ఎడతెగని వ్యూహాలు.. ఎత్తులకు పైఎత్తులతో ప్రధాన పార్టీలన్నీ ఈరోడ్ ఉప సమరానికి సిద్ధమయ్యాయి. బుధవారం నామినేషన్లను ఎన్నికల అధికారి ఆమోదించడంతో ప్రచార పర్వానికి తెరలేపాయి. ముఖ్యంగా నాలుగు ప్రధాన పారీ్టలకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలో నువ్వా..నేనా అన్నట్లు ముందుకు సాగుతున్నాయి.
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చిల అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారి శివకుమార్ బుధవారం ఆమోదించారు. పరిశీలనలో మరో 76 నామినేషన్లు కూడా ఓకే అయ్యాయి. ఈ ఎన్నికల రేసుల నుంచి తాము తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకేలో చీలిక కారణంగా ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రకటించడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గంలో ఓట్ల వేటకు సిద్ధమయ్యారు.
రసవత్తరంగా..
ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నిక అన్నాడీఎంకే రాజకీయాలను రసవత్తరంగా మార్చింది. ఆ పార్టీ శిబిరాల అభ్యర్థులుగా తెన్నరసు, సెంథిల్ మురుగన్, ఆ పార్టీలో చీలికతో ఆవిర్భవించిన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్ నామినేషన్లు వేశారు. చివరకు సర్వసభ్య సభ్యుల మెజారిటీ మద్దతుతో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తన అభ్యర్థి సెంథిల్ మురుగన్‌ను పోటీ నుంచి తప్పించారు. అదే సమయంలో తాజాగా తమకు కుక్కర్ గుర్తు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడాన్ని నిరసిస్తూ అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం కూడా ఎన్నికల నుంచి తప్పుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఏ విధంగా పన్నీరు సెల్వం తలొగ్గారో, అదే తరహాలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ కూడా వెనక్కి తగ్గినట్టు చర్చ సాగుతోంది. క్షణంలో ఎన్నికల రేసులో నుంచి తప్పుకున్నా, తాము ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గేది లేదని, తమకు అనుకూలమైన గుర్తు కేటాయించక పోవడం వల్లే బరిలో నుంచి తప్పుకున్నట్లు టీటీవీ స్పష్టం చేశారు. దుష్ట శక్తి డీఎంకే, ద్రోహ శక్తి అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శిబిరం అభ్యర్థి తెన్నరసు మాత్రమే అధికారికంగా ఆ పార్టీ తరపున పోటీలో మిగిలారు.
121లో 80 నామినేషన్లకు ఆమోదం
ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద గత నెల 31 నుంచి ఈనెల 7వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించారు. మొత్తంగా 121 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆరుగురు ఉన్నారు. ఇందులో ఇద్దరు వెనక్కి తగ్గారు. బుధవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఎన్నికల పర్యవేక్షకుడు రాజ్ మోహన్ యాదవ్, ఎన్నికల అధికారి శివకుమార్ అన్ని నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
మొత్తం 121 నామినేషన్లు దాఖలు కాగా, 80 ఆమోదం పొందాయి. ఇందులో తొలి ఆమోదం ఎన్నికల వీరుడు, స్వతంత్ర అభ్యర్థి పద్మరాజన్‌ది కావడం విశేషం. ఆ తర్వాత కోవైకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నూర్ మహ్మద్ నామినేషన్‌ను ఆమోదించారు. మూడో నామినేషన్ కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్. అలాగే అన్నాడీఎంకే డీఎంకే అధికారిక అభ్యర్థి తెన్నరసు, డీఎండీకే అభ్యర్థి ఆనంద్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి మేనక నామినేషన్లకు కూడా ఆమోదం లభించింది. ఇక ఎన్నికల నుంచి తప్పుకున్న పన్నీరు సెల్వం వర్గం అభ్యర్థి సెంథిల్ మురుగన్, టీటీవీ అభ్యర్థి శివ ప్రశాంత్ నామినేషన్లు ఆమోదం పొందినా, వారు గురువారం ఉప సంహరించాలని నిర్ణయించారు.
కాంగ్రెస్సా.. డీఎంకేనా..?
ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే సమరం కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థులు ఈవీకేఎస్, తెన్నరసు మధ్య ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు చీల్చే ఓట్లే కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా ఆయా కూటమి పక్షాలైన బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్ తదితర పారీ్టలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. బుధవారం పళని స్వామి నేతృత్వంలో మిత్ర పక్షాల నాయకులు సమావేశమయ్యారు.
ఈనెల 12వతేదీ నుంచి నియోజకవర్గంలో పళని స్వామి ఇంటింటా సుడిగాలి ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. కాగా అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు కోసం తమ శిబిరం తరపున కూడా స్టార్ క్యాంపెయినర్‌ల జాబితాను పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇప్పటికే డీఎంకే మంత్రులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ కూడా ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈనెల 24, 25 తేదీల్లో ఈరోడ్‌లో 10 చోట్ల సీఎం ప్రసంగించనున్నారు. అలాగే సీఎం తనయుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ కూడా ఈనెల 19, 20 తేదీల్లో ఇలంగోవన్ కోసం ప్రచారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment