చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే ప్రభుత్వంపై డీఎంకే సమర భేరి మోగించేందుకు సిద్ధమైంది. అమ్మ (జయలలిత) పాలన, ఆమె పర్యవేక్షణలోని పాలనలో రాష్ట్రం పతనదశకు చేరుకుందని ప్రచారం చేసేందుకు స్టాలిన్ సమరశంఖం పూరించారు. రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతున్న అన్నాడీఎంకే పాలనకు కోర్టు విధించిన జైలు శిక్ష కళ్లెం వేసింది. రాష్ట్రంలో అన్నాడీఎంకేకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని అవకాశంగా తీసుకుని ప్రధాని పీఠం సైతం అధిరోహించాలని పార్టీ అధినేత్రి జయలలిత ఆశించారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ స్వయంగా కోరినా ఈ కారణంగానే కాదని పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒంటరిగా పోటీకి దిగి సాహసం చేశారు.
37 స్థానాలు గెలుచుకోవడం ద్వారా దేశ స్థాయిలోనే మూడో అతి పెద్ద పార్టీగా (పార్లమెంటు సభ్యుల సంఖ్యా పరంగా రెండో స్థానం కాంగ్రెస్) అన్నాడీఎంకే అవతరిచింది. అమ్మ హవాకు దేశమంతా నివ్వెరపోగా మెజారిటీ స్థానాల్లో డిపాజిట్టు కోల్పోయిన ప్రధాన ప్రతిపక్ష డీఎంకే డీలాపడిపోయింది. అన్నాడీఎంకేలో ఇదే జోరు కొనసాగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అమ్మ పాలన తప్పదని కరుణానిధి, స్టాలిన్ తలలు పట్టుకు కూర్చున్నారు. అనూహ్యంగా 18 ఏళ్లుగా సాగుతున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పు వెలువడి జయను జైలు పాలు చేసింది. మాజీ సీఎంగా మార్చేసింది. పార్టీ నేతృత్వంలో జరిగే అతి ముఖ్యమైన వేడుకలు, శ్రీరంగం ఉప ఎన్నికలో సైతం జయ బాహ్య ప్రపంచంలోకి రాలేకపోయారు. స్టార్ ఎట్రాక్షన్ కలిగిన నేతలేక అన్నాడీఎంకే అల్లాడుతోంది.
ఇదే అదనుగా రంగంలోకి డీఎంకే
బలహీనంగా ఉన్నపుడే శత్రువును దెబ్బతీయాలన్న సూత్రాన్ని వంట బట్టించుకున్న డీఎంకే ఇదే అదనుగా రంగంలోకి దిగింది. జయ బయటకు రాలేని పరిస్థితుల్లో తామే ముందుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో పలుకుబడిని పెంచుకోవాలని సిద్ధమైంది. పార్టీని, ప్రధానంగా యువతను సన్నద్ధం చేసేందుకు పార్టీ కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శి స్టాలిన్ ఆదివారం రాత్రి కోయంబత్తూరులో సమావేశమయ్యారు. రాష్ట్రం నలుమూలలా పదివేల బహిరంగ సభలు నిర్వహించాలని సమావేశానికి హాజరైన యువజన విభాగ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు.
అన్నాడీఎంకే పాలనలోని వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధాన అజెండాగా పదివేల సభలు సాగాలని సమావేశంలో తీర్మానించారు. యువజన విభాగంలోని 25 లక్షల మంది సభ్యులు డీఎంకే సైనికులుగా మారి పాలక ప్రభుత్వంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ద్వారా సాగుతున్న జయ బినామీ ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టాలని కోరారు. జిల్లా, మండల, గ్రామ, వీధి స్థాయిల్లో ఈ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పారు. 15 ఏళ్లు పైబడిన వారిని యువజన విభాగంలో సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు.
అమ్మపై సమర భేరి
Published Tue, Mar 10 2015 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement