రెండాకుల కోసం..
► ఈసీకి ప్రమాణపత్రం సమర్పించిన పన్నీరు
► నేడు చిన్నమ్మ తరఫున దాఖలు
► జిల్లా కార్యదర్శులతో పళని సమాలోచన
►ఎంజీయార్ శత జయంతి ఏర్పాట్లు
► పన్నీరును ఒంటరి చేద్దాం... నేతల నినాదం
రెండాకుల చిహ్నం వ్యవహారంపై మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల కమిషన్‌కు అదనపు ప్రమాణ పత్రం సమర్పించారు. సుమారు 20 లక్షల పేజీలతో కూడిన 1.5 లక్షల అంశాలతో ఈ ప్రమాణ పత్రంలో తమ వైపు వాదనను ఈసీ ముందు ఉంచారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ తరఫున మంగళవారం ప్రమాణ పత్రం దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నాడీఎంకే తమదంటే తమదంటూ మాజీ సీఎం పన్నీరు సెల్వం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరాలు రచ్చకెక్కాయి. దీంతో రెండాకుల చిహ్నం సీజ్ చేయబడింది. చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో వ్యవహారాల్ని తాత్కాలిక ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పర్యవేక్షించారు. రెండాకుల కోసం ఈసీకి లంచం ఇవ్వడానికి ప్రయత్నించి ఆయన కూడా కటకటాల్లోకి వెళ్లారు.
ప్రస్తుతం ఆ శిబిరం తరఫున సీఎంగా ఉన్న పళనిస్వామి పార్టీ బాధ్యతలను సైతం తనభుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన గడువు మేరకు అదనపు ప్రమాణ పత్రాల్ని రెండు శిబిరాలు దాఖలు చేయాల్సిన పరిస్థితి. చిన్నమ్మ శిబిరం కన్నా ముందుగానే పన్నీరు శిబిరం సోమవారం తన తరఫున ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. లారీల్లో తమవద్ద ఉన్న ఆధారాలను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ ఎన్నికల కమిషన్‌కు పన్నీరు శిబిరం సమర్పించింది.
సుమారు 20 లక్షల పేజీలతో కూడిన 1.5 లక్షల అంశాలతో ఈ ప్రమాణ పత్రం దాఖలు చేయడం గమనార్హం. కార్యదర్శులతో పళని సమాలోచన: చిన్నమ్మ తరఫున ఈసీకి ప్రమాణ పత్రం సమర్పించాల్సిన అవశ్యం ఏర్పడడంతో జిల్లాల కార్యదర్శులతో సీఎం పళని స్వామి సోమవారం సాయంత్రం సమావేశం అయ్యారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఈ సమావేశం గంటన్నర పాటుగా జరిగింది. సీనియర్ మంత్రులు, జిల్లాల కార్యదర్శులు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శులు జైలులో ఉండడంతో వారి తరఫున సీఎం పళని స్వామి ప్రమాణ పత్రం సమర్పించేందుకు సిద్ధం అయ్యారు.
మంగళవారం ఈ ప్రమాణ పత్రం ఈసీ వద్ద దాఖలు చేయనున్నారు. ఇందుకోసం పార్టీ కార్యాలయంలో సమావేశం సాగినా, పన్నీరును ఒంటరి చేయడం లక్ష్యంగా కొత్త నినాదాన్ని అందుకున్నట్టు సమాచారం. దివంగత నేత ఎంజీయార్ శత జయంతి ఉత్సవాల వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటే రీతిలో ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా పళని స్వామి దృష్టికి ప్రభుత్వ న్యాయవాదుల నియామకం విషయంలో అన్నాడీఎంకే న్యాయవాద విభాగంలో బయల్దేరిన రచ్చ విషయాన్ని పలువురు కార్యదర్శులు తీసుకెళ్లి ఉన్నారు. ఈ విషయంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని ఆయన దాట వేసినట్టు సమాచారం.
పన్నీరును ఒంటరి చేద్దాం: ప్రధాని నరేంద్ర మోదీ అభయం తమకే ఉన్న దృష్ట్యా, మాజీ సీఎం పళనితో విలీనం ప్రయత్నాల్ని పక్కన పెట్టి, ఆయన్ను ఒంటరి చేద్దామన్న నినాదాన్ని పలువురు జిల్లాల కార్యదర్శులు ఈ సమావేశంలో అందుకున్నట్టు సమాచారం. తొలుత పళని స్వామి పన్నీరుకు మద్దతుగానే స్పందించినట్టు తెలిసింది. పన్నీరు వెంట జనం, కేడర్ ఉందని, ఆయన్ను లాక్కోవడం ద్వారా పార్టీకి లాభం అన్న వ్యాఖ్యలు చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే మెజారిటీ శాతం కేడర్ ఆయన్ను ఒంటరి చేసిన పక్షంలో, అటు వైపుగా తొంగి చూసే వాళ్లు ఉండరన్న వ్యాఖ్యలు అందుకున్నట్టు తెలిసింది.
దీంతో ముందు ఆ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపిలు, మాజీలను ఇటు వైపుగా లాగేందుకు ప్రయత్నించాలని, ఆ తర్వాత ఒంటరి గురించి ఆలోచిద్దామంటూ పళని స్పందించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే విలీనం వ్యవహారం ఇప్పట్లో చర్చ అనవసరం అని, తమంతత తాముగా వాళ్లే అన్నాడీఎంకేలోకి వచ్చే విధంగా అడుగులు వేద్దామంటూ సమావేశాన్ని ముగించి ఉన్నారు. ఈ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జయకుమార్ అన్ని విషయాలు చర్చించామన్నారు. ప్రమాణ పత్రం విషయంపై సంతకాలు తీసుకున్నామన్నారు.
ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం: తంబిదురై
విలీనం కొలిక్కి వచ్చినా, సీఎం ఎవరన్న విషయాన్ని ఎమ్మెల్యేలు నిర్ధారిస్తారని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. ధర్మపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలోకి పన్నీరు శిబిరం వీలీనమైన పక్షంలో సీఎంగా ఎవరు ఉంటారని ప్రశ్నించగా, అది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.
ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో అన్నాడీఎంకేలో సీఎం అయ్యే అర్హత పన్నీరు సెల్వంకు మాత్రమే ఉందని 37 శాతం మంది అంగీకారం తెలిపి ఉన్నారని ప్రశ్నించగా, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. పన్నీరు సీఎం పగ్గాలు చేపట్టాలని ఆ శిబిరానికి చెందిన ఎమ్మెల్యే సెమ్మలై వ్యాఖ్యానిస్తున్నారే అని ప్రశ్నించగా, సీఎంగా ఎవరు ఉండాలి, పార్టీని ఎవరు నడిపించాలి అన్న విషయాలు ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులు, సర్వసభ్య సమావేశంలో తేల్చాల్సిన విషయంగా దాట వేశారు. సెమ్మెలై వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ, ముందుగా విలీనం సాగదని అని ముందుకు సాగారు.
దినకరన్‌కు బెయిల్‌పై రేపు నిర్ణయం
రెండాకుల చిహ్నం కోసం లంచం కేసులో అరెస్టైన టీటీవీ దినకరన్‌కు బెయిల్ లభించేనా అన్న ఎదురు చూపుల్లో చిన్నమ్మ శిబిరం వర్గాలు ఉన్నాయి. టీటీవీ మద్దతు దారులు పలువురు తీహార్ జైల్లో ఆయనతో ములాఖత్ అయినట్టు సమాచారం. టీటీవీ సన్నబడ్డా, మనోధైర్యంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనకు బెయిల్ లభించాలన్న ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. ఆయన కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశించినా, బెయిల్ పిటిషన్‌పై బుధవారం నిర్ణయం ప్రకటించనుండడంతో ఎదురు చూపులు పెరిగాయి.