సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో నంబర్–1 అనే స్థాయికి పళనిస్వామి చేరుకుంటున్నారు. ఆధిపత్యపోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వస్తున్న ఆయనకు తాజాగా మరో విజయం దక్కింది. పార్టీ ప్రధాన కార్యాలయం సీలును తొలగించాలని, కార్యాలయం తాళాన్ని ఎడపాడికి అప్పగించాలని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది.
ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య గత కొంతకాలంగా నువ్వా..నేనా అంటూ సాగుతున్న పోరు అనేక మలుపులు తిరుగుతోంది. ఈనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పన్నీర్ దూకుడుకు పగ్గాలు వేశారు. ఇక ఆ తరువాత పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచవర్గంలోని కొందరిపై బహిష్కరణ వేటు కూడా పడింది. ఎడపాడిని కట్టడిచేసేందుకు అదేరోజున పన్నీర్, ఆయన అనుచరవర్గం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగింది.
ఈ సమాచారం అందుకున్న ఎడపాడి మద్దతుదారులు పన్నీర్ వర్గంతో తలపడ్డారు. పలువురు గాయపడటం, పోలీసుల లాఠీచార్జీతో పార్టీ కార్యాలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. శాంతి భద్రతల సమస్యలు వస్తాయనే అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసింది. సీలు తొలగించాలని ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది.
ఎడపాడికి అప్పగింత–ఆనందోత్సాహాలు
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం..అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని బుధవారం తీర్పు చెప్పింది. అయితే పార్టీ కార్యకర్తలు నెలరోజులపాటూ కార్యాలయానికి రాకూడదని షరతు విధించింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎడపాడి వర్గీయులకు ఆనందం మిన్నంటింది. అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నాయకత్వంలో వందలాది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు చెన్నై అడయార్ గ్రీన్‌వేస్ రోడ్డులో విజయోత్సాహంతో చిందులు వేశారు. ఎంజీఆర్, జయలలిత, ఎడపాడి చిత్రపటాలను చేతబూని ర్యాలీ నిర్వహించారు. క్యాంప్ ఆఫీస్‌కు చేరుకుని ఎడపాడిని అభినందనలతో ముంచెత్తారు. ఇక కోర్టు తీర్పుతో పన్నీర్ మద్దతుదారులు డీలా పడిపోయారు.
ఇది కూడా చదవండి: యూపీ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏకంగా మంత్రి రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment