సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి పళణి స్వామి సొంత జిల్లాలో చిన్నమ్మ శశికళ సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతానికి ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో జిల్లాలో తన పట్టు చేజారకుండా పళణి స్వామి ముందు జాగ్రత్తల్లో పడ్డారు.
అన్నాడీఎంకేలో సాగుతున్న గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో అన్నాడీఎంకేను ఎప్పటికైనా తన గుప్పెట్లోకి తీసుకుంటానని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పటికే ప్రకటించారు. తన బలాన్ని చాటే విధంగా మద్దతు దారులతో భేటీలు, సంప్రదింపుల్లో ఆమె బిజీగా ఉన్నారు. దశల వారీగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన పళణి స్వామి సొంత జిల్లాపై చిన్నమ్మ దృష్టి పెట్టారు.
బలం చాటే ప్రయత్నం..
పళణి స్వామి సొంత జిల్లా సేలంలో తనకు సైతం బలం ఉందని చాటాలని చిన్నమ్మ భావిస్తోంది. ఇందులో భాగంగా తన మద్దతు దారుల ద్వారా బల నిరూపణకు సిద్ధమయ్యారు. పళణిస్వామి సొంత జిల్లాలో ఉన్న అసంతృప్తి సెగను తనకు అనుకూలంగా మలచుకునే విధంగా చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. సోమవారం ఆ జిల్లా పరిధిలోని ఆత్తూరు, వాలప్పాడి, సేలం టౌన్ జంక్షన్ , దాదుగా పట్టి, శీలనాయకం పట్టి, సూరమంగళంలలో సభలకు నిర్ణయించారు. పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరించడమే కాకుండా, పళణిపై గుర్రుగా ఉన్న నేతలను ఆహ్వానించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. దీంతో అందరి దృష్టి సేలంపై పడింది. సోమవారం సేలంలో, ఆ మరుసటి రోజు పక్కనే ఉన్న ఈరోడ్ జిల్లాలో చిన్నమ్మ పర్యటన జరగనుంది.
సేలంలో తిష్టవేసిన పళణి
తన సొంత జిల్లాలో చిన్నమ్మ పర్యటన నేపథ్యంలో పట్టు జారకుండా ముందు జాగ్రత్తల్లో పళణి నిమగ్నమయ్యారు. చిన్నమ్మ పర్యటన వైపు ఏఒక్క నేత వెళ్లకుండా కట్టడికి సిద్ధమయ్యారు. తిరుపతి పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా సేలంకు వెళ్లడం గమనార్హం. రెండు రోజులు సేలంలోనే ఆయన ఉండనున్నారు. చిన్నమ్మ పర్యటన జరిగే సమయంలో తన మద్దతుదారులతో ప్రత్యేక సమావేశాలకు పళణి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితంగా సేలం వేదికగా అన్నాడీఎంకే రాజకీయం రసవత్తరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment