నేతల కిరికిరీ కోట దాటింది.. తకరారు తారస్థాయిని తాకుతోంది.. చివరికి నాయకుల పంచాయితీ పరిధి దాటిపోతోంది.. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నాడీఎంకే.. ఆ నలుగురి చేతుల్లో నలిగిపోతోంది..! బలం కోసం.. బలగం కోసం అగ్రనేతలైన పన్నీరు, పళని స్వామి అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటూ.. నువ్వా.. నేనా అనే రీతిలో తలపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తామేమీ తక్కువ కాదంటూ శశికళ, దినకరన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. బల ప్రదర్శనకు దిగడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి వారు పార్టీపై పట్టే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. మదురై వేదికగా పన్నీరు సెల్వం బలప్రదర్శన నిర్వహించారు. చెన్నైలో తిష్ట వేసిన పళని శిబిరం పన్నీరుకు వ్యతిరేకంగా వ్యూహరచనలో నిమగ్నమైంది. మరోవైపు అమ్మ నెచ్చెలి శశికళ పురట్చి పయనం పేరిట తిరుత్తణి వైపుగా కదిలారు. ఇక, ఈమె ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ తిరువళ్లూరు జిల్లా అయపాక్కంలో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు.
ఎవరికి వారే..
గత రెండు వారాలుగా అన్నాడీఎంకేలో ముదురుతున్న అంతర్గత విభేదాలు, చోటు చేసుకుంటున్న మలుపులు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్యనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక, ఆదివారం ఎవరికి వారు పారీ్టపై పట్టుకు తమ దైన శైలిలో దూసుకెళ్లారు. జూలై 11న జరిగే సర్వ సభ్య సమావేశంతో పార్టీని కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఈ సమావేశాన్ని నిర్వహించి తీరాలనే సంకల్పంతో ఆదివారం చెన్నైలో సుదీర్ఘ కార్యచరణలో నిమగ్నమయ్యారు. అలాగే, ఈ సమావేశానికి ముందే, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా ఉన్న పన్నీరు సెల్వంతో పాటుగా ఆయన మద్దతుదారుల జాబితా సిద్ధం చేసి పార్టీ నుంచి సాగనంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు బలాన్ని చేకూర్చే విధంగా అన్నాడీఎంకేకు చెందిన ‘నమదు అమ్మ’ దిన పత్రికలో పబ్లీషర్స్ స్థానంలో పన్నీరు సెల్వం పేరును ఆదివారం తొలగించడం గమనార్హం.
తగ్గేదేలే అంటున్న పన్నీరు..
ఢిల్లీ నుంచి ఆదివారం మదురైకు చేరుకున్న పన్నీరు సెల్వం బల ప్రదర్శనకు దిగారు. ఆయన మద్దతు దారులు వేలాదిగా విమానాశ్రయానికి చేరుకుని బ్రహ్మరథం పట్టారు. దారి పొడవున ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన బలాన్ని చాటే విధంగా కేడర్ తన వెంటే ఉంది అంటూ పన్నీరు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నాయకులు లేకున్నా, కార్యకర్తలు అందరూ తన వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, సమస్యలకు కారుకులెవ్వరో కేడర్ గుర్తించారని పేర్కొన్నారు.
దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత మార్గంలో పయనిస్తున్న తాను నిత్యం కేడర్‌తో కలిసి మెలిసి ఉన్నానని, వారే ఇప్పుడు తనకు బలం అని ధీమా వ్యక్తం చేశారు. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించిన ఆయన ప్రత్యేక వాహనంలో మద్దతు దారులతో కలిసి ముందుకు దూసుకెళ్లారు. అలాగే, మదురై వేదికగా మద్దతు దారులతో సమావేశం అయ్యారు. అనంతరం తేని వైపుగా పన్నీరు సెల్వం బల ప్రదర్శన సాగింది. ఇక, ఈనెల 28వ తేదీన రాయపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని కీలక ప్రకటన చేయడానికి పన్నీరు సిద్ధం అవుతోన్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. కాగా పన్నీరు మద్దతుదారుడైన వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ మరోమారు సర్వసభ్య సమావేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. జులై 11న జరగనున్న సమావేశాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.
చిన్నమ్మ ‘పురట్చి’ పయనం
అన్నాడీఎంకేను తన గుప్పెట్లోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఇక, రాజకీయ కార్యక్రమాల్లో దూకుడు పెంచనున్నారు. ఆదివారం చెన్నై టీ నగర్‌లోని నివాసం నుంచి తమిళ హక్కులు, మహిళా సాధికారత నినాదంతో పురట్చి పయనానికి చిన్నమ్మ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక వాహనంలో కోయంబేడు, పూందమల్లి, తిరువళ్లూరు, తిరుత్తణి, కోర మంగళం, కేజీ కండ్రిగ, ఆర్కే పేట, అమ్మయార్ కుప్పం వరకు చిన్నమ్మ పయనం సాగింది. అమ్మయార్ కుప్పం బహిరంగ సభ వేదిక వద్దకు చిన్నమ్మ చేరుకున్నారు. ఇక, చిన్నమ్మ ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ సైతం వ్యూహాలకు పదును పెట్టే విధంగా ముఖ్య నేతలతో సమావేశంలో మునిగారు. చిన్నమ్మ తీసుకునే నిర్ణయాలు, ఆమె వేసే అడుగులకు బలాన్ని చేకూర్చే విధంగా తిరువళ్లూరు జిల్లా అయపాక్కం వేదికగా ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలతో సమాలోచించడం గమనార్హం.
అన్నాడీఎంకే ఆత్మగౌరవాన్ని కాపాడుతా: శశికళ
తిరువళ్లూరు: అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిస్టంభన తొలగించి పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని శశికళ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం తిరువళ్లూరు జిల్లాకు ఆమె వచ్చారు. ఈ మేరకు పూందమల్లి, నేమం, తిరువళ్లూరు, పాండూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ నేతలు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. పూందమల్లిలో పార్టీ నేతలతో మాట్లాడుతూ త్వరలోనే అన్నాడీఎంకేలో అన్ని పరిస్థితులు చక్కదిద్దుతా, కార్యకర్తలు అధైర్యపడవద్దు అని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నరసింహన్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్‌రామ్, పార్టీ నేతలు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నేనే ప్రధాన కార్యదర్శి..
తిరుత్తణి: కేజీ కండ్రికలో చిన్నమ్మ శశికళ మాట్లాడుతూ, అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శి తానే అని స్పష్టం చేశారు. తనను తొలగించే అధికారం పన్నీరు, పళని స్వామికి లేదు అని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే అధికారం క్షేత్రస్థాయిలోనే కార్యకర్తలకు మాత్రమే ఉందని వివరించారు. జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నాయకుల్ని అడ్డం పెడ్డుకుని పళని స్వామి ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టే ప్రయత్నంలో ఉన్నారని, ఇందుకు అవకాశం లేదన్నారు. పన్నీరు సెల్వంతో చేతులు కలుపుతారా..? అని ప్రశ్నించగా, వేచి ఉండండీ..! అన్నాడీఎంకేకు మంచి రోజులు రాబోతున్నాయని ఆమె సమాధానం ఇవ్వడం విశేషం.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు
Comments
Please login to add a commentAdd a comment