మళ్లీ తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం?
- ఎడపాటికి డిప్యూటీ సీఎం పదవి?
- శశికళకు అధికారిక ఉద్వాసనే!
- అన్నాడీఎంకే వైరి వర్గాల విలీనంపై జోరుగా చర్చ
అన్నాడీఎంకే నుంచి శశికళను, ఆమె అక్క కొడుకు టీవీవీ దినకరన్‌ను శాశ్వతంగా సాగనంపాలన్న తమ డిమాండ్‌ను ఎడపాటి పళనిస్వామి వర్గం నెరవేరుస్తుందని పన్నీర్ సెల్వం వర్గం నమ్మకంతో ఉంది. ఎడపాటికి చెందిన అన్నాడీఎంకే (పురచ్చి తలైవి అమ్మ), సెల్వానికి చెందిన అన్నాడీఎంకే (అమ్మ) గ్రూపులు విలీనం దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా అధికారిక చర్చలు చేపట్టాలంటే ముందే శశికళపై, దినకరన్‌పై వేటు వేయాలని పన్నీర్ వర్గం పట్టుబడుతోంది.
ఇందుకు సరైన కార్యాచరణతో చర్చలకు రావాలని కోరుతోంది. అయితే, ఈ మేరకు చర్చలు, సంప్రదింపుల కోసం ఓ కమిటీని ఏర్పాటుచేయాల్సి ఉందని ఎడపాటి వర్గం మంత్రి ఒకరు స్పష్టం చేశారు. శశికళ, దినకరన్ ఉద్వాసన తప్పదని ఆయన తెలిపారు. అధికారికంగానే వారిని సాగనంపుతామని, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళతో, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవికి దినకరన్‌తో రాజీనామా చేయిస్తామని ఎడపాటి వర్గం నేతలు స్పష్టం చేస్తుండటం గమనార్హం.
విలీనం చర్చల్లోని డిమాండ్లేమిటి?
పన్నీర్ సెల్వాన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఆ వర్గం విలీన చర్చల్లో గట్టిగా డిమాండ్ చేస్తున్నదని అత్యంత విశ్వసనీయ నేత ఒకరు తెలిపారు. ప్రస్తుతం సీఎం పళనిస్వామికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి.. మరోసారీ సెల్వాన్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని ఆయన వర్గం గట్టిగా కోరుతున్నట్టు తెలుస్తోంది. తన వర్గం నేతలు మరో ఐదుగురికి కేబినెట్ మంత్రి పదవులు ఆయన కోరుతున్నట్టు సమాచారం. అయితే, ఎడపాటి వర్గం మాత్రం విలీన చర్చల్లో సీఎం మార్పు డిమాండ్ తెరపైకి వచ్చిందన్న అంశాన్ని కొట్టిపారేస్తోంది. 122మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎడపాటి సీఎం అయ్యారని, ఆయన మార్పు అంశం చర్చకు రాలేదని అంటున్నారు. అయినా, చర్చలు ప్రారంభం కాకముందే ఈ విషయాన్ని ఎలా లేవనెత్తుతారని అడుగుతున్నారు. మొత్తానికి విలీనం జరగాలంటే తన వర్గానికి పార్టీలో, ప్రభుత్వంలో పెద్దపీట వేయాలని సెల్వం కోరుతున్నట్టు తెలుస్తోంది.