
మహిళా రచయితల పుస్తకాలతో మహిళల కోసం మహిళలే నడుపుతున్న గ్రంథాలయం ఒకటి ఉంది తెలుసా? ఇది ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉంది. అదే సిస్టర్ లైబ్రరీ. దీన్ని దేశంలోనే తొలి ఫెమినిస్ట్ లైబ్రరీగా చెప్పుకోవచ్చు. 2019ల ప్రారంభమైంది ఇది.
ఎలా?
ముంబైలో ‘బాంబే అండర్‌గ్రౌండ్’ పేరుతో ఆర్టిస్ట్ కలెక్టివ్ గ్రూప్ ఒకటుంది. నగరంలోని పలుచోట్ల తాత్కాలిక రీడింగ్ స్పెస్‌ని ఏర్పాటు చేసి.. పుస్తకాలతోపాటు తోటివాళ్లతో జనాలు సమయం వెచ్చించేలా చూడ్డం ఈ గ్రూప్ విధుల్లో ఒకటి. ఆ పనిలోనే ఉన్నప్పుడు ఈ గ్రూప్ సభ్యురాలైన ఎక్వీ థామీకి రీడింగ్ స్పేస్‌లో సమావేశమైన వారెవ్వరూ మహిళా రచయితల పుస్తకాలు చదువుతున్నట్టు కనిపించలేదు. అసలు తానెన్ని చదువుతుందో తేల్చుకోవాలనుకుంది ముందు. ఇంటికెళ్లి తన బుక్ ర్యాక్‌లో చూసుకుంటే మహిళా రచయితల పుస్తకాలు కనీసం 20 శాతం కూడా లేవు. అప్పుడు డిసైడ్ చేసుకుంది ఎక్వీ మహిళా రచయితల పుస్తకాలు చదవాలని. దేశంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలో మహిళా రచయితల రాసిన పుస్తకాలన్నిటినీ సేకరించడం మొదలుపెట్టింది. అలా కేవలం మహిళా రచయితల పుస్తకాలతోనే నిండిపోయిన తన పర్సనల్ లైబ్రరీలోంచి స్నేహితులూ పుస్తకాలు అరువు తీసుకోసాగారు. ఆ డిమాండ్ చూసి నిశ్చయించుకుంది ఫెమినిస్ట్ లైబ్రరీ స్టార్ట్ చేయాలని.
ఆ ప్రయత్నాల్లో ఉండగా.. 2018లో ఆమెకు ఫైన్ ఆర్ట్ అవార్డ్ వచ్చింది. దానికింద అందిన రొక్కంతో దేశంలోని ప్రముఖ నగరాలను పర్యటించి మహిళా రచయితలు రాసిన నవలలు, వ్యాస సంపుటాలు, ఉద్యమ రచనలు, ఆర్ట్ పుస్తకాలు, మహిళాపత్రికలు వంటి వెయ్యి పుస్తకాలను సేకరించింది. వాటితోనే ‘సిస్టర్ లైబ్రరీ’ని ప్రారంభించింది. ‘సాహిత్య, కళా రంగాల్లో మహిళల కృషిని తెలియజేయడానికే ఈ లైబ్రరీని స్థాపించినా.. ఈ ప్రయాణ క్రమంలో అనిపించింది అసలు సృజన రంగంలో మహిళలు పంచిన జ్ఞానాన్ని, వాళ్లు సాధించిన స్థానాన్నీ ప్రపంచం గ్రహించేలా చేయాలని! ఇప్పుడా లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాను’ అని చెబుతుంది ఎక్వీ.
ఈ లైబ్రరీకి దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లోని మహిళలంతా తమ వంతు సాయం చేస్తున్నారు. విరాళాల నుంచి క్రౌడ్‌ఫండింగ్ దాకా ఇందులో పుస్తకాల కోసం ధన సహాయమూ అందుతోంది. ఫెమినిస్ట్ లైబ్రరీ ఆవశ్యకతను చాటడానికి, స్ఫూర్తి పంచడానికి సిస్టర్ లైబ్రరీ సభ్యులు దేశ, విదేశీ పర్యటనలూ చేస్తున్నారు. దీంతోపాటు దేశంలో మహిళలే నిర్వహిస్తున్న చంపక బుక్‌స్టోర్ (బెంగళూరు), వాకింగ్ బుక్ ఫెయిర్స్ బుక్‌స్టోర్ అండ్ మొబైల్ లైబ్రరీ (భువనేశ్వర్), ట్రైలాజీ క్యురేటెడ్ బుక్ షాప్ అండ్ లైబ్రరీ (ముంబై) స్టోరీటెల్లర్ బుక్‌స్టోర్ (కోల్‌కత్తా), వన్ అప్ లైబ్రరీ, బుక్‌స్టోర్ స్టూడియో అండ్ లర్నింగ్ ల్యాబ్( ఢిల్లీ), సిస్టర్స్ ఆఫ్ ద పిపుల్ (ఢిల్లీలోని చారిటీ బుక్ స్టోర్) లాంటి బుక్ స్టోర్స్, లైబ్రరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment