
ఐటీ రంగంలో చాలా ఏళ్లు పనిచేసిన 31 ఏళ్ల స్మృతి మిరానీ "భారతీయ మత్స్యకన్య"గా మారతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా రికార్డు సాధించింది. 40 మీటర్ల నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్మృతి మిరానీ. IIT బాంబే ఇంజనీర్ నుంచి భారతదేశపు తొలి మహిళా ఫ్రీ-డైవింగ్ రికార్డ్ హోల్డర్ వరకు ఆమె పయనం చాలా స్ఫూర్తి దాయకం. ఇది కేవలం రికార్డులను బద్దలు కొట్టడం గురించి మాత్రమే కాదు. తనకెదునైన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, అభిరుచి, పట్టుదల ఎవరూ ఊహించని లోతులకు (సముద్రపు) తీసుకెళ్లగలవని నిరూపించిన వైనం గురించి కూడా.
ఒక్క శ్వాస ఆమె జీవితాన్ని మార్చగలదు అంటే నమ్ముతారు. అవును స్మృతి మిరానీ విషయంలో అదే జరిగింది. ఒకే ఒక్క శ్వాసతో 40 మీటర్లకు పైగా నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా స్మృతి మిరానీ థాయిలాండ్‌లో చరిత్ర సృష్టించింది. ఎయిర్ ట్యాంక్ లేకుండా ఊపిరిబిగబట్టి సముద్రం లోతులకు చేరి చరిత్ర సృష్టించింది. నిజంగా ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చింది. ప్రతీ మహిళలకు గర్వకారణమైన క్షణం!
అప్నియా కో ఫంగాన్‌లో ప్రపంచ ప్రఖ్యాత కోచ్ లుకాస్ గ్రాబోవ్స్కీ ఆధ్వర్యంలో చాలా కఠోరమైన శిక్షణ తీసుకుని తనను తాను తీర్చుకుంది. రికార్డులను బద్దలు కొట్టడానికి తన శారీరక,మానసిక బలాన్ని సాధించింది. ఫ్రీ-డైవింగ్‌లో ఎయిర్ ట్యాంక్ లేదా శ్వాస ఉపకరణాలు లేకుండా సాధించాలంటే శ్వాసతీసుకోవడం అనే కళను అలవర్చుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని శ్రద్ధగా సాధన చేసే మెంటల్ గేమ్ లాంటిది అంటారామె.
తాను నీటి అడుగున ఉన్నప్పుడు తనకు తాను అత్యంత సన్నిహితంగా అనిపిస్తుంది” అని గర్వంగా చెబుతుందామె. ’’ ఇపుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాను, నాకు నేనే సవాళ్లు విసురుకుంటా.. భయాన్ని అధిగమించాను. ఫ్రీ-డైవింగ్ ఆనందాన్ని గుర్తించాను’’ అంటుంది.
చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
అండమాన్ దీవులలో ఊహించని విధంగా ఆమె ప్రయాణం ప్రారంభమైంది. తొలిసారి ఫ్యామిలీతో వెళ్లినపుడు స్కూబా-డైవింగ్ నేర్చుకోవాలని ప్రయ్నత్నించింది. రెండోసారి విజయం సాధించింది. ఆ తరువాత 2019లో రిమోట్‌గా పనిచేస్తున్నపుడు స్కూబా-డైవింగ్‌ను కొనసాగించడానికి వెళ్లినపుడు తాబేలుతో పాటు ఫ్రీ-డైవర్ ఈత కొట్టడం చూడటం జీవితం దృక్పథాన్ని మార్చివేసింది. అప్పటినుంచి సముద్రమే నివాసంగా మారి పోయింది. స్మృతి అప్పటి నుండి మాల్టా, బాలి, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జలాల్లో కొన్నింటిలో డైవ్ చేసింది. సర్టిఫైడ్ ఫ్రీ-డైవింగ్ బోధకురాలిగా ఎదిగింది. అనేక మందికి శిక్షణనిస్తోంది. వారిలో తమ సామర్థ్యాన్ని అన్వేషించి, వారి భయాలను అధిగమించవడానికి శక్తినిచ్చే లక్ష్యంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment