'అమ్మ'కోటలో పాగా వేసేదెవరో?
► ఆందరి చూపు ఆర్కేనగర్ వైపు.. జయ మృతితో అనివార్యమైన ఎన్నిక
► రసవత్తరంగా రాజకీయాలు
► బహుముఖ పోటీ ఖాయం
► పన్నీర్, స్టాలిన్, దినకరన్ కు తొలి పరీక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో మూడు నెలలుగా ఖాళీగా ఉన్న చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గంలో వచ్చేనెల 12వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. జయలలిత రెండుసార్లు పోటీచేసి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో ఈ అసెంబ్లీ స్థానంపై వీవీఐపీ ముద్రపడింది. జయ మరణం తరువాత ఖాళీ అయిన స్థానం కావడంతో ప్రధానాకర్షణగా మారింది. దీంతో ఆర్కేనగర్‌లో గెలుపొందడం ఒక ప్రతిష్టగా అన్నిపార్టీలూ భావిస్తున్నాయి. ప్రధానపోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుందనేది నిర్వివాదాంశం. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో డీఎంకేకు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్, మనిదనేయ మక్కల్ కట్చీలు ప్రకటించాయి.
ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ డీఎంకేలో శుక్రవారం నుంచే ప్రారంభమైంది. గత ఎన్నికల్లో జయపై పోటీచేసి ఓడిన సిమ్లా ముత్తుచోళన్ తన దరఖాస్తును సమర్పించారు. ఇక బీజేపీ, ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకే పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నాయి. తమ నిర్ణయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తామని ప్రజా సంక్షేమకూటమి శుక్రవారం తెలిపింది. అన్నాడీఎంకే అనుచరులను శశికళ, పన్నీర్‌సెల్వం, దీప పంచుకుని ఉన్నారు.
అభ్యర్థుల పేర్లపై ఊహాగానాలు
అనేక పార్టీలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నందున ఆర్కేనగర్ ఉప ఎన్నికలో బహుముఖ పోటీ ఖాయమని తేలిపోయింది. అన్నాడీఎంకే, డీఎంకేలతోపాటు ఇతర ద్రవిడ పార్టీలు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులపై రాష్ట్రంలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
అన్నాడీఎంకే నుంచి దినకరన్, పన్నీర్‌సెల్వం వర్గం నుంచి ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై నుంచి దీప, డీఎంకే తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన సిమ్లా ముత్తుచోళన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పేర్లు వినిపిస్తున్నాయి. తాము పోటీకి దిగుతున్నట్లు నామ్‌తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ శుక్రవారం ప్రకటించారు. తమిళ మానిల కాంగ్రెస్, పీఎంకే పోటీచేద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఎలాగో ఓటమి ఖాయం ఎందుకు అనవసరమైన ఖర్చని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, పీఎంకే అ«ధినేత డాక్టర్ రాందాస్, ఎండీఎంకే అధినేత వైగో ఆలోచనలో పడినట్లు సమాచారం. త్వరలో పార్టీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
పోటీకి వెనుకాడను: దినకరన్
ఇదిలా ఉండగా, ఆర్కేనగర్ నుంచి పోటీచేసేందుకు అవకాశం వస్తే ఎంతమాత్రం వెనుకాడబోనని అన్నాడీంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థిఎవరైనా అన్నాడీఎంకే ఘనవిజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ ముగ్గురికీ తొలి సవాల్:
ఆర్కేనగర్‌లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో ప్రధాన నేతలు ముగ్గురూ తొలిసారిగా సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడుగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చిన తొలి ఎన్నిక. ఎంతో బలమైన క్యాడర్ గలిగిన అన్నాడీఎంకే కలహాల కాపురంగా మారిన దశలో డీఎంకే అభ్యర్థిగెలుపు నల్లేరుపై నడకలా సాగాల్సి ఉంది. ఇంతటి సానుకూలమైన పరిస్థితులను స్టాలిన్ సద్వినియోగం చేసుకుంటారో లేదో వేచి చూడాలి.
అలాగే కొంతకాలంగా చిన్నమ్మ చాటున ఉండి తెరవెనుక రాజకీయాలు నడిపిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దినకరన్ కు సైతం ఇది తొలి సవాలే. ఎంజీఆర్ స్థాపించి, జయలలితచే బలమైన పార్టీగా నిలవడం అనే అంశం మినహా దినకరన్ చుట్టూ ఇతరత్రా అన్నీ ప్రతికూల అంశాలే. పైగా అన్నాడీఎంకే అభ్యర్థిగా తానే నిలిచేందుకు దినకరన్ సిద్ధం అవుతున్నారు. అన్నాడీఎంకేతో విభేదించి తిరుగుబాటు నేతగా మారిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సైతం ప్రజాకోర్టులో తొలిసారిగా తన సత్తా చాటుకోవాల్సి ఉంది.
ఆన్నాడీఎంకేకు ఆర్కేనగర్ పెట్టని కోట:
ఆర్కేనగర్ నియోజకవర్గంలో 1977లో తొలిసారిగా అన్నాడీఎంకే తన అభ్యర్దిని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టి విజయం సాధించింది. ఆ తరువాత 1991, 2001, 2006, 2011, 2015, 2016 ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే గెలుపొందింది. 1957, 1962, 1980చ 1984లో కాంగ్రెస్ గెలిచింది. 1967, 1971,1989,1996 ఎన్నికల్లో డీఎంకేను విజయం వరించింది. డీఎంకే 7 సార్లు, అన్నాడీఎంకే 3 సార్లు మాత్రమే ఓటమిపాలైంది.
గత ఎన్నికల్లో ఓట్ల శాతం:
గత ఏడాది జరిగిన సార్వత్రి ఎన్నికల్లో ఆర్కేనగర్‌లో అన్నాడీఎంకే అభ్యర్ది జయలలిత 97,218 (55.87 శాతం) ఓట్లతో గెలుపొందారు డీఎంకే అభ్యర్ది సిమ్లా ముత్తుచోళన్ కు 57,673 (33.14 శాతం) ఓట్లు, వీసీకే అభ్యర్ది వసంతీదేవికి 4,195 , (2.41 శాతం), పీఎంకే అభ్యర్ది ఆగ్నస్‌కు 3,011 (1.73 శాతం), బీజేపీ అభ్యర్ది ఎమ్‌ఎన్ రాజాకు 2,873 (1.68 శాతం) ఓట్లు లభించాయి. అన్నాడీఎంకేలో ఏర్పడిన చీలికలు డీఎంకేకు లాభించేనా లేక శశికళ, పన్నీర్, దీప వర్గాల్లో ఏవరో ఒకరిని విజయ కిరీటం వరించేనా అని చర్చించుకుంటున్నారు.