చేతులు కలిపారు
► ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల విలీనం
► డిప్యూటీ సీఎం, పార్టీ సమన్వయకర్తగా పన్నీర్
► సీఎం, పార్టీ ఉప సమన్వయకర్తగా పళనిస్వామి
► శశికళ తొలగింపునకు త్వరలో జనరల్ కౌన్సిల్ భేటీకి నిర్ణయం
► శశికళ వర్గం ఎమ్మెల్యేల అసంతృప్తి
► నేడు గవర్నర్‌తో భేటీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్నెల్ల విభేదాల అనంతరం ఏఐఏడీఎంకే లోని రెండు కీలక వర్గాలు విలీనమయ్యాయి. మూడు నాలుగు రోజులుగా విలీనంపై చర్చలు కొలిక్కి రాకపోవటంతో పెరిగిన ఉత్కంఠకు సోమవారం తెరపడింది. అధికార మార్పిడి విషయంలో రెండు వర్గాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వం, ప్రభుత్వ బాధ్యతలు పళని స్వామి నిర్వర్తించాలని నిర్ణయించారు.
దీంతోపాటుగా పన్నీరు సెల్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలతోపాటు మరికొన్ని శాఖలను పన్నీర్ వర్గానికి ఇచ్చేందుకు కూడా సీఎం పళనిస్వామి అంగీకరించారు. ఇకపై పన్నీర్ సెల్వం అన్నాడీఏంకే సమన్వయకర్తగా, పళనిస్వామి ఉప సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. తాజా మార్పుల నేపథ్యంలో దినకరన్, శశికళ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు రేపు గవర్నర్‌ను కలవనున్నారు. అటు, అన్నాడీఎంకే విలీనంపై సినీనటుడు కమల్ హాసన్ స్పందించారు. తమిళ ప్రజల నెత్తిన ఈ రెండు వర్గాల నేతలు టోపీ పెడుతున్నారని ట్విటర్ ద్వారా విమర్శించారు.
నాటకీయ పరిణామాలు
రెండు వర్గాల మధ్య నాలుగు రోజులుగా చర్చలు జరగుతున్నా ఓ కొలిక్కి రాలేదు. శని, ఆది వారాల్లో పన్నీర్, పళని వర్గాల దూతలు సమావేశమైనా పార్టీ, ప్రభుత్వంలో పదవులపై పట్టుబట్టడంతో కలవటం కష్టమేననే సంకేతాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పన్నీర్‌సెల్వం మరోసారి తన అనుచరులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం పళనిస్వామి దూతలుగా వచ్చిన సీనియర్ మంత్రులు తంగమణి, ఎస్‌పీ వేలుమణిలు.. పన్నీర్‌సెల్వంకు డిప్యూటీ సీఎం పదవి, పాండియన్‌కు మంత్రి పదవికి సమ్మతి వ్యక్తం చేశారు.
అయితే, శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించాలని పన్నీర్‌వర్గం మరోసారి పట్టుబట్టడంతో మళ్లీ ప్రతిష్టంభన తలెత్తింది. అటు సీఎం కూడా సోమవారం తన నివాసంలో సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఇంతలో.. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నట్లు ఇరువర్గాల నుంచి కార్యకర్తలు, మీడియాకు సమాచారం వచ్చింది. అయితే మధ్యాహ్నం 2 కావస్తున్నా.. ఇద్దరు నేతలూ వారి ఇళ్లనుంచి బయటకు రాలేదు. దీంతో కార్యకర్తల్లో ఉత్కంఠ పెరిగింది. అయితే మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఇరువురు నేతలు పార్టీ కార్యాలయానికి బయలుదేరి 3.15 గంటలకు సంయుక్త మీడియా సమావేశంలో చేతులు కలిపారు.
‘మనల్ని ఎవరూ విడదీయలేరు. మనమంతా అమ్మ పిల్లలం’ అని పన్నీర్ సెల్వం తెలిపారు. ‘మనమంతా కలిసిపోయినందుకు నేడు ఎంజీఆర్, అమ్మ చాలా సంతోషిస్తారు. ఆర్నెల్లలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఇకపై వాటిని అధిగమిద్దాం’ అని పళనిస్వామి వెల్లడించారు. దీంతో సమావేశ మందిరంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. శశికళ తొలగింపునకు కొన్ని న్యాయ అడ్డంకులున్నందున.. త్వరలోనే అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేసి ముందడుగేయనున్నట్లు తెలిసింది.
డిప్యూటీగా పన్నీర్ ప్రమాణం
అనంతరం ఇద్దరు నేతలు మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్, జయలలిత సమాధి వద్దకెళ్లి పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం.. పన్నీర్‌సెల్వం ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాదాసీదాగా జరిగింది.
డిప్యూటీ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం.. ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ శాఖలను నిర్వహించనున్నారు. పన్నీర్‌వర్గానికే చెందిన కే పాండియన్ తమిళనాడు అధికార భాష, సంస్కృతి సంప్రదాయాల శాఖలను పొందారు. ప్రమాణ చేసిన పన్నీర్ సెల్వం, సీఎం పళనిస్వామిని ప్రధాని మోదీ అభినందించారు. ‘తిరు ఓ పన్నీర్‌సెల్వంతోపాటుగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఇదో కొత్త టోపీ.. కమల్: అన్నాడీఎంకే వర్గాల విలీనంపై సినీనటుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు. సోమవారం విలీనం జరుగుతుండగానే.. ట్విటర్ దాడి చేశారు. ‘గాంధీ టోపీ, కాషాయ టోపీ, కశ్మీర్ టోపీలను చూశాం. ఇప్పుడు తమిళ ప్రజల నెత్తిన జోకర్ టోపీ పెడుతున్నారు. ఇది చాలా? ఇంకా ఏమైనా కావాలా? తమిళులారా మేల్కొనండి!’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మరో స్వాతంత్య్ర సంగ్రామం, ముఖ్యంగా అవినీతిపై పోరాటం కోసం మీలో ఎవరికి ధైర్యముంది?’ అని మరో ట్వీట్‌లో కమల్ తమిళప్రజలను ప్రశ్నించారు.