
జీవనయోధ
కశ్మీర్‌లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్‌మేన్‌లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్‌లో మొదటి మహిళా పోస్ట్‌ఉమన్‌గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.
మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్‌పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్‌ఉమన్. ఈ ఊరు శ్రీనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.
5 నెలలు మంచులోనే
దక్షిణ కశ్మీర్‌లోని హిర్‌పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్‌పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్‌క్వార్టర్ అయిన షోపియన్‌కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్‌మేన్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.
ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబు
ఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్‌బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.
క్రూరమృగాల భయం
కశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.
ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి.