► ఉరుకులు..పరుగులతో ప్రచారం
► నిఘా కట్టుదిట్టం
► తనిఖీలు ముమ్మరం
► ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ
► రేపు ఎన్నికలు
ఉపఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. నియోజకవర్గాల్లో ఉన్న నేత లను బయటకు పంపించే పనుల్లో ఎన్నికల వర్గాలు నిమగ్నమయ్యారుు. అలాగే, శనివారం జరగనున్న ఉపఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేశాయి. ఎన్నికల సామగ్రిని ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు శుక్రవారం చర్యలు తీసుకోనున్నారు. ప్రచారం సమాప్తమవడంతో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగం, పోలీసు యంత్రాంగం భద్రతను నియోజకవర్గాల్లో కట్టుదిట్టం చేసింది.
సాక్షి, చెన్నై: తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రం, పుదుచ్చేరిలోని నెల్లితోపు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికకు శుక్రవారం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఎన్నికల ప్రచారానికి గురువారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు మోటార్ సైకిల్ ర్యాలీలు, పాదయాత్రలతో చివరిసారిగా తమతమ నియోజకవర్గాల్లోని ప్రాంతాల్ని చుట్టి వచ్చేశారు. తిరుప్పరగుండ్రంలో అన్నాడీఎంకే అభ్యర్థి బోసుకు మద్దతుగా ఆర్థికమంత్రి పన్నీరు సెల్వం, రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్‌లు ఓపెన్ టాప్ వాహనం మీదుగా భారీ ర్యాలీతో ముందుకు సాగారు. తిరుప్పరగుండ్రం ఆలయం వద్ద తమ ప్రచారాన్ని ముగించారు. అక్కడి డీఎంకే అభ్యర్థి శరవణన్ సైతం ర్యాలీగా అదే చోట తన ప్రచారాన్ని ముగించడం గమనార్హం.
ఇక, తంజావూరులో డీఎంకే అభ్యర్థి డాక్టర్ అంజుగం భూపతికి మద్దతుగా రెండో రోజుగా సుడిగాలి పర్యటన చేసిన ఆపార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ అక్కడి బస్టాండ్ ఆవరణలో జరిగిన సభతో ప్రచారం ముగించారు. సీఎం జయలలిత ఓటర్లకు పిలుపునిస్తూ రాసిన లేఖను ఆధారంగా చేసుకుని, ఓట్ల కోసం ఎన్నిపాట్లు పడుతున్నారో అని తీవ్రంగా స్టాలిన్ విరుచుకుపడ్డారు. అరవకురిచ్చిలోనూ మంత్రుల నేతృత్వంలో భారీ ర్యాలీగా అక్కడి అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్‌బాలాజీ ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఇక, సెంథిల్ బాలాజీకి మద్దతుగా దక్షిణ చెన్నై, తూర్పు జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి, ఎమ్మెల్యే విరుగై రవి, దక్షిణ చెన్నై ఎంపీ జయవర్దన్, అన్నాడీఎంకే సభ్యుడు, ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుదుచ్చేరి నెల్లితోపులో వివాదాలకు ఆస్కారం ఇవ్వని విధంగా ఉదయం అన్నాడీఎంకే అభ్యర్థి ఓంశక్తి శేఖర్ నేతృత్వంలో భారీ ర్యాలీకి ఎన్నికల యంత్రాంగం అనుమతి ఇచ్చింది. ఆ ప్రచార పర్యటన ముగియగానే, అక్కడి అభ్యర్థి, సీఎం నారాయణస్వామి ర్యాలీకి అనుమతించారు.
ముగిసిన ప్రచారం: సరిగ్గా ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగియడంతో నియోజకవర్గాల్లో ఉన్న బయటి ప్రాంతాలకు చెందిన వారందరూ వెళ్లి పోవాల్సిందేనని ఆదేశిస్తూ ఎన్నికల యంత్రాంగం హెచ్చరించే పనిలో పడింది. ఆయా నియోజకవర్గాల్లోని హోటళ్లు, లాడ్జీల్లో బయటి వ్యక్తులు ఉంటే, వారిని పోలీసు ద్వారా పంపించేందుకు తగ్గ చర్యల్లో మునిగారు. ఆయా నియోజకవర్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ బూత్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుని నిఘా పెంచడమే కాకుండా, తనిఖీలను ముమ్మరం చేశారు. ఆయా ప్రాంతాల్లో వాహన తనిఖీలు వేగవంతం చేశారు. ఎవరైనా ఓటర్లను మభ్య పెట్టే విధంగా వ్యవహరిస్తుంటే, తమకు సమాచారం అందించాలని పిలుపు నిచ్చే పనిలోపడ్డారు. ఇక, ఎన్నిక శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానున్న దృష్ట్యా, అందుకు తగ్గ ఏర్పాట్లు వేగవంతం అయ్యారుు. శుక్రవారం ఉదయం నుంచి ఈవీఎంలను, ఎన్నికల సామగ్రిని ఆయా నియోజకవర్గ కేంద్రాల నుంచి పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు.
ప్రచారం సమాప్తం
Published Fri, Nov 18 2016 1:55 AM | Last Updated on Mon, Sep 17 2018 6:12 PM
Advertisement
Advertisement