అన్నాడీఎంకే విలీనం: గవర్నర్‌తో కీలక నేత భేటీ
వీకే శశికళను తప్పించి.. దినకరన్‌ను తొలగించి అన్నాడీఎంకేలోని రెండు వైరివర్గాలు ఏకమయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రస్తుతం సీఎం ఎడపాటి పళనిస్వామి గ్రూపులు విలీనమయ్యే దిశగా వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే కీలక నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, రాజకీయ అంశాలేవీ చర్చించలేదని చెప్పారు. అయితే, అధికార అన్నాడీఎంకేలో సాగుతున్న రాజీ, విలీన ప్రయత్నాలను ఆయన గవర్నర్ దృష్టికి తెచ్చి ఉంటారని భావిస్తున్నారు.
వీకే శశికళను, ఆమె కుటుంబసభ్యులను అన్నాడీఎంకే నుంచి పూర్తిగా తప్పించాలని పన్నీర్ సెల్వం వర్గం గట్టిగా డిమాండ్ చేస్తుండటంతో ఈ విలీన చర్చల తుది వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు సీఎం ఎడపాటి గురువారం తన వర్గం ఎమ్మెల్యులు, మంత్రులతో భేటీ అవుతున్నారు.