సమావేశానికి పన్నీర్ సెల్వం సన్నాహాలు మొదలుపెట్టారు. అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఏక నాయకత్వం వివాదంపై ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. పదవి చేపట్టడమే అదనుగా పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు. పొన్నయ్యన్ ఆడియోపై నమ్మకం ఇటీవల మాజీ మంత్రి పొన్నయన్ పేరున విడుదలైన ఆడియో కలకలం రేపింది. ఎడపాడి నెంబర్ గేమ్ ఆడుతున్నారని, ఆయనకు పార్టీ క్యాడర్లో పెద్ద బలం లేదంటూ వ్యాఖ్యానించడం ఆ పార్టీలో దుమారం రేపింది. దీనిపై అప్రమత్తమైన ఎడపాడి పార్టీలో కొత్త టీమ్‌ను నియమించి పొన్నయ్యన్‌ను ప్రాధాన్యత లేని పదవిలోకి నెట్టారు. పొన్నయ్యన్ మాటలను విశ్వసిస్తున్న పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించడంపై చర్చిస్తున్నారు. ఎడపాడి పళనిస్వామి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నెలకొన్న ఉద్రిక్తత ఇంకా సద్దుమణగకముందే పన్నీర్‌సెల్వం మరోసారి సన్నద్ధం కావడం చర్చనీయాంశమైంది. ఎడపాడి వైపు ఉన్నట్లుగా చెబుతున్న కార్యవర్గ సభ్యులకు గాలంవేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి తుది నిర్ణయాన్ని త్వరలో ఓపీఎస్ ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీలోని ముఖ్యనేతలను పదవుల నుంచి ఎడపాడి తప్పించిన అంశాన్ని కూడా చర్చించాలని ఆలోచిస్తున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇప్పటికే రెండుసార్లు సర్వసభ్య సమావేశం జరుగగా, పన్నీర్ ప్రయత్నాలు ఫలిస్తే అది మూడో సర్వసభ్య సమావేశం అవుతుంది. కుట్రలో భాగంగానే తాళం అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులను సీఎం స్టాలిన్ అవకాశంగా తీసుకుని తమ పార్టీకి శాశ్వతంగా తాళం వేసేందుకు యత్నిస్తున్నారని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఆరోపించారు. అన్నాడీఎంకేను భూస్తాపితం చేసేందుకు ద్రోహులతో స్టాలిన్ చేతులు కలిపారని, అందుకే తమ పార్టీ కార్యాలయానికి సీలు వేశారని విమర్శించారు. పన్నీర్‌సెల్వం సైతం అన్నాడీఎంకేను అణచివేయాలని కాచుకుని ఉన్నారని, అయితే ఆయన ఆశయం నెరవేరదని ఎడపాడి వ్యాఖ్యానించారు. పోటాపోటీగా వినతిపత్రాలు ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదాను సైతం పన్నీర్‌సెల్వం నుంచి లాక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పదవిపై ఓపీఎస్, ఈపీఎస్ వేర్వేరుగా అసెంబ్లీ స్పీకర్‌కు వినతిపత్రాలు సమరి్పంచారు. ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఎంపికకై ఎమ్మెల్యేలతో ఈనెల 17వ తేదీ ఎడపాడి సమావేశం అవుతున్నారు. విధి విధానాలను అనుసరించి స్పీకర్ అప్పావుకు ఈ సమాచారం ఇవ్వనున్నారు. -
బాహుబలి క్లైమాక్స్ కూడా తక్కువే.. అన్నాడీఎంకే పగ్గాలు పళనికే..!
ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సభలు.. సమావేశాలు, దాడులు.. దౌర్జన్యాలు, ఎత్తులు.. పై ఎత్తులతో గత పక్షం రోజులుగా సాగిన అన్నాడీఎంకే ఆధిపత్య పోరుకు తెరపడింది. పార్టీ పగ్గాలు ప్రస్తుతానికి పళనిస్వామికే దక్కాయి. అయితే సోమవారం క్లైమాక్స్ మాత్రం బాహుబలి, కేజీఎఫ్, విక్రమ్ సినిమాలకు తక్కువ కాదన్నట్లుగా సాగింది. సర్వసభ్య సమావేశంలో వానగరం వేదికగా ఎడపాడి పార్టీ పగ్గాలు అందుకున్నారనే సమాచారంతో.. పన్నీరు సెల్వం వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. ఓపీఎస్ తన మద్దతుదారులతో రాయపేటలోని పార్టీ కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి.. దాన్నిస్వాధీనంలోకి తెచ్చుకున్నారు. సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం అక్కడికి వచ్చి వీరంగం సృష్టించింది. దాడులు.. ప్రతిదాడులతో పార్టీ కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసి పలువురు ఆందోళన కారులను అరెస్ట్ చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: గత కొంతకాలంగా అన్నాడీఎంకేలో సాగుతున్న ఆధిపత్యపోరులో ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించారు. పన్నీర్ కల్పించిన అడ్డంకులను అధిగమించి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపికయ్యారు. దీంతో ప్రత్యర్థి వర్గం ఎడపాడి మద్దతుదారులపై విరుచుకుపడగా జరిగిన అల్లర్లు, వాహనాల ధ్వంసం, పరస్పర ముష్టిఘాతాలు, కత్తివేట్లతో పార్టీ కార్యాలయ పరిసరాలు యుద్ధభూమిని తలపించాయి. అమ్మ మరణంతో ఖాళీగా మారిన ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించేందుకు తొలుత శశికళ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆమె జైలుకెళ్లగా, సమన్వయ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లుగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి జయస్థానాన్ని భర్తీ చేశారు. అయితే ఇద్దరికీ పొసగకపోవడంతో చాపకిందినీరులా ఉన్న అంతఃకలహాలు అసెంబ్లీ ఎన్నికల తరువాత బట్టబయలయ్యాయి. పార్టీ సారథులుగా ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అంటూ ఏక నాయకత్వ నినాదం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సుమారు 80 నుంచి 90 శాతం మంది నాయకులు, కార్యకర్తలు ఎడపాడి వైపు నిలువడంతో పన్నీర్‌సెల్వం కోపం కట్టలు తెంచుకుంది. ఎడపాడికి అన్నీ మంచి శకునాలే.. ఇదిలా ఉండగా, ఈనెల 11వ తేదీన ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యేందుకు ఎడపాడి అన్నీ సిద్ధం చేసుకున్నారు. సమావేశంపై స్టే కోసం పన్నీర్‌సెల్వం కోర్టు కెక్కడంతో ఎడపాడి శిబిరం తీవ్ర ఉత్కంఠకు లోనైంది. అయితే సోమవారం వెలువడిన తీర్పు ఎడపాడికి అనుకూలమైంది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు. దీంతో యధావిధిగా సర్వసభ్య సమావేశం జరిగింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి, కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్ ఎంపికయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్ పదవులు రద్దు, పార్టీ నుంచి పన్నీర్ బహిష్కరణ, ప్రధాన కార్యదర్శి పదవికి నాలుగు నెలల్లోగా ఎన్నికలు తదితర 16 తీర్మానాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకగ్రీవ ఆమోదం పొందాయి. అంతేగాక శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అనే పదవిని రద్దు చేస్తూ పార్టీ బైలాను సవరించారు. కాగా అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తెస్తామని సర్వసభ్య సమావేశంలో ఎడపాడి ధీమా వ్యక్తం చేశారు. రెచ్చిపోయిన ఇరువర్గాలు ఎడపాడి ఎత్తులకు చిత్తయిన పన్నీర్‌సెల్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో పాగా వేశారు. ఎడపాడి మద్దతుదారులంతా వానగరంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఉండగా, పన్నీర్‌సెల్వం తన అనుచరులతో కలిసి రాయపేట పార్టీ కార్యాలయంలోకి తలుపులను బద్దలు కొట్టి మరీ వెళ్లారు. అక్కడున్న ఎడపాడి ఫొటోలను చించివేసి తగులబెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం పార్టీ కార్యాలయంలోకి జొరబడి వీరంగం సృష్టించింది. ఇందుకు ప్రతిగా పన్నీర్ అనుచరులు సైతం ముష్టిఘాతాలకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కత్తులు, కర్రలు ఇతర మారణాయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు వెంటాడారు. ఫలితంగా కొందరికి గాయాలయ్యాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో.. దాడుల కారణంగా అనేక వాహనాలు ధ్వంసమై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి.. శాంతిభద్రతల సమస్య తలెత్తింది. పోలీసులు భారీగా మొహరించి లాఠీచార్జీ చేసినా పార్టీ శ్రేణులను నిలువరించడం సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 144 సెక్షన్ విధించి పార్టీ కార్యాలయానికి సీలు వేసి పలువురిని అరెస్ట్ చేసింది. ఇందుకు నిరసన తెలుపుతూ పన్నీర్ తన మద్దతుదారులతో ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఎడపాడి వర్గీయులు పన్నీర్‌సెల్వం తదితరులపై పోలీసు కేసు పెట్టారు. పార్టీ నుంచి తనను ఎడపాడి బహిష్కరించడం కాదు, తానే ఎడపాడి, కేపీ మునుస్వామిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పన్నీర్‌సెల్వం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. చదవండి: సీఎంకు చల్లటి చాయ్: అధికారికి నోటీసులు.. కఠిన చర్యలు! -
ఎస్ఈసీ చెంతకు అన్నాడీఎంకే పంచాయితీ.. పన్నీరు సెల్వం ఫిర్యాదు, పళని స్వామి వ్యూహాలు
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే పంచాయితీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరింది. పార్టీలో పరిణామాలపై పన్నీరు సెల్వం ఈసీకి ఫిర్యాదు చేశారనే.. సమాచారంతో పళని శిబిరం వ్యూహాలకు పదును పెట్టింది. ఇక, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కారం జరిగినట్టు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి మధ్య నెలకొన్న వివాదం బుల్లి తెర ధారావాహికను తలపించే విధంగా మలుపులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా పళని శిబిరం దూకుడు పెంచడంతో ఎత్తుకు పైఎత్తు వేసే పనిలో పన్నీరు సెల్వం ఉన్నారు. అన్నాడీఎంకేలో తాజాగా చోటు చేసుకున్న వివాదాలు, సమన్వయ కమిటీ కన్వీనర్ అనుమతి లేకుండా జూలై 11న మరో మారు సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయడం వంటి పరిణామాలను వివరిస్తూ పన్నీరు సెల్వం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా, రెండాకుల చిహ్నాన్ని మరోమారు స్తంభింపజేయడానికి తగ్గ వ్యూహాల్లో పన్నీరు ఉన్నట్టు ప్రచారం జోరందుకుంది. ఇది కాస్త పళని శిబిరంలో కలవరాన్ని రేపినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలకు మద్దతుదారులు పదును పెట్టారు. సర్వసభ్య సమావేశానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, పార్టీలో పన్నీరు రూపంలో ఎదురు అవుతున్న పరిణామాలను ఎన్నికల కమిషన్‌కు వివరించేందుకు తగ్గ నివేదిక సిద్ధం చేసే పనిలో పళని మద్దతు నేతలు ఉండటం విశేషం. అదే సమయంలో శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా సర్వసభ్య సమావేశం జరిగి తీరుతుందని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ మంగళవారం ప్రకటించారు. పెరిగిన బలం పళనిస్వామికి రోజురోజుకూ బలం పెరుగుతోంది. పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న వారిలో 9 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులు మంది మంగళవారం పళనికి జై కొట్టారు. అన్నాడీఎంకేలో మొత్తం 2,665 మంది సర్వసభ్య సమావేశం సభ్యులు ఉండగా, 2,432 మంది పళని వైపు ఉన్నారు. ఇదిలా ఉండగా, పన్నీరు సెల్వం మద్దతు దారులు తనపై దాడిచేశారని వ్యాసార్పాడికి చెందిన పళనిస్వామి మద్దతిస్తున్న మారిముత్తు పోలీసుల్ని ఆ›శ్రయించారు. దీంతో పన్నీరు సెల్వం మద్దతుదారులు 10 మందిపై కేసు నమోదైంది. కాగా, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు.. పిటిషన్ దాఖలైంది. షణ్ముగం అనే సర్వసభ్య సమావేశం సభ్యుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సమావేశ నిర్వహణకు కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సూచనల్ని అన్నాడీఎంకే వర్గాలు విస్మరించినట్టు పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నియోజకవర్గాల్లో చిన్నమ్మ పురట్చి పయనం అన్నాడీఎంకేలో పరిణామాల నేపథ్యంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కూడా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. కేడర్‌ను తన వైపునకు తిప్పుకునే విధంగా పురట్చి పయనానికి తిరుత్తణి వేదికగా ఆమె శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తగ్గ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. కరూర్ నుంచి నియోజకవర్గాల వారీగా తన పర్యటన సాగే విధంగా చిన్నమ్మ పర్యటన ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం. చదవండి: HYD: మోదీ పర్యటనకు భారీ భద్రత.. ‘సాలు మోదీ.. సాలు దొర’ ఫ్లెక్సీ వార్ -
దూకుడు పెంచిన శశికళ.. ఆసక్తికరంగా తమిళ పాలిటిక్స్!
నేతల కిరికిరీ కోట దాటింది.. తకరారు తారస్థాయిని తాకుతోంది.. చివరికి నాయకుల పంచాయితీ పరిధి దాటిపోతోంది.. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నాడీఎంకే.. ఆ నలుగురి చేతుల్లో నలిగిపోతోంది..! బలం కోసం.. బలగం కోసం అగ్రనేతలైన పన్నీరు, పళని స్వామి అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటూ.. నువ్వా.. నేనా అనే రీతిలో తలపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తామేమీ తక్కువ కాదంటూ శశికళ, దినకరన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. బల ప్రదర్శనకు దిగడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది..! సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి వారు పార్టీపై పట్టే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. మదురై వేదికగా పన్నీరు సెల్వం బలప్రదర్శన నిర్వహించారు. చెన్నైలో తిష్ట వేసిన పళని శిబిరం పన్నీరుకు వ్యతిరేకంగా వ్యూహరచనలో నిమగ్నమైంది. మరోవైపు అమ్మ నెచ్చెలి శశికళ పురట్చి పయనం పేరిట తిరుత్తణి వైపుగా కదిలారు. ఇక, ఈమె ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ తిరువళ్లూరు జిల్లా అయపాక్కంలో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఎవరికి వారే.. గత రెండు వారాలుగా అన్నాడీఎంకేలో ముదురుతున్న అంతర్గత విభేదాలు, చోటు చేసుకుంటున్న మలుపులు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్యనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక, ఆదివారం ఎవరికి వారు పారీ్టపై పట్టుకు తమ దైన శైలిలో దూసుకెళ్లారు. జూలై 11న జరిగే సర్వ సభ్య సమావేశంతో పార్టీని కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఈ సమావేశాన్ని నిర్వహించి తీరాలనే సంకల్పంతో ఆదివారం చెన్నైలో సుదీర్ఘ కార్యచరణలో నిమగ్నమయ్యారు. అలాగే, ఈ సమావేశానికి ముందే, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా ఉన్న పన్నీరు సెల్వంతో పాటుగా ఆయన మద్దతుదారుల జాబితా సిద్ధం చేసి పార్టీ నుంచి సాగనంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు బలాన్ని చేకూర్చే విధంగా అన్నాడీఎంకేకు చెందిన ‘నమదు అమ్మ’ దిన పత్రికలో పబ్లీషర్స్ స్థానంలో పన్నీరు సెల్వం పేరును ఆదివారం తొలగించడం గమనార్హం. తగ్గేదేలే అంటున్న పన్నీరు.. ఢిల్లీ నుంచి ఆదివారం మదురైకు చేరుకున్న పన్నీరు సెల్వం బల ప్రదర్శనకు దిగారు. ఆయన మద్దతు దారులు వేలాదిగా విమానాశ్రయానికి చేరుకుని బ్రహ్మరథం పట్టారు. దారి పొడవున ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన బలాన్ని చాటే విధంగా కేడర్ తన వెంటే ఉంది అంటూ పన్నీరు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నాయకులు లేకున్నా, కార్యకర్తలు అందరూ తన వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, సమస్యలకు కారుకులెవ్వరో కేడర్ గుర్తించారని పేర్కొన్నారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత మార్గంలో పయనిస్తున్న తాను నిత్యం కేడర్‌తో కలిసి మెలిసి ఉన్నానని, వారే ఇప్పుడు తనకు బలం అని ధీమా వ్యక్తం చేశారు. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించిన ఆయన ప్రత్యేక వాహనంలో మద్దతు దారులతో కలిసి ముందుకు దూసుకెళ్లారు. అలాగే, మదురై వేదికగా మద్దతు దారులతో సమావేశం అయ్యారు. అనంతరం తేని వైపుగా పన్నీరు సెల్వం బల ప్రదర్శన సాగింది. ఇక, ఈనెల 28వ తేదీన రాయపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని కీలక ప్రకటన చేయడానికి పన్నీరు సిద్ధం అవుతోన్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. కాగా పన్నీరు మద్దతుదారుడైన వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ మరోమారు సర్వసభ్య సమావేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. జులై 11న జరగనున్న సమావేశాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. చిన్నమ్మ ‘పురట్చి’ పయనం అన్నాడీఎంకేను తన గుప్పెట్లోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఇక, రాజకీయ కార్యక్రమాల్లో దూకుడు పెంచనున్నారు. ఆదివారం చెన్నై టీ నగర్‌లోని నివాసం నుంచి తమిళ హక్కులు, మహిళా సాధికారత నినాదంతో పురట్చి పయనానికి చిన్నమ్మ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక వాహనంలో కోయంబేడు, పూందమల్లి, తిరువళ్లూరు, తిరుత్తణి, కోర మంగళం, కేజీ కండ్రిగ, ఆర్కే పేట, అమ్మయార్ కుప్పం వరకు చిన్నమ్మ పయనం సాగింది. అమ్మయార్ కుప్పం బహిరంగ సభ వేదిక వద్దకు చిన్నమ్మ చేరుకున్నారు. ఇక, చిన్నమ్మ ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ సైతం వ్యూహాలకు పదును పెట్టే విధంగా ముఖ్య నేతలతో సమావేశంలో మునిగారు. చిన్నమ్మ తీసుకునే నిర్ణయాలు, ఆమె వేసే అడుగులకు బలాన్ని చేకూర్చే విధంగా తిరువళ్లూరు జిల్లా అయపాక్కం వేదికగా ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలతో సమాలోచించడం గమనార్హం. అన్నాడీఎంకే ఆత్మగౌరవాన్ని కాపాడుతా: శశికళ తిరువళ్లూరు: అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిస్టంభన తొలగించి పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని శశికళ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం తిరువళ్లూరు జిల్లాకు ఆమె వచ్చారు. ఈ మేరకు పూందమల్లి, నేమం, తిరువళ్లూరు, పాండూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ నేతలు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. పూందమల్లిలో పార్టీ నేతలతో మాట్లాడుతూ త్వరలోనే అన్నాడీఎంకేలో అన్ని పరిస్థితులు చక్కదిద్దుతా, కార్యకర్తలు అధైర్యపడవద్దు అని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నరసింహన్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్‌రామ్, పార్టీ నేతలు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేనే ప్రధాన కార్యదర్శి.. తిరుత్తణి: కేజీ కండ్రికలో చిన్నమ్మ శశికళ మాట్లాడుతూ, అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శి తానే అని స్పష్టం చేశారు. తనను తొలగించే అధికారం పన్నీరు, పళని స్వామికి లేదు అని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే అధికారం క్షేత్రస్థాయిలోనే కార్యకర్తలకు మాత్రమే ఉందని వివరించారు. జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నాయకుల్ని అడ్డం పెడ్డుకుని పళని స్వామి ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టే ప్రయత్నంలో ఉన్నారని, ఇందుకు అవకాశం లేదన్నారు. పన్నీరు సెల్వంతో చేతులు కలుపుతారా..? అని ప్రశ్నించగా, వేచి ఉండండీ..! అన్నాడీఎంకేకు మంచి రోజులు రాబోతున్నాయని ఆమె సమాధానం ఇవ్వడం విశేషం. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు -
ఢిల్లీలో ‘రెండాకుల’ పంచాయితీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు ముదిరింది. ఆ పార్టీలో నెలకొన్న రాజకీయ పంచాయితీ హస్తినకు చేరుకుంది. ఎడపాడి ఎత్తుగడలను అడ్డుకునేలా ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు ఓపీఎస్ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఓ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్‌గా ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న ధ్వంధ నాయకత్వానికి తెరదించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇదే అదనుగా ఏక నాయకత్వం నినాదాన్ని ఎడపాడి పళనిస్వామి తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారాన్ని పన్నీర్‌సెల్వం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. సుమారు పదిరోజులకు పైగా సాగిన ఈ ఆధిపత్యపోరు గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో విశ్వరూపం దాల్చింది. మెజారిటీ కార్యవర్గం ఎడపాడికి మద్దతుగా నిలవడంతో పన్నీర్ వేసిన పాచికలు పారలేదు. తనకు అనుకూలంగా ఓపీఎస్ రూపొందించిన 23 తీర్మానాలు ఆమోదం పొందక వీగిపోయాయి. ప్రిసీడియం శాశ్వత చైర్మన్‌గా తమిళ్‌మగన్ హుస్సేన్ ఎంపికైనట్లు గురువారం నాటి సమావేశంలో ఈపీఎస్ ప్రకటించారు. జూలై 11 వ తేదీన మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించేలా ఈపీఎస్ వర్గానికి చెందిన మాజీ మంత్రి సీవీ షణ్ముగం చేసిన విజ్ఞప్తిని ప్రిసీడియం చైర్మన్ గురువారం నాటి సమావేశంలో అనుమతించారు. ఏక నాయకత్వంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీవీ షణ్ముగం అదే వేదికపై ప్రకటించారు. రాజధానికి చేరుకున్న ఓపీఎస్ సర్వసభ్య సమావేశం మొత్తం ఈపీఎస్‌కు అనుకూలంగా మారడంతో కినుక వహించిన పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో కలిసి వాకౌట్ చేశారు. అందరూ కలిసి గురువారం రాత్రే ఢిల్లీ విమానం ఎక్కేశారు. ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి పార్టీలో నెలకొన్న పరిస్థితులను వారికి వివరించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతేగాక జూలై 11వ తేదీ సర్వసభ్య సమావేశం జరుపకుండా స్టే విధించాలని కోరుతూ చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఓపీఎస్ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. కన్వీనర్‌గా ఉన్న తన అనుమతి లేకుండా ప్రిసీడియం చైర్మన్‌ను ఎన్నుకున్నారని, ప్రధాన కార్యదర్శి పదవి లేనందున కన్వీనర్, కో కన్వీనర్ పదవులను ఏర్పాటు చేసుకున్నామని అందులో వివరించారు. ప్రధాన కార్యదర్శి పదవిని చట్టవిరుద్ధంగా పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఈసీకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. రాజీకి ససేమిరా వివాదాలను పక్కనపెట్టి సామరస్యం దిశగా ముందుకు సాగేలా ఓపీఎస్ వర్గం చేసిన ప్రతిపాదనను ఈపీఎస్ వర్గం తోసిపుచ్చింది. ఏక నాయకత్వాన్నే కోరుతున్నామని మరోమారు స్పష్టం చేసింది. ఢిల్లీ నుంచి పావులు కదిపేలా పన్నీర్‌సెల్వం చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టేందుకు ఎడపాడి పళనిస్వామి చెన్నైలో చట్ట నిపుణులతో శుక్రవారం చర్చలు జరిపారు. ఎత్తుకు పైఎత్తువేసి పన్నీర్‌ను పడగొట్టాలని మద్దతుదారులతో సమావేశమయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్ల పదవీకాలం ముగిసినందున ప్రిసీడియం చైర్మన్ మాటే పార్టీలో చెల్లుబాటు అవుతుందని సీవీ షణ్ముగం మీడియాతో శుక్రవారం అన్నారు. పన్నీర్‌సెల్వం ప్రస్తుతం పార్టీ కన్వీనర్ కాదు, కోశాధికారి మాత్రమేనని వ్యాఖ్యానించారు. జనరల్‌బాడీ సభ్యుల నుంచి ఐదుశాతం హాజరీ ఉంటే సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. ఎడపాడి అనుమతిస్తే ఓపీఎస్‌ను కలిసి చర్చలు జరుపుతానని ప్రిసీడియం చైర్మన్ చెప్పారు. చదవండి: EPS - OPS Clash: పన్నీరు సెల్వంపైకి బాటిళ్లు విసిరిన ఈపీఎస్ వర్గీయులు -
చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం, అమ్మ జయలలిత మరణం కేసులో చిన్నమ్మ శశికళకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యక్తిగతంగా క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట మంగళవారం తన వాదన చెప్పారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటు చేసుకు న్న పరిణామాల గురించి తెలిసిందే. తొలుత చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది పన్నీరు సెల్వమే. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని నినాదించారు. నిగ్గుతేల్చాలని పట్టుబట్టారు. చివరకు చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో సీఎంగా గద్దెనెక్కిన ఆమె ప్రతినిధి పళనిస్వామికి దగ్గరయ్యారు. అధికారాన్ని పంచుకు న్న ఈ ఇద్దరు అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మను బహిష్కరించారు. అలాగే, అమ్మ మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్‌ను రంగంలోకి దించారు. ఈ కమిషన్ గతంలో 8 సార్లు సమన్లు జారీ చేసినా పట్టించుకోని పన్నీరు, తాజాగా పరుగులు తీయక తప్పలేదు. గంటలపాటూ విచారణ సోమవారం 3 గంటల పాటుగా ఆర్ముగ స్వామి కమిషన్ పన్నీరును విచారించింది. 78 ప్రశ్నలు సంధించగా, కొన్నింటికి సమాధానాలు ఇచ్చి, మిగిలిన వాటికి దాట వేశారు. ప్రధానంగా అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్, సీఎస్ రామ్మోహన్రావు కనుసన్నల్లోనే చికిత్స వ్యవహారాలు సాగినట్లుగా వ్యాఖ్యల తూటాల్ని పేల్చడం చర్చకు దారి తీశాయి. మంగళవారం 6 గంటలు పా టు విచారణ జరిగింది. 120 ప్రశ్నల్ని పన్నీరు ముందు కమిషన్ వర్గాలు ఉంచగా, మరో 34 ప్రశ్నల్ని క్రాస్ ఎగ్జామిన్‌లో శశికళ తరపున న్యాయవాది రాజ చెందూ ర్ పాండియన్ సంధించారు. అలాగే, అపోలో ఆస్పత్రి తరపున 11 ప్రశ్నలు పన్నీరు ముందుంచారు. చిన్నమ్మకు అనుకూలంగా.. గతంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించిన పన్నీరు తాజాగా ఆమెను ఇరకాటంలో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. జయలలిత మరణం విషయంలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుమానం లేదు అని పేర్కొనడం గమనార్హం. అయితే, ప్రజలు, కేడర్ అనుమానాలు వ్యక్తం చేశాయని, వారి ప్రతినిధిగా తాను కమిషన్ ఏర్పాటుకు పట్టుబట్టినట్టు పేర్కొనడం ఆలోచించాల్సిందే. ఇక, జయలలితకు వ్యతిరేకంగా శశికళ, ఆమె కుటుంబీకులు ఎలాంటి కుట్రలు చేయలేదని స్పష్టం చేశారు. అలాగే, చిన్నమ్మ అంటే వ్యక్తిగతంగా తనకు మర్యాద, అభిమానం ఉందని క్రాస్ ఎగ్జామిన్ సమయంలో పన్నీరు ఇచ్చిన సమాధానాలు అన్నాడీఎంకేలో హాట్ టాపిక్ అయ్యాయి. కాగా జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, సీసీ కెమెరాల తొలగింపు తదితర అంశాల గురించి తనకు తెలియదని పన్నీరు పేర్కొన్న దృష్ట్యా, ఆమెకు చికిత్స అందించిన లండన్ వైద్యుడు రిచర్డ్, అపోలో యాజమాన్యాన్ని మరో మారు విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది. సంతృప్తికరంగా విచారణ విచారణ అనంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, విచారణ సంతృప్తికరంగా జరిగిందన్నారు. ‘వాస్తవాలు’ తెలియజేశానన్నారు. చిన్నమ్మ న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ మాట్లాడుతూ, కుట్రలు జరగలేదని, అనుమానం లేదన్న సమాధానాలను పన్నీరు వెల్లడించినట్లు చెప్పారు. -
‘అమ్మకు ఆ సలహా ఇచ్చింది నేనే.. కానీ’
సాక్షి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో ఉన్న జయలలితను విదేశాలకు తీసుకెళ్లి వైద్యం అందించాలన్న సలహాను తొలుత ఇచ్చింది తానేనని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు. దివంగత సీఎం జయలలిత మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ఆర్ముగ స్వామి కమిషన్ ముందు సోమవారం ఆయన హాజరయ్యారు. విచారణ వేగవంతం జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. నాలుగున్నరేళ్లుగా ఈ విచారణకు డుమ్మా కొడుతూ వచ్చిన పన్నీరు సెల్వం ఎట్టకేలకు సోమవారం జరిగిన విచారణకు వచ్చారు. కాగా మంగళవారం కూడా రావాలని కమిషన్ వర్గాలు ఆయన్ని ఆదేశించాయి. అలాగే, జయలలిత నెచ్చెలి శశికళతో పాటుగా సుదీర్ఘ కాలం పోయేస్ గార్డెన్లో ఉన్న ఆమె వదినమ్మ ఇలవరసి సైతం విచారణకు వచ్చారు. (చదవండి: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోండి.. నగదు రివార్డు పొందండి: స్టాలిన్ ) సీసీ కెమెరాల్ని తొలగించమని ఆదేశించ లేదు పన్నీరు సెల్వం కమిషన్ ముందు ఉంచిన వాదనలు, వాంగ్ములం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అపోలో ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు తొలగించాలని తాను ఆదేశించ లేదని ఆయన స్పష్టం చేశారు. జయలలిత మధుమేహంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునని, అయితే, ఆమెకు ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల గురించి తనకు తెలియదని వెల్లడించారు. దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్‌ను ఏవిధంగా విదేశాలకు తీసుకెళ్లి వైద్య చికిత్స అందించడం జరిగిందో, అదే తరహాలో అమ్మను కూడా విదేశాలకు తీసుకెళ్దామని అప్పటి ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, మరో మంత్రి తంగమణితో పాటుగా పలువురి దృష్టికి తీసుకెళ్లానని, అయితే, ఎవరూ స్పందించ లేదని పేర్కొన్నారు. అయితే, అపోలో వర్గాలు మాత్రం అమ్మ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంటూ వచ్చారని వివరించారు. అలాగే, విదేశాలకు తరలింపు విషయంలో తాను నిర్లక్ష్యం వహించినట్టుగా మాజీ సీఎస్ రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక, పలు ప్రశ్నలకు తెలియదు అని, తన దృష్టికి రాలేదని, తనతో ఎవరూ చర్చించలేదని, సలహా కూడా తీసుకోలేదని పన్నీరు సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఇలవరసి ఒకటి రెండు సార్లు తాను.. అపోలో ఆస్పత్రిలో అద్దాల నుంచి జయలలితను చూశానని వాంగ్ములం ఇచ్చినట్లు సమాచారం. -
Tamil Nadu: కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..!
సాక్షి, చెన్నై : గతంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పుగలేంది తీరు ఆపార్టీ అగ్రనాయలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామికి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పుగలేంది వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. అయితే ప్రాథమిక సభ్యత్వం నుంచి తనను అకారణంగా తొలగించారంటూ పుగలేంది కోర్టుకెక్కారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తన పరువుకు భంగం కల్గించిన పన్నీరు సెల్వం, ‡పళనిస్వామిపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించాలని కోర్టుకు పుగలేంది విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పన్నీరు సెల్వం, పళని స్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం విచారణకు ఆ ఇద్దరు హాజరు కావాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపుతూ, నేరుగా కోర్టుకు హాజరయ్యే అంశం నుంచి మినహాయింపు ఇవ్వాలని తమ న్యాయవాదుల ద్వారా వారు పిటిషన్ వేశారు. ఈ విజ్ఞప్తి కోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 14వ తేదీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు. కొడనాడు కేసులో.. వాదోపవాదాలు కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీ వ్యవహారం తాజాగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షిగా ఉన్న కోయంబత్తూరుకు చెందిన రవి దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణ ముగించి, చార్జ్‌షీట్ సైతం దాఖలై ఉందని, ఈ సమయంలో మళ్లీ పునఃవిచారణ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. స్టే విధించాలని కోరారు. అయితే, రవి ఓ సాక్షి మాత్రమేనని, అతడి వాదనను పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టం చేశారు. అలాగే, ఈ కేసులో మాజీ సీఎం పళనిస్వామి, శశికళ, ఆమె బంధువు ఇలవరసిని విచారించేందు అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈనేపథ్యంలో న్యాయమూర్తి తీర్పును శుక్రవారం వెలువరించనున్నట్లు ప్రకటించారు. -
నువ్వా.. నేనా.. అన్నాడీఎంకేలో పోటాపోటీ!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో కీలకమైన ప్రిసీడియం చైర్మన్ పోస్టును చేజిక్కించుకునేందుకు నేతలు ఆపార్టీ నేతలు నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. రేసులో మొత్తం ఏడుగురు నేతలు ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం ముగ్గురి మధ్య ఉంది. ఇప్పటి వరకు వళ్లి ముత్తు, నావలన్ నెడుంజెలియన్, పొన్నయ్యన్, పుదుమై పిత్తన్, కాళి ముత్తు, మధుసూదనన్ వంటి నేతలు ప్రిసీడియం చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో మధుసూదనన్ ఒకటిన్నర దశాబ్దం ఆ పదవిలో కొనసాగారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన మరణించారు. దీంతో ఈ పదవిపై సీనియర్ల దృష్టి పడింది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో సమన్వయ కమిటీ కీలకంగా ఉన్నప్పటికీ, కోర్టుల్లో పార్టీ పరంగా ఉన్న వ్యవహారాల్ని ఎదుర్కొనడం, ఎన్నికల కమిషన్‌తో ముడిపడిన అంశాలన్నీ ప్రిసీడియం చైర్మన్ గుప్పెట్లోనే ఉంటాయి. ప్రధాన పోటీ వారిమధ్యేనా? ఎన్నికల్లో ఓటమి తర్వాత పదవులు లేకుండా ఖాళీగా ఉన్న సీనియర్లు ఈ పదవి కోసం తీవ్రంగానే పావులు కదుపుతున్నారు. సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామికి సన్నిహితంగా ఉన్న నేతలు ఆశావహుల జాబితాలో ఉన్నారు. జేసీడీ ప్రభాకర్, తమిళ్ మగన్ హుస్సేన్, సయ్యద్ ఖాన్, అన్వర్ రాజా, అరుణాచలం, వేనుగోపాల్, ధనపాల్ రేసులో ఉన్నారు. అయితే ధనపాల్, అన్వర్ రాజా, తమిళ్ మగన్ హుస్సేన్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు భావిస్తున్నారు. అన్వర్, హుస్సేన్ మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన నేతలు. వీరిలో ఒకరికి పదవి కట్టబెడితే.. మరొకరు వ్యతిరేకించే అవకాశం ఉంది. ధనపాల్ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాగా మధుసూదనన్ దివంగత అమ్మ జయలలిత మెచ్చిన ప్రిసీడియం చైర్మనే కాదు, పన్నీరుసెల్వం మద్దతు దారుడు కూడా. దీంతో ఈసారి కూడా తన వర్గీయులకే ఆ పదవి కట్టబెట్టేందుకు పన్నీరు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. చదవండి: Tamilnadu: రూ.7 వేల కోట్ల భారం.. అందుకే 60 ఏళ్లకే రిటైర్మెంట్ -
Tamil Nadu Assembly: ఉపనేతగా పన్నీరు సెల్వం.. వాళ్లకు షాక్!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే శాసనసభాపక్ష ఉపనేతగా ఓ పన్నీరు సెల్వం, విప్‌గా మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సోమవారం చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే శాసన సభా పక్ష సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే చిన్నమ్మ శశికళతో టచ్‌లో ఉన్న నేతల ఉద్వాసనకు తీర్మానించారు. మాజీ మంత్రి ఆనందన్, అధికార ప్రతినిధి పుహలేందితో సహా 15 మందిని అన్నాడీఎంకే నుంచి తొలగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి 66 మంది గెలిచిన విషయం తెలిసిందే. ఆ పార్టీ శాసన సభపక్ష నేతగా మాజీ సీఎం పళనిస్వామి ఇప్పటికే ఎన్నికయ్యారు. ఇక ఉపనేత, విప్ ఎంపిక నిమిత్తం అన్నాడీఎంకే శాసన సభాపక్షం సోమవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. పట్టువీడిన పన్నీరు రెండున్నర గంటల పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ సాగింది. ఇందులో పన్నీరు సెల్వంను శాసనసభాపక్ష ఉప నేత పగ్గాలు చేపట్టాల్సిందేనని ముక్తకంఠంతో నేతలు నినదించారు. దీంతో ఆయన ఓ మెట్టుదిగి పదవి చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. అలాగే అన్నాడీఎంకేను కైవశం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న శశికళను అడ్డుకునే దిశగా చర్చ సాగింది. ఈ మేరకు కీలక తీర్మానాన్ని చేశారు. ఆమెతో ఎవరైనా మాట్లాడితే ఉద్వాసనే అన్న హెచ్చరిక చేశారు. ఈ సమావేశం అనంతరం అన్నాడీఎంకే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే శాసనపక్షా పక్ష ఉపనేతగా ఓ పన్నీరు సెల్వం, విప్‌గా మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, సహాయ విప్‌గా అరక్కోణం ఎమ్మెల్యే ఎస్. రవి ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ప్రకటించారు. అలాగే అన్నాడీఎంకే కోశాధికారిగా మాజీ మంత్రి కడంబూరు రాజు, కార్యదర్శిగా మరో మాజీ మంత్రి కేపీ అన్బళగన్, సహాయ కార్యదర్శిగా మనోజ్ పాండియన్‌లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ నేతలకు హెచ్చరిక శశికళతో ఫోన్లో మాట్లాడినా, సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేసినా అన్నాడీఎంకేలో చోటు లేదని హెచ్చరించే రీతిలో మరో ప్రకటన విడుదలైంది. ఆమెతో మాట్లాడిన 15 మంది నేతలను పార్టీ నుంచి తొలగించారు. ఇందులో మాజీ మంత్రి ఆనందన్, మాజీ ఎంపీ చిన్నస్వామి, పార్టీ అధికార ప్రతినిధి పుహలేందితో పాటు పలువురు నేతలు ఉండడం గమనార్హం. దీనిపై మాజీ మంత్రి జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో ఐక్యమత్యంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల సమవేశమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. శశికళకు మద్దతిస్తే ఎవరికైనా అన్నాడీఎంకేలో చోటు ఉండదని హెచ్చరించారు. చదవండి: ఎల్జేపీలో ముసలం.. నితీశ్ చాణక్యం! -
తమిళనాడులో వీడిన ఉత్కంఠ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రస్తుత సీఎం పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ఎంపిక చేశారు. ఈమేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతకాలు చేశారు. ఇక.. 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో ఇప్పటి వరకు భారీ ఎత్తున వివాదం నడిచింది. నేనంటే నేనే అంటూ పళనిస్వామి, పన్నీర్ సెల్వం పరోక్షంగా ప్రకటనలిచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పళనిస్వామికి అవకాశం దక్కడంతో సస్పెన్స్ వీడింది. (చదవండి: అన్నాడీఎంకేలో కుర్చీ వార్) -
చెన్నై: ఏఐడీఎంకేలో కీలక రాజకీయ పరిణామాలు
-
అమ్మ మిస్టరీ.. బాంబు పేల్చిన పన్నీర్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మరణ మిస్టరీ అటు ఇటూ తిరిగి చివరకు అపోలోకు చుట్టుకుంది. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో అమ్మ గడిపిన 74 రోజుల సీసీటీవీ పుటేజీ దృశ్యాలపై విచారణ కమిషన్ పట్టుబట్టడం, అవి చెరిగిపోయాయని, అసలు రికార్డేకాకుండా ఒక అధికారి స్విచ్ఆఫ్ చేయమన్నాడని భిన్నమైన వాంగ్మూలాలు చోటుచేసుకోవడంతో అపోలో ఆసుపత్రిని సందర్శించేందుకు కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి సిద్ధమవుతున్నారు. జ్వరం, డీహైడ్రేషన్...కేవలం ఈ రెండు వ్యాధులతో బాధపడుతూ అపోలోలో చేరారని 2016 సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. జయ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు, త్వరలో ఆరోగ్యం కుదుటపడుతుంది, డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. అయితే బులెటిన్‌లో పేర్కొన్నదానికి భిన్నంగా అదే ఏడాది డిసెంబర్ 5న జయ కన్నుమూశారు. దీంతో అందరిలోనూ అనుమానాలు తలెత్తాయి. ప్రతిపక్షాలు సైతం సీబీఐ విచారణకు పట్టుబట్టాయి. అప్పట్లో అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన పన్నీర్‌సెల్వం సైతం విచారణకు పట్టుబట్టారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించింది. కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి ఎదుట సుమారు వందమందికి పైగా వాంగ్మూలం ఇచ్చారు. ఈ దశలో అపోలో ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల పుటేజీ కావాలని కమిషన్ ఇటీవల కోరినపుడు అవి చెరిగిపోయాయని బదులువచ్చింది. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో టీటీవీదినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ జయ చికిత్స పొందుతున్న దృశ్యాలను బైటపెట్టాడు. అవి మార్ఫింగ్ దృశ్యాలను కొందరు కొట్టిపారేసినా స్వయంగా శశికళ చిత్రీకరించారని నమ్మబలికారు. పుటేజీలపైనే పట్టుబట్టి ఉన్న కమిషన్ అపోలో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుబ్బయ్య విశ్వనాథన్, వైద్యులు పద్మావతి, భువనేశ్వరి, అరుళ్సెల్వన్, మాజీ ఎంపీ మనోజ్‌పాండియన్, శశికళ తరఫు న్యాయవాది సెంధూరపాండి వేర్వేరుగా మంగళవారం పిలిపించి విచారించింది. ఈ సందర్భంగా అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయని కమిషన్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, చికిత్సలో భాగంగా వార్డు నుంచి జయను బైటకు తీసుకొచ్చినపుడు సీసీ టీవీ కెమెరాల స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా ఒక అధికారి ఆదేశించినట్లు విచారణ కమిషన్ ముందు అపోలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుబ్బయ్య విశ్వనాథన్ ఇచ్చిన వాంగ్మూలం కలకలానికి కారణమైంది. జయ చికిత్సకు సంబంధించిన బులెటిన్లు వేరేవారు సిద్ధం చేయగా, తాను సంతకం మాత్రమే చేశాను అని సీఓఓ చెప్పారు. అయితే ఆ బులెటిన్ తయారు చేసినవారు ఎవరని కమిషన్ ప్రశ్నించగా ఆయన వారంరోజుల గడువు కోరడంతో కమిషన్ మంజూరు చేసింది. జయ చేరిన 2016 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విడుదలైన బులెటిన్లలో పొంతనలేదు, వాటిని కూడా వివరించాలని కమిషన్ ఆదేశించింది. సీసీటీవీ కెమెరాలు స్వీచ్‌ఆఫ్ చేయాలని ఒక అధికారి ఆదేశించినట్లుగా అపోలో సెక్యూరిటీ అధికారి తనతో అన్నాడని సుబ్బయ్య చెప్పడంతో సదరు అధికారి ఎవరని కమిషన్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సైతం తెలియదనే సమాధానమే వచ్చింది. సెక్యూరిటీ అధికారి ఇళంగోవన్ మృతిచెందడం వల్ల స్విచ్ ఆఫ్ చేయమని చెప్పిన అధికారిని గుర్తించేందుకు ఎవరిని అడగాలో తెలియడం లేదని కూడా ఆయన అన్నాడని కమిషన్ వర్గాలు చెప్పాయి. ఈ జవాబుకు ఆగ్రహించిన కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి ‘చనిపోయిన వారిని అడ్డుపెట్టుకుని వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా’ అని గద్ధించగా ఆయన మౌనం పాటించినట్లు తెలిసింది. 2016 సెప్టెంబర్ 22న పోయెస్‌గార్డెన్‌లో ఏమి జరిగిందో తెలుసుకునేందుకు పుటేజీలను సేకరించాలని, అపోలో ఆసుపత్రిలో అదే నెల 23,24 తేదీల పుటేజీని పరిశీలించాలని, పోయెస్‌గార్డెన్ నుంచి అపోలో ఆసుపత్రి వరకున్న 17 సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించాలని మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ మంగళవారం కమిషన్ ముందు హాజరై ఆర్ముగస్వామిని కోరాడు. కమిషన్ సైతం ఆయా పుటేజీలను సేకరించాలని నిర్ణయించుకుంది. పోయెÜగార్డెన్, అపోలో ఆసుపత్రిని సైతం పరిశీలించాలని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. మరోబాంబు పేల్చిన పన్నీర్: సీసీటీవీ పుటేజీల వివాదం ఇలా ఉండగా, డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మరిన్ని అనుమానాలు రేకెత్తించే వ్యాఖ్యలతో బాంబుపేల్చారు. చెన్నై తమిళనాడు రాష్ట్రం తేనీలో మంగళవారం రాత్రి జరిగిన అన్నాడీఎంకే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అపోలో ఆసుపత్రిలో జయను చూసేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎంత ప్రయత్నించినా చూడలేక పోయాను. అమ్మ చికిత్స పొందిన 74 రోజులూ ఆసుపత్రి కిందకే పరిమితమైనా. రోజులు గడుస్తున్నా జయ ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో మెరుగైన చికిత్సకు అమెరికాకు పంపాలని నిర్ణయించుకున్నా. అమ్మకు ఏమైనా జరిగితే ప్రజల తమను రోడ్లపైకి రానీయరని భయపడ్డా. ఇదే విషయాన్ని తాను ప్రస్తావించి బతిమాలా. ‘మాపై నమ్మకం లేదా’ని అపోలో యాజమాన్యం నన్ను ఎదురుప్రశ్నించి నిరాకరించిందని అన్నారు. -
ఎప్పుడో సీఎం అయ్యే వాడిని!
సాక్షి,చెన్నై : తలచుకుని ఉంటే, తానెప్పుడో సీఎం అయ్యే వాడినని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు. ద్రోహుల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని, పళని సర్కారు కుప్ప కూలడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. గురువారం ఈరోడ్‌లో కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ నినాదంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం సాగింది. ఈసందర్భంగా మీడియాతో దినకరన్ మాట్లాడారు. కావేరి వ్యవహారంలో కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని పళని ప్రభుత్వం పథకం ప్రకారం కపట నాటకాలను ప్రదర్శిస్తున్నాయని మండి పడ్డారు. కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలను పళని, పన్నీరు తాకట్టుపెట్టేశారని, వాటిని మళ్లీ దక్కించుకోవాలంటే, ఈ ప్రభుత్వం కుప్పకూలాల్సిందేనని పేర్కొన్నారు. అందుకు తగ్గ సమయం ఆసన్నమైందన్నారు. అనర్హత వేటు వ్యవహారంలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన మరుక్షణం పళని సర్కారు కుప్పకూలినట్టేనని, తీర్పు త్వరితగతిన వెలువరించేందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని తాము అభ్యర్థిస్తున్నామన్నారు. ద్రోహుల్ని తరిమి కొడతాం రాజకీయాలంటే ఏమిటో తెలియని పన్నీరు సెల్వంను తీసుకొచ్చి సీఎం పదవిలో చిన్నమ్మ శశికళ కూర్చొబెట్టారన్నారు. అమ్మ మరణం తదుపరి రెండో సారిగా కూడా చాన్స్ ఇస్తే, ఏకంగా అన్నాడీఎంకేని బీజేపీకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు చేశారన్నారు. పళని స్వామిని సీఎంగా చేస్తే, ఆయన ఏకంగా అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి, వారి అడుగులకు మడుగులు వత్తే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. తాను తలచుకుని ఉంటే, ఎప్పుడో సీఎం అయ్యే వాడినని ధీమా వ్యక్తంచేశారు. అయితే, తనకు గాని, తన కుటుంబంలోని వారికి గాని పదవీ ఆశ లేనందున, అన్నాడీఎంకే కోసం అమ్మ వెన్నంటి ఉండి శ్రమించామన్నారు. అయితే, ప్రస్తుతం ఆ పార్టీని రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నట్టు వివరించారు. ఆ ఇద్దరు ద్రోహులకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, వారిని తరిమి కొట్టే రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల్ని తమ మీదకు ఉసిగొల్పుతున్నారని, మున్ముందు అదే పోలీసులు ఆ ఇద్దరినీ టార్గెట్ చేయడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. -
కంచి మఠం ఆస్తులు వేల కోట్లు
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శివైక్యం చెందిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి హయాంలో కంచి మఠం ఆస్తులు గణనీయంగా వృద్ధి చెందాయి. వేలకోట్ల ఆస్తులు పెరిగి మఠం పేరు ప్రతిష్టలు దేశ, విదేశాలకు వ్యాప్తిచెందాయి. ప్రస్తుతం ఉన్న శిష్యగణంలో 40% అదనంగా శిష్యులు, భక్తులు పెరిగారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థిర, చరాస్తులు పెరిగాయి. అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లోనూ స్వామీజీ భక్తులు పెరిగారు. జయేంద్ర సరస్వతి కంటే ముందు 68 మంది పీథాధిపతులు పనిచేయగా వీరంతా హిందూమత ప్రచారానికే పరిమితమయ్యారు. జయేంద్ర సరస్వతి మాత్రం కంచి కామకోటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మత ప్రచారంతో పాటు స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించారు. పారిశ్రామికవేత్తలను శిష్యులుగా చేర్చుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి అధిక మొత్తంలో విరాళాలు రాబట్టారు. ఆయుర్వేద ఆస్పత్రి, వర్సిటీలు నిర్మించి.. గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించారు. దేశవ్యాప్తంగా 38 శాఖలను ప్రారంభించి భక్తుల నుంచి వేల కోట్ల విరాళాలను ట్రస్ట్‌కు రాబట్టారు. ఈ సొమ్ములతో సేవా కార్యక్రమాలను చేపట్టడంతో ప్రముఖుల దృష్టి కంచి మఠం వైపు మళ్లింది. ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.. మఠం మేనేజర్ సుందరేశ్ అయ్యర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల సీఎంలు, ప్రధాని కార్యాలయం నుంచి తమకు ఫోన్లు వచ్చినట్లు చెప్పారు. స్వామీజీ అధిష్టానం గురించి వారు వాకబు చేశారని వివరించారు. దీనికి ఎవరెవరు వస్తున్నారో తెలియపర్చలేదని తెలిపారు. బుధవారం రాత్రి తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కంచి మఠానికి చేరుకుని జయేంద్రసరస్వతి పార్థీవదేహానికి నమస్కరించారు. స్వామీజీ ఆకస్మిక మరణం మనస్సును కలచివేసిందని చెప్పారు. -
ఏఐఏడీఎంకే నుంచి 58మంది బహిష్కరణ
చెన్నై: అన్నా డీఎంకే పార్టీ నుంచి 50మందికిపైగా నాయకులను పార్టీ అధినాయకులు ఒ.పన్నీర్‌సెల్వం, కె.పళనిస్వామిలు బహిష్కరించారు. క్రమశిక్షణ వేటు పడిన 53మంది పార్టీ కాంచీపురం సెంట్రల్ యూనిట్‌కు చెందినవారు. అలాగే పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగానికి చెందిన ఐదుగురు(అన్నా తోజిర్సంగ పెరవై)ని కూడా బహిష్కరించారు. వారిని అన్ని పోస్టుల నుంచి, ప్రాథమిక సభ్యత్వాల నుంచి తొలగించినట్లు కో ఆర్డినేటర్లు పన్నీరుసెల్వం, పళనిస్వామిలు తెలిపారు. పార్టీ నుంచి విడిపోయిన దినకరన్‌కు ప్రధాన శక్తులుగా ఉన్న పలువురిని ఇంతకుముందు కూడా బహిష్కరించారు. -
‘మేం ఎవ్వరం అమ్మని కలవలేదు.. అంతా శశికళే..’
సాక్షి, న్యూఢిల్లీ : అమ్మ(జయలలిత)కు ఇన్ఫెక్షన్ కాకూడదని మంచి ఉద్దేశంతో మేం ఒక్కరం కూడా అమ్మను చూసేందుకు వెళ్లలేదు. ఎందుకంటే మేం ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నాం. కానీ వాళ్లు మాత్రం ప్రతి రోజు వెళ్లి చూసొచ్చి అమ్మ కోలుకుంటోంది.. తింటోంది అని చెప్పేవాళ్లు. మేం ఆ మాటలు విని సరే అనుకునే వాళ్లం’ అని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం చెప్పారు. ఆర్కే నగర్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ చేతుల్లో తమ అభ్యర్థి ఘోరంగా ఓటమిపాలయిన సందర్భంగా సోమవారం అన్నాడీఎంకే ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పన్నీర్ మీడియాతో మాట్లాడారు. ‘ఒక్క మంత్రి కూడా అమ్మను ప్రత్యక్షంగా కలవలేదు. ప్రతిసారి నర్సు.. వారే (శశికళ కుటుంబ సభ్యులు) వెళ్లి వస్తుండేవారు’ అని పన్నీర్ సెల్వం చెప్పారు. జయలలిత పోర్ట్‌ఫోలియోకు ఎంతటి విలువిచ్చారో అంతే గౌరవాన్ని తాను కాపాడానని చెప్పారు. -
‘రెండాకులు’ పళని–పన్నీర్లకే
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ అధికారిక చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాటి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంల వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల్లో అత్యధికులు పళనికే మద్దతు ఇస్తున్నందున ఆ వర్గానికే గుర్తు కేటాయించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెండాకుల గుర్తును పళని వర్గానికి కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఈసీ తాజా నిర్ణయంతో రెండాకుల గుర్తు కోసం తీవ్రంగా పోరాడుతున్న ఆ పార్టీ బహిష్కృత నేత శశికళకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మరోవైపు ఈసీ నిర్ణయంతో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఇతర మంత్రులు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం పళని స్వామి స్పందిస్తూ.. అన్నాడీఎంకేకు ఈ రోజు అత్యంత ఆనందకరమైనదని అన్నారు. ఈసీ నిర్ణయంతో ఇక అన్నాడీఎంకే పేరును, రెండాకుల చిహ్నాన్ని పళని స్వామి వర్గం వినియోగించుకోవచ్చు. అలాగే పార్టీ ప్రధాన కార్యాలయం కూడా పళనిస్వామి వశం కానుంది. గతేడాది డిసెంబర్లో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్లో ఉపఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. పన్నీర్‌సెల్వం, శశికళల నేతృత్వంలోని రెండు వర్గాలతో పాటు జయ మేనకోడలు దీప కూడా పార్టీ రెండాకుల గుర్తు మాదంటే మాదని వాదించడంతో ఈ గుర్తును ఈసీ అప్పట్లో నిలిపివేసింది. మరోవైపు ఈసీ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇది రెండోసారి..! ► నాడు ఎంజీఆర్ మరణంతో నిలిపివేత ► జయ కన్నుమూతతో మార్చిలోనూ నిషేధం అన్నా డీఎంకే పార్టీ ఎన్నికల చిహ్నంగా రెండాకుల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) పునరుద్ధరించడం ఇది రెండోసారి. ఒక పార్టీ ఎన్నికల చిహ్నాన్ని రెండుసార్లు నిలిపివేసి మళ్లీ కేటాయించడం ఏఐఏడీఎంకే విషయంలోనే జరిగింది. ఎంజీఆర్ చనిపోయాక ఆయన భార్య జానకి, జయలలితల మధ్య... అలాగే జయ మరణం తర్వాత పళనిస్వామి–శశికళ వర్గం, పన్నీర్‌సెల్వం వర్గం మధ్య కూడా పార్టీపై ఆధిపత్యం కోసం పోరు ఒకే పద్దతిన సాగింది. కరుణానిధితో తలెత్తిన భేదాభిప్రాయాలతో ఎంజీఆర్ 1972లో డీఎంకే నుంచి బయటకు వచ్చి అన్నా డీఎంకేను ఏర్పాటుచేసి, రెండాకులను ఎన్నికల చిహ్నంగా చేసుకున్నారు. 1987లో ఆయన మరణించినప్పుడు భార్య జానకీ రామచంద్రన్, నాటి పార్టీ ప్రదానకార్యదర్శి జయలలిత రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీలో, అసెంబ్లీలో తనకే ఆధిక్యం ఉందనీ, ఎన్నికల గుర్తును తమ వర్గానికే కేటాయించాలని జానకి పట్టుపట్టారు. అటు జయలలిత కూడా కార్యకర్తల మద్దతు తనకే ఉందనీ, రెండాకుల గుర్తును తమ వర్గానికి ఇవ్వాలని వాదించారు. దీంతో ఈ గుర్తును ఎవరూ ఉపయోగించకుండా అప్పట్లో ఈసీ నిలిపివేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జానకి ఓడిపోయి రాజకీయాల నుంచి నిష్క్రమించడంతో గుర్తు, పార్టీ జయలలిత వశమయ్యాయి. మళ్లీ గతేడాది జయలలిత చనిపోయినప్పుడు కూడా దాదాపు ఇలానే జరిగింది. జయలలిత ఆసుపత్రిలో ఉండగా ముఖ్యమంత్రిగా నియమితుడైన పన్నీర్‌సెల్వం... ఆమె మరణం తర్వాత కూడా పదవిలో కొనసాగేందుకు ప్రయత్నించారు. అప్పుడే జయలలిత సన్నిహితురాలు శశికళ కూడా ఏకపక్షంగా తనను తానే పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించుకుని, పార్టీని తన అదుపాజ్ఞల్లోకి తెచ్చుకుని, సీఎంగా పన్నీర్‌సెల్వంను తొలగించి పళనిస్వామిని నియమించారు. దీంతో పన్నీర్‌సెల్వం తిరుగుబావుటా ఎగురవేయడంతో పార్టీ మళ్లీ రెండుగా చీలింది. అప్పుడే జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. దీంతో రెండాకుల గుర్తును తమకే కేటాయించాలంటూ అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్‌సెల్వం వర్గం ఈసీకి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ గుర్తు వాడకంపై ఈ ఏడాది మార్చి 22న తాత్కాలిక నిషేధం విధించింది. ఆ తర్వాత ఇరు వర్గాలు ఓటర్లను తీవ్రంగా ప్రలోభపెట్టడంతో ఈసీ ఎన్నికనే వాయిదా వేసింది. రెండాకుల గుర్తును చేజిక్కించుకునేందుకు దినకరన్ అవినీతికి కూడా పాల్పడినట్లు కూడా రుజువైంది. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటై శశికళను, ఆమె కుటుంబీకులను పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రెండాకుల గుర్తును పళని, పన్నీర్లకే కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్