మహిళలకు స్ఫూర్తిగా ఫేస్ బుక్ కథ!
కలలను సాకారం చేసుకునేందుకు వయసుతో పని లేదని చెబుతోంది ముంబైకి చెందిన ఓ మహిళ. ఐదు పదుల వయసులో కాలేజీలో విద్యార్థినిగా చేరి అనుకున్నది సాధించేందుకు నడుం కట్టింది. ఇంటర్ చదివిన తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేసెయ్యడంతో అక్కడే ఆగిపోయిన చదువును తిరిగి కొనసాగిస్తోంది. ఉమ్మడి కుటుంబంలో సంసారం సాగించిన 30 ఏళ్ల తర్వాత కొంత బాధ్యతలు తీరడంతో తన కల సాకారం చేసుకోడానికి తిరిగి ప్రయత్నం ప్రారంభించింది. పట్టుదలతో ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు రాస్తోంది.
30 ఏళ్ల తర్వాత తాను కాలేజీలో చేరానంటూ 51 ఏళ్ల వయసున్న ఓ మహిళ తన అనుభవాలను 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. కొద్ది గంటల్లోపే ఆమె కృషిని పొగుడుతూ, ఆమెను ప్రోత్సహిస్తూ వేలకొద్దీ షేర్లతోపాటు, ఇబ్బడిముబ్బడిగా వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ఇంటర్ పూర్తయిన తర్వాత పెళ్లి కావడం, ఉమ్మడి కుటుంబంలోకి వెళ్లడంతో చదువును కొనసాగించలేకపోయానని ఆమె తెలిపింది. అయితే చదువుకోవాలనే కోరిక కారణంగా.. ఏదో కోల్పోయినట్లుగా ఫీలయ్యేదాన్నని, అందుకే చదువుకు వయసుతో సంబంధం లేదని భావించి ప్రస్తుతం కాలేజీలో చేరి డిగ్రీ పరీక్షలు రాస్తున్నట్లు ఆమె ఫేస్ బుక్ పేజీలో తెలిపింది.
తన ముగ్గురు పిల్లల్లో ఒకరికి పెళ్లయి, మరో ఇద్దరు కాలేజీలో చదువుతుండగా ఆమె తిరిగి చదవాలని నిర్ణయించుకొంది. కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు కాలేజీలో విద్యార్థినిగా చేరి, ప్రస్తుతం మూడో సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఆమె కథ... ఎందరో మహిళలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది.