
ఇంతలా ఏఐ సాంకేతికత దూసుకుపోతున్నా.. ఆడపిల్ల అనగానే అమ్మో..! అనే అంటున్నారు. ఇంకా ముగ్గురూ.. అబ్బాయిలే అయినా భయం ఉండదు. గానీ అదే రెండోసారి లేదా మూడోసారి ఆడబిడ్డ అనగానే ప్రాణాలే పోయినంతంగా తల్లడిల్లిపోతారు చాలామంది. ఎందుకనేది అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఎందుకంటే అటు అబ్బాయి లేదా అమ్మాయిని పెంచి పెద్దచేసి విద్య చెప్పించడం వంటివన్ని షరామాములే కానీ..ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులనగానే సమాజం సైతం టన్నుల కొద్దీ జాలి చూపిస్తుంది. అలాంటి వివక్షనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఎదుర్కొంది. చిన్ననాటి నుంచి దానిపై పోరాడుతూనే వచ్చింది. చివరికి తనను వద్దు, చంపేయాలని చూసిన తల్లిదండ్రులనే గర్వపడేలా అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచమే తనవైపు తిరిగి చూసేలా చేసింది.
ఆ అమ్మాయే పూజ తోమర్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని బుధాన అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు అంజలి, అను అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ గ్రామస్థులు అమ్మాయి అనగానే కట్నం ఇచ్చి పెళ్లిచేసే కష్టతర బాధ్యతగా చూసేవారు. అలాంటి వాతావరణంలో పూజా తల్లిదండ్రులు కూడా మూడోసారి అమ్మాయి పుట్టకూడదని దేవుళ్లందరికీ దండాలు పెట్టుకున్నారు.
కానీ విధి వింత పరీక్షకు ఎవ్వరైనా తలొగ్గక తప్పదు కదా..!. పాపం అలానే ఈ తల్లిదండ్రులకు ఎంతలా వద్దనుకున్నా మూడోసారి ఆడపిల్లే పుట్టింది. తండ్రే ఈ విషయం విని జీర్ణించుకోలేక కళ్లు తిరిగిపడిపోయాడు. ఇక తాము ఈ అమ్మాయిని పెంచలేం అని కుండలోపెట్టి చంపేయాలనుకున్నారు. కానీ ఆ చిన్నారి గుక్కపెట్టిన ఏడుపుకి జాలి కలిగిందో ఏమో..! వెంటనే చేతుల్లోకి తీసుకున్నారు తల్లిదండ్రులు.
అలా చిన్ననాడే బతుకు పోరాటం చేసింది పూజ. అలా నెమ్మదిగా పెద్దదైంది. తనంటే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదనే విషయం తెలిసి మౌనమే దాల్చిందిగానీ వారితో పోరాడలేదు. అడుగడుగున ముగ్గురు ఆడపిల్లలు అనే మాటలు ఓ పక్కన, మరోవైపు నువ్వు పుట్టుకుంటే బాగుండును అన్న సూటిపోటి మాటల మధ్య బాధనంత పట్టికింద బిగబెట్టి బతికింది.
అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఎలాగైన ఆడిపిల్ల భారం కాదు అదృష్టమనే చెప్పాలని నిర్ణయించుకుంది. అదెలాగనేది తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి యూట్యూబ్‌లో జాకీ చాన్ పాత్రలే ఆమెకు నచ్చేవి. ఎందుకంటే తాను ఎదుర్కొన్న వివక్ష పోరాటాల అందుకు కారణమై అయి ఉండొచ్చు కూఆ. కానీ పూజ ఎప్పుడు రాజకీయ నాయకురాలు, ఏ ఐపీఎస్ వంటివి లక్ష్యంగా ఏర్పరచుకాలేదు. కరాటేలో రాణించాలనుకోవడం విశేషం.
తన చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు అయినా అదే నేర్చుకోవాలనుకుంది. సరిగ్గా ఇంటర్‌లో ఉండగా ఒక కరాటే టీచర్ స్థానిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక ఆమె ఆ టీచర్ సాయంతో దానిలోని మెళుకువలు నేర్చుకుంది. మరింత ఇందులో ఛాంపియన్‌గా రాణించాలంటే ఏం చేయాలో తెలుసుకుంది.
ఆ విషయంలో ఆమె మేనమామ కాస్త సాయం అందించడంతో మార్షల్ ఆర్ట్స్‌తో మిళితమైన కరాటేలో ప్రావీణ్యం తెచ్చుకునేందుకు భోపాల్‌కు పయనమైంది. అక్కడ ఐదేళ్లలో పలు కాంపీటీషన్లలో గెలుపొంది కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందింది. అయితే దీన్ని పూజ చాలా అవమానంగా భావించి వదులుకుంది. మరింతగా దీనిలో రాణించి ఉన్నతోద్యోగం పొందాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడింది.
ఆ సమయంలోనే అల్టిమేట్ ఫైనల్ ఛాంపియనషిష్(మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)) గురించి తెలుసుకుంది. ఇక దాని కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది. కనీసం అందుకు ఎవరైన స్పాన్స్ చేయడంగానీ కాంట్రాక్టులు, జీతం లేదా ఎవరిదైనా హామీ వంటివి ఏం లేకుండానే ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆమె ట్యూషన్ పీజు కట్టేందుకు ఎవరో దాత ముందుకు వచ్చారు. అంతే తప్ప కనీసం ఏ మద్దతు సాయం లేకుండా ఒంటరిగా మొండిగా అక్కడ ఎంఎఏలో శిక్షణ తీసుకుంది.
అలా పూజ అల్టిమేట్ ఫైనల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బ్రెజిల్‌కు చెందిన రాయన్నే అమండా డోస్ శాంటోస్‌తో తలపడి గెలుపొందింది. దీంతో ఇలా యూఎఫ్‌సీ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలుగా యావత్తు భారతావనిని తనవైపు గర్వంగా చూసేలా చేసింది. 31 ఏళ్ల ఈ పంచర్ ఇప్పుడు తన MMA జట్టులో నెలకు దాదాపు రూ. 1.5 నుండి 2 లక్షలు ఖర్చుచేసే ఛాంపియన్‌గా ఎదిగింది.
ఇన్నాళ్లుగా తాను చేస్తున్న పోరాటనికి ఓ అర్థం వచ్చేలా విజయాలు సాధిస్తున్నా అంటూ కంటతడిపెట్టుకుంది. తానెంటన్నది తన కుటుంబానికి చూపించాలనుకోలేదని, ఈ ప్రపంచానికి ఆడపిల్ల భారం అనే మాటకు తావివ్వకూడదు అని చెప్పేందుకే పోరాడనంటోంది పూజ. ఇక ఆమె అనితరసాద్యమైన విజయం అందుకోగానే ఆమె గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. నాడు ముచ్చటగా మూడోసారి ఆడపిల్లగా పుట్టిన శాపగ్రస్తురాలిగా చూసిన వాళ్లే తన కరచలనం కోసం తహతహలాడటం విశేషం.
అమె అక్కలు ఒకరు నర్సుగా, మరొకరు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లంతా తమ చెల్లి పూజ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పూజా తల్లి సైతం ఆమె తన కూతురని గర్వంగా చెబుతూ మీడియా ముందుకొస్తుంది. ఇక చివరగా భారతదేశం అనగానే కేవలం క్రికెట్ మ్యాచ్‌లే కాదు యోధులు కూడా ఉన్నారని చూపించాలనుకుంటున్నా..అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పూజ.
దురదృష్టం ఏంటంటే ఏ ఆడపిల్ల అని అవమానంగా ఫీలయ్యాడో ఆ తండ్రే పూజ విజయాన్ని చూడకముందే కన్నుమూశాడు. ఏదీఏమైనా ఇలాంటి తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించేలా పూజ విజయం ఉండటమే గాక తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆడపిల్లలందరకీ స్ఫూర్తిగా నిలిచింది పూజ.
(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే)
Comments
Please login to add a commentAdd a comment