ప్రకృతిలోని జీవరాశులను ప్రేమించే వాళ్లంతా మాతృత్వం కలవారే! దీనికి జెండర్ లేదు. వాత్సల్యం, కరుణే దానికి కొలమానం! అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వాన్ని ఫాలో అవుతున్నవాళ్లకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకో! అవును, కమలా హ్యారిస్ గురించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ ప్రస్తావన. రాజకీయ ఎన్నికల ప్రచారంలో హుందాతనం.. అగ్రరాజ్యంలోనూ పూజ్యమని అర్థమైంది. అవతలి పక్షాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా మహిళానేతల విషయంలో ఎక్కడైనా వాళ్ల దక్షత కన్నా వ్యక్తిగతేచ్ఛలే పరిగణనలోకి తీసుకునేట్టున్నారు.
దీనికి అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాలనే వ్యత్యాసం లేనట్టుంది. పిల్లల్లేని మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతారని, వాళ్లు సమాజానికి భారమే తప్ప వాళ్ల వల్ల ఒరుగుతున్నదేమీ లేదని రిపబ్లికన్‌పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వాక్రుచ్చాడు. ఈ కామెంట్.. పిల్లల్లేని కమలా హ్యారిస్‌నుద్దేశించేనని ప్రపంచమంతా గ్రహించి, ఆమె పక్షాన నిలిచింది. పిల్లలను కనాలా వద్దా అనేది పిల్లల్ని కనే శారీరక స్థితి, పెంచే సామాజిక పరిస్థితులను బట్టిమహిళ నిర్ణయించుకోవాలని, ఆ నిర్ణయాధికారం ఆమె హక్కని నాగరిక సమాజం గొంతు చించుకుని అరిచింది. దాని మీద ఉద్యమాలనూ లేవనెత్తింది.
ఇంతలోతైన ఆలోచన, అంత విశాలమైన దృక్పథం లేని వాన్స్ లాంటి వాళ్లకు కనీసం దాన్ని ఓ పర్సనల్ చాయిస్‌గా గుర్తించాలనే స్పృహ కూడా లేనట్టుంది. పెళ్లి, పిల్లలు అనేది వ్యక్తిగతం. పిల్లల్లేని చాలామంది ఆడవాళ్లు అనాథలను చేరదీసి, ఇరుగుపొరుగు పిల్లలను పోగేసి.. బంధువుల బిడ్డలను అక్కున చేర్చుకుని వాళ్లను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దిన ఉదంతాలు కోకొల్లలు! ఇందుకు కమలా హ్యారిస్ కూడా ఉదాహరణగా నిలుస్తారు. కడుపున పుట్టిన పిల్లల్లేక΄ోయినా ఆమె అద్భుతమైన మాతృమూర్తి! తన భర్త పిల్లలకు అమ్మతనాన్ని పంచింది. జేడీ వాన్స్ వ్యాఖ్యల క్రమంలో ఆ పిల్లలు కమలా హ్యారిస్ చేయి వదల్లేదు.
ఆమె భుజాల చుట్టూ చేయివేసి ఆమె మనోనిబ్బరాన్ని మరింత పెంచుతున్నారు. దీన్ని ప్రపంచమూ హర్షిస్తోంది. అలాంటి మాతృమూర్తి మీద నోరుపారేసుకున్న వాన్స్.. తండ్రైనా హృదయం లేనివాడిగా ముద్రపడ్డాడు. నిజానికి అమెరికా అధ్యక్ష్య పదవికి తమ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్‌ని ప్రకటించగానే ఆపార్టీ విజయావకాశాలు అనూహ్యంగా పెరిగాయి. ఆ ధాటిని తట్టుకోలేక రిపబ్లికన్‌పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ప్రతిపక్ష అభ్యర్థి జెండర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆమె వ్యక్తిగత జీవితం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కమలా హ్యారిస్ మాతృత్వానికి.. అమెరికా అవసరాలకు లంకె ఏంటి? అక్కడే కాదు ఎక్కడైనా సరే.. స్త్రీల వ్యక్తిగత విషయాలకు.. దేశ పురోగతికి ఏమిటి సంబంధం? ఒకవేళ సంబంధమే ఉంది అనుకుంటే అప్పుడు పురుషుడి వ్యక్తిగత విషయాలూ అంతే ప్రభావం చూపిస్తాయి కదా! పెళ్లి, పిల్లలు.. ఎవరికైనా వాళ్ల వ్యక్తిగతమే! ఒకవేళ వాన్స్ అన్నదే తీసుకున్నా.. పెళ్లి, పిల్లలు అనే బాధ్యత లేని స్త్రీలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతిలో చెప్పుకోదగ్గపాత్రేపోషిస్తున్నారు. మాతృత్వాన్ని మహత్తర అనుభూతిగా చూపి ఆ బంధనంతో స్త్రీలను కట్టిపడేసి.. తమకుపోటీలేకుండా చూసుకోవాలనుకున్న పురుషాధిపత్య భావజాలం అమెరికన్లలోనూ జాస్తి అని వాన్స్ ద్వారా మరోసారి రుజువైంది.
:::సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment