సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే పంచాయితీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేరింది. పార్టీలో పరిణామాలపై పన్నీరు సెల్వం ఈసీకి ఫిర్యాదు చేశారనే.. సమాచారంతో పళని శిబిరం వ్యూహాలకు పదును పెట్టింది. ఇక, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కారం జరిగినట్టు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి మధ్య నెలకొన్న వివాదం బుల్లి తెర ధారావాహికను తలపించే విధంగా మలుపులతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
తనకు వ్యతిరేకంగా పళని శిబిరం దూకుడు పెంచడంతో ఎత్తుకు పైఎత్తు వేసే పనిలో పన్నీరు సెల్వం ఉన్నారు. అన్నాడీఎంకేలో తాజాగా చోటు చేసుకున్న వివాదాలు, సమన్వయ కమిటీ కన్వీనర్ అనుమతి లేకుండా జూలై 11న మరో మారు సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయడం వంటి పరిణామాలను వివరిస్తూ పన్నీరు సెల్వం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా, రెండాకుల చిహ్నాన్ని మరోమారు స్తంభింపజేయడానికి తగ్గ వ్యూహాల్లో పన్నీరు ఉన్నట్టు ప్రచారం జోరందుకుంది.
ఇది కాస్త పళని శిబిరంలో కలవరాన్ని రేపినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలకు మద్దతుదారులు పదును పెట్టారు. సర్వసభ్య సమావేశానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, పార్టీలో పన్నీరు రూపంలో ఎదురు అవుతున్న పరిణామాలను ఎన్నికల కమిషన్‌కు వివరించేందుకు తగ్గ నివేదిక సిద్ధం చేసే పనిలో పళని మద్దతు నేతలు ఉండటం విశేషం. అదే సమయంలో శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా సర్వసభ్య సమావేశం జరిగి తీరుతుందని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ మంగళవారం ప్రకటించారు.
పెరిగిన బలం
పళనిస్వామికి రోజురోజుకూ బలం పెరుగుతోంది. పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న వారిలో 9 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులు మంది మంగళవారం పళనికి జై కొట్టారు. అన్నాడీఎంకేలో మొత్తం 2,665 మంది సర్వసభ్య సమావేశం సభ్యులు ఉండగా, 2,432 మంది పళని వైపు ఉన్నారు. ఇదిలా ఉండగా, పన్నీరు సెల్వం మద్దతు దారులు తనపై దాడిచేశారని వ్యాసార్పాడికి చెందిన పళనిస్వామి మద్దతిస్తున్న మారిముత్తు పోలీసుల్ని ఆ›శ్రయించారు. దీంతో పన్నీరు సెల్వం మద్దతుదారులు 10 మందిపై కేసు నమోదైంది. కాగా, గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు.. పిటిషన్ దాఖలైంది. షణ్ముగం అనే సర్వసభ్య సమావేశం సభ్యుడు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సమావేశ నిర్వహణకు కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సూచనల్ని అన్నాడీఎంకే వర్గాలు విస్మరించినట్టు పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
నియోజకవర్గాల్లో చిన్నమ్మ పురట్చి పయనం
అన్నాడీఎంకేలో పరిణామాల నేపథ్యంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కూడా వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. కేడర్‌ను తన వైపునకు తిప్పుకునే విధంగా పురట్చి పయనానికి తిరుత్తణి వేదికగా ఆమె శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తగ్గ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. కరూర్ నుంచి నియోజకవర్గాల వారీగా తన పర్యటన సాగే విధంగా చిన్నమ్మ పర్యటన ఏర్పాట్లు చేసుకుంటుండటం గమనార్హం.
చదవండి: HYD: మోదీ పర్యటనకు భారీ భద్రత.. ‘సాలు మోదీ.. సాలు దొర’ ఫ్లెక్సీ వార్
Comments
Please login to add a commentAdd a comment