కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో అగాధాన్ని సృష్టించింది. మరెందరో జీవితాల్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు కోవిడ్-19 సృష్టించిన విలయం కారణంగా ఆత్మీయులను కోల్పోయినవారిలో, ఉద్యోగాలను పోగొట్టుకున్నవారిలో జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరించింది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో ఒకరు కావ్య ధోబ్లే. కోవిడ్ రోగుల మధ్య నెలల తరబడి పనిచేస్తూ, రోజుకు అనేక మరణాలను చూడటం, స్వయంగా కరోనా బాడిన నేపథ్యంలో జీవితంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఆమె విజయానికి, సంతోషకరమైన జీవితానికి పునాది వేసింది. ఏంటి ఆ నిర్ణయం? కావ్య సాధించిన విజయం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.
కావ్య ధోబ్లే-దత్ఖిలే ముంబైలో ఒక నర్సు. కావ్య ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలో పెరిగింది. బహుశా ఆ కోరికే ఆమెన నర్సింగ్‌పైపు మళ్లించిందేమో.జనరల్ నర్సింగ్,మిడ్‌వైఫరీలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ (సియోన్ హాస్పిటల్)లో పనిచేయడం ప్రారంభించింది. తరువాత ను టాటా క్యాన్సర్ హాస్పిటల్‌లో రెండు సంవత్సరాలు పనిచేసింది. దీనితో పాటు, కావ్య 2017లో నర్సింగ్‌లో బి.ఎస్సీ పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక సంవత్సరం బోధించిన తర్వాత,ముంబైలోని సియోన్ ఆసుపత్రికి స్టాఫ్ నర్సుగా చేరింది. 2019 నుండి 2022 వరకు సియోన్ హాస్పిటల్‌లో ఆయన పనిచేసిన కాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది.
ఉద్యోగం మానేసి, సంచలన నిర్ణయం
కావ్య కూడా కరోనా బారిన పడి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఎన్నో మరణాలను చూసింది. కానీ తన రోగనిరోధక శక్తి తనను కాపాడిందనే విషయాన్ని అర్థం చేసుకుంది. అలాగే వ్యవసాయం అంటే మక్కువ ఉన్న ఆమె మనం పండించే, రసాయనాలతో నిండిన ఆహారం వ్యాధులకు హేతువని తెలుసుకుంది. అందుకే సమస్య మూలాన్ని తొలగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతే నెలకు రూ. 75వేల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసింది. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినా, ఆమె భర్త రాజేష్ దత్ఖిలే క్యావకు మద్దతు ఇచ్చాడు. 2022లో, ఆమె తన ఉద్యోగాన్ని వదిలి భర్త గ్రామానికి వెళ్లింది.
నర్సింగ్ నుండి జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు
ఆహారానికి ఆధారం వ్యవసాయం. అందుకే ఎలాంటి రసాయనాలు వాడని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది కావ్య. పట్టుదలగా కృషి చేసింది. వర్మీ కంపోస్ట్ బిజినెస్‌తో లక్షలు సంపాదిస్తోంది. రాజేష్ కుటుంబానికి పూణేలోని జున్నార్‌లోని దత్ఖిలేవాడి గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. ఇందులో 5 గుంతల (0.02 ఎకరాలు) వర్మీకంపోస్ట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని వదిలి, వర్మీకంపోస్ట్ వంటి సేంద్రీయ ఇన్పుట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కావ్య స్థానిక రైతులతో మాట్లాడింది. ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి సంవత్సరంలో టర్నోవర్ రూ. 24 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 లక్షల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. కావ్య ప్రతి నెలా దాదాపు 20 టన్నుల రిచ్ వర్మీకంపోస్ట్‌ను తయారు చేస్తుంది. 50 శాతం లాభం మార్జిన్‌తో 50 కిలోల బ్యాగు ధర రూ. 500 లకు విక్రయిస్తుంది. ప్రస్తుతం 30 లక్షల వార్షిక టర్నోవర్‌తో విజయ వంతంగా దూసుకుపోతోంది. వోల్జా డేటా ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వర్మీకంపోస్ట్ ఎగుమతిదారు. ఆ తర్వాత టర్కీ, ఇండోనేషియా,వియత్నాం ఉన్నాయి. ఈ రంగంలో అవార్డును కూడా అందుకుంది.
ప్రారంభంలో తప్పని సవాళ్లు
సేంద్రీయ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ గురించి కావ్య రైతులతో మాట్టాడినప్పుడల్లా, ఆమెకు లభించే సమాధానం, 'మీరు దీన్ని చేసి మాకు చూపించండి' అని. దీంతో ఆగస్టు 2022లో, అతను ఒక రైతు నుంచి ఒక కిలో వానపాములతో జీరో పెట్టుబడితో వర్మీ కంపోస్ట్ తయారీనీ మొదలు పెట్టింది. ప్రారంభించాడు. అక్టోబర్ 2022 నాటికి, వర్మీకంపోస్ట్ సిద్ధమైంది. మార్చిలో, కావ్య కృషి కావ్య బ్రాండ్ కింద వర్మీకంపోస్ట్ వాణిజ్య అమ్మకాలను ప్రారంభించింది. దాని ఫలితాలను రైతులు స్వయంగా అనుభవించారు. వారి విజయాలను తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసేది. ఒక రైతు ఐదు టన్నుల వర్మీకంపోస్టును రూ. 50,000 (కిలోకు రూ. 10) కు కొనుగోలు చేశాడు. రెండు వేల మంది రైతులకు ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ 2,000 కిలోల వానపాములను కొనుగోలు చేసింది. కావ్య కిలో రూ.400కి అమ్మింది. ప్రతి రెండు నెలలకు 200 కిలోల వానపాములు, 35వేల కిలోల వర్మీ కంపోస్టును విక్రయిస్తుంది. అంతేకాదు ఆమె శిక్షణ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తున్నారు.తన చుట్టూ ఉన్నరైతుల్లో ఈ మార్పు తీసుకురాగలిగినందుకు చాలా సంతోషం అంటుంది కావ్య.
వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు?
వర్మీకంపోస్ట్‌కు అవసరమైన ప్రధానమైనవి ఆవు లేదా గొర్రెలు , మేక పెంట, చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, బయోగ్యాస్ ప్లాంట్ స్లర్రీ లాంటి సేంద్రియ వ్యర్థాల మిశ్రమానికి వానపాములు కలుపుతారు, అవి ఎరువుగా రూపాంతరం చెందుతాయి.కేవలం రూ.500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కంపోస్ట్‌ను ఎత్తైన పడకల మీద, డబ్బాలు, చెక్క డబ్బాలు, సిమెంటు ట్యాంకులు లేదా గుంటలు, వెదురు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా మట్టి కుండలలో కూడా తయారు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 జాతుల వానపాములు ఉన్నాయి. అయితే స్థానిక జాతులను ఉపయోగించడం అనువైనది ఎందుకంటే అవి తక్షణమే అందుబాటులో ఉంటాయి, పైగా స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. భారతదేశంలో, సాధారణంగా ఉపయోగించే వానపాము జాతులు పెరియోనిక్స్ ఎక్స్‌కవాటస్, ఐసెనియా ఫోటిడా , లాంపిటో మౌరిటీ లాంటివి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment