
విలీనానికి ఆస్కారమే లేదు
► చర్చల కమిటీ రద్దు
► పురట్చి తలైవీ శిబిరం ప్రకటన
► పన్నీరుకు బ్రహ్మరథం...!
► వేళప్పన్ చావడిలో బహిరంగ సభ
► దారి పొడవునా ఆహ్వానం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అమ్మ శిబిరంతో విలీనం ప్రసక్తే లేదని మాజీ సీఎం, పురట్చి తలైవీ అమ్మ శిబిరం నేత పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. విలీనం కోసం నియమించిన చర్చల కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వేళప్పన్‌చావిడిలో ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో పన్నీరుకు పురట్చి తలైవీ అమ్మ శిబిరం వర్గాలు బ్రహ్మరథం పట్టాయి.
అన్నాడీఎంకే అమ్మ శిబిరంతో విలీనం లక్ష్యంగా నిర్ణయం తీసుకోవా లని మాజీ సీఎం, పురట్చి తలైవీ శిబిరం నేత పన్నీరుసెల్వంకు సీఎం పళనిస్వామి పిలుపునిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పన్నీరు నాన్చుడుపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సైతం సంధించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం వేళప్పన్ చావడి వేదికగా భారీ బహిరంగ సభకు పన్నీరు సెల్వం పిలుపు నివ్వడంతో విలీనంపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సాగింది. దీంతో ఆ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, యథాప్రకారం అమ్మ భక్తిని చాటుతూ, చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా స్పం దిస్తూ, ఆ కుటుంబాన్ని సాగనంపాల్సిందేనన్న నినాదాన్ని పన్నీరు అందుకున్నారు. విలీనం విషయంగా చివర్లో స్పందించారు.
విలీనానికి ఆస్కారమే లేదని స్పష్టం చేస్తూ, చర్చల నిమిత్తం నియమించిన కమిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఇక, ఈ సభ నిమిత్తం చెన్నై నుంచి కోయంబేడు మీదుగా వేళప్పన్ చావడికి వచ్చిన పన్నీరుకు పురట్చి తలైవీ శిబిరం వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. పండుగ వాతావరణం నెలకొనే రీతిలో దారి పొడవునా బ్యానర్లు, ఫ్లెక్సీలను హోరెత్తించారు. పన్నీరు బహిరంగ సభ వేదికకు రాక ముందు సాగిన ర్యాలీలో బల నిరూపణ సాగించే రీతిలో కేడర్ పోటెత్తడం గమనార్హం.