కెరీర్‌లో పీక్‌లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి! | Govinda Niece A Popular TV Actress Domestic Abuse to entrepreneur | Sakshi
Sakshi News home page

కెరీర్‌లో పీక్‌లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!

Published Thu, Feb 27 2025 1:16 PM | Last Updated on Thu, Feb 27 2025 3:49 PM

Govinda Niece A Popular TV Actress Domestic Abuse to entrepreneur

బాలీవుడ్ హీరో గోవింద -సునీత దంపతుల విడాకుల  పుకార్లు అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాయి.  37 ఏళ్ల  వైవాహిక  జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారన్నవార్తల్లో వాస్తవం లేదంటూ నటుడు ఈ  ఊహగానాలను  కొట్టిపడేశారు. అయితే, గోవిందతోపాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా మంది గ్లామర్ ప్రపంచంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని మీకు తెలుసా?  స్టాండ్-అప్ కమెడియన్ కృష్ణ అభిషేక్ , టీవీ టెలివిజన్ నటి రాగిణి ఖన్నా చాలామంది నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా టెలివిజన్‌లో తన తొలి సీరియల్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నటి సౌమ్య సేథ్ గోవిందాకు మేనకోడలు. ఈమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం  నటనకు దూరంగా ఉన్నప్పటికీ,   ఏ అభిమాని ఆమెను మరచిపోలేరు. వైవాహిక జీవితంలోకి అడుగపెట్టాక అంతులేని కష్టాలు మొదలయ్యాయి. భరించలేని గృహహింస,  విడాకులు ఇన్ని కష్టాల మధ్య తనను తాను నిలబెట్టుకుని  రాణిస్తోంది? అయితే ఎందుకు గ్లామర్‌  ప్రపంచానికి దూరమైంది? సౌమ్య సేథ్  జీవితం,  కెరీర్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

సౌమ్య సేథ్ 1989 అక్టోబర్ 17న బనారస్‌లో జన్మించింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ పొందింది. గోవింద మేనకోడలిగా సినీ ఇండస్ట్రీలో పరిచయాలు పెరిగాయి. భాలీవుడ్‌ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం చిత్రంలో ఆమె ఒక అతిధి పాత్రలో నటించింది. ఆ తరువాత 2011లో ‘నవ్య… నయే ధడ్కన్ నయే సవాల్’ అనే టీవీ సీరియల్‌ ద్వారా కెరీర్‌ను ప్రారంభించి, నవ్య  పేరుతో పాపులర్‌ అయింది. మహిళా విభాగంలో ఆమె బిగ్ టెలివిజన్ అవార్డులను అందుకుంది. ఆమె తరువాత దిల్ కీ నజర్ సే ఖూబ్‌సూరత్ అనే షోలో టైటిల్ రోల్‌లో నటించింది. 2013లో MTV వెబ్‌బెడ్‌ను కూడా నిర్వహించింది, తరువాత చక్రవర్తి అశోక సామ్రాట్ అనే షోలో 'కరువాకి' పాత్రను పోషించింది. ఇలా కెరీర్‌లో పీక్‌లో ఉండగానే2017లో అమెరికాకు చెందిన నటుడు అరుణ్ కపూర్‌ను  వెస్టిన్ ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్ రిసార్ట్‌లో  వివాహం చేసుకుంది తరువాత  అమెరికాలో స్థిరపడింది. వీరికి ఒక  కొడుకు ఐడెన్ పుట్టాడు.

ఇదీ చదవండి: టిపినీ కాదు, చద్దన్నం : క్రేజ్‌ మామూలుగా లేదుగా! ఎక్కడ?

“నేను అద్దం ముందు నిలబడినపుడు నన్ను నేను గుర్తుపట్టలేకపోయాను.  ఒళ్లంతా గాయాలు.క డుపుతో ఉన్నా  కూడా  చాలా రోజులు తినలేదు. అసలు కొన్ని రోజులు అద్దం వైపు చూసే ధైర్యం చేయలేకపోయాను. ఒక దశలో  చచ్చిపోదామనుకున్నా. కానీ  నేను చనిపోతే నా బిడ్డ  పరిస్థితి ఏంటి? తల్లి లేకుండా ఎలా బతుకుతుంది? నేను నన్ను నేను చంపుకోగలను కానీ.. బిడ్డ ఎలా? ఈ ఆలోచనే నాకొడుకు  ఐడెన్, నా ప్రాణాన్ని కాపాడింది." అని తెలిపింది.  చివరికి పెళ్లైన రెండేళ్లకు  2019లో విడాకులు తీసుకుని ఆ కష్టాల నుంచి బైటపడింది. 

మరోవైపు ఈ కష్టకాలంలో  సౌమ్య సేథ్‌కు తల్లిదండ్రులు వర్జీనియాకు వెళ్లి  అండగా నిలిచారు. అలా 2023లో, సౌమ్య ప్రేమకు మరో అవకాశం ఇచ్చి ఆర్కిటెక్ట్ , డిజైనర్ శుభం చుహాడియాను వివాహం చేసుకుంది. తరువాత 33 ఏళ్ల వయసులో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారి  సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. వర్జీనియాలో లైసెన్స్ పొందిన రియల్టర్‌గా రాణిస్తోంది. తన తండ్రి, తాత వ్యాపార దక్షతను చూసి తాను కూడా వ్యాపారవేత్త కావాలనే కలలు కనేదాన్నని, చివరికి తన కల నెరవేరిందని ఒక సోషల్‌మీడియా పోస్ట్‌ ద్వారా  చెప్పింది సౌమ్య.

సౌమ్య సేథ్  జీవితం, కెరీర్‌ ఆమె  ధైర్యానికి,  దృఢత్వానికి  చక్కటి నిదర్శనం. కెరీర్ కోల్పోయినా,  జీవితంలో ఎన్ని కష్టాలొచ్చిన తలొగ్గక, తనను తాను ఉన్నతంగా నిలబెట్టుకుంది.తద్వారా లక్షలాది మందికి ప్రేరణగానిలిచింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement