మహిళా సాధికారతకు ఉత్తమ సాధనాలలో ఒకటిగా నిలిచింది డ్రోన్ శిక్షణ. ఢిల్లీకి ఉత్తరాన ఉన్న సింఘోలా, నైరుతి జిల్లాల్లోని 200 మంది మహిళలు శిక్షణ తీసుకొని డ్రోన్ లైసెన్స్ పొందేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సాధికారిత కల్పించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని కిందటేడాది చేపట్టింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన మహిళలు దేశ రాజధానిలో ఇటీవల కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన డ్రోన్ దీదీలు పైలెట్ లైసెన్స్ సర్టిఫికెట్స్ పొంది, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతారు. శిక్షణ పొందిన వారికి డ్రోన్‌లను ప్రభుత్వమే అందజేస్తుంది.
స్వయం ఉపాధికి..
డ్రోన్లను స్వయంగా ఉపయోగించడానికి, అద్దెకు ఇవ్వడానికి అనుమతిస్తారు. సర్వేలు, ఈవెంట్ షూట్‌లు, ఫొటోగ్రఫీ, వ్యవసాయంలో సీడింగ్, పురుగుమందులు చల్లడం వంటి వాటి కోసం డ్రోన్‌లను ఉపయోగించడమే లక్ష్యంగా ఉద్యోగావకాశాలు పొందుతారు.
ఆర్థికాభివృద్ధికి..
మూడేళ్ల కాలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 15 వేల డ్రోన్‌లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయంతో పాటు అదనంగా మహిళలు డ్రోన్ సంబంధిత వ్యాపారాలను చేసుకునే అనుమతి లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి మరింతగా దోహదపడుతుంది. ఎరువులను చేతితో పిచికారీ చేసే సాంప్రదాయ పద్ధతులను డ్రోన్లతో భర్తీ చేయడం ద్వారా పురుగు మందుల వల్ల కలిగే ప్రమాదం తగ్గుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది.
అంతేకాదు, డ్రోన్ల వాడకంలో ఖర్చులు తగ్గి, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. టెక్నాలజీలో ఆధునాతన శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కృషి జరపడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను మరింత శక్తిమంతులుగా తయారు చేయడమే.
ఇవి చదవండి: Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా?
Comments
Please login to add a commentAdd a comment