కోల్‌కతాలో అభయ... హైదరాబాద్‌లో దిశ... ఢిల్లీలో నిర్భయ. చెప్పుకుంటూ పోవడమేనా? వేదన నింపుకోవడమేనా? లేడి కొమ్ములు దిగబడిన పులి కళ్లల్లో భయం కూడా సాధ్యమే. శిక్షణ తీసుకుంటే రక్షణాయుధాన్ని వాడితే దుర్మార్గం ఆగుతుంది. దుష్టుడు మన చేత చిక్కి కటకటాల పాలవుతాడు.
ఆపద వస్తే ఎవరు సహాయం చేస్తారా అని నిస్సహాయంగా చూడడం కాదు, తనను తాను రక్షించుకోవడానికి ‘ఆమె’ను సమాయత్తం చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పని చేస్తోంది. ‘హర్ ఘర్ దుర్గ’ (ప్రతి ఇంట్లో దుర్గ) అనే నినాదంతో మహిళలకు స్వీయరక్షణ ప్రచారం మొదలుపెట్టింది. అమ్మాయిలకు కరాటే, జూడోలలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిలోనూ అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో క్లాసులు నిర్వహించనుంది. వారంలో కనీసం రెండు గంటల సమయం శారీరక వ్యాయామం, ఆత్మరక్షణ విద్యలకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంఘాల సహకారం తీసుకోనున్నట్లు తెలియచేశాయి అధికార వర్గాలు. మనదగ్గర ఈ పని ఐదేళ్ల్ల కిందటే మొదలైంది. తెలంగాణ, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తగుళ్ల స్వర్ణయాదవ్ అనే యువతి కర్రసాము నేర్చుకుని, హైదరాబాద్‌లో అకాడమీ స్థాపించి బాలికలకు నేర్పి
స్తోంది.
కర్రసాము... మార్షల్ ఆర్ట్స్
స్వర్ణ యాదవ్ ఫోక్ సింగర్. పాటలు పాడడానికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేది. ్రపోగ్రామ్ పూర్తయిన తర్వాత ఇంటికి చేరేసరికి రాత్రి పది దాటుతుంది. తనను తాను రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుందామె. మన దగ్గర కర్రసాము ఉందిగాని నేర్పించేవారు లేరు. తమిళనాడులో సిలంబం (కర్రసాము) ఆర్ట్ బాగా విస్తరించి ఉంది. తమిళనాడు వెళ్లి రెండేళ్ల కోర్సు చేశారు స్వర్ణ. తాను నేర్చుకుంటే సరిపోదు, వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు నేర్పించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన తర్వాత 2019 నుంచి స్కూళ్లలో నేర్పించడం మొదలు పెట్టింది. ‘స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ’ని 2022లో రిజిస్టర్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది. పది మందికి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో శిక్షకులుగా తయారు చేసి వారి సహాయంతో యూసుఫ్‌గూడ, ఉప్పల్, పటాన్‌చెరు, ఎల్‌బీనగర్, మాదాపూర్, కూకట్‌పల్లిలో ఫ్రీ క్యాంపులు నిర్వహించింది. స్కూళ్లలో కూడా ఉచితంగా నేర్పించింది.. హైదరాబాద్ నగరంలో శిక్షణ తర్వాత తమ సర్వీస్‌ని తెలంగాణ జిల్లాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతోందామె.
అబ్బాయిలకు కూడా!
‘‘కర్రసాముతోపాటు మనదేశీయ యుద్ధకళలన్నింటినీ మా అకాడెమీలో పరిచయం చేయాలనేది భవిష్యత్తు ఆలోచన. రాబోయే వేసవికి పంజాబ్ మార్షల్ ఆర్ట్ ‘గట్కా’ను ప్రవేశపెడుతున్నాం. స్కూళ్లలో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ అబ్బాయిల్లో దేహదారుఢ్యం తగినంతగా ఉండడం లేదు. స్మార్ట్ ఫోన్‌లలో మునిగిపోయి ఊబకాయులవుతున్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అబ్బాయిల్లో ఫిట్‌నెస్ పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు స్వర్ణ యాదవ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment