karate
-
పారిశుధ్య కార్మికుడి కూతుళ్లు కరాటేలో క్వీన్స్..!
వారి ఇంటిపేరు ఏమిటో చాలామందికి తెలియదు. ‘కరాటే సిస్టర్ప్’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన విశాఖపట్నంకు చెందిన కృష్ణప్రియ, జ్యోతి, సంగీత కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెల్చుకున్నారు. కర్రసాము, చెస్లోనూ రాణిస్తున్నారు...జీవీఎంసీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న రామారావు ముగ్గురు కుమార్తెలు సంగీత, కృష్ణప్రియ, జ్యోతి కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. విశాఖ మహా నగరంలోని పీ అండ్ టీ కాలనీలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ (ఎన్ ఎంసీహెచ్)లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఒక వైపు చదువు, మరోవైపు కరాటేలో ప్రావీణ్యం చూపుతున్నారు.కృష్ణప్రియ (16) డబ్లు్యఆర్ఐ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్–2017 పోటీలలో రజతం, ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2018 పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు, నెట్షాడోకాన్ నేషనల్ ఛాంపియన్ షిప్–2019 ఓపెన్ కరాటే పోటీలలో వెండి, కాంస్య పతకాలు, దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్–2020 పోటీల్లో రజత, కాంస్య పతకాలు, 5వ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో స్వర్ణ, వెండి పతకాలు, 13వ జాతీయ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్ షిప్–2022 పోటీలలో రజత, వెండి పతకాలు, 8వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్–2025 ΄ోటీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు....ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పతకాలు సాధించింది.ఈ నెలలో విశాఖలోని పోర్టు స్టేడియంలో జరిగిన 81వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2025 పోటీలలో ముగ్గురు సోదరీమణులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీలలో జ్యోతి బంగారు పతకం, వెండిపతకాలు, కృష్ణప్రియ ఏకంగా రెండు బంగారు పతకాలు, సంగీత వెండి, కాంస్య పతకాలు సాధించింది. విశాఖలో జరిగిన ఈ పోటీలలో విశాఖకు చెందిన ఈ ముగ్గురు సోదరీమణులు ఒకే వేదిక మీద సత్తా చాటి పతకాలు అందుకొని భేష్ అనిపించుకున్నారు.‘రామారావుకు నేనే కరాటేలో శిక్షణ ఇచ్చాను. 1989 నుంచి కరాటే అకాడమీ నిర్వహిస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా రామారావు ముగ్గురు కుమార్తెలకు కూడా కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. ఈ ముగ్గురు పిల్లలకు కష్టపడే తత్వం ఉంది. మంచి భవిష్యత్ ఉంది’ అంటున్నాడు కరాటే కోచ్ ఎల్లారావు.‘పిల్లలు సరదాగా కరాటే నేర్చుకుంటున్నారు అనుకున్నానుగానీ ఇంత పేరు తెచ్చుకుంటారు అనుకోలేదు. వారి విజయాలకు ఒక తండ్రిగా మురిసిపోతున్నాను. గర్విస్తున్నాను’ అంటున్నాడు రామారావు. కరాటే అంటే నిండైన ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసమే ముగ్గురు సోదరీమణులకు ఆభరణం. వారు కరాటేలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆశిద్దాం.– దుక్కా మురళీకృష్ణారెడ్డి, సాక్షి, సీతమ్మధార, విశాఖపట్నం (చదవండి: వ్యాధిని వరంలా మార్చి..కుటుంబాన్ని పోషించింది..!) -
పంచ్‌లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?
పెరెగ్రైన్ ఫాల్కన్ కన్నా వేగవంతమైన కిక్‌లకు టెక్నిక్ మేళవించి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తుంది. చిరుత కంటే వేగంగా పాదాలను కదిలించి ఎదుటివారిని చిత్తు చేస్తుంది. పాల్గొన్న ప్రతిపోటీలోనూ పతకం సాధించి తనకుతానే సాటిగా అంతర్జాతీయ వేదికపై మరోమారు సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన కరాటే క్వీన్ దేవిహంసిని. ఇప్పటి వరకూ అనేక జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి మెడల్స్‌తోపాటు పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.- చిలకలగూడ యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఫుజైరాలో 2025 ఫిబ్రవరిలో జరిగే కరాటే–1 యూత్‌లీగ్ పోటీలకు అండర్–14 కటా విభాగంలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి దేవిహంసిని. వడోరై కరాటే డూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యుఏఈలో జరిగే యూత్‌లీగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఎనిమిది మందిని ఎంపిక చేశారు. చిన్ననాటి నుంచే.. సాధారణ కుటుంబానికి చెందిన పెబ్బిలి దేవిహంసిని (12) సికింద్రాబాద్ సెయింట్ మేరీ హైసూ్కల్లో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి, తల్లి అంజలి గృహిణి. తన ఆరో ఏట నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకుంది. మొదట విశాఖపట్నంలోని కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్‌లో చేరింది. కరాటే కోచ్ సిహాన్, సీహెచ్ శ్రీనివాసరావు వద్ద ఓనమాలు నేర్చుకుంది. కఠోరశ్రమ, చిత్తశుద్ధి, నేర్చుకోవాలనే తపనతో మెళకువలను ఔపోసన పట్టి బ్లాక్‌బెల్ట్ సాధించింది. సినీనటుడు సుమన్ నుంచి బ్లాక్‌బెల్ట్ అందుకోవడం గర్వంగా ఉందని చెబుతోంది దేవి. సాధించిన పతకాలు..జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దేవిహంసిని పాల్గొన్న ప్రతి పోటీలోనూ బహుమతి సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కటా, కుమిటీ విభాగాల్లో పది గోల్డ్, రెండు వెండి, జాతీయ స్థాయిలో 22 బంగారు, ఐదు వెండి, మూడు రజిత పతకాలు కైవసం చేసుకుంది. సౌత్ నేషనల్ లెవల్లో 7 గోల్డ్, ఒక్కో సిల్వర్, బ్రాంజ్, ఆసియన్ లెవల్లో ఒక్కో సిల్వర్, బ్రాంజ్, స్టేట్ లెవల్లో ఐదు బంగారు, ఒక్కో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. మువ్వన్నెల జెండా ఎగురవేస్తా.. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేస్తా. యుఏఈ ఫుజైరాలో కరాటే యూత్‌లీగ్‌లో విజయం సాధిస్తా. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం కూడా అవసరం. అందరి సహకారం ఉంటే గెలుపు తథ్యమని దేవిహంసిని ధీమా వ్యక్తం చేస్తోంది. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!
కరాటే అనేది మార్షల్ ఆర్ట్ మాత్రమే కాదు... మహత్తరమైన ఫిలాసఫీ కూడా. ఆ తత్వంలో... మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే... సాహసంతో దూసుకెళ్లే స్ఫూర్తి దాగుంది. అందుకే కరాటే అనే ఆత్మరక్షణ విద్య అత్యవసరం అయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న వంద విద్యాసంస్థల్లో 30 రోజుల పాటు 50 వేల మంది అమ్మయిలకు కరాటే క్లానుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు...అక్షరక్రమంలోనే కాదు, ఆత్మరక్షణలోనూ అనంతపురం జిల్లాను ముందు వరుసలో ఉంచే లక్ష్యంగా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాఠశాలల నుంచి కాలేజీల వరకు కరాటే క్లాసుల నిర్వహణకు చొరవ తీసుకున్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సహకారంతో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ వర్కర్లు, ఆర్డీటీ సంస్థ ప్రతినిధులతో కలసి అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యతోపాటు యోగా, మానసిక వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న సామాజిక ఉద్యమకారిణి, తొలితరం ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, జడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల పరిధిలోని బాలికల పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. (National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?)‘నిజం చెప్పాలంటే కొన్నిరోజుల ముందువరకు ఇల్లు దాటి ఒంటరిగా బయటికి రావాలంటే భయంగా ఉండేది. ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనే భయమే దీనికి కారణం. ఒకరోజు మా అక్క ను ఎవరో అసభ్యంగా కామెంట్ చేస్తే ఇంట్లో చెప్పి ఏడ్చింది. అప్పటినుంచి నాకు కూడా అలాంటి అనుభవం ఎదురవుతుందేమోననే భయం ఏర్పడింది. కరాటే క్లాసులకు హాజరు కావడం వల్ల నాలో ఉన్న ఆ భయం పోయింది. ఇప్పుడు నేను నిశ్చింతగా బయటికి వెళుతున్నాను. ఎవరైనా కామెంట్ చేస్తే వారిని ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకు వెళ్లగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది పల్లవి.‘కరాటే నేర్చుకోవడం అనేది ఎవరినో భయపెట్టడానికి కాదు. మనం ధైర్యంగా ఉండడానికి. కరాటేలాంటి ఆత్మరక్షణ విద్యల వల్ల క్రమశిక్షణ, ఆరోగ్య స్పృహ పెరుగుతుందనేది అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను’ అంటుంది శ్రీలత. (National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్!)‘మా అమ్మాయికి ఎంసెట్ కోచింగ్ ఇప్పటినుంచే ఇప్పిస్తున్నాం’ అని ఘనంగా చెప్పుకునే తల్లిదండ్రులను, ‘అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ఎందుకు!’ అని ఆశ్చర్యపడేవాళ్లను ఎందరినో చూస్తుంటాం. పల్లవి, శ్రీలత, ఆఫ్రోజ, భార్గవి.. లాంటి అమ్మాయిల మనసులో మాట విన్నప్పుడు కరాటే నుంచి యోగా వరకు శిక్షణ తరగతులు నిర్వహణ అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.– ఖాజీ హిదాయతుల్లా, సాక్షి, అనంతపురం సిటీఎప్పుడు ఏ ఆపద వచ్చినా...జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది అమ్మాయిలను ఆత్మరక్షణ విద్యలో ఆరితేరేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు ప్రతి మండలం లో కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించి అమలు చేస్తున్నాం. నాలుగు రిసోర్స్ టీమ్‌లు అందుబాటులో ఉంటాయి. వాటికి వీరవాహిని, బలప్రభ, సురసేన, శక్తిసేనగా నామకరణం చేశాం. సంక్షేమ శాఖ, కరాటే అసోసియేషన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు ప్రతి టీమ్‌ను పర్యవేక్షిస్తారు. ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సమర్థంగా తిప్పికొట్టేలా అమ్మాయిలను తీర్చిదిద్దుతున్నాం. పది నుంచి పద్దెనిమిది ఏళ్లలోపు టీ నేజ్ అమ్మాయిలకు వచ్చే సమస్యలపైన అవగాహన కల్పిస్తున్నాం. – బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్, అనంతపురంఅదృష్టంగా భావిస్తున్నా...కరాటే, యోగా, మానసిక వికాసం, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఉచితంగా శిక్షణ పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరైనా ఆకతాయులు నా జోలికి వస్తే తోక ముడిచి పరుగెత్తేలా చేయగలననే నమ్మకం వచ్చింది. అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచే ఇటువంటి శిక్షణ ఇస్తే మరింత బాగుంటుంది.– జి. భార్గవి, ఇంటర్ విద్యార్థిని, రాప్తాడుసెల్ఫ్–డిఫెన్స్సాహసానికి జెండర్ భేదం లేదు. అయితే కొన్ని ఆటలు మాత్రం ‘పురుషులకు మాత్రమే’ కోట గోడలలో బంధీలై పోయాయి. ఇప్పుడు ఆ కోటలు బ్రద్దలవుతున్నాయి. తమిళనాడులో ‘ఇలవట్ట కల్’ అనేది పురాతన ఆట. పెద్ద పెద్ద గుండ్రాళ్లను ఎత్తి పడేసే ఈ ఆటలో పురుషులు మాత్రమే పాల్గొనేవారు. మహిళలు ప్రేక్షక΄ాత్రకే పరిమితం అయ్యేవారు. ఈసారి మాత్రం మేము సైతం అంటూ ‘ఇలవట్ట కల్’లో మహిళలు సత్తా చాటారు. భవిష్యత్ తరాలకు తరగని ఉత్సాహాన్ని ఇచ్చారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఈసారి మహిళల కోసం ‘ఇలవట్ట కల్’ ప్రత్యేకంగా నిర్వహించారు. 47 కేజీలు, 67 కేజీల విభాగంలో మహిళలు సత్తా చాటారు. ఎత్తే సత్తా ‘ఇలవట్ట కల్’ ΄ోటీలలోపాల్గొన్న భవధరణి 67 కేజీల బరువు ఉన్న రాతిగుండును ఏకంగా రెండు సార్లు అలవోకగా ఎత్తిపడేసి మొదటి బహుమతిని గెలుచుకుంది. ‘ఈ ΄ోటీలలో ΄ాల్గొనడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి... సంప్రదాయంగా వస్తున్న ఆటలను కాపాడుకోవడం. రెండు... ఇలవట్ట కల్లో మహిళలు కూడా సత్తా చాటగలరు అని నిరూపించడం’ అంటుంది భవధరణి.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై -
తగ్గేదే లేదు.. ఒగ్గేదే లేదు!
‘నీ ప్రయాణంలో కరాటే అనేది వెలిగే కాగడాలా ఉండాలి’ అంటాడు ఒక మార్షల్ ఆర్టిస్ట్. పరిస్థితుల ప్రభావం వల్ల, రకరకాల కారణాల వల్ల దారి ΄పొడుగునా ఆ వెలుగును కాపాడుకోవడం అందరి వల్ల సాధ్యం కాకపోవచ్చు. తండ్రి పక్కనపెట్టిన కాగడా పట్టుకొని కరాటేలో విజయపథంలో దూసుకుపోతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి చెందిన మన్యం బిడ్డ కొండపల్లి చందన.కాస్త సరదాగా చెప్పుకోవాలంటే చందన వాళ్ల ఇంట్లో ‘కరాటే’ అనేది పాత చుట్టంలాంటిది. తండ్రి కొండపల్లి జంపన్నకు కరాటే అంటే ఎంతో ఇష్టం. ఎన్నో కలలు కన్నాడు. బ్లాక్‌బెల్ట్ వరకు వెళ్లాడు. తెల్లవారుజామునే ‘హా’ ‘హూ’ అంటూ తండ్రి సాధన చేస్తుంటే ఆ శబ్దాలు నిద్రలో ఉన్న చందన చెవుల్లో పడేవి. ఆ శబ్దాల సుప్రభాతంతోనే నిద్ర లేచేది. నాన్న సాధన చేస్తుంటే ఆసక్తిగా చూసేది. ఆ తరువాత సరదాగా తాను కూడా సాధన చేసేది. అలా కరాటేతో పరిచయం మొదలైంది.చిన్నప్పటి నుంచే ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న చందనను తల్లిదండ్రులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయిని సుధకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇతర ఆటలతో పాటు కరాటే కూడా విద్యార్థులతో సా«ధన చేయించేది. స్కూలు మొత్తంలో ఓ పదిమంది విద్యార్థినులు కరాటేలో ప్రతిభ చూపిస్తుండటంతో ఆ శిక్షణను కొనసాగిస్తూనే వివిధ పోటీలకు విద్యార్థులను తీసుకువెళ్లేవారు. ఎనిమిదో తరగతి నుంచే కరాటే పోటీలలో పాల్గొంటూ బహుమతులు గెలుస్తూ వచ్చింది చందన.విరామం కాదు ఆరంభ సంకేతంవరంగల్లో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం గెలుచుకోవడంతో చందన విజయపరంపర మొదలైంది. విశాఖపట్నం, ఖమ్మంలలో జరిగిన పోటీల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ముంబై, దిల్లీలో జరిగిన పోటీల్లోనూ పతకాలు సా«ధించింది. అయితే పదోతరగతి తర్వాత ఆటలతోపాటు చదువు ముఖ్యం అంటూ కుటుంబంపై వచ్చిన ఒత్తిడి కారణంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి బయటకు వచ్చి హన్మకొండలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్లో చేరింది. ‘ఇక కరాటే ఆపేసిట్లేనా!’ అడిగే వాళ్లు చాలామంది. అయితే ఆ విరామం మరిన్ని విలువైన విజయాలు సాధించడానికి ఆరంభ సంకేతం అనేది చాలామందితోపాటు చందనకు కూడా తెలియదు.ఇప్పటికీ కలగానే ఉంది!కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న చందనను వదులుకోవడానికి గురుకుల పాఠశాల వారు ఇష్టపడలేదు. ఆమె వేరేచోట చదువుతున్నా తమ స్కూల్ తరఫున పోటీలకు పంపడం ప్రారంభించారు. గత నెల గోవాలో జరిగిన అండర్ 18, వరల్డ్‌కప్ చాంపియన్ షిప్లో చందన పాల్గొంది. తొలిరౌండ్లో కర్ణాటక అమ్మాయిపై గెలిచింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్రికా, చైనాలకు చెందిన అమ్మాయిలపై విజయం సాధించింది. ‘గోవాకు వెళ్లేప్పటికి నాకు తెలుగు తప్ప మరో భాష రాదు. అక్కడంతా బాగా పాష్‌గా కనిపించడంతో కొంత తడబడ్డాను. ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయలేదు. దీంతో నేషనల్, ఇంటర్నేషనల్ చాంపియన్లతో పోటీపడి నెగ్గగలనా అని సందేహించాను. కర్ణాటక అమ్మాయితో త్వరగానే గేమ్ ముగిసింది. ఆ తర్వాత నాకంటే ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న ఆఫ్రికన్ అమ్మాయితో పోటీ పడ్డాను. ఇక్కడే నా పని అయిపోతుందనుకున్నా. గేమ్నే నమ్ముకుని గెలిచాను. చిన్నప్పటి నుంచి కరాటే అంటే చైనానే గుర్తుకు వస్తుంది. అలాంటిది చివరగా చైనా అమ్మాయిపై విజయం సాధించడం ఇప్పటికీ కలగానే ఉంది’ అంటుంది చందన.గోవా విజయంతో 2025 జనవరిలో మలేషియాలో జరగబోయే పోటీలకు అర్హత సాధించింది. కనే కల విజయాన్ని పరిచయం చేస్తుంది. ఆ విజయం ఎప్పుడూ మనతో చెలిమి చేయాలంటే ఆత్మవిశ్వాసం ఒక్కటే సరిపోదు. లక్ష్యసాధన కోసం బాగా కష్టపడే గుణం కూడా ఉండాలి. కొండపల్లి చందనలో ఆ గుణం కొండంత ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.అదే నా లక్ష్యంనాన్నకు కరాటే అంటేప్రాణం. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. ఆయనకు ఎన్నో కలలు ఉండేవి. స్కూల్లో నేను కరాటే బాగాప్రాక్టీస్ చేస్తున్నానని ఎవరో చెబితే నాన్న ఎంతో సంతోషించారు. దీంతో మరింత ఇష్టం, పట్టుదలతో కరాటే సాధన చేశాను. ‘ఆడపిల్లకు కరాటేలు ఎందుకు! చక్కగా చదివించక’ అంటుండేవారు ఇరుగు ΄పొగురు, బంధువులు. అయితే వారి మాటలతో అమ్మానాన్నలు ప్రభావితం కాలేదు. అమ్మ శారద నా వెన్నంటే నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తేవాలన్నదే నా లక్ష్యం. అయితే ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. చేయూత అందిస్తే నా ప్రయాణం సులువు అవుతుంది.– చందన– కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఫొటోలు : యాసారపు యాకయ్య -
కరాటే మాన్సూన్ క్యాంప్‌లో.. గోవింద్ ప్రతిభ!
పోచారం: జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 18 వరకూ 16వ జాతీయ మాన్సూన్ క్యాంప్‌ను చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్ నగరంలో నిర్వహించారు. క్యాంపులో ముఖ్య అతిథిగా జపాన్ హెడ్ క్వార్టర్స్ నుండి మాస్టర్ షిహాన్ తుకుయ తనియమ, ఇండియన్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ షహన్ ఆనంద రత్న, తెలంగాణ రాష్ట్ర చీఫ్ రాపోలు సుదర్శన్ పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్పోర్ట్స్ కరాటే అకాడమీ తరపున పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడకు చెందిన గుగులోత్ గోవింద్ నాయక్ హాజరయ్యారు.ఈ శిబిరంలో తకుయ తనియమ చేతులమీదుగా ఇంటర్నేషనల్ టెక్నికల్ లైసెన్స్డ్ ఎగ్జామినర్ సరి్టఫికెట్‌ను గోవింద్ నాయక్ అందుకున్నారు. కోర్సు సిలబస్‌ను పూర్తిచేయడంతో పాటు అద్భుతమైన కరాటే నైపుణ్యాలను గోవింద్ ప్రదర్శించి అతిథుల ప్రశంసలు పొందారు. సమాజంలో చోటుచేసుకునే అరాచకాల నుండి రక్షించుకోవడానికి కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోవింద్ అన్నారు. తల్లిదండ్రులు ఆడబిడ్డలకు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి యుద్ధ విద్యలు నేరి్పంచాలన్నారు. -
24, 25 తేదీల్లో తెలంగాణ అండర్–19 చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఈనెల 24, 25వ తేదీల్లో రాష్ట్ర అండర్–19 జూనియర్ చాంపియన్‌షిప్ జరగనుంది. కూకట్పల్లి ప్రగతినగర్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. జనవరి 1, 2005న లేదా ఆ తర్వాత పుట్టిన వారు మాత్రమే ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. బాలబాలికల విభాగాల్లో వేర్వేరుగా గేమ్‌లు నిర్వహిస్తారు. బాలికల విభాగంలో టాప్–4లో నిలిచిన ప్లేయర్లు... బాలుర విభాగంలో టాప్–7లో నిలిచిన ప్లేయర్లు జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని టీఎస్‌సీఏ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ టోర్నీలో ఆడాలనుకునే వారు తమ పేర్లను 7337578899, 7337399299 నంబర్లలో నమోదు చేసుకోవాలి. 25, 26 తేదీల్లో తెలంగాణ యూత్ బాస్కెట్‌బాల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం, మహబూబ్‌నగర్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యూత్ అంతర్ జిల్లా చాంపియన్‌షిప్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 25, 26వ తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో ఈ టోర్నీని నిర్వహిస్తారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోరీ్నలో మొత్తం 17 జిల్లా జట్లు పాల్గొంటున్నాయి.ఈ టోర్నీలో రాణించిన క్రీడాకారులను జాతీయ యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ బాస్కెట్‌బాల్ జట్టులోకి ఎంపిక చేస్తామని తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ నార్మన్ ఐజాక్ తెలిపారు. జాతీయ యూత్ చాంపియన్‌షిప్ పశ్చిమ బెంగాల్లో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరుగుతుంది. గత ఏడాది సూర్యాపేటలో జరిగిన తెలంగాణ యూత్ అంతర్జిల్లా చాంపియన్íÙప్లో మేడ్చల్ మల్కాజిగిరి జట్లు బాలబాలికల విభాగాల్లో విజేతగా నిలిచాయి. కరాటే కుర్రాళ్ల కిక్ అదిరింది సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఆల్ స్టయిల్స్ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాళ్లు అదరగొట్టారు. టైగర్ కుంగ్ ఫూ అకాడమీ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. వివిధ విభాగాల పతక విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. స్వర్ణ పతకాలు: ఈథన్ రాజ్ (అండర్–12 కటా), దక్ష్ (అండర్–8 కటా). రజత పతకాలు: అంకిత (అండర్–10 కటా), సాయాంశ్ (అండర్–12 కటా), కావ్యాంశ్ (అండర్–8 కటా). కాంస్య పతకాలు: అమైర్ (అండర్–8 కటా), కిరణ్య (అండర్–8 కటా), అహ్మద్ (అండర్–6 కటా), శ్రవణ్ (అండర్–12 కటా), నిగ్నేశ్ (అండర్–6 కటా), మాన్విత (అండర్–6 కటా), సాధ్విత (అండర్–12 కటా), కరణ్‌నాథ్ (అండర్–13 కటా). చాంపియన్స్ వృత్తి, సుహాస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ అంతర్ జిల్లా స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో అంతర్జాతీయ స్విమ్మర్ వృత్తి అగర్వాల్, పురుషుల విభాగంలో సుహాస్ ప్రీతమ్ చాంపియన్స్‌గా నిలిచారు. సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ టోర్నీలో వృత్తి నాలుగు ఈవెంట్లలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన వృత్తి 200, 400, 800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన మైలారి సుహాస్ ప్రీతమ్ 50, 100, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్స్‌తోపాటు 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్స్‌లో విజేతగా నిలిచాడు. తెలంగాణ స్విమ్మింగ్ సంఘం సెక్రటరీ జి.ఉమేశ్, జీహెచ్ఎంసీ ఏడీఎస్ శ్రీనివాస్ గౌడ్, వెంకట్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. -
Ishita Sharma: మేమే మా ధైర్యం!
ముంబై జూహూ గ్రౌండ్స్‌లో విమెన్స్ డే సందర్భంగా 1500 మంది ఆడపిల్లలు కరాటేలో తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. వీళ్లంతా ఎవరో చదవండి... ‘మన దేశంలో 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలు రెండున్నర కోట్ల మంది ఉన్నారు. వీరు స్కూల్లో సైన్సు నేర్చుకున్నట్టు లెక్కలు నేర్చుకున్నట్టు ఆత్మరక్షణ ఎందుకు నేర్చుకోరు? ఎందుకు నేర్పించరు?’ అని అడుగుతుంది ఇషితా శర్మ. ముంబైలో డాన్స్ స్కూల్‌ను నడిపే ఇషితా శర్మ ఐదేళ్ల క్రితం ఒకరోజు రాత్రి కారులో వెళుతుంటే కొంతమంది పోకిరి కుర్రాళ్లు ఆమెను ఫాలో అయ్యారు. ముందామెకు ఏం చేయాలో తోచలేదు. భయపడింది. కాని చివరకు ధైర్యం కూడగట్టుకుని అద్దం దించి పెద్దగా అరిచింది. అంతే. వాళ్లు పారిపోయారు. ‘ఇంత వయసు వచ్చిన నేనే ఇలా భయపడ్డాను. చిన్నపిల్లలు ఎంత భయపడిపోతారో అనే ఆలోచన నాకు వచ్చింది’ అంటుందామె. ఈ ఆలోచన నుంచే ‘ముక్కా మార్’ ఆవిర్భవించింది. 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలకు కరాటే, కుంగ్ ఫూ వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని అనుకుంది ఇషిత. తనకు తెలిసిన ఒక కరాటే మాస్టర్ని సహాయం అడిగింది. అతను అంగీకరించాడు. ముంబైలోని వెర్సోవా బీచ్‌లో ఐదుమంది ఆడపిల్లలతో 2018లో ‘ముక్కా మార్’ (దెబ్బ కొట్టు) కార్యక్రమం మొదలైంది. అయిదు పది, పది వంద అవడానికి ఎంతో సమయం పట్టలేదు. దేహం, గళం, బుద్ధి ‘ఆడపిల్లలు మగవాళ్ల కంటే బలహీనులు అనే భావనతోనే పెంచుతారు. అబ్బాయిలను మగాడిలా పోరాడు అంటారు. మేము– ఆడపిల్లను ఆడపిల్లలా పోరాడు అని చెబుతాం. ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాదు అని చెబుతాం. మన పెంపకంలో ఆడపిల్లకు ఏ అన్యాయం జరిగినా ఊరికే ఉండు, సహించు అనే బోధిస్తారు. మేము ఎదిరించు, నీ గళం వినిపించు, బుద్ధిని ఉపయోగించు అని చెబుతాం. ముఖ్యంగా హింసను ఎదిరించాలంటే ఈ మూడు తప్పవు’ అంటుంది ఇషిత. ‘ముక్కా మార్ శిక్షణలో చేరాక ఏదైనా ప్రమాదం వస్తే పెద్దగా అరిచి ప్రతిఘటించాలని, తర్వాత బుద్ధిని ఉపయోగించి అక్కడి నుంచి బయటపడాలని ఆ రెండూ సాధ్యం కాకపోతే శారీరకంగా తలపడి పోరాడాలని మాకు తెలిసొచ్చింది’ అని ఒక అమ్మాయి అంది. 1100 స్కూళ్లలో ‘ముక్కా మార్’ శిక్షణ అవసరం మహరాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఎం.సి.జి.ఎం (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై) పరిధిలోని 1100 పైగా స్కూళ్లలో ‘ముక్కా మార్’ కార్యకర్తలను వారానికి రెండు రోజులు ఆత్మరక్షణ విద్యలు నేర్పేందుకు ప్రోత్సహించింది. 6,7,8 తరగతులు విద్యార్థినులకు స్కూళ్లలో వారానికి రెండు రోజులు కరాటే, కుంగ్ ఫు, కుస్తీ క్లాసులు నేర్పిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ ద్వారా అంటే వాట్సప్ చాట్‌బోట్ ద్వారా క్లాసులు కొనసాగాయి. ఈ క్లాసులు దేశంలోని ఏ ప్రాంతం ఆడపిల్లలైనా నేర్చుకోవచ్చు. ఇప్పటికి ‘ముక్కా మార్’ ద్వారా 5 వేల మంది ఆడపిల్లలు నేరుగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకున్నారు. ఆన్లైన్ ద్వారా 16 వేల మంది అమ్మాయిలు నేర్చుకున్నారు. దాదాపు 300 మంది మహిళా టీచర్లకు శిక్షణ ఇవ్వడం వల్ల ఆ టీచర్ల ద్వారా 50 వేల మంది ఆడపిల్లల వరకూ నేర్చుకుంటున్నారు. మన సమాజంలో రోజురోజుకూ ఆడపిల్లల మీద హింస, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. అయితే వాటికి భయపడి ఆడపిల్లను ఇంట దాచడం అంటే వారి భవిష్యత్తును నాశనం చేయడమేనని అంటుంది ఇషితా శర్మ. ‘వారు ధైర్యంగా సమాజంలో తిరగాలి. ప్రమాదం ఎదురైతే ఎదిరించేలా ఉండాలి. ఆత్మరక్షణ విద్యలు నేర్పడం ద్వారా మాత్రమే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి భయం పోతుంది’ అంటుందామె. నిజంగానే ప్రతి స్కూల్లో మేథ్స్ టీచర్, సైన్స్ టీచర్ ఉన్నట్టుగా ఆడపిల్లల కోసం ఒక కరాటే టీచర్ ఉండాలని ఈ విమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. -
కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర కుర్రాడికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ఎ.కార్తీక్ రెడ్డి స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లో కార్తీక్ రెడ్డి క్యాడెట్ బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో విజేతగా నిలిచాడు. జారాలాంపౌస్ (సైప్రస్) రజతం, హారిసన్ లుకాస్ (స్కాట్లాండ్), జేకబ్ కట్లర్ (ఇంగ్లండ్) కాంస్య పతకాలు గెలిచారు. -
Self Defence: ఆగంతకుడు ఎదురుగా ఉంటే... వెనుక నుంచి వస్తే ఏం చేయాలి?
గాంధీజీ ఆకాంక్ష ఇది. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిరోడ్డు మీద ధైర్యంగా సంచరించగలిగిన రోజు మనదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు... అని ఆకాంక్షించాడు బాపూజీ. అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణం చేయడానికి స్త్రీ ధైర్యం చేస్తోంది. కానీ సంస్కారం లోపిస్తున్నది మగవాళ్లలోనే. అయితే మహిళ ఒకప్పటిలాగా ఉండడం లేదు. ఆకతాయి మగవాళ్లు ఏడిపిస్తారని ముడుచుకు పోవడం లేదు. ఏడిపించిన వాళ్ల దేహశుద్ధి చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇందుకు నిదర్శనం ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎయిర్‌పోర్టు ఉద్యోగి ఉదంతమే. ఆమె డ్యూటీ ముగించుకుని రాత్రి పూట ఇంటికి వెళ్తోంది. ఓ యువకుడు ఆమె బైక్‌ను ఆపాడు. అతడి దుర్మార్గపు ఆలోచనను కని పెట్టింది. అయితే ఆమె భయంతో బిగుసుకుపోలేదు, పారిపోయే ప్రయత్నమూ చేయలేదు. రోడ్డు పక్కన ఉన్న కర్ర తీసుకుని ఆ యువకుడిని చితక్కొట్టింది. ‘ఆడపిల్ల అంటే ఇలా ఉండాల’ని సమాజం నుంచి ప్రశంసలందుకుంటోంది. ‘ఆడపిల్ల ఒద్దికగా తల వంచుకుని వెళ్లాలి’ అనే కాలదోషం పట్టిన సూక్తిని తిరగరాసింది. ఈ ఆధునిక సమాజంలో మనగలగాలంటే ఆడపిల్ల ఎలా ఉండాలో... చెప్పడానికి తానే రోల్‌మోడల్‌గా నిలిచింది. మగవాడు సాహసం చేస్తే హీరో, మహిళ సాహసం చేస్తే షీరో. ‘‘ప్రతి ఒక్క బాలిక, మహిళ స్వీయ రక్షణ చిట్కాలను నేర్చుకుని తీరాలి. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌కి చాలా శక్తి కావాలని, ఆడపిల్లలు ఈ ప్రాక్టీస్ చేస్తుంటే లాలిత్యాన్ని కోల్పోతారనేది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా ఉండాల్సిన ఫిట్నెస్ చాలు. ఈ ప్రాక్టీస్‌తో దేహం శక్తిమంతం అవుతూ, ఫ్లెక్సిబుల్‌గానూ ఉంటుంది. నిజానికి ప్రమాదం ఎదురైనప్పుడు స్పందించాల్సింది మెదడు. ఈ ప్రాక్టీస్‌తో మెదడు చురుగ్గా ఉంటుంది. దాంతో తక్షణమే అప్రమత్తమై మెళకువలతో వేగంగా స్పందిస్తుంది. నైట్‌షిఫ్ట్‌లు, డ్యూటీలో భాగంగా బయట ప్రదేశాలకు వెళ్లాల్సిన వాళ్లు తప్పనిసరిగా స్వీయరక్షణ పద్ధతులు నేర్చుకుని తీరాలి. మనలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే... ఏదైనా సాధించగలమనే ధైర్యం కూడా వస్తుంది. ఇవి ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ప్రాక్టీస్‌తో తమ మీద తమకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది, అది ధైర్యానికి కారణమవుతుంది. ఆ ధైర్యం కెరీర్ ఉన్నతికి దోహదం చేస్తుంది. గన్నవరం అమ్మాయిని ప్రతి ఒక్కరూ అభినందించి తీరాలి. ఆమె స్ఫూర్తితో మరికొంత మంది ప్రతికూల పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన గలుగుతారు’’ అన్నారు కరాటే చాంపియన్ సైదా ఫలక్. ఆమె తెలంగాణలో స్కూళ్లలో బాలికలకు స్వీయరక్షణ నేర్పిస్తున్నారు. పక్షులు, జంతువులు... స్త్రీపురుష భేదం లేకుండా వేటికవి తనను తాను రక్షించుకుంటాయి. మనిషికెందుకు ఈ తేడా? సమాజం విధించిన పరిధిలో కుంచించుకుపోవడం వల్లనే స్త్రీ బాధితురాలిగా మిగులుతోంది. అంతేతప్ప స్త్రీలో తనను తాను రక్షించుకోగలిగిన శక్తి లేక కాదు. దేహదారుఢ్యంలో పురుషుడికి సమానం కాకపోవచ్చు. కానీ తనను తాను పురుషుడికి దీటుగా తీర్చిదిద్దుకోవడంలో మాత్రం వెనుకబాటుతనం ఉండదు. సమాజం గీసిన అసమానత్వపు గిరిగీతను చెరిపేయడం మొదలుపెట్టింది మహిళ. ఇప్పటికే అనేక స్కూళ్ల నుంచి స్వీయరక్షణలో శిక్షణ పొందిన తరం బయటకు వచ్చింది. ఈ దారిలో మరికొంత మంది నడిచి తీరుతారు. గాంధీజీ కలలు కన్న సంపూర్ణ స్వాతంత్య్రం కోసం మహిళలు నిశ్శబ్దంగా ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఫలాలు సమీప భవిష్యత్తులోనే అందుతాయనడంలో సందేహం లేదు. ధైర్యం... ఆరోగ్యం! నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా స్కూల్లో తైక్వాండో క్లాసులు పెట్టారు. అప్పటినుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాలుగుసార్లు నేషనల్స్‌లో పాల్గొన్నాను. ప్రాక్టీస్‌కి ముందు తర్వాత తేడా నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. మా నాన్న లేరు. అక్క, అమ్మ, నేను. బయట పనులు చక్కబెట్టుకుని రాగలిగిన ధైర్యం వచ్చింది. ‘ఆడపిల్ల కాబట్టి’ అని జాగ్రత్తలు నేర్పించే వయసులో మా అమ్మ నాకు తైక్వాండో నేర్చుకునే అవకాశం ఇచ్చింది. అమ్మాయిలకు నేను చెప్పేదేమిటంటే... ఈ ప్రాక్టీస్ వల్ల ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిన కారణంగా ఎదురవుతున్న అనేక అనారోగ్యాల నుంచి కూడా దూరంగా ఉండగలుగుతాం. – కంభంపాటి లలితాకీర్తన, బీటెక్ స్టూడెంట్, కర్నూలు నన్ను నేను రక్షించుకోగలను! తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్, థర్డ్ డాన్ లెవెల్‌కు చేరాను. రాయలసీమలో ఈ స్థాయిని చేరుకున్న అమ్మాయిని నేను మాత్రమే. ఔరంగాబాద్‌లో జరిగిన నేషనల్స్‌లో మొదటి స్థానం నాది. దీనిని స్పోర్ట్‌గా చూడండి, మార్షల్ ఆర్ట్‌గా చూడండి. కానీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మరువద్దు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అమ్మాయిలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం సాధ్యం కాదు. అర్ధరాత్రి డ్యూటీ చేయలేమంటే కుదరదు. అంతేకాదు... విలువలు పతనమవుతున్నాయి కూడా. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ మెళకువలు నేర్చుకోవాల్సిందే. అప్పుడే ఏ పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలననే ఆత్మవిశ్వాసం వస్తుంది. మహిళలు కూడా ఈ వయసులో ఇంకేం నేర్చుకుంటాం అనుకోకూడదు. కనీసంగా కొన్ని టెక్నిక్లనైనా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే ‘నన్ను నేను రక్షించుకోగలను’ అనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే ముందుకు నడిపిస్తుంది. – జి. కెహితీ, కుకివోన్ తైక్వాండో నేషనల్ చాంపియన్, ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ నేర్పిస్తూనే ఉన్నాను! తైక్వాండో నేర్పించడం నాకు వృత్తి మాత్రమే కాదు, సామాజిక బాధ్యతగా చేపట్టాను. ముప్పై ౖఏళ్లుగా ఐదువేల మందికి శిక్షణనిచ్చాను. ఈ యుద్ధవిద్యల్లో జపాన్ వాళ్లది కరాటే, చైనా వాళ్లది కుంగ్‌ఫూ, కొరియా వాళ్లది తైక్వాండో. మా అమ్మాయి పేరు కెహితి కూడా కొరియా పదమే. మా కొరియన్ మాస్టారి పట్ల గౌరవంతో ఆ పేరు పెట్టుకున్నాను. ఆడపిల్లల విషయానికి వస్తే ఈ మూడింటిలో తైక్వాండో అత్యుత్తమ స్వీయరక్షణ కళ. – జి. శోభన్‌బాబు, కుకివోన్ తైక్వాండో బ్లాక్‌బెల్ట్ సెవెన్త్ డాన్, వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆగంతకుడు ఎదురుగా ఉంటే... 1. హేమర్ స్ట్రైక్... చేతిలో ఉన్న వస్తువే ఆయుధం. బండి తాళం అయినా సరే. ఏమీ లేకపోతే చేతులే ఆయుధం. చేతిలో ఉన్న ఆయుధంతో సుత్తితో గోడకు మేకు కొట్టినట్లుగా ఆగంతకుడి ముఖం మీద దాడి చేయాలి. చేతిలో ఏమీ లేకపోతే పిడికిలి బిగించి దాడి చేయాలి. 2. గ్రోయిన్ కిక్... చేతులతో చేసిన దాడి సరిపోకపోతే కాళ్లకు పని చెప్పాలి. మోకాలి దెబ్బ ఆగంతకుడి కాళ్ల మధ్య తగలాలి. ఈ దాడితో చాలావరకు తాత్కాలికంగా దేహభాగం పక్షవాతం సోకినట్లు చచ్చుబడిపోతుంది. అతడు తేరుకునేలోపు పారిపోవచ్చు లేదా పోలీసులకు పట్టించవచ్చు. వెనుక నుంచి వస్తే... 1. ఆల్టర్నేటివ్ ఎల్బో స్ట్రైక్... ఇది ఆగంతకుడు వెనుక నుంచి దాడి చేసినప్పుడు ప్రయోగించాల్సిన టెక్నిక్. మోచేతిని భుజాల ఎత్తుకు లేపి దేహాన్ని తాడులా మెలితిప్పుతున్నట్లు తిరుగుతూ మోచేతితో ఆగంతకుడి ముఖం మీద దాడి చేయాలి. అతడు తేరుకునేలోపు వేగంగా మళ్లీ మళ్లీ దాడి చేయాలి. మోచేతితో దాడి చేస్తున్నప్పుడు పాదాన్ని దేహ కదలికకు అనుగుణంగా గాల్లోకి లేపి, దేహం బరువును మునివేళ్ల మీద మోపాలి. అప్పుడే మోచేతి అటాక్ సమర్థంగా ఉంటుంది. 2. ఎస్కేప్ ఫ్రమ్ ఎ ‘బేర్ హగ్ అటాక్’ ... ఆగంతకుడు వెనుక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి కౌగిలించుకున్నప్పుడు తప్పించుకునే మార్గం ఇది. రెండు మోచేతులను గాల్లోకి లేపి ఒకదాని తర్వాత మరో మోచేతితో ఆగంతకుడి ముఖం, దవడల మీద దాడి చేయాలి. అప్పుడు అతడి చేతులు వదులవుతాయి. అప్పుడు ఎదురుగా తిరిగి అరచేతిని చాకులాగ చేసి మెడ మీద కర్రతో కొట్టినట్లు దాడి చేయాలి. వెంటనే పిడికిలి బిగించి మెడ మీద గుద్దుతూ మరో చేతిని మెడ మీద వేసి అతడిని కిందపడేయాలి. దేహం మీద రకరకాలుగా దాడి చేసి శత్రువును నిర్వీర్యం చేయవచ్చు. నూటికి 81 శాతం మహిళలు జీవితంలో ఒక్కసారైనా లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు యూఎస్‌లో ఓ సర్వేలో తెలిసింది. మహిళల రక్షణ కోసం యూనివర్సిటీ ఆఫ్ ఓరేగాన్ సూచించిన కొన్ని స్వీయరక్షణ పద్ధతులివి. – వాకా మంజులారెడ్డి -
కరాటే క్వీన్స్: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్ కిడ్
‘నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టాలంటే ఆడపిల్లలకు కరాటే ఎంతో దోహదపడుతుంది. మా అమ్మానాన్నలు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు మేం భయపడ్డాం. శిక్షణ పొందాక ఆ గొప్పతనం తెలిసింది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు కరాటే నేర్పించాలి.’ – కరాటే విజేతలు అగనంపూడి(గాజువాక): ఆత్మస్థైర్యం, స్వీయరక్షణతోపాటు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు బాలికలు కరాటేను ఎంచుకుని.. నిరంతర సాధన చేశారు. చదువుతో పాటు కరాటేలో శిక్షణ పొందుతూ.. సరిలేరు మాకెవ్వరూ అంటూ పతకాలు పంట పండిస్తున్నారు. వీరే కూర్మన్నపాలెం, దువ్వాడ, రాజీవ్‌నగర్ ప్రాంతాలకు చెందిన బాలికలు. వేపగుంటకు చెందిన చాంపియన్స్ కరాటే డోజో సారథ్యంలో జాతీయ కోచ్, బ్లాక్ బెల్ట్ ఫిప్త్ డాన్, జపాన్ కరాటే షోటోకై వి.ఎన్.డి.ప్రవీణ్‌కుమార్ పర్యవేక్షణలో వీరంతా శిక్షణ పొందుతున్నారు. వీరికి గంటా కనకారావు మెమోరియల్ సంస్థ సాయం అందిస్తోంది. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకం అందుకుంటున్న మృదుల, హీరో సుమన్ నుంచి పసిడి పతకం అందుకుంటున్న రేష్మా వండర్ కిడ్..రేష్మా చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో తన పంచ్‌లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే వండర్ కిడ్.. పసిడి పతకాల పంట పండిస్తోంది పేడాడ రేష్మా. కూర్మన్నపాలెం సమీపంలోని మాతృశ్రీ లే అవుట్లో నివాసముంటున్న రేష్మా ఉక్కునగరంలోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. 2019 నుంచి కరాటేలో శిక్షణ పొందుతోంది. ఇప్పటి వరకు రేష్మా తన పంచ్‌లతో రాష్ట్ర, జాతీయస్థాయిలో 8 బంగారు, 7 రజత, రెండు కాంస్య పతకాలు సాధించి ఈ ప్రాంత ప్రతిష్టను ఇనుమడింపజేసింది. తండ్రి పి.వరహాలరావు ఇండియన్ ఆర్మీ విశ్రాంత ఉద్యోగి. తల్లి ధనలక్ష్మి గృహిణి. అంతర్జాతీయ స్థాయిలో పసిడి పతకం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నదే ఆమె లక్ష్యం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు కోచ్‌లు ఆమెను ప్రోత్సహిస్తున్నారు. చదవండి👉🏾 మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత మృదుల.. పతకాల వరద దువ్వాడ విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం.మృదుల కరాటేలో 2018 నుంచి శిక్షణ పొందుతోంది. చిన్నప్పటి నుంచి కరాటేపై ఆసక్తి పెంచుకున్న మృదుల ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 26 పసిడి పతకాలు, 6 రజతం, 7 కాంస్య పతకాలు సాధించి.. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులకు తన పవర్ చూపించింది. తండ్రి ఎం.సుధాకర్ ప్రైవేట్ కర్మాగారంలో పనిచేస్తుండగా.. తల్లి పద్మజ గృహిణి. మృదులను ఆది నుంచి ప్రోత్సహిస్తుండడంతో మెరుపు పంచ్‌లతో పతకాల వేట సాగిస్తోంది. కరాటేలో ప్రపంచ చాంపియన్‌గా నిలవాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. జాతీయ కోచ్ చేతుల మీదుగా పసిడి పతకం అందుకుంటున్న లిఖిత చరిత్రలో ఓ పేజీ లిఖించుకుంది నేటి సమాజంలో బాలికలు, మహిళల ఆత్మ రక్షణకు కరాటే ఒక ఆయుధం అని భావించే టి.లిఖిత ఎన్ఏడీ కొత్తరోడ్డులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే కరాటేలో రాణిస్తోంది. చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని పంచ్ విసిరితే పతకం వచ్చి తీరాల్సిందే. లిఖిత ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 33 బంగారు పతకాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు తన ఖాతాలో జమచేసుకుంది. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నది ఆమె లక్ష్యం. ఆమె తండ్రి వెంకట మహేష్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి గృహిణి. వీరిద్దరితోపాటు కోచ్‌లు కూడా తనకు ఆది నుంచి వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని లిఖిత తెలిపింది. చదవండి👉 బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన సాయి కీర్తనకు పతకం అందిస్తున్న నిర్వాహకులు ‘కీర్తి’ ప్రతిష్టలు పెంచేలా.. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సీహెచ్ వేద సాయి కీర్తన.. కుటుంబంతో నిర్వాసితకాలనీలో నివాసం ఉంటోంది. 2018 నుంచి డోజో ఇన్స్టిట్యూట్లో కరాటే శిక్షణ కొనసాగిస్తోంది. సమాజంలో మహిళలు పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులను ఎదుర్కొడానికి కరాటే ఒక్కటే శరణ్యమని భావించి.. దానిపై ఇష్టం పెంచుకుంది. స్వీయ రక్షణతో పాటు కరాటేలో ఉత్తమ ప్రదర్శనతో విశ్వవిఖ్యాతగా నిలవాలన్నది ఆమె లక్ష్యం. ఇప్పటి వరకు 15 బంగారు, మూడు రజతం, 9 కాంస్య పతకాలతో మెరుపులు మెరిపించింది. తండ్రి సీహెచ్.రమేష్ ప్రైవేట్ ఉద్యోగి. తల్లి అర్చనా దేవి స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. చదవండి👉🏻 వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’ -
కార్తీక్ రెడ్డికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: యూఎస్ఏ ఓపెన్ అంతర్జాతీయ కరాటే టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ఎ.కార్తీక్ రెడ్డి స్వర్ణ పతకం సాధించాడు. అమెరికాలో జరిగిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన కార్తీక్ అండర్–13 బాలుర కుమిటే టీమ్ విభాగంలో పసిడి పతకాన్ని నెగ్గాడు. 40 దేశాల నుంచి 300కు పైగా క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా... -
మన చందు ‘బంగారం’
సాక్షి, బచ్చన్నపేట(వరంగల్): ప్రతిభకు పేదరికం అడ్డురాదు. లక్ష్యం.. పట్టుదలకు కఠోర దీక్ష తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం అంజయ్యనగర్‌కు చెందిన బొలుగుల చందు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఐదో ఇంటర్నేషనల్ యూత్ నేపాల్ హీరో కప్ (అండర్–19) కరాటే కుంగ్ ఫూ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించాడు. తండ్రి ఆటో డ్రైవర్.. తల్లి కంకుల విక్రయం బొలుగుల యాదగిరి, సునీత దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు చందు. నిరుపేద కుటుంబానికి చెందిన యాదగిరి రోజూ ఆటో నడుపుతుండగా.. భార్య సునీత మొక్కజొన్న కంకులు విక్రయించి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చందు 5వ తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మండల కేంద్రంలో చదువుకున్నాడు. ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేటలో డిగ్రీ ఫస్టియర్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్న చందు ఎనిమిదవ ఏట కరాటే కుంగ్‌ఫూ నేర్చుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన దొడ్డి శ్రీనివాస్ మాస్టర్ బచ్చన్నపేటకు వచ్చి కుంగ్‌ఫూ నేర్పించేవారు. దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించేలా.. ఇంటర్నేషనల్ యూత్ నేపాల్ హీరో కప్ కుంగ్‌ఫూ పోటీల్లో 14 దేశాలు పాల్గొనగా.. భారతదేశం నుంచి బొలుగుల చందు బరిలోకి దిగాడు. పలు దేశాల క్రీడాకారులతో తలపడి విజయం సాధించిన చందు ఫైనల్స్‌లో కొరియా ప్లేయర్‌పై 5–4 తేడాతో అద్భుత విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన తొలిరౌండ్లో భూటాన్‌పై 5–3, సెమీ ఫైనల్లో నేపాల్ ప్లేయర్‌పై 5–3 తేడాతో విజయాలను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించిన చందు పసిడి పతకం దక్కించుకున్నాడు. దాతల సాయంతో నేపాల్‌కు.. ఫైనల్ పోటీలకు ఎంపికైన చందు నేపాల్‌కు వెళ్లడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. కనీసం రవాణా చార్జీలకు సైతం చేతిలో డబ్బులు లేకపోవడంతో మండల కేంద్రానికి చెందిన పలువురు దాతలు, అలాగే మంత్రి కేటీఆర్ సహాయంతో నేపాల్ వెళ్లాడు. అంతర్జాతీయ స్థాయిలో ఓ మెరుపు మెరిసిన చందును ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. -
28 అంతర్జాతీయ రికార్డుల ‘సాహసపుత్రుడు’
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): చిన్నతనంలో స్నేహితులతో తరుచూ దెబ్బతినే చిన్నారిని ఆత్మస్థైర్యం కోసం కరాటే శిక్షణకు పంపింది తల్లి ఖాజాబీ. ఆ బాలుడు నేడు ఏకంగా 28 అంతర్జాతీయ కరాటే రికార్డులను సొంతం చేసుకున్నాడు. బాల్యం నుంచి క్రమం తప్పని సాధనతో పలువురికి స్పూర్తిదాయకంగా నిలిచాడు. అతనే కరాటే మాస్టర్ ఇబ్రహిం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లిలో వెల్డింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న షేక్ మహబూబ్, ఖాజాబీల కుమారుడు షేక్ ఇబ్రహిం. చిన్నతనంలో ఆడుకునేటప్పుడు స్నేహితులతో గొడవలు, దెబ్బతిని ఇంటికి రావడం చూసి తల్లి ఖాజాబీ తట్టుకోలేకపోయింది. ధైర్యం నింపేందుకు కరాటే మాస్టర్ వద్ద చేర్చింది. నిరంతరం సాధనతో ఇబ్రహింలో ధైర్యంతో పాటు కరాటే పట్ల ఆసక్తి పెరిగింది. ప్రదర్శనలిస్తూ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో 28 రికార్డులను సొంతం చేసుకున్నాడు. శ్రీలంక, నేపాల్‌లో ప్రదర్శనలు ఇచ్చాడు. తాను ప్రదర్శించడమే కాకుండా తాను శిక్షణనిచ్చిన వందలాదిమంది శిష్యులతో కలిపి భారీ కరాటే ప్రదర్శన ఇవ్వడం ఇతని ప్రత్యేకత. చిన్నప్పుడు ఆత్మస్థైర్యం కోసం మొదలైన కరాటే ప్రస్థానం రికార్డుల పరంపర సాగిస్తుంది. కరాటే విద్యే చిన్నారులకు నేర్పుతూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ.... ఇబ్రహిం జీవనం సాగడం విశేషం. 2016 నుంచి ప్రారంభమైన రికార్డుల ప్రదర్శనలు 2020కి వచ్చేసరికి కరాటేలోని వివిధ రకాల విన్యాసాలతో ప్రదర్శనలతో సాధించిన పలు రికార్డులు.. 666 మందితో కటా ప్రదర్శన చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు (2016) 5220 మందితో కరాటే ప్రదర్శన (2017) 4250 మందితో కరాటే ప్రదర్శన లిమ్కా బుక్ఆఫ్ రికార్డు (2017) 600 మందితో కలాం వరల్డ్ రికార్డు (2018) 60 మందితో మెరాకిల్ వరల్డ్ రికార్డు (2018) ఆర్‌హెచ్ వరల్డ్ రికార్డు (2018) ఏఎస్ఎస్ వరల్డ్ రికార్డు ( ఒక్క నిమిషంలో మోచేత్తో 195 స్టిక్‌లను బల్లమీద కొట్టడం (2019) ఒక్క నిమిషంలో 60 మంది 2లక్షల 15 పంచ్‌లు (2019) రియల్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డు (2019) సాహసపుత్ర రికార్డు (2019) యూనివర్శల్ రికార్డు (2019) ఎక్స్‌లెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (2020) వజ్రా వరల్డ్ రికార్డు (2020) అఫిషియల్ వరల్డ్ రికార్డు (2020) లిమ్కా బుక్ఆఫ్ రికార్డు (2020) గిన్నిస్‌బుక్ అటెంప్ట్ – (2020) గిన్నిస్ రికార్డు ఎల్బో స్ట్రైకింగ్స్ (2020) కలామ్స్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డు (2021) -
నాటి ప్రపంచ ఛాంపియన్.. నేడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు
ఆగ్రా: పాతికేళ్లు కూడా నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించి, కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హరిఓమ్ శుక్లా.. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచ ఖ్యాతి గాంచిన శుక్లా.. నేడు కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డెక్కాడు. దేశ, విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో పతకాలు సాధించిన ఆయన.. ఇల్లు గడవని ధీన స్థితిలో కాలం వెల్లబుచ్చుతున్నాడు. 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరఫున స్వర్ణ పతకాన్ని సాధించిన శుక్లా.. ఆరేళ్ల ప్రాయంలోనే కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. అతనికి 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు. అయితే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో అతని ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీల్లో గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం అడుగంటి పోయింది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టినా ఫలితం లేకుండా పోయింది. రోజు రోజుకూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ టీ స్టాల్‌ను నడిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు వరకు స్కూల్ పిల్లలకు కరాటే పాఠాలు నేర్పిన శుక్లా.. ప్రస్తుతం ఛాయ్ వాలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా కారణంగా పిల్లలెవరూ క్లాసులకు హాజరు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీ స్టాల్ నడుపుతున్నాని అతను వాపోతున్నాడు. ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా.. ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని.. ఆ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా ఉద్యోగం చూసుకునే వాడినని అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు. చదవండి: బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్ బయటపడ్డాడు.. లేకపోతే..? -
ఎందుకు ప్రశ్నించరు.. ఎందుకు పోరాడరు?!
ఎందుకు ప్రశ్నించరు?! ఎందుకు పోరాడరు?! ఎందుకు కష్టపెట్టుకుంటారు?! ఎందుకు ఆధారపడతారు?! అపర్ణా రాజవత్‌కు చిన్నప్పడు అన్నీ సందేహాలే. ఆ ప్రశ్నలకు తానే సమాధానం వెతికింది. నైపుణ్యం సంపాదించడానికి తోడబుట్టిన అన్నలతోనే పోరాడింది. కరాటే నేర్చుకుంది. ఇప్పుడు ఈ నాలుగుపదుల వయసులో గత నాలుగేళ్లుగా లక్షాయాభైవేల మందికి ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తూ వచ్చారు అపర్ణ. లైంగిక అసమానత, హింసకు వ్యతిరేకంగా నిలిచే పోరాటంలో ఇతర మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ‘పింక్ బెల్డ్ మిషన్’ పేరుతో రెండువేల మంది సుశిక్షితులైన ట్రెయినర్లను కూడా అపర్ణ సిద్ధం చేశారు. అపర్ణ నేతృత్వం లోని ‘పింక్ బెల్ట్ మిషన్’ ఈ ఏడాది ఆగ్రాలో 7,401 మంది మహిళలతో ఆత్మరక్షణ శిక్షణ తరగతి నిర్వహించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. ‘‘నా తరవాతి లక్ష్యం ఇరవై లక్షల మంది బాలికలకు ఆత్మరక్షణ విద్య నేర్పడం. గృహ హింస బాధితుల కోసం హాస్టళ్ల నిర్వహణలో నిమగ్నమవ్వడం. న్యాయనిపుణులు, యాక్టివిస్టులు, కౌన్సెలర్లు వంటి నిపుణులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి మహిళల సమస్యలకు తగు పరిష్కారాలు అన్వేషించడం’’ అని తెలిపారు అపర్ణ. అబ్బాయిలతో పోటా పోటీగా! నోయిడాలో పుట్టి పెరిగిన అపర్ణ.. ‘‘నాది ఒక ప్రాంతం అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను భారతీయ మహిళను. ఈ సమైక్య భావనతో దేశీయంగా మా మిషన్ ద్వారా మహిళలకోసం చేసే కార్యక్రమాలు 12 రాష్ట్రాల్లో చురుగ్గా కొనసాగుతున్నాయి’’ అంటారు అపర్ణ. ఆ విధంగా ఆమె తన భారతీయతను కూడా చాటుతున్నారు. సంప్రదాయ రాజ్‌పుత్ కుటుంబంలో ఐదుగురు తోబొట్టువులలో ఒకరుగా పుట్టిన అపర్ణకు ఇద్దరు అన్నలు ఉన్నారు. ‘‘ప్రతీదానికి అడ్డుగా నిలబడేవారు. వారితో శారీరక హింసలను కూడా భరించాల్సి వచ్చింది. నన్ను నేను రక్షించుకునే ఏకైక మార్గం నా అంతఃశక్తి అని నాకు ఆ వయసులోనే అర్థమైంది. నా వయసు అమ్మాయిలు బొమ్మలతో ఆడుకుంటుంటే నేను కరాటే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ క్లాసుల్లో అంతా అబ్బాయిలే ఉన్నారని గమనించిన తరువాత, మా అమ్మను అడిగాను నేనూ ఆ తరగతిలో చేరుతాను అని. నా ఉత్సాహాన్ని చూసి, ఎట్టకేలకు మా అమ్మ అంగీకరించింది’ అన్నారు అపర్ణ. తొమ్మిదో తరగతి చదివే సమయానికి బ్లాక్ బెల్ట్ సంపాదించారు ఆమె. అంతటితో ఊరుకోలేదు తన చుట్టూ ఉన్న మహిళలకు మార్షల్ ఆర్ట్స్ బోధించడం ప్రారంభించారు. కరాటేలో 13 జాతీయ స్థాయి టైటిళ్లను గెలుచుకున్న అపర్ణ, జాతీయ ఛాంపియన్షిప్, రెండుసార్లు దక్షిణాసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో రజత పతక విజేతగా నిలిచారు. అనుకోకుండా ఒక ప్రమాదానికి గురై ఆసియా కరాటే ఛాంపియ¯Œ షిప్లో పాల్గొనలేక పోయారు. దీంతో ఆమె తన శక్తిని శిక్షణకు మళ్లించాలని నిశ్చయించుకున్నారు. తరువాత ప్రపంచవ్యాప్త ప్రయాణాలకు టూర్ సూపర్వైజర్ గా మారారు. శక్తి సంకేతం పింక్ బెల్ట్ 2012 లో ఢిల్లీలో 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం, హత్య గురించి విన్నాక అపర్ణ స్థిమితంగా ఉండలేకపోయారు. ‘‘అమ్మాయిలపై జరిగే నేరాల గణాంకాలను అధ్యయనం చేశాను. ప్రతీ యేడాది మహిళలపై పెరుగుతున్న రకరకాల హింసల గురించి తెలుసుకున్నాను. ప్రపంచ దేశాల్లో భారతదేశం మహిళలకు ప్రమాదకరం అనే నిపుణుల నివేదికలను పరిశీలించాను. అప్పుడే, మహిళలకు మార్షల్ ఆర్ట్స్‌లో ఆత్మరక్షణకు శిక్షణ ఇవ్వాలని బలంగా అనుకున్నాను. నాలో ఉన్న వాగ్ధాటి సామర్థ్యాన్ని ఆసరాగా తీసుకున్నాను. పూర్తి సామర్థ్యంతో 2016లో ‘పింక్ బెల్ట్ మిషన్’ను ఏర్పాటు చేశాను. అమ్మాయిలను మా మిషన్ త్వరగానే ఆకట్టుకుంది. మొదట్లో అమ్మాయిలు పెద్ద సంఖ్యలో రాలేదు, కానీ మార్పే లక్ష్యంగా ముందుకు సాగాను’’ అని వివరించారు అపర్ణ. మార్షల్ ఆర్ట్స్ బోధనతో పాటు, మోటివేషనల్ స్పీకర్‌గానూ ఆమె రాణిస్తున్నారు. నైపుణ్యాల గుర్తింపు పింక్ బెల్ట్ మిషన్ ద్వారా మహిళలకు ఆత్మరక్షణ, విద్య, వృత్తి నైపుణ్యం అనే అంశాలు కేంద్రంగా మూడు వేర్వేరు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారు అపర్ణ. ‘‘ఇప్పటివరకు, మా మిషన్ 1.5 లక్షల మంది యువతులు, మహిళల జీవితాలను ప్రభావితం చేసింది. మా మిషన్ ప్రతి భారతీయ మహిళకు ఆరోగ్య అవగాహన, భద్రతా పద్ధతులు, చట్టపరమైన హక్కులు, సైబర్ క్రైమ్, ఆత్మరక్షణ, కంప్యూటర్ అక్షరాస్యత, లైంగిక, గృహ హింసల నివారణ, వృత్తి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని బలోపేతం చేస్తుంది. ఇప్పుడు ఈ మిషన్ కార్యక్రమాలను మరింతగా విస్తృతం చేసి ఇతర రాష్ట్రాల్లోని మహిళలకూ అవగాహన కల్పించే దిశగా సాగుతున్నాను’’ అంటున్నారు అపర్ణ. -
ఛాయనిక, దర్శనలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: యామగుచి కరాటే అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన వైఎంసీఏ కరాటే కప్ టోర్నీలో ఛాయనిక, కె. దర్శన ఆకట్టుకున్నారు. వైఎంసీఏ నారాయణగూడ వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. 17 ఏళ్లు పైబడిన బాలికల స్పేరింగ్ విభాగంలో ఛాయనిక విజేతగా నిలిచింది. పవిత్ర, నవ్యశ్రీ వరుసగా రజత, కాంస్యాలను అందుకున్నారు. 15 ఏళ్ల బాలికల స్పేరింగ్ ఈవెంట్లో దర్శన, టిషా మహంత్, మహేశ్వరి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల బ్లాక్ బెల్ట్ ఈవెంట్లో విశ్వనాథ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. మహాదేవ్ రజతాన్ని గెలుచుకోగా... కృష్ణ కాంస్యాన్ని సాధించాడు. ఈ టోర్నీలో మొత్తం 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సినీ నటి సుమయా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పి. ధర్మరాజ్, రిటైర్డ్ కార్యదర్శి వినయ్ స్వరూప్, గ్రాండ్ మాస్టర్ ఆర్కే కృష్ణ, మాస్టర్స్ వంశీకృష్ణ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సలోమీ, నాగ తనిష్కలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జీఎస్‌కేడీఐ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో కురినెల్లి సలోమీ, జి. నాగ తనిష్కారెడ్డి ఆకట్టుకున్నారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో అండర్–11 బాలికల కటా విభాగంలో సలోమీ స్వర్ణాన్ని గెలుచుకుంది. అండర్–13 కటా ఈవెంట్లో తనిష్క చాంపియన్‌గా నిలిచి పసిడిన కైవసం చేసుకుంది. అనౌష్క రజతాన్ని గెలుచుకోగా... నిత్యారెడ్డి కాంస్యాన్ని అందుకుంది. నమ్రత నాలుగో స్థానంలో నిలిచింది. 14–15 వయో విభాగం బాలుర కటా ఈవెంట్లో టి. ఉదయ్, సర్వేశ్, గిరి శేషు వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. 16–17 వయో విభాగం బాలుర కుమిటే విభాగంలో రవీంద్ర పసిడిని సొంతం చేసుకోగా... గోపీ, భరత్, జై మహేశ్ వరుసగా తర్వాతి స్థానాలను సాధించారు. -
కరాటే క్వీన్
‘‘నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులకు చెక్ పెట్టాలంటే ఆడపల్లలకు కరాటే ఎంతో దోహద పడుతుంది. మా అమ్మానాన్నలు కరాటే నేర్చుకోవాలన్నప్పుడు భయపడ్డా. ఇప్పుడు శిక్షణ పొందాక ఆ గొప్పతనం తెలుస్తోంది. అందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటే నేర్పేందుకు ముందుకు రావాలి’’ – భవాని చాంద్రాయణగుట్ట: మహానగరంలో మహిళలు అర్ధరాత్రి కాదు.. పట్టపగలే నిర్భయంగా తిరలేని రోజులివి. ఏ మానవ మృగం ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో చెప్పలేని పరిస్థితి. పాతికేళ్ల క్రితమైతే తల్లిదండ్రులు బాలికలను చదువు మాన్పించి ఇంట్లోనే ఉంచేవారు. వయసు రాగానే పెళ్లి చేసి బరువు దించుకునేవారు. ఇప్పుడు రోజులు మారాయి.. ఆడపిల్లలను కన్నవారు తమ బిడ్డలకు మృగాళ్లను ఎదిరించడం నేర్పిస్తున్నారు. ఇంటిపట్టునే ఉంటే లోకజ్ఞానం ఎప్పుడు అబ్బుతుందని.. కట్టుకున్నవాడే బరితెగిస్తే అప్పుడు బేల చూపులు చూస్తూ కన్నీరు పెట్టుకోకూడదని చిన్నప్పుడే ధైర్యాన్ని నింపుతున్నారు. అక్షరభ్యాసంతో పాటే ఆత్మరక్షణ విద్యను నేర్పిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు అంబటి భాస్కర్, శోభ దంపతులు. రోజూ ఎక్కడోచోట మహిళలపై జరుగుతున్న దాడులను పత్రికల్లో చూసిన వీరు.. అలాంటి దుర్ఘటనలు ఎదురైతే ఎదిరించేలా తమ కూతురు భవానీకి కరాటే నేర్పిస్తున్నారు. ఇప్పుడామె జాతీయ స్థాయిలో రాణిస్తూ కన్నవారికి పేరు తెస్తోంది. ‘నిర్భయ’ దుర్ఘటనతో.. ఢిల్లీలో ‘నిర్భయ’ దుర్ఘఘటనతో దేశంలో చాలామంది తల్లిదండ్రులు తల్లడిల్లారు. భాస్కర్, శోభ మాత్రం భవానీకి కరాటేలో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం నగరంలోని అరోరా కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న భవానీని నాలుగేళ్ల క్రితం జంగమ్మెట్‌లోని నాయక్ బూడోఖాన్ కరాటే అకాడమీలో చేర్పించారు. చదువుకుంటూనే మాస్టర్ గణేష్ నాయక్ వద్ద శిక్షణ పొందింది. అక్కడి నుంచే పలు పోటీలకు సైతం హాజరైంది. జిల్లాస్థాయి పోటీలతో ప్రయాణం మొదలెట్టిన ఆమె అంతర్జాతీయ పోటీల్లో సైతం విజేతగా నిలిచింది. ఇప్పటి దాకా 13 జాతీయ, మూడు రాష్ట్ర, ఒక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంది. ఇటీవల బళ్లారిలో గ్రాండ్ చాంపియన్‌షిప్ సాధించిన భవాని త్వరలో మలేసియాలో జరిగే పోటీలకు ఎంపికైంది. తల్లిదండ్రులతో భవానీ బాలికలకు ఉచితంగా.. ప్రతి వేసవిలో బాలికలకు ఉచితంగా కరాటే నేర్పిస్తున్నాం. పాతబస్తీలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కరాటేలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. భవానీ కరాటేలో చక్కగా రాణిస్తోంది. త్వరలో మలేసియా కూడా వెళ్లనుంది. ఆమె శిక్షణ పొందుతూనే ఎన్సీసీ క్యాంప్‌లో తోటి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఎన్సీసీలో కూడా ఆమె ప్రత్యేక ర్యాంక్ సాధించడం గొప్ప విషయం.– పి.గణేష్ నాయక్, కరాటే మాస్టర్ -
ప్రపంచ రికార్డుపై అక్కాచెల్లెళ్ల దృష్టి
కాచిగూడ: నగరానికి చెందిన కరాటే క్రీడాకారిణులు అమృత రెడ్డి, గణ సంతోషిణి రెడ్డి అక్కాచెల్లెళ్లు. వీళ్లిద్దరు ఇప్పటికే పలు కరాటే ఈవెంట్లలో తమ ప్రతిభ చాటుకున్నారు. బర్కత్‌పురకు చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ప్రపంచ రికార్డులపై దృష్టి పెట్టారు. ఈ నెల 30న బర్కత్‌పురలోని జీవీఆర్ కరాటే అకాడమీలో లిమ్కా బుక్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1,828 రోజులకుగాను 1,828 మేకులతో ఏర్పాటు చేసిన చెక్కపై పడుకుని, 60 నెలలు... నెలకు ఒక్కటి చొప్పున 60 షాబాదు బండలు ఛాతీపై 5 సంవత్సరాలు అంటే 5 నిమిషాల్లో పగులగొట్టి రికార్డ్స్ సాధించనున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ అక్కాచెల్లెళ్లు అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఆకట్టుకున్నారని ఆయన చెప్పారు. ఈ రికార్డు ప్రదర్శనను తిలకించడానికి పలువురు నేతలు, అధికారులు హాజరవుతున్నారని గోపాల్ రెడ్డి చెప్పారు. -
కరాటేలో బంగారు పతకం
వేటపాలెం: మండలంలోని దేశాయిపేట పంచాయతీ, రామానగర్‌లో ఉన్న వివేకా స్కూలు విద్యార్థి కరాటేలో బంగారు పతకం సాధించాడు. వివేకా స్కూలులో 6వ తరగతి చదువుతున్న ఎస్డీ సుభాని ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కోచింగ్ క్యాంపులో కరాటేలో బంగారు పతకం సాధించాడు. ఈ క్యాంపులో 150 మంది విద్యార్థులు పాల్గొనగా సుభాని తన ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడు. సేన మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కావూరి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సుభాని ఈ పోటీల్లో పాల్గొనగా నిర్వాహకులు సుభానిని అభినందించారు. -
మట్టిలో మాణిక్యానికి కావాలి చేయూత
సాక్షి, కమాన్‌చౌరస్తా: తనొక సాధారణ కుటుంబానికి చెందిన యువతి కాని కరాటే, కిక్ బాక్సింగ్ క్రీడల్లో అసాధారణ ప్రతిభ ఆమె సొంతం. కాని ఆర్థిక ఇబ్బందులు ఆమెను కలవరపెడుతున్నాయి. తనలోని టాలెంట్‌ను గుర్తించిన సన్నిధి ఫౌండేషన్ తమ వంతు చేయూతనిచ్చింది. కరీంనగర్ పట్టణానికి చెందిన కరాటే, కిక్‌బాక్సింగ్ క్రీడాకారిణి కందుల మౌనికకు సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు అండగా నిలిచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఆమెకు ఏషియన్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం రాగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న సన్నిధి ఫౌండేషన్ బాధ్యులు మంగళవారం రూ.5 వేలు అందజేశారు. క్రీడల్లో రాణించి, తనకు సహకరిస్తోన్న వారి నమ్మకాన్ని నిలబెడతానని మౌనిక తెలిపింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు రాధారపు సూర్యప్రకాశ్, ఉపాధ్యక్షుడు అంబాల ప్రదీప్‌రెడ్డి, పృధ్యున్నత్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రదర్స్.. అదుర్స్
పశ్చిమగోదావరి, పోడూరు: జిన్నూరు నర్సింహరావుపేటకు చెందిన పెచ్చెట్టి నాగచైతన్య, పెచ్చెట్టి రాధాకృష్ణ సోదరులిద్దరూ చిన్ననాటి నుంచే క్రీడల్లో రాణిస్తున్నారు. అన్న నాగచైతన్య జిన్నూరు ఐడియల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. తమ్ముడు రాధాకృష్ణ 2వ తరగతి చదువుతున్నాడు. నాగచైతన్య కరాటేలో రాణిస్తూ పలు పతకాలను సాధించాడు. పాలకొల్లు, నిడదవోలు పట్టణాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి పతకాలను, ప్రశంసాపత్రాలను అందుకున్నాడు. రాధాకృష్ణ రన్నింగ్‌లో చిచ్చరపిడుగు. స్కూల్‌స్థాయిలో ఎప్పుడు పోటీలు నిర్వహించినా ఫస్ట్ వస్తాడు. ఇటీవల పాలకొల్లులో అపుస్మా ఆధ్వర్యంలో జోనల్‌స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమస్థానం సాధించాడు. భవిష్యత్తులో మరింత రాణిస్తామని చెప్పారు. -
అపూర్వి విజయం చిన్నారి సొంతం
కుత్బుల్లాపూర్: చిన్న వయసులోనే కరాటేలో పట్టు సాధించింది. మూడేళ్లు శిక్షణలో ఆ క్రీడలో రాటుదేలిందా చిన్నారి. పేరు పూర్వీశర్మ.. ఫతేనగర్‌కు చెందిన సంజయ్‌శర్మ, అమితాశర్మల చిన్న కుమార్తె. సెయింట్ పీటర్ (బోయిన్పల్లి) గ్రామర్ స్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. పూర్వీ.. తెలంగాణ ప్రాంతం నుంచి జాతీయ జట్టులో స్థానం సంపాదించి గ్రీస్‌లోని ఏథెన్స్ నగరంలో గతనెల 25 నుంచి జరిగిన కరాటే ‘షుటికై’ టోర్నమెంట్లో తనదైన శైలిలో రాణించి సిల్వర్ మెడ ల్ సాధించింది. ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో మహ్మద్ మన్సూర్ పాషా శిక్షణతో కెరీర్ ప్రారంభించింది. గ్రీస్‌లో జరిగిన పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది చిన్నారులను ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురిలో పూర్వీశర్మ అతి చిన్న వయస్కురాలు కావడం విశేషం. ఆది నుంచి ప్రతిభావనిగా.. పూర్వీశర్మ 2015లో శిక్షణ ప్రారంభించి అదే ఎడాది మండల, జిల్లా స్థాయి పోటీల్లో తొలి విజయం సాధించింది. 2016లో ఇంటర్ స్టేట్, స్కూల్ లెవల్ పోటీల్లోనూ విజయం సొంతం చేసుకుంది. 2017లో మహాబలేశ్వర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉన్నా అండర్–10 కేటగిరీలో తన ప్రతిభను చాటి ఔరా అనిపించింది. ఈ ఏడాది గ్రీస్ అంతర్జాతీయ పోటీల కోసం జరిగిన ఎంపికలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించారు. ఇందులో అత్యంత కఠినమైన వడపోతలో మేటిగా నిలిచింది పూర్వీశర్మ. ఎంపిక కమిటీ అంచనాలను నిజం చేస్తూ తాజాగా గ్రీస్‌లో సిల్వర్ పతకం సాధించి ‘హైదరాబాద్ కరాటే కిడ్’గా నిలిచింది. చివరి నిమిషంలో చేతులెత్తేసిన స్పాన్సర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ వస్తున్న పూర్వీశర్మకు తొలుత ఓ స్పాన్సర్ ముందుకు వచ్చి హడావిడి చేశాడు. ఇది నమ్మిన ఆమె తల్లిదండ్రులు సంజయ్ శర్మ, అమితా శర్మలు పూర్తి భరోసాతో ఉన్నారు. ఇంకో వారం రోజులలో గ్రీస్‌కు వెళ్లేక్రమంలో అంతవరకు స్పాన్సర్‌గా ఉంటానన్న వ్యక్తి చెతులెత్తేశాడు. దీంతో గత్యంతరం లేక బ్యాంక్‌లో రూ.5 లక్షలు లోన్ తీసుని చిన్నారిని పోటీలకు పంపించారు. ఇప్పుడు కుమార్తె సిల్వర్ మెడల్ సంపాదించడంతో తమ కష్టానికి ఫలితం దక్కిందని ఆమె తల్లిదండ్రులు ‘సాక్షి’తో చెప్పారు. ప్రతిభ గల చిన్నారులకు ప్రభుత్వం చేయుతనందించాలని కోరుతున్నారు. -
స్త్రీలోక సంచారం
♦ ఆగస్టు 16న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మరణించిన అనంతరం ప్రాముఖ్యం సంతరించుకున్న ఆయన జీవిత విశేషాలలో ఆయన దత్తపుత్రిక నమితా భట్టాచార్యకు కూడా సముచిత స్థానం లభించింది. చదువులో చక్కగా రాణించి, ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో కామర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు అదే కళాశాలలో ఎకనమిక్స్‌లో ఆనర్స్ చేస్తున్న రంజన్ భట్టాచార్యను ప్రేమించి, పెళ్లి చేసుకున్న నమిత ఆ తర్వాత రాజకీయాల్లోకి రాకుండా ప్రా«థమిక పాఠశాల ఉపాధ్యాయినిగా స్థిరపడ్డారు. ♦ వరల్డ్ కరాటే చాంపియన్‌షిప్‌లకు పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ యువతి సయేదా ఫాలక్ ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అక్కడి యువతులకు కరాటేలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని విల్లా మేరీ డిగ్రీ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలైన సయేదా 2016 యు.ఎస్.ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించడంతో కరాటే అథ్లెట్‌గా ప్రపంచ ప్రసిద్ధురాలయ్యారు. ♦ డేటింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్న మహిళల్లో 18 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉండగా, పురుషుల్లో 50 ఏళ్లు పైబడినవారు అధికంగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. వయసు మీద పడుతున్న కొద్దీ పురుషుల్లో శృంగారేచ్ఛ పెరుగుతుంటే, స్త్రీలు కుటుంబ బాధ్యతల్లో పడి, వయసుకు మించిన వృద్ధాప్యంలోకి మానసికంగా జారిపోవడమే ఇందుకు కారణం అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎలిజబెత్ బ్రౌచ్ విశ్లేషించారు. ♦ ఆగస్టు 16న 60వ యేటలోకి అడుగు పెట్టిన అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నటి, బిజినెస్‌ఉమన్ మడోన్నా.. తన పిల్లలతో కలిసి మొరాకోలో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఆగ్నేయ ఆఫ్రికాలోని దుర్భిక్ష పీడిత దేశమైన మలావీలో అనా«థ పిల్లల సంక్షేమం కోసం పన్నెండేళ్ల క్రితం తను స్థాపించిన ‘రైజింగ్ మలావీ’ సంస్థకు ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ♦ గర్భస్రావం జరిగి.. ఆ దుఃఖంలో ఉన్న స్త్రీకి, ఆమె భర్తకు మూడు రోజుల సాంత్వన సెలవు ఇచ్చే చట్టాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేబోతోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో కుటుంబ సభ్యులు లేదా కడుపున పుట్టిన వారు మరణించిన సందర్భంలో మాత్రమే ఇలాంటి సాంత్వన సెలవును ఇస్తుండగా.. మహిళా ఎంపీ జిన్నీ ఆండర్సన్ ప్రతిపాదన మేరకు ఇప్పుడు ఆ సెలవు పరిధిలోకి గర్భస్రావాన్ని కూడా చేరుస్తూ ఒక సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ♦ బిడ్డ పుట్టిన తొలి గంటలోనే బిడ్డకు తల్లిపాలు ççపట్టించే నిరంతర కార్యక్రమాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది. శిశు మరణాలను తగ్గించడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రధాన ఆసుపత్రులలో బ్రెస్ట్ ఫీడింగ్ క్లినిక్‌లను నెలకొల్పి.. ప్రసవానంతరం తల్లీబిడ్డల్ని తక్షణం ఆ క్లినిక్‌ల లోపలికి తరలించి, తల్లి చేత బిడ్డకు పాలు పట్టించిన తర్వాత మాత్రమే వాళ్లిద్దరినీ కుటుంబ సభ్యుల సందర్శనార్థం ప్రసూతి వార్డుకు అనుమతిస్తారు. ♦ ‘ఆకలి నుంచి, పేదరికం నుంచి, వివక్ష నుంచి, లైంగిక అసమానత్వం నుంచి మనకు విముక్తి లభించాలి’ అంటూ .. ఒక రోజు ఆలస్యంగా ట్విట్టర్లో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు పెట్టిన భారత మహిళా క్రికెట్ జట్టు (వన్డే ఇంటర్నేషనల్) కెప్టెన్ మిథాలీ రాజ్‌పై.. ‘ఒక సెలబ్రిటీకి స్వాతంత్య్ర దినోత్సవం అంటే ఉన్న గౌరవం ఇదేనా?’ అని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. అందుకు సమాధానంగా.. ప్రస్తుతం బెంగళూరులో ‘ఇండియా బ్లూ’ జట్టు తరఫున ‘ఉమెన్స్ చాలెంజర్ ట్రోఫీ’లో ఆడుతున్న మిథాలీ రాజ్.. ‘ఫోన్ అందుబాటులో లేని కారణంగానే శుభాకాంక్షలు చెప్పడం ఆలస్యం అయింది తప్ప, గౌరవం లేకపోవడం వల్ల కాదు’ అని వివరణ ఇచ్చారు. ♦ ముంబైలో నేడు జరుగుతుందని అంతా భావిస్తున్న ప్రియాంక–నిక్ జోనాస్‌ల ఎంగేజ్మెంట్కి షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, ఐశ్వర్య, రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్, షాహద్ కపూర్, దీపికా పడుకోన్ వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నా.. షారుక్ వెళ్లకపోతే కనుక.. గతంలో ప్రియాంకాకు, షారుక్‌కు మధ్య కొంతకాలం పట్టువిడుపులుగా కొనసాగిన ప్రేమ–ద్వేషం అందుకు కారణం అయి ఉండే అవకాశం ఉందని బాలీవుడ్ ఊహాగాన ప్రియులు తలపోస్తున్నారు. -
బరిలో దిగితే పతకమే
హైదరాబాద్: పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ పతకాలు. లెక్కకు మిక్కిలిగా ప్రతిభా, ప్రశంసా అవార్డులు. బరిలోకి దిగితే అవలీలగా ప్రత్యర్థులను మట్టికరిపించడం. ఇదీ కరాటేలో అద్భు త ప్రతిభ కనబరుస్తోన్న 18 ఏళ్ల తెలుగు అమ్మాయి సూరపనేని డింపుల్ సామర్థ్యం. ఇదంతా ఒకవైపు మాత్రమే. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, పోటీలకు వెళ్లాలంటే ఇతరుల వద్ద చేతులు చాపాల్సిన పరిస్థితి. దాదాపుగా అన్ని స్థాయిల్లో విజయాలను సాధించిన ఆమె... ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే కార్వీ సంస్థ అందించిన సహాయం ఆమె నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. ఆ సంస్థ ఇచ్చిన ప్రో త్సాహంతోనే ‘యూఎస్ ఓపెన్ జూనియర్ ఇంటర్నేషనల్ కరాటే కప్’లో రెండు స్వర్ణాలు, ఒక రజతాన్ని సాధించింది. భవిష్యత్‌లో కరాటే చాంపియన్‌గా మారాలని దృఢంగా నిర్ణయించుకుంది. కుటుంబ నేపథ్యం... డింపుల్ స్వస్థలం విజయవాడ. ఆమె తల్లిదండ్రులు సూరపనేని రామోజి, సుజనశ్రీ. ప్రస్తుతం ఆమె ఆంధ్ర లయోలా కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఏడేళ్ల వయస్సు నుంచే కరాటేలో ప్రతిభ కనబరుస్తోన్న డింపుల్‌కు స్కూల్ స్థాయిలో ఇచ్చిన శిక్షణే పునాది. అంతర్ పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణిస్తూ ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మారింది. 2013లో జాతీయ స్థాయిలో తొలి కాంస్యాన్ని సాధించింది. అదే ఏడాది మలేసియాలో జరిగిన టోర్నీలో స్వర్ణంతో పాటు కాంస్యాన్ని గెలుచుకుంది. 2015లో క్రొయేషియాలో జరిగిన ‘వరల్డ్ ఫెడరేషన్ టోర్నమెంట్’, 2016లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ టోర్నీల్లోనూ డింపుల్ పాల్గొంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో యూఎస్ ఓపెన్‌కు దూరమవ్వాలని నిర్ణయించుకున్నానని డింపుల్ చెప్పింది. కార్వీ సంస్థ చివరి క్షణంలో ఆదుకోవడంతోనే భారత్‌కు పతకాలు అందించగలిగానని తెలిపింది. డింపుల్ చిన్ననాటి కోచ్ వెంకటేశ్వరరావు కాగా ప్రస్తుతం జాతీయ కోచ్ కీర్తన్ కొండూరు ఆమెకు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన ‘యూఎస్ ఓపెన్ జూనియర్ ఇంటర్నేషనల్ కరాటే కప్’లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చిన డింపుల్ మూడు పతకాలను సాధించింది. అండర్–65 కేజీల వెయిట్ కేటగిరీ మహిళల వ్యక్తిగత ‘కటా’ విభాగంలో స్వర్ణంతో పాటు ‘టీమ్ కుమిటీ అండ్ కటా’ కేటగిరీలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. వ్యక్తిగత కుమిటీ విభాగంలో రన్నరప్‌గా నిలి చి రజతాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో డింపుల్‌కు అభినందన సభ జరిగింది. -
కరాటేలో సంధ్యా కిరణం
కరాటే.. శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచడంతో పాటు ఆత్మరక్షణకు దోహదపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం, మనోధైరాన్ని పెంచుతుంది. అటువంటి క్రీడలో ఆసక్తితో ఆర్థిక ఇబ్బందులున్నా మొక్కవోని దీక్షతో పతకాలు సాధిస్తోంది. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రోత్సాహంతో పతకాల పంట పండిస్తోంది. ఎంబీఏ చదువును పూర్తిచేసి ఉన్నత చదువులతో పాటు కరాటేలో మరింత స్థాయికి ఎదిగేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది భీమవరం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన కొడమంచిలి సంధ్య. విజయగాథ ఆమె మాటల్లోనే.. భీమవరం: మాది భీమవరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ. తల్లిదండ్రులు అక్కమ్మ, దేవుడు, అక్క, అన్న ఇది మా కుటుంబం. అక్క, అన్న చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినా, నన్ను మాత్రం ఉన్నత స్థాయిలో చూడాలన్న కోరిక అమ్మా, నాన్నతో పాటు తోబుట్టువులకూ ఉంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాఠశాల విద్య పస్తుల సాగరం మున్సిపల్ హైస్కూల్లో సాగింది. ఇంటర్ నుంచి ఎంబీఏ వరకూ డాక్టర్ చీడే సత్యనారాయణ కళాశాలలో చదువుకున్నా. మంచి మార్కులతోనే ఉత్తీర్ణత సాధించా. ఇదే సమయంలో రైస్ మిల్లు కార్మికుడిగా పనిచేసే నాన్న దేవుడు ప్రమాదవశాత్తు కాలువిరిగి మంచానపడ్డారు. కుటుంబ పోషణ కష్టం కావడంతో అమ్మ అక్కమ్మ మిల్లులో పనికి వెళ్లేది. అక్క టైలరింగ్, అన్న తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నాకు చిన్నతనం నుంచి కరాటేలో మక్కువ ఉండటంతో కుటుంబసభ్యులు ప్రోత్సహించారు. స్థానికంగా ఉన్న కరాటే మాస్టార్ జోశ్యుల విజయభాస్కర్ వద్ద శిక్షణ ఇప్పించారు. పతకాల పంట విశాఖ, గుంటూరు, కరీంనగర్, తాడేపల్లిగూడెం, జొన్నాడ, తాళ్లరేవు, రాజమండ్రి, మల్కిపురం తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఎనిమిది స్వర్ణ, ఆరు రజత, రెండు కాంస్య పతకాలు సాధించాను. మరెన్నో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నా ను. ప్రముఖుల ప్రశంసలు పొందాను. అయితే దూరప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లకు హాజరయ్యేందుకు ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారింది. చదువుతో పాటు కరాటేలో శిక్షణ తలకు మించిన భారమైంది. ప్రస్తుతం అన్న, అక్క సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. కరాటేలో మరింత రాణించి పోలీసు ఉద్యోగం సంపాదించడమే నా లక్ష్యం. ఇందుకు ఆర్థిక ఇబ్బందులు ప్రతి బంధకంగా మారాయి. ఇప్పటికే ఎన్నో కష్టాలకోర్చి కుటుంబసభ్యులు ఇక్క డి వరకూ తీసుకువచ్చారు. దాతలు సహకరిస్తే కరాటేలో మరింత రాణిస్తానన్న నమ్మకం.. ఆత్మవిశ్వాసం నాకుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా లక్ష్యాన్ని తప్పక సాధిస్తాను. -
రష్మికకు బ్లాక్‌బెల్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటుతోన్న నగరానికి చెందిన పి. రష్మిక బ్లాక్‌బెల్ట్‌ను అందుకుంది. స్పార్క్స్ కుంగ్ఫు అకాడమీ ఆధ్వర్యంలో మెహదీపట్నంలోని ప్రభు త్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కుంగ్ ఫు మాస్టర్ జమీల్ ఖాన్ కరాటే క్రీడాకారులకు పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 50 పతకాలను గెలుచుకున్న 14 ఏళ్ల రష్మికకు బ్లాక్‌బెల్ట్‌తో పాటు ధ్రువపత్రాన్ని అందించారు. రష్మికతో పాటు మాస్టర్ పీఎం మోహిత్ బ్లూ బెల్ట్, అనూష ఠాకూర్ ఆరెంజ్ బెల్ట్, టి. శాశ్వత్ ఆరెంజ్ బెల్ట్‌లను అందుకున్నారు. -
ధీశాలి 'బహుముఖ ప్రజ్ఞాశాలి'
అది 1980 దశకం..అప్పుడప్పుడే కరాటే అంటే యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న పద్మజ కూడా ఆ యుద్ధ క్రీడంటే మక్కువ చూపి శిక్షణ పొందడం మొదలుపెట్టారు. క్రమంగా మెళకువలు నేర్చుకుంటూ జిల్లాలో మొట్టమొదటి ఉమన్ బ్లాక్‌బెల్ట్ ఫస్ట్ డాన్‌గా నిలిచారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ పతకాలు కైవసం చేసుకున్నారు. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యను ఇతరులకు కూడా పంచాలనుకుని ఇప్పటి వరకు కొన్ని వందల మంది బాల బాలికలకు, షీ టీంలకు ఆత్మరక్షణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. కరాటే శిక్షకురాలిగానే కాదు..ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా, చిత్రకారిణిగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ చాటుతున్న పద్మజపై ‘సాక్షి’ కథనం. ఒంగోలు వన్‌టౌన్: మేదరమెట్ల నుంచి వచ్చి ఉద్యోగరీత్యా ఒంగోలులో స్థిరపడిన చిలకమర్తి గోపాలకషమూర్తి, రమాదేవి దంపతులకు ఒక్కగానొక్క కూతురు పద్మజ. తండ్రి విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కావడంతో పద్మజ తన అన్న చంద్రశేఖర్ (మ్యాథ్స్ లెక్చరర్, హైదరాబాద్) తమ్ముడు కష్ణమోహన్ (ఫార్మాసూట్ సైంటిస్ట్, న్యూయార్క్)తో సమానంగా పెరిగింది. ఒంగోలు శర్మా కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన పద్మజ 1993లో బీఎస్సీ, బీఈడీ పట్టా తీసుకున్నారు. 1996లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా కొత్తపట్నం మండలం బజ్జిరెడ్డి గమళ్లపాలెం పాఠశాలలో ఉద్యోగినిగా చేరారు. 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ రావడంతో ఇంగ్లిష్ టీచర్‌గా మద్దిపాడు మండలం బసవన్నపాలెం ఉన్నతపాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం చిన్నగంజాం హైస్కూల్ నందు ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. కరాటే పద్మజ 1980 దశకంలో కరాటే శిక్షణ యువతీయువకులను విపరీతంగా ఆకర్షించింది. పద్మజ డిగ్రీ చదివే రోజుల్లో ఒంగోలు మహిళా మండలి వద్ద ప్రతిరోజూ ప్రముఖ కరాటే మాస్టర్ వలిశెట్టి రవి యువకులకు కరాటే శిక్షణ ఇవ్వడం గమనించి, కరాటే నేర్చుకోవాలన్న ఆసక్తిని నేరుగా రవి మాస్టర్‌కి తెలిపింది. అలా యుద్ధ నైపుణ్య విద్యలో తొలి అడుగులు వేసిన పద్మజ 1995లో ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్‌గా, 2017 జనవరి 8న ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫోర్త్ డాన్‌గా నిలిచింది. 2015లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం (హైదరాబాదు)లో జరిగిన నేషనల్ బూడోకాన్ ఈవెంట్లో ‘కట’ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించింది. ఉద్యోగరీత్యా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పటికీ స్వార్డ్, స్టిక్, నాన్చక్ ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా ... ♦ తను పని చేస్తున్న చోట పలువురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా నవోదయ, గురుకుల పాఠశాలలకు అర్హత సాధించడంలో చేయూతనిచ్చారు. ♦ 2009 నుంచి జిల్లా రీసోర్స్ పర్సన్‌గా కొనసాగుతూ విద్యాశాఖ నిర్వహించిన వివిధ శిక్షణా శిబిరాల్లో ఆంగ్ల బాషా శిక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు. ♦ 2016లో బెంగళూర్‌లో రీజినల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లిష్ సౌత్ ఇండియా (ఆర్ఐఇఓస్ఐ) ఆధ్వర్యంలో జరిగిన క్యాంప్‌లో జిల్లా విద్యాశాఖ సహకారంతో సీఈఎల్‌టీ ట్రైనింగ్ తీసుకున్నారు. ♦ 2017 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున స్పాట్ వాల్యుయేషన్‌కి వచ్చిన సుమారు 100 మంది సహచర ఇంగ్లిష్ ఉపాధ్యాయులతో ‘ఇంగ్లిష్–ప్రకాశం’ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 300 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు ఇంగ్లిష్ బోధనలో వచ్చే సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సమన్వయపరచడం. ♦ 2017లో ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, బ్రిటీష్ కౌన్సిల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఇంగ్లిష్ ట్రైనింగ్ క్యాంపులో మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంశంపై రాష్ట్రీయ మాధ్యమిక విద్యా మిషన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) వారు నిర్వహించిన క్యాంపులో మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. ప్రేమ వివాహం కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదవడం, పద్మజ తండ్రి వత్తి రీత్యా బయటి ప్రపంచంతో మమేకం కావడంతో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ ప్రతి విషయాన్ని అందరూ కలిసి మాట్లాడుకోవటం, కలిసి నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా మారిన నేపధ్యంలోనే పద్మజ తన సహవిద్యార్థి వై.ఎస్.దిగ్విజయ్‌ను మతాంతర వివాహం చేసేకున్నారు. పెళ్లి జరిగిన తొలి రోజుల్లో ఇద్దరి కుటుంబాల భావ సంఘర్షణ వల్ల ఏర్పడిన అరమరికలు అనతికాలంలోనే సమసిపోయి ఇద్దరి కుటుంబాలు ఆదర్శంగా నిలిచాయి. 80 దశకంలో విప్లవ భావాలు యువతలో మెండుగా ఉన్న రోజులు. ప్రేమంటే భావావేశంతో కలిగేదనిపిస్తున్న నేటి ప్రేమ కథలకు భిన్నంగా, భావసారూప్యతతో జీవిత భాగస్వాములైన పద్మజ, దిగ్విజయ్‌లను చూసి నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబం గురించి ఒంగోలు జక్రయ్య ఆస్పత్రి వీధిలో నివసిస్తోంది పద్మజ కుటుంబం. భర్త వై.ఎస్.దిగ్విజయ్ ఒంగోలు నగరంలోని పేస్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలు బయాలజీ సైన్స్ టీచర్‌గా సేవలందించిన దిగ్విజయ్ ఒక లోకల్ ఛానెల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వివేక్ (21) శ్రీకాకుళం డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జన్ (బీడీఎస్) చదువుతున్నాడు. విక్రాంత్ (18) విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్నాడు. తల్లి వద్ద కరాటే శిక్షణ పొందిన ఈ ఇద్దరు పిల్లలు గ్రీన్ బెల్ట్ పొందారు. ‘సమాజం కోసం నా వంతుగా ... ప్రభుత్వంగానీ, వలంటరీ ఆర్గనైజేషన్స్గానీ నగరంలో ఏదైనా వేదిక ఏర్పటు చేయగలిగితే ఉదయం ఆత్మరక్షణ యుద్ధ నైపుణ్యం శిక్షణ, సాయంత్రం ఇంగ్లిష్ మాట్లాడటం, బోధనా నైపుణ్యం, బాషా సమస్యలపై ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అంటున్న పద్మజ ఆశ నెరవేరాలని ఆశిద్దాం. ఉపాధ్యాయినిగా.. ఆత్మరక్షణ నైపుణ్య శిక్షకురాలిగా ♦ 1995–96 లో ఖాశీం మెమోరియల్ బాలికలపాఠశాల (దర్శి) విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చారు. ♦ 2006లో ప్రకాశం జిల్లా సర్వశిక్ష అభియాన్ పీడీరఘుకుమార్ ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించారు. ♦ 2012 నిర్భయ ఘటన తరువాత ఒంగోలు వాకర్స్‌క్లబ్ లో మాస్టర్ ఎ.రవిశంకర్‌తోపాటు పలువురికిప్రాక్టీస్లో సేవలందిచారు. ♦ 2014 నుంచి స్థానిక జక్రయ్య ఆసుపత్రి ఆవరణలో డా.జాకబ్ జక్రయ్య, డా.సారా జార్జి ల సహకారంతో స్థానికులకు కరాటే శిక్షకురాలిగా నిలిచారు. డా.సారా జార్జి కూడా పద్మజ వద్ద శిక్షణ పొందుతున్నారు. ♦ 2016లో ఒంగోలులో జరిగిన ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలలో మద్దులూరు (సంతనూతలపాడు) హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఆత్మరక్షణ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించారు. ♦ 2016లో తన గురువు వలిశెట్టి రవి స్థాపించిన రుద్రమదేవి డిఫెన్స్ అకాడమీ (హైదరాబాదు) సహకారంతో తెలంగాణలో షీ టీం ఆధ్వర్యంలో అనేక మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్‌కి శిక్షణ ఇచ్చారు. ♦ 2017 నుంచి చిన్నగంజాం ఏడో తరగతి బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. చిత్రకారిణిగా ఏకకాలంలో ఉపాధ్యాయినిగా, యుద్ధనైపుణ్య శిక్షకురాలిగా , చిత్రాకారిణిగా ,భార్యగా, అమ్మగా, విభిన్న పాత్రలను పోషిస్తున్న «ఈ ధీశాలి తన భావాలకు రూపాలనిస్తూ అనేక చిత్రాలకు జీవం పోశారు. ఆమెను కలవడానికి వచ్చే మిత్రులు, సందర్శకులను ఇంటిలో గోడలను అలంకరించిన ఆమె పెయింటింగ్స్ కచ్చితంగా ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. 2005లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థాన్ నిర్వహించిన ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కోర్సును ఫూర్తి చేశారు. 2009 మార్చిలో ఫెవీక్రిల్ సంస్థ ఇచ్చిన ఎక్స్పర్ట్ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశారు. -
తేడా వస్తే.. తాట తీస్తారు
సాక్షి, జనగామ రాష్ట్రంలోనే తొలిసారిగా జనగామ జిల్లాలోని డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల సభ్యులకు అధికారులు ఆత్మరక్షణపై శిక్షణ అందిస్తున్నారు. ఇంటాబయటా జరుగుతున్న దాడుల నుంచి రక్షణ పొందేందుకు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. మెడలోంచి బంగారు ఆభరణాలను లాక్కెళ్లడం, అత్యాచార యత్నం, యాసిడ్, కత్తులతో దాడులు.. వంటి వాటి నుంచి సులువుగా బయటపడటంపై అవగాహన కల్పిస్తున్నారు. 15 రకాల టెక్నిక్లను నేర్పిస్తూ.. మహిళల్లో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. గతంలో పాఠశాల, కళాశాల స్థాయి బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్‌పై మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించారు. జనగామ కేంద్రంగా 2017 జనవరి 24న 13,686 మంది విద్యార్థినులతో ‘సంఘటిత సబల’ప్రదర్శనను నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు అదే తరహాలో డ్వాక్రా సంఘాలకు మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు ఇచ్చి మరో భారీ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. శిక్షణ సాగుతోందిలా.. తాజాగా బదిలీ అయిన జిల్లా కలెక్టర్ అల్లమరాజు దేవసేన, డీఆర్డీవో మేకల జయచంద్రారెడ్డి.. డ్వాక్రా మహిళలకు కరాటే శిక్షణపై ఆలోచన చేశారు. డిసెంబర్ మొదటివారంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుని శిక్షణ బాధ్యతలను రాణి రుద్రమదేవి సెల్ఫ్‌డిఫెన్స్ అకాడమీకి అప్పగించారు. డీఆర్డీఓ, మండల సమాఖ్యల నుంచి ఖర్చులను భరించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. తొలి విడతలో గ్రామైక్య సంఘాలు(వీఓ)ల్లోని అధ్యక్ష, కార్యదర్శులకు, చురుగ్గా ఉండే మహిళలను ఎంపిక చేశారు. గత నెల 20 నుంచి 24 వరకు జిల్లాలోని బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, చిల్పూరు, జఫర్‌గఢ్, గుండాల మండలాల్లో 1,884 మందికి శిక్షణ ఇచ్చారు. మండల కేంద్రాల్లో రెండ్రోజుల పాటు శిక్షణ పొందిన వీఓలు, మహిళలు గ్రామాల్లో మిగిలిన డ్వాక్రా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తారు. జిల్లాలోని 210 గ్రామ పంచాయతీల పరి«ధిలో ఉన్న మహిళలకు మార్షల్ ఆర్ట్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులో అన్ని గ్రామాల్లో ఒకేసారి 1,25,998 మంది మహిళలకు మార్షల్ ఆర్ట్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం పెరిగింది ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే రోజులు ఇవి. ఏ వైపు నుంచి ఓ ప్రమాదం వస్తుందో తెలియదు. అన్ని సమయాల్లో అందరు తోడుగా ఉంటారని చెప్పలేం. సెల్ఫ్ డిఫెన్స్‌పై శిక్షణ తీసుకున్నాక కొంత ధైర్యం వచ్చింది. మహిళల కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉంది. –గొడిశాల సమత, దేవరుప్పుల -
పంచ్ పాండవులు
♦ కరాటేలో కొత్తవలస కుర్రాళ్ల ప్రతిభ ♦ అంతర్జాతీయ డిప్లమో సాధన ♦ జిల్లాలోనే తొలి జపాన్ డిప్లమో కైవశం ♦ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు ఆత్మరక్షణ విద్య అందరూ నేర్చుకుంటారు. అత్యుత్తమ ప్రమాణాలను కొందరే అందుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతారు. అయిదుగురు సామాన్య విద్యార్థులు ఆ ఘనత సాధించారు. జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజయం సాధించారు. పతకాలు కొల్లగొడుతున్నారు. కొత్తవలస మండలానికి చెందిన ఆ ‘పంచ్’ పాండవులపై స్ఫూర్తిదాయకమైన కథనమిది. –కొత్తవలస రూరల్ ♦ ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ నుంచి గుజూర్యూ కరాటే– డో–ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏషియా కరాటే చాంపియన్ షిప్, ఎంఎల్ఏ కప్, 14 ఆల్ ఇండియా కరాటే చాంపియన్ షిప్, 18 ఆల్ ఇండియా కరాటే చాంపియన్ షిప్, 1వ ఏపీ గుజూర్యూ కరాటే చాంపియన్ షిప్, నార్త్ ఏపీ గుజూర్యూ, సౌత్ ఇండియా గుజూర్యూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని విజయ శిఖరాలు అధిరోహించారు. ♦ ఇద్దరు విద్యార్థులు నేషనల్ స్పోర్ట్స్ కరాటే–డో–కాస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కార్యదర్శిగా, సభ్యునిగా ఎంపికయ్యారు. ♦ ఈ అయిదుగురు విద్యార్థులు జార్ఖండ్ రాష్ట్రంలో జూన్ 25, 26 తేదీల్లో జేఆర్డీ టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన 12వ జాతీయ కరాటే పోటీల్లో పతకాలు సాధించారు. ఇదే కాంప్లెక్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ జపాన్ డిప్లమా పోటీల్లో పాల్గొని బ్లాక్ బెల్టులు సాధించటం జిల్లా చరిత్రలో తొలిసారి. ♦ కొత్తవలస మండలానికి చెందిన ఎం.సుధీర్‌బాబు, ఎన్.భరత్ కుమార్, ఎం.నరేంద్ర, ఎం.నీలాంజీని ప్రసాద్, ఎస్.శ్రీనివాస్‌కు ఆత్మరక్షణ విద్య అంటే ఎంతో మక్కువ. వీరంతా కొత్తవలస మండలం ములగవాకవానిపాలెం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ బ్లాక్‌బెల్టు 5 వడాన్ రాష్ట్ర గుజూర్యూ ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ములగపాక త్రినాథ్‌రావు శిష్యులు. చిన్నప్పటి నుంచి వీరంతా కోచ్ త్రినా«థ్ వద్ద కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. కరాటేలో ఎల్లో బెల్టు నుంచి బ్లాక్ బెల్టుల వరకూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధిస్తున్నారు. ‘నరేంద్ర’జాలం కొత్తవలస మండలం నిమ్మలపాలెంకు చెందిన ఎం.నరేంద్ర ప్రస్తుతం జిందాల్ భారతి విద్యామందిర్‌లో 9 తరగతి చదువుతున్నాడు. తండ్రి నారాయణరావు కిరాణా వ్యాపారి. జార్ఖండ్‌లో జరిగిన జపాన్ డిప్లమా బ్లాక్ బెల్ట్ పోటీల్లో నరేంద్ర మొదటి ఏఐకేఎఫ్ ఈస్ట్‌జోన్ కరాటే చాంపియన్ షిప్–2017లో కాంస్య పతకం సాధించాడు. 2016 జాతీయస్థాయి ఏషియన్ కరాటే చాంపియన్ షిప్ బంగారు, విశాఖపట్నం స్వర్ణభారతి, రాజీవ్‌గాంధీ స్టేడియాల్లో 2015లో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు రజిత పతకాలను సాధించాడు. భళా భరత్ వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామానికి చెందిన ఎన్.భరత్‌కుమార్ ప్రస్తుతం మంగళపాలెం సెయింటాన్స్‌లో 10 తరగతి చదువుతున్నాడు. అయిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే త్రినాథ్ శిక్షణలో రాటుదేరాడు. తండ్రి ఆటో డ్రైవర్. నిరుపేద కుటుంబానికి చెందిన భరత్‌కుమార్ జార్ఖండ్‌లో అంతర్జాతీయ జపాన్ డిప్లమా పోటీల్లో బ్లాక్‌బెల్టు, జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. 2015 ఏషియన్ కరాటే చాంపియన్ షిప్లో బంగారు పతకం. 2016లో ఏపీ ఎంఎల్ఏ కప్, 12వ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్, ఏసియన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో పతకాలు సాధించాడు. తాపీమేస్త్రి కొడుకు తారస్థాయికి.. చింతపాలెం గ్రామానికి చెందిన ఎస్.శ్రీనివాసరావు ప్రస్తుతం పెందుర్తి శ్రీగురు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి తాపీ పనులు చేస్తుంటాడు. శ్రీనివాసరావు 2016 జాతీయ ఏషియన్ కరాటే చాంపియన్ షిప్లో రజతం, విశాఖపట్నం స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ పోటీలు, 2015లో జాతీయస్థాయిలో గాజువాకలో జరిగిన ఎంఎల్ఏ కప్ పోటీల్లో 2 బంగారు పతకాలు సాధించాడు. 14వ ఆల్ ఇండియా, 12 ఆలిండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్, జార్ఖండ్‌లో జరిగిన జపాన్ డిప్లమా బ్లాక్‌బెల్ట్, మొదటి ఏఐకేఎఫ్ ఈస్ట్‌జోన్ కరాటే చాంపియన్ షిప్–2017 పోటీల్లో కాంస్య పతకాలను సాధించాడు. ఒలింపిక్ పతకమే ధ్యేయం జర్మనీ, కెనడా, కొలంబోల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చినా ఆర్థిక స్తోమత చాలక, ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించక అవకాశం కోల్పోయాను. ఒలింపిక్స్‌లో పతకం సాధించటమే నా ధ్యేయం. అందుకే శిక్షణ ఇస్తున్నా. ప్రతి ఒక్కరూ.. ప్రదానంగా ఆడపిల్లలు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలి. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు 16 వేల మందికి శిక్షణ ఇచ్చాను. ఏఐకేఎప్ లో రాష్ట్రంలో 5వ డాన్‌గా మెదటిసారిగా బ్లాక్‌బెల్టు తీసుకున్నాను. – ఎం.త్రినాథరావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ గూజూర్యూ పంచ్ కొడితే పతకమే కొత్తవలస మండలం మునగపాకవానిపాలెం గ్రామానికి చెందిన ఎం.నీలాంజని ప్రసాద్ నరపాం కోస్టల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో జరిగిన కరాటే పోటీల్లో 2 బంగారు, 2 రజిత, 2 కాంస్య పతకాలు సాధించాడు. జపాన్ డిప్లమా బ్లాక్‌బెల్టు సాధించాడు. 2016లో విశాఖపట్నం స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి ఏషియన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో బంగారుపతకం, 2015లో రాజీవ్‌గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి, 2017 జార్ఖండ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంస్య పతకాలను సాధించాడు. స్వర్ణాల సుధీర్ కొత్తవలస మండలం కోస్టల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న సుధీర్‌బాబు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన అంతర్జాతీయ జపాన్ డిప్లమా పోటీల్లో పాల్గొని జపాన్ బ్లాక్ బెల్టు సాధించాడు. జార్ఖండ్‌లో జరిగిన మొదటి ఏఐకేఎఫ్ ఈస్ట్‌జోన్ కరాటే చాంపియన్ షిప్–2017లో కాంస్య పతకం సాధించాడు. సౌత్ ఇండియా గుజూర్యూ కరాటే డో ఫెడరేషన్ అసోసియేషన్ మెదటి శిక్షణలో పాల్గొన్నాడు. ఏషియన్ షిప్లో బంగారు పతకం, 2016లో మొదటి ఆంధ్రప్రదేశ్ గుజూర్యూ కరాటే చాంపియన్ షిప్ ఎంఎల్ఏ కప్ బంగారు పతకం సా«ధించాడు. 2016లో నార్త్ ఆంధ్ర గుజూర్యూ కరాటే చాంపియన్‌షిప్ సాధించాడు. 2016లో 12వ ఆల్ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ హైపవర్ కప్‌లో బంగారు పతకం సా«ధించాడు. నేషనల్ స్పోర్ట్సు కరాటే డో కాస్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ విజయనగరం జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యాడు. -
ఆటకు పట్టం
కరాటే, స్విమ్మింగ్‌లో రాణిస్తున్న ఖుషీధర్‌రెడ్డి మూడేళ్ల ప్రాయంలోనే బంగారు పతకం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు మూడేళ్ల ప్రాయంలోనే బంగారు పతకాన్ని కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాడు ఈ బుడతడు. స్వతహాగా క్రీడాకారుడైన తండ్రి ప్రోత్సాహం.. ఆ వెనువెంటే కన్నతల్లి చల్లని దీవెనలు తోడు కావడంతో కరాటే, స్విమ్మింగ్‌లో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అతనే రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వెన్నపూస లోకేశ్వరరెడ్డి, లత దంపతుల కుమారుడు ఖుషీధర్‌రెడ్డి. ప్రస్తుతం ప్రసన్నాయపల్లిలోని ఎల్‌ఆర్‌జీ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న ఖుషీధర్‌రెడ్డి.. క్రీడలతో పాటు చదువులోనూ రాణిస్తున్నాడు. స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయిలో నాల్గో స్థానంలో ఉండగా... కరాటేలో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటుకున్నాడు. ఇక చదువులో తన పాఠశాలలో ఐదో ర్యాంక్ సాధించాడు. - అనంతపురం సప్తగిరిసర్కిల్ తొలి గురువు తండ్రే స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన లోకేశ్వరెడ్డి.. కర్రసాములో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. అదే చిన్నారి ఖుషీధర్‌రెడ్డిని ఆకర్షించింది. తన తండ్రి వద్ద కర్రసాము అభ్యసిస్తూ అదే సమయంలో కరాటేలోనూ తండ్రి నుంచి మెలకువలు తెలుసుకుంటూ వచ్చాడు. ఖుషీధర్ రెడ్డిలోని ఆసక్తిని గమనించిన లోకేశ్వరరెడ్డి అతడిని 2010లో తైక్వాండో శిక్షకుడు గురుస్వామి వద్దకు చేర్చాడు. అదే ఏడాది ఆగస్టులో శ్రీకృష్ణదేవరాయల పంచ శతాబ్ధి పట్టాభిషేక మహోత్సవాలను పురస్కరించుకుని అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో 18 కేజీల విభాగంలో ఖుషీధర్‌రెడ్డికి తొలిసారిగా తన ప్రతిభను చాటుకునే అవకాశం దక్కింది. ఆ పోటీల్లో అద్భుతంగా రాణించిన అతను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అదే సమయంలో స్కూల్ ఆఫ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ (సిమ) చేరాడు. గురువు ఆర్నాల్డ్ విక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఖుషీధర్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని కటాస్ విభాగంలో ప్రథమ, కుబుడో (కర్రసాము)లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. కర్ణాటకలోని ఫెడరేషన్ ఆఫ్ ఒకినోవా కరాటే గుజురియో డు కరాటే రెన్మాయ్ ఇండియా ఆధ్వర్యంలోని జిల్లా శిక్షకుడు శ్రీనివాసరావు వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొంది హరిహరలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇండోనేపాల్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో కటాస్‌లో ప్రథమ, కుబుడోలో ద్వితీయస్థానంలో నిలిచాడు. స్విమింగ్‌లోనూ అసమాన ప్రతిభ 2014లో సరదాగా నేర్చుకున్న ఈత.. అదే ఏడాది మేలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఖుషీధర్‌రెడ్డికి జిల్లా నుంచి ప్రాతినిథ్యం దక్కేలా చేసింది. అదే ఏడాది ఆగస్ట్‌లో జిల్లా స్థాయి అండర్-8 విభాగం ఈత పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అదే ఏడాది డిసెంబర్ 17, 18 తేదీల్లో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో 200 మీ।। వ్యక్తిగత మిడ్లే విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. 50 మీ।। బ్యాక్ స్ట్రోక్ విభాగంలో తృతీయ, 100 మీ।। ఫ్రీ స్టైల్ విభాగంలోనూ తృతీయ బహుమతి సాధించి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. 2016 జూన్‌లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన జాతీయస్థాయి ఈత పోటీల్లో పాల్గొని నాల్గోస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఈత పోటీల్లోనూ నాల్గో స్థానంలో నిలిచాడు. ఒలంపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఖుషీదర్‌రెడ్డి... తన ప్రతి విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు కోచ్‌లు రవిశేఖర్‌రెడ్డి, రాజశేఖర్ పాత్ర మరువలేనిదని అంటున్నాడు. -
కరాటే వీరుడు షాహీర్
- జాతీయ స్థాయిలో బంగారు పతకం - అంతర్జాతీయ పోటీల్లో సిల్వర్ మెడల్ కైవసం - నేడు అభినందన సభ పామిడి : గోవాలో ఈ నెల 12 నుంచి 15 వరకూ నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థి డీ షాహీర్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఇతను స్థానిక ఏపీ మోడల్స్కూల్లో 8వ తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేశాడు. గురువారం షాహీర్కు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ హనుమంతరాయుడు, పీఈటీ తాండ్లే నరేష్ తెలిపారు. -
కుంగ్‌ఫూ, కరాటేలో జిల్లా ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: విజయవాడలో ఈనెల 29వ తేదీన నిస్కిన్ మంక్ కుంగ్‌ఫూ అకాడమి ఆ«ధ్వర్యంలో జరిగిన రాష్టస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీలలో తమ క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి రెండు బంగారు, ఒక రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించారని ఉషూ కుంగ్ ఫూ అకాడమి చీఫ్ ఇన్స్ట్రక్టర్ షేక్ సంధాని తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం బ్రాడీపేట మహిమ గార్డెన్స్‌లోని అకాడమిలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్–12 స్పారింగ్ విభాగంలో ఎం.థామస్ బంగారు, ఎం.తరుణ్య కాంస్య పతకాలు సాధించారని తెలిపారు. 50 నుంచి 65 కేజీల స్పారింగ్ విభాగంలో కె.సాయిమౌళి బంగారు, ఎ.శేషసాయి కిరణ్ రజత, ఎస్.సాయి శాండిల్య, ప్రవీణ్ ఫ్రాన్సిస్, పీఎన్ఎస్ తేజస్వి కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రీడాకారులు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. -
కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు
నిడదవోలు :ఈ నెల 6న రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో నిడదవోలుకు చెందిన ఎస్కే సలీం, ఎం.జావేద్ రెహమాన్ ఖురేషి రాష్ట్రం తరఫున పాల్గొని వెండి పతకాలు సా«ధించారు. ఈ విషయాన్ని ఆంధ్రరాష్ట్ర జట్టు మేనేజర్ ఎంవీఆర్ రాజు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గుజోరియో కరాటే అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు సత్తి వేణుమాధవరెడ్డి, గౌరవాధ్యక్షుడు బండి రాంబాబు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కేదారిశెట్టి రవికుమార్ క్రీడాకారులను అభినందించారు. -
హు... హ... హు?
ఈ పిల్లవాడెవరు? చిందులేస్తాడు.. ఎగురుతాడు.. తంతాడు.. కరాటే నేర్చుకోకపోయినా బ్లాక్బెల్డ్లా హు...హ.. హు.. అంటాడు. పదేళ్ల బిడ్డకు అంత నైపుణ్యం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? గత జన్మనుంచా? హు.. హ.. హు..?? (who) ‘‘అక్కా, అవినాశ్ మూసిన కన్ను తెరవడం లేదు. నాకు భయంగా ఉంది. నువ్వు తొందరగా రా!’’ అంది పద్మ ఫోన్లో. పద్మ గొంతులో ఆందోళన గమనించిన అక్క రజిత ‘‘ఏమైందే? నిన్న బాగానే ఉన్నాడు, స్కూల్ కెళ్తున్నాడు అని చెప్పావుగా!’’ అంది ఆదుర్దాగా!‘‘అవన్నీ నువ్వొచ్చాక చెబుతా! రా ముందు’’ ఏడుపు గొంతుతో అంది పద్మ. ‘‘సరే, టెన్షన్ పడకు. వస్తున్నా!’’ అంది రజిత.గంటలో పద్మ ఇంటి ముందుంది రజిత. లోపల చడీచప్పుడు లేదు. కొంచెం ఆందోళన గానే బెడ్రూమ్లోకెళ్లింది. పద్మ ఏడుస్తూ బెడ్‌మీద కూర్చుని ఉంది. బెడ్ మీద అవినాశ్ పడుకుని ఉన్నాడు. ఇంట్లో మరిది శ్రీనివాస్ లేనట్టున్నాడు. పద్మకు ఒక్కడే కొడుకు అవినాశ్. ఐదవ తరగతి చదువుతున్నాడు. దగ్గరగా వెళ్లి ‘‘పద్మా! ఏమైందే!’’ అని భుజంపై చెయ్యి వేసి అడిగింది రజిత. అక్కను చూడగానే ఆమెను పట్టుకొని బావురుమంది పద్మ.‘‘వాడేమైపోతాడోనని భయంగా ఉందే!’’ అని ఏడుస్తూనే ఉంది. అవినాశ్ ఒంటిమీద చెయ్యి వేసి చూసింది రజిత. ఒళ్లు బాగా కాలిపోతోంది. ఒంటి మీద చర్మం కమిలిన గుర్తులు కనిపించాయి. ‘‘ఏమైంది? శ్రీనివాస్ ఎక్కడ?పిల్లవాడికి ఇలాగుంటే ఎక్కడికెళ్లాడు?’’ అందోళనగా అడిగింది రజిత. పద్మ ఏడుస్తూనే ఉదయం జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చింది. రోజూ గొడవలే! ‘‘వీడితో రోజూ ఏదో సమస్య వచ్చి పడుతూనే ఉందక్కా. ఉదయం స్కూల్ నుంచి ఫోన్ రావడంతో నేను మీ మరిది వెళ్లాం. ‘మీ అబ్బాయిని తీసుకెళ్లండి, టీసీ ఇచ్చేస్తాం’ అన్నారు ప్రిన్సిపల్. క్లాస్‌మేట్‌తో గొడవ పడ్డాడట. ఆ పిల్లవాడిని వీడు కొట్టడంతో తలకు దెబ్బతగిలిందట. ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పుడు చూసినా క్లాస్‌రూమ్‌లో కరాటే ఫీట్లు చేస్తాడట. ఈ కరాటే పిచ్చి ఎక్కడ పట్టుకుందో, ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నీకు తెలుసు కదా! ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే. వీడు చేసిన పనికి ఆ పిల్లవాడి తల్లితండ్రులు వచ్చి మమ్మల్ని తిట్టారు. దీంతో శ్రీనివాస్ ఆవేశంలో వీడిని చితకబాదాడు. అడ్డు వచ్చిన నన్ను కూడా తోసేశాడు. బిడ్డకు ఒళ్లంతా వాతలు తేలాయి. బాగా భయపడ్డాడు. జ్వరం వచ్చేసింది. కోపంలో పొద్దుననగా వెళ్లిన శ్రీనివాస్ ఇప్పటిదాకా రాలేదు. ఫోన్ చేస్తే.. ‘ఛస్తే.. చావనీ’ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నాకేం తోచక నీకు ఫోన్ చేశాను’’...ఏడుస్తూనే చెప్పింది పద్మ. అవినాశ్ విషయం రోజూ రజితకు తెలుస్తూనే ఉంటుంది. మూడేళ్ల వయసు నుంచే ‘హ.. హు....’ అంటూ కరాటే ఫైట్లు చేసేవాడు. అడ్డున్న వస్తువులు వాడి ఫీట్లకు ముక్కలవ్వాల్సిందే! స్కూల్‌కి వెళ్లమంటే మాత్రం చుక్కలు చూపించేవాడు. కరాటే స్కూల్లో చేర్పించమంటే శ్రీనివాస్ వినేవాడు కాదు. చదువుపై శ్రద్ధ ఉండదు వేరే వ్యాపకాలుంటే బుద్ధిగా చదువుకోమని హెచ్చరించేవాడు. అవినాశ్ మొండిగా ప్రవర్తించేవాడు. విసిగినప్పుడల్లా తిడుతూనో, కొడుతూనో వాడిని అదుపులో పెట్టాలనుకునేవాడు శ్రీనివాస్. ఆలోచనల నుంచి తేరుకున్న రజిత ‘ఆసుపత్రికెళ్దాం పద’ అని బయల్దేరదీసింది. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకునేసరికి శ్రీనివాస్ వచ్చి ఉన్నాడు. కొడుకు పరిస్థితి చూసిన శ్రీనివాస్‌కు కళ్లనీళ్లు ఆగలేదు. కోపంలో ఎంతగా కొట్టిందీ గుర్తు తెచ్చుకొని మరీ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు.‘‘వీడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడంలేదొదినా! అన్నీ టైమ్‌కి అమర్చి పెడుతున్నా చదువుకోకుండా ఈ పిచ్చిపనులేంటో’’ అన్నాడు శ్రీనివాస్. ‘‘శ్రీనివాస్! నేను చెప్పిన చోటుకి వాడిని తీసుకొస్తే సమస్యేంటో మీకూ, వాడికీ తెలుస్తుంది. అప్పుడీ గొడవలూ, ఏడ్పులూ ఉండవు’’ అంది రజిత. ‘‘అక్కా! ఏదైనా చేయి. ఎక్కడకు రమ్మన్నా వస్తాం. వాడు బాగుపడితే అంతే చాలు!’’ అంది రజిత చేతులు పట్టుకొని పద్మ. వెలుగు చూపిన ప్రయాణం అవినాశ్ చుట్టూ ఆసక్తిగా చూస్తున్నాడు. తల్లీ తండ్రి అక్కడ ఉన్న అతనితో తన గురించి చెబుతుంటే మౌనంగా వింటున్నాడు. అన్నీ విన్న కౌన్సెలర్ అవినాశ్‌కు దగ్గరగా వచ్చి అతణ్ణి మెత్తని వాలు కుర్చీలో కూర్చోబెట్టాడు. ‘‘అవినాశ్! ఇక్కడ నీకు నచ్చినట్టే ఉండు. అమ్మా నాన్న ఏమీ అనరు. వాళ్లు ఏమైనా అన్నా మేం ఊరుకోం. మేం చెప్పినట్టు చేస్తావా?’’ అని అడిగాడు. ‘చేస్తాను’ అన్నట్టు తల ఊపాడు అవినాశ్. ‘‘అవినాశ్! కళ్లు మూసుకొని ప్రశాంతంగా పడుకో. ఏ భయాలూ పెట్టుకోకు. నేను అడిగినప్పుడు నీ కళ్ల ముందు ఏమేం కనిపిస్తాయో, అనిపిస్తున్నాయో అవన్నీ చెబుతూ ఉండు..’’ కౌన్సెలర్ చె ప్పాడు. ఎదురుగా కౌన్సెలర్, అమ్మనాన్న, పెద్దమ్మ.. వారందరినీ చూసి కళ్లు మూసుకొన్నాడు అవినాశ్. పది నిమిషాలు నిశ్చల స్థితిని అనుభవించేంత సమయం ఇచ్చిన కౌన్సెలర్ అవినాశ్‌కు సూచనలివ్వడం ప్రారంభించాడు. అవినాశ్ అంతర్ చేతనలో తను ఎక్కడ ఉన్నది, ఏమేం చేస్తున్నది, దృశ్యంగా కనిపిస్తున్నవి ఏంటి... వరుసగా చెబుతున్నాడు. పద్మ, రజిత, శ్రీనివాస్‌లు మౌనంగా చూస్తున్నారు. అవినాశ్ చెబుతున్నాడు.. ‘అమ్మ దగ్గర ఆడుకోవడం, అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగుంది. ఈ స్కూల్ అంటే ఇష్టం లేదు. చదువంటే భయం. నా కంపాస్ బాక్స్ కిశోర్ లాక్కున్నాడు. అడిగితే నన్ను కొట్టాడు. నేను ఒక్క ‘కిక్’ ఇచ్చాను. అంతే, గొడకు కొట్టుకొని దెబ్బ తగిలింది. టీచర్ నన్నే కొట్టింది. నేను ఆ టీచర్‌కీ కిక్ ఇచ్చాను. నాన్న నన్ను కొడుతున్నాడు. నాన్నా... నన్ను కొట్టద్దు నాన్నా! ప్లీజ్ నాన్నా!’ అంటున్న అవినాష్ బుగ్గల మీద ధారాపాతంగా కన్నీళ్లు. అవినాశ్ స్థితిని చూస్తున్న పద్మ, రజిత, శ్రీనివాస్‌లు విలవిలలాడిపోయారు. కౌన్సెలర్ సూచనలు అవినాశ్‌కు ఇంకా అందుతున్నాయి. ‘‘నీకు ఇంకా ఏం ఇష్టం, ఇంకా వెనక్కి వెళ్లగలవు. అది నీ గత జీవితం అవుతుంది. ప్రయత్నించు’’ అని చెప్పాడు. అవినాశ్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. అంతా విచిత్రంగా చూస్తున్నారు. ‘నా ఊరు చైనాలో ఉంది. నాకు ‘నింజా’ అనే కరాటే స్కూల్ ఉంది. నేను టీచర్ని. శిష్యులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే నాకు ప్రాణం. నేను ముసలోడినైపోయాను. నా స్కూల్ పాడైపోతోంది, ఎవరూ పట్టించుకోవడంలేదు. నేను అక్కడికే వెళ్లిపోతాను’ ...పలవరిస్తున్నట్టుగా చెబుతున్నాడు అవినాశ్. అవగాహనతో సాధన థెరపీ పూర్తయింది. అవినాశ్‌ను విశ్రాంతి తీసుకోమని చెప్పి పద్మ, శ్రీనివాస్‌లను బయటకు తీసుకువచ్చారు కౌన్సెలర్. ‘‘శ్రీనివాస్! మీరూ విన్నారుగా అవినాశ్ అంతర్చేతనంలో ఎలాంటి భావాలున్నాయో! అవి ఇప్పటివి కాదు. అతని గత జన్మలోనివి. కరాటే అంటే అతనికి ప్రాణం. అతని కల తీరకుండానే మరణించి, అదే ఊపిరిగా తిరిగి జన్మించాడు. తను ఏం చేయాలనుకొని ఈ భూమ్మీదకు వచ్చాడో ఆ పనికి అడ్డుపడకండి. పెద్దలుగా మీకున్న కలలు మీ బిడ్డ మీద రుద్దకుండా అతడికి ఏమవ్వాలని ఉందో దాంట్లో తర్ఫీదు ఇప్పించండి. మీ బిడ్డ జీవితం మెరుగవుతుంది’’ అన్నారు కౌన్సెలర్. ‘తప్పకుండా’అన్నారు శ్రీనివాస్, పద్మ మనస్ఫూర్తిగా. ఇప్పుడు అవినాశ్‌కి పధ్నాలుగేళ్లు. 8వ తరగతి చదువుతున్నాడు. కౌన్సెలర్ సూచనల ప్రకారం అవినాశ్‌ను కరాటే స్కూల్లో చేర్పించాడు శ్రీనివాస్. కరాటేలో రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చదువు ఇష్టం లేదన్నా, మెల్లగా తన మనసును అక్షరాలపై కుదిరేలా చేసుకున్నాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వాలనే ధ్యేయంతో సాధన చేస్తున్నాడు. 3 వేల మంది పిల్లలపై పరిశోధన డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అమెరికాలో ప్రముఖ సైకియాట్రిస్ట్. వర్జీనియా విశ్వవిద్యాలయంలో 50 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. 40 ఏళ్ల వయసులో ప్రపంచంలోని 3000 మంది పిల్లల నుంచి రిగ్రెషన్ థెరపీ ద్వారా వారి గత జీవితం తాలూకు విశేషాలను రాబట్టారు. దీని బట్టి, ‘చేతన’ ప్రయాణం ఎప్పటికీ ఆగిపోదని బలంగా చెప్పారు అయాన్. బాల మేధావులెందరో..! కొంతమంది పిల్లల్లో అసాధారణ కళ, నైపుణ్యం ఆశ్చర్యపరుస్తుంటుంది. కిందటి జన్మలో ఆ కళ పట్ల వారికి అపారమైన అనుభవం, అభిమానం ఉండి ఉంటాయి. దాన్ని పూర్తి చేసుకో లేక తమ పుట్టుకతో పాటూ ఈ జన్మకూ మోసుకువస్తారు. తమకు నచ్చిన ఆ కళనే సాధన చేస్తుంటారు. అంతః చేతనలో ఉండే ఆ కళను వారు దర్శించగలిగితే సాధనమార్గాలు సులువు అవుతాయి. నైపుణ్యం పెరుగుతుంది. - డాక్టర్ లక్ష్మీ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చి అకాడమీ, హెదరాబాద్ జ్ఞాపకాల గని కరోల్ బౌమ్యాన్ పాస్ట్ లైఫ్ థెరపిస్ట్. పరిశోధకురాలు. పిల్లల గత జీవిత జ్ఞాపకాలను వెలికి తీసి ‘చిల్డ్రన్ పాస్ట్ లైవ్స్’ (పిల్లల గత జీవితాలు) పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకం ప్రపంచంలో 22 భాషల్లో అనువాదమైంది. మొజార్ట్ కూడా అంతే! మొజార్ట్ ఆస్ట్రియావాసి. కీబోర్డ్, వయొలిన్ అంటే పిచ్చి. ఎవరూ అతనికి సంగీతనం నేర్పించలేదు. కానీ, సమర్థంగా రాగాలను పలికించేవాడు. 5 ఏళ్ల వయసులోనే యురోపియన్ రాజవంశీయుల ముందు తన సంగీత ప్రతిభను చూపి ప్రశంసలు అందుకున్నాడు. సంగీతంలో ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు. - నిర్మల చిల్కమర్రి -
అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక
కరీంనగర్ స్పోర్ట్స : ముంబయిలోని అంథేరి వెస్ట్ సెలబ్రేషన్స స్పోర్ట్స కాంప్లెక్స్‌లో బుధవారం ఈనెల 27 వరకు నిర్వహించే అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స కరాటే పోటీలకు ఇంటర్నేషనల్ గొజిరాయ్ అకాడమీ విద్యార్థులు ఎంపికై నట్లు చీఫ్ ఇన్స్ట్రక్టర్ అన్వర్‌ఖాన్ తెలిపారు. అండర్-14లో అర్మాన్ఖాన్, ఫర్హాన్‌ఖాన్, అలం, ఫరీద్, సుల్తాన్, అండర్-17లో అజార్‌ఖాన్, ఉమర్ఖాన్, షేక్ సల్మాన్, అండర్-19లో అబ్దుల్లా, అనిల్, శైలేందర్, సారుు, స్వేబ్, షేక్ సజ్జాత్ ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరిని ఇన్స్ట్రక్టర్లు అబ్బర్ఖాన్, విమల, ఫైమిదా ఖాటూన్, శశిధర్, రమణ అభినందించారు. -
ఒలింపిక్స్ ప్రాబబుల్స్‌లో చోటు
హిందూపురం టౌన్ : హిందూపురం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న వి.రిత్విక్ జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి ఒలింపిక్స్ ప్రాబబుల్స్‌లో స్థానం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మేరి, కోచ్ రామచంద్రలు సోమవారం తెలిపారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రిత్విక్ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతిని సాధించి సినీనటుడు సుమన్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. అదే విధంగా త్వరలో ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు అర్హత సాధించాడని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్, కోచ్‌తో పాటు ఎఓ ప్రభాకర్‌రెడ్డి, డీన్ నాగరాజు, తల్లిదండ్రులు వెంకటేష్, అరుణలు అభినందించారు. -
జాతీయ కరాటే పోటీలు ప్రారంభం
హైదరాబాద్: ఏఐబీకేఎఫ్ జాతీయ కరాటే చాంపియన్‌షిప్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పద్మారావు శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరాటే అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని క్రీడాశాఖ మంత్రి పద్మారావు అన్నారు. కరాటే అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా ఆయన 2 లక్షల విరాళం ప్రకటించగా... ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఐఎం నేత శ్రీశైలం యాదవ్ కరాటే సంఘానికి లక్ష రూపాయల విరాళం అందించారు. ఆత్మవిశ్వాసానికి, దృఢచిత్తానికి, మనోబలానికి కరాటే ఎంతో ఉపకరిస్తుందని బూడోకాన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సుమన్ అన్నారు. తమ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. -
కిక్ ఇస్తే ఖంగు తినాల్సిందే!
– కరాటేలో రాణిస్తున్న విద్యార్థినులు వీరు కిక్ ఇచ్చారంటే ప్రత్యర్థి ఖంగు తినక తప్పదు. అమ్మాయిలే కదా అనుకుని వీరితో తలపడితే ఇక అంతే సంగతులు. కరాటేలో అబ్బాయిలకు సైతం ఏ మాత్రం తీసిపోకుండా పాఠశాల స్థాయిలో మొదలు పెట్టిన కరాటే ఇప్పుడు వీరిని జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించే దిశగా తీసుకెళ్లింది. శిక్షకుల సూచనలను ఆచరిస్తూ ముందుకు సాగుతూ జాతీయ స్థాయిలో పతకాలను సాధించారు పరిగి మండలం శాసనకోటకు చెందిన కె.లత, ఆర్.నందిని, బి.జోత్సS్న. పేద వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ప్రతిభకు ఏదీ అడ్డురాదంటూ నిరూపిస్తూ ముందుకు సాగుతున్నారు. శాసనకోటకు చెందిన కె.నాగభూషణం, కె.శారదమ్మ కుమార్తె కె.లత. 6వ తరగతి నుంచి కరాటేను నేర్చుకుంటోంది. ప్రస్తుతం హిందూపురం పట్టణంలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంఈసీ చదువుతోంది. పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాణిస్తూ బంగారు పతకాలను సాధించింది. గౌరీబిదనూరులో జరిగిన జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు, హిందూపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కరాటే పోటీల్లో రాణించి పలు పతకాలు సాధించింది. ప్రస్తుతం ఇంటర్లో ఎంఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆర్.నందిని శాసనకోటకు చెందిన ఎన్.నరసింహమూర్తి, చెన్నమ్మల కుమార్తె. ఈమె ఆరు సంవత్సరాలుగా కరాటేలో శిక్షణ పొందుతోంది. జిల్లా స్థాయి, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కరాటేలో ప్రతిభను చూపుతూ బంగారు పతకాలను సాధించింది. గౌరీబిదనూరు, హిందూపురంలో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ ముందుకు సాగుతోంది. 6వ తరగతి నుంచి జాతీయస్థాయి కరాటే పోటీల్లో రాణిస్తోంది బి.జోత్సS్న. ఈమె శానసనకోటకు చెందిన బి.ప్రకాష్‌రాజ్, ఎస్.శాంతకుమారిల కుమార్తె. ప్రస్తుతం ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి కరాటేపై మక్కువ పెంచుకుంది. ఇప్పటికే గౌరీబిదనూరు, హిందూపురంలో రెండు సార్లు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో, రాష్ట్ర స్థాయి పోటీల్లో తన సత్తాను చాటి బంగారు పతకాలను, షీల్డులను సాధించింది. ప్రభుత్వాలు సాయమందించాలి కరాటేలో రాణించే క్రీడాకారులకు ప్రభుత్వాలు సాయమందించాలి. పేదరికంలో ఉన్నప్పటికి విద్యార్థినులు కరాటేపై మక్కువతో జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. వీరిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగే సత్తా ఉంది. ఆ దిశగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. – జనార్దన్‌రెడ్డి, కోచ్, హిందూపురం -
ముగిసిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
పెనుబల్లి : స్థానిక సప్తపది ఫంక్షన్హాల్లో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కరాటే పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటేను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. పెనుబల్లి లాంటి మారుమూల ప్రాంతాల్లో కరాటేను ప్రజల్లోకి తీసుకెళ్లిన కరాటే మాస్టర్ శ్రీకాంత్‌ను ఆభినందించారు. మహిళల ఆత్మరక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం తుదిపోరును తిలకించారు. అంతకుముందు ఈ పోటీలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కరాటే మాస్టర్లు, స్థానిక నాయకులు మట్టా దయానంద్ విజయ్‌కుమార్, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, చీకటి రామారావు, చెక్కిలాల మోహన్‌రావు, ముక్కర భూపాల్‌రెడ్డి, కీసర శ్రీనివాస రెడ్డి, పిల్లి నవజీవన్, అలుగోజు చినస్వామి పాల్గొన్నారు. -
కరాటేలో సత్తా చాటిన జిల్లా కుర్రాళ్లు
ఏలూరు రూరల్ : కరాటే పోటీల్లో జిల్లా కుర్రాళ్లు సత్తా చాటారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కరాటే చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఏలూరుకు చెందిన పి.సాయికుమార్ జూనియర్ కలర్ బెల్ట్ అంశంలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించాడు. ఇదే విభాగంలో పాల్గొన్న వై.రమేష్‌బాబు, కె.జ్ఞాన నాగసాయి బ్రాంజ్‌మెడల్ సొంతం చేసుకున్నారు. జూనియర్ కలర్ బెల్ట్ కుమితేలో ఎస్.సురేష్ సిల్వర్, బి.నాగబాబు బ్రాంజ్‌మెడల్ సాధిం చినట్టు శిక్షకుడు వి.దిలీప్‌కుమార్ తెలిపారు. -
కరాటే జిల్లా జట్టు ఎంపిక
బాపట్ల టౌన్: జిల్లా స్థాయి కరాటే పోటీలు ఈనెల 4, 5తేదీల్లో బాపట్లలో ఉంతో ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి 100 మంది ఈపోటీల్లో పాల్గొనగా 15మందిని రాష్ట్రజట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో సిహెచ్ హర్ష, కె.పృధ్వీ, కె.కళ్యాణ్, సిహెచ్ పవన్, టి.సంతోష్, బి.రామకోటి, తేజ, కె.కారుణ్య, బి.ఎన్.వి.శ్రీలక్ష్మీ, డి.హర్ష, కార్తీకేయ, బి.సాయిమోహన్, కె.ధనుజయ్, డి.తరుణ్, కె.సత్య ఉన్నారు. ఈమేరకు మంగళవారం స్థానిక రోటరీక్లబ్‌లో జిల్లా కరాటే అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపికైన వారిని అభినందించింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు యర్రా నాగేశ్వరరావు, తిరుపతిరావు, రుద్రరాజు అంజిరాజు, రోటరీక్లబ్ ప్రెసిడెంట్ సురేష్, ఇంటర్నేషనల్ కరాటే నిపుణులు కొండ్ర కీరన్ తదితరులు పాల్గొన్నారు. -
కరాటేలో జిల్లాకు పతకాల పంట
భోగాపురం (పెదవేగి రూరల్) : రాష్ట్రస్థాయి కరాటే సుమన్ కప్ –2016 చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు పతకాల పంట పండించారు. గత నెల 28న విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ పోటీలు నిర్వహించగా అన్ని విభాగాల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. స్థానిక విజ్ఞాన్ గ్లోబల్ జెన్ విద్యార్థులు ఏడు పతకాలు సాధించినట్టు ప్రిన్సిపాల్ బీఎస్ఎన్ మణి బుధవారం విలేకరులకు తెలిపారు. తమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జి.వాసుదేవ్, జి.అఖిల్ రాఘవ, కేఎ¯Œæవీవీ హనుమ, ఎ.చాణక్య వివిధ విభాగాలలో 3 బంగారు, 2 రజత, 2 కాంస్య పతకాలు మొత్తం 7 పతకాలు సాధించినట్టు చెప్పారు. ఈ పోటీలలో 10 జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొనగా పశ్చిమగోదావరి నుంచి 80 మంది విద్యార్థులు హాజరైనట్టు చెప్పారు. విద్యార్థులను, శిక్షకులు ఇబ్రహిమ్ బేగ్, లక్ష్మణరావులను విజ్ఞాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ప్రిన్సిపాల్ బీఎస్ఎన్ మణి, మేనేజర్ బి.అప్పారావు, ఉపాధ్యాయులు అభినందించారు. భాష్యం విద్యార్థుల ప్రతిభ కొవ్వూరు : కొవ్వూరు భాష్యం పాఠశాల విద్యార్థులు కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఎం.రసూల్‌ఖాన్ తొమ్మిదేళ్ల విభాగంలో బంగారు పతకం, 14 ఏళ్ల విభాగం కటాలో ఎన్ఎల్ హేమంత్ వెండి పతకం సాధించినట్టు ప్రిన్సిపాల్ జె.సూర్యనారాయణ చెప్పారు. విద్యార్థులను ఆయనతో పాటు జోనల్ ఇన్చార్జ్ జీఎన్ సత్యనారాయణ, లిటిల్ చాంప్స్ ప్రిన్సిపాల్ కె.మల్లేశ్వరి, కరాటే ఇన్స్ట్రక్టర్ మీసాల రాధ తదితరులు అభినందించారు. సత్తాచాటిన ‘ఐడియల్’ విద్యార్థులు జిన్నూరు (పోడూరు) : రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో జిన్నూరు ఐడియల్ స్కూల్‌కు చెందిన పలువురు విద్యార్థులు పతకాలు సాధించారు. అండర్–12 బాలికల కటా విభాగంలో ఎన్.వైష్ణవి బంగారు, కాంస్య పతకాలు, ఎం.రాజవంశీ 2 వెండి పతకాలు, పి.పవన్‌కార్తీక్, కేఎస్ఎస్ పవన్, వారణాశి వెంకట సూర్య చంద్రమౌళి కాంస్య పతకాలు, డి.దుర్గారామ్‌చరణ్ ప్రశంసాపత్రాన్ని సాధించినట్టు స్కూల్ కరస్పాండెంట్ ఏవీ సుబ్బారావు చెప్పారు. కరాటే శిక్షకులు ధనాని సూర్యప్రకాష్, సీహెచ్.లక్ష్మీనారాయణ, ఎన్.అప్పలస్వామితో పాటు విద్యార్థులను పలువురు అభినందించారు. -
అంతర్జాతీయ కరాటే పోటీలకు జనగామ విద్యార్థులు
జనగామ :పాండిచ్చేరి రాష్ట్రంలో ఈనెల 26 నుంచి 30 వరకు జే ఎస్.కలామణి–గ్రాం డ్ మాస్టర్ టకేషి మ సూయమ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న అం తర్జాతీయ రైషూన్కాన్ షిటో రియో కరాటే చాంపియన్ షిప్ పోటీలకు జనగామ విద్యార్థులు ఎంపికయ్యారు. గతనెల 31న జాతీయ స్థాయిలో ఏడేళ్ల నుంచి యాభై యేళ్ల వరకు జరిగిన కాన్షిటో రియో కరాటే పోటీల్లో మేకల తరుణ్, ఎండీ మైపోజ్, సాత్విక్, రొడ్డ విశాల్ పాల్గొని బంగారు పథకం సాధించారు. దీంతో వారు అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించినట్లు రైషూన్కాన్ షిటోరియో తెలంగాణ చీఫ్ జి.ధన్‌రాజ్, గ్కాండ్ మాస్టర్ ఎం.సలీంపాషా తెలిపారు. -
ఆ విద్య ఇప్పుడు పనికొస్తుంది: హీరోయిన్
'కంచె' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత తెలుగు సినిమాలో మెరిసిందే లేదు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న 'నక్షత్రం' సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నారామె. పోలీసాఫీసర్ పాత్రలో అలరించనున్న ఆమె దీనిపై మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ఇంత త్వరగా పోలీసాఫీసర్ పాత్రలో నటించే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ విషయంలో చాలా ఆత్రుతగా ఉన్నాను. వాటిలో ఒకటి సందీప్‌తో చేసే ఫైట్. ఐదు సంవత్సరాలపాటు కరాటేలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించాను. నేను నేర్చుకున్న ఆ విద్య ఇప్పుడిలా ఉపయోగపడుతుంది. షూటింగ్ త్వరగా మొదలవ్వాలని కోరుకుంటున్నాను. కృష్ణవంశీ సార్‌తో పనిచేయడం కల నిజమవడంలాంటిది' అంటూ తన సంతోషాన్నంతా చెప్పుకొచ్చింది ప్రగ్యా. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తేజుకి జంటగా ప్రగ్యా కనిపించనున్నారు. కాగా హీరో సందీప్ సరసన రెజీనా హీరోయిన్గా అలరించనున్నారు. ఇంతమంది స్టార్స్ కనువిందు చేయనున్నారన్న వార్తతో 'నక్షత్రం' సినిమాపై కృష్ణవంశీ అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. -
అన్న పంచ్ విసిరితే మాస్ చెల్లి కిక్ కొడితే మటాష్
కరాటేలో రాణిస్తున్న అన్నా చెల్లెలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణింపు మల్కాపురం :క్రీడల్లో ప్రతిభ చాటుతున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటిది ఒకే ఇంట్లో ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలతో దుమ్ముదులుపుతున్నారు. మల్కాపురం ప్రాంతానికి చెందిన జీవీఎన్ శేషు, జి.పద్మావతిలకు ఇద్దరు పిల్లలు. రేవంత్, నమ్రత. రేవంత్ఇంటర్ చదువుతుండగా..నమ్రత తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇద్దరూ కరాటేలో బంగారు,వెండి పతకాలతో సత్తాచాటుతూ వారెవ్వా అనిపిస్తున్నారు. రేవంత్ చిన్నతనం నుంచి సినిమాల్లో ఫైట్లు చూసి ఇంట్లో డిష్యూం డిష్యూం అంటూ తల్లిదండ్రులతో ఆడుకునేవాడు. క్రమంగా ఫైటింగ్‌పై రేవంత్‌కున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు నగరంలో ప్రముఖ కరాటే శిక్షకుడు ఎం.సుందరం వద్ద చేర్పించారు. అప్పుడు రేవంత్ వయసు కేవలం తొమ్మిదేళ్లు. ఇక్కడ శిక్షణ తీసుకుని 2008లో తొలిసారిగా నగరంలో స్వర్ణభారతి స్టేడియం వద్ద జరిగిన కరాటే పోటోల్లో ప్రతిభ చూపి బ్రాంజ్ మెడల్ సాధించాడు. కేరళలో 2008 సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ పోటీల్లో చక్కటి ప్రతిభ చూపి సిల్వర్ మెడల్ సాధించాడు. 2011లో అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. అక్కడ నుండి అనేక పోటీల్లో తన ప్రతిభ చూపి అనేక మెడల్స్,సర్టిఫికెట్లు సాధించాడు.ఇంత వరకు రేవత్ 40 గోల్డు,20 సిల్వర్,22 బ్రాంజ్ మెడల్స్ సాధించాడు.ఎంతో మంది ప్రముఖుల మన్నలను పొందాడు. అన్నను చూసి.. తన అన్న కరాటేలో చూపుతున్న ప్రతిభకు స్ఫూర్తితో నమ్రత కూడా కరాటేపై మక్కువ పెంచుకుంది. అన్న చేరిన గురువు వద్దే శిక్షణ తీసుకుని సత్తాచూపుతోంది. ఏడో ఏటనే కరాటేలో చేరి అద్భుత ప్రదర్శన చూపి గురువుల మన్నలను పొందింది.నమ్రత కూడా అనేక పోటీల లో పాల్గొని పలు బహుమతులు సాధించింది. ప్రస్తుతం తోమ్మిదో తరగతి చదువుతున్న నమ్రత ఇంత వరకు 25 గోల్డు,16 సిల్వర్,20 బ్రాంజ్ మెడల్ సాధించింది. తమ ఇద్దరు పిల్లలు కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి పతకాలు తీసుకురాడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కరాటేతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది
వరంగల్ స్పోర్ట్స్ : కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంపెంపొందుతుందని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. రియో చిం కాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హంట ర్ రోడ్‌లోని సీఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం జాతీ య స్థాయి ఓ పెన్ టు ఆల్ కరాటే పోటీలు నిర్వహించారు. జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాల్సిన బాధ్యత పేరెంట్స్‌పై ఉందన్నారు. కాగా, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 500 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారని టోర్నీ నిర్వాహకæ కార్యదర్శి, గ్రాండ్ మాస్టర్ ధన్‌రాజ్ తె లిపారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఆగ స్టు 26 నుంచి 30 వరకు పాండిచ్చేరిలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొం టారన్నారు.కార్యక్రమంలో జేఎస్ కలైమణి, సాల్మ న్, మహమూద్ అలీ, వివేక్ పాల్గొన్నారు. -
స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ బ్రోచర్ విడుదల
కొత్తవలస: 38వ రాష్ట ఓపెన్కరాటే చాంపియన్‌షిప్ సుమన్కప్ 2016 పోటీలకు సంబంధించిన బ్రోచర్లను విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు విశాఖలో శనివారం విడుదల చేశారు. ఈ పోటీలను కొత్తవలస మేజరుపంచాయతీ శివారు రాజపాత్రునిపాలెం సమీపంలో ఉన్న సెయింట్‌జార్జ్ విద్యాసంస్థల ఆవరణలో నిర్వహిస్తామని నిర్వాహకులు బీవీ.అప్పారావు తెలిపారు.ఈ పోటీలలో 10జిల్లాలకు చెందిన కరాటేచాంపియన్స్ పాల్గొంటారని చెప్పారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా డీఎల్.నారాయణ(ఏకేపీ జడ్జి)మిర్జా ఇబ్రహీం,సిహెచ్.నాగరాజులు వ్యవహరిస్తారన్నారు. ఈ ప్రాతంలో రాష్ట్రస్థాయి కరాటేపోటీలు నిర్వహించడం ప్రథమమని తెలిపారు.జపాన్ సాటోకాన్ కరాటే డు కనన్జుకో ఆర్గనైజేషన్ ఇండియా(బారతప్రభుత్వం గుర్తించిన సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ పోటీలకు రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్స్ మాత్రమే కాకుండా జాతీయస్థాయి కరాటే చాంపియన్స్ కూడా హాజరవుతారని వివరించారు. -
జాతీయ కరాటే పోటీల్లో పతకాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా రెడ్డి జనసంఘ్ ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన 3వ జాతీయస్థాయి కరాటే పోటీల్లో జిల్లా క్రీడాకారులు తొమ్మిది పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో క్రీడాకారులను జిల్లా కరాటే అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, జిల్లా అ««దl్యక్షుడు కృష్ణయ్యగౌడ్ అభినందించారు. జాతీయస్థాయి కరాటేలో జిల్లా క్రీడాకారులు మంచి నైపుణ్యం ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. మార్షల్ ఆర్ట్స్‌కు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇచ్చి, కరాటే మాస్టర్లకు ఉపాధి కల్పించాలని కోరారు. రాష్ట్ర పాఠశాలల క్రీడల కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు ఎతినె చెన్నయ్య మాట్లాడుతూ జపాన్ కరాటే అసోసియేషన్ షోటోకాన్ ఆధ్వర్యంలో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. జాతీయస్థాయి కరాటే బ్లాక్‌బెల్టు విభాగంలో రమేశ్‌రాథోడ్ (నవాబ్‌పేట) స్పైరింగ్, ఓంకార్ (షాద్‌నగర్) కతాస్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నట్లు తెలిపారు. మహిళల బ్లాక్బెల్టులో యశోధ (మహబూబ్‌నగర్), జూనియర్స్‌లో భూత్పుర్ కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు లత ప్రథమ, శిరీష, సంధ్య ద్వితీయ, సబ్ జూనియర్ విభాగంలో మోహన్ శ్రీకాంత్, శివప్రసాద్‌లు మొదటి మూడుస్థానాల్లో నిలిచి పతకాలు పొందినట్లు తెలిపారు. వీరికి మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేసినట్లు వెల్లడించారు. క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. -
అర్జున్ అదిరెన్
కరాటేలో రాణిస్తున్న గిరిపుత్రుడు ‘ఆల్ ఇండియూ కునిబకాయ్డు’ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం చైనాలో జరిగే అంతర్జాతీయ స్థారుు పోటీలకు అర్హత ‘మందలో ఒకరిగా కాకుండా వందలో ఒకరిగా ఉండు..’ అని స్వామి వివేకానందుడు చెప్పిన సూక్తిని ఈ యువకుడు ఆచరించాడు. పేదరికం వెంటాడినా.. కష్టాలు చుట్టుముట్టినా.. అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో ముందుకుసాగాడు. ఈ మేరకు తనకు ఇష్టమైన కరాటేలో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు ఆ గిరిపు త్రుడు. కష్టపడితే విజయం ఎన్నటికైనా వరిస్తుందని ఆశిస్తున్నాడాయన. ‘శ్రమయేవ జయతే’ అని నినదిస్తున్న కరాటే కింగ్ అర్జున్‌పై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. గూడూరు : మండలంలోని బొల్ల్లేపల్లి శివారులోని బంచరాయితండాకు చెందిన బానోతు ఈర్యా, కాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు అర్జున్‌కు కరాటే అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఈర్యా, కాంతమ్మలు తమకున్న రెండెకరాల పొలాన్ని సాగుచేస్తూ ఇద్దరు కొడుకులను చదివిస్తున్నారు. కాగా, అర్జున్ 1 వ తరగతి నుంచి 10 వరకు గూడూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నాడు. 2009లో పదో తరగతి వచ్చే సరికి ఆయనకు కరాటే నేర్చుకోవాలనే కోరికి పుట్టింది. ఈ క్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లి కరాటే ఎవరు నేర్పిస్తారని అడుగగా.. నర్సంపేటలో కరాటే మాస్టర్లు ఉంటారని చెప్పారు. రచ్చ శ్రీనివాస్ దగ్గర శిక్షణ.. పదో తరగతి పాసైన తర్వాత అర్జున్ నర్సంపేటలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరాడు. ఈ సమయంలో ఆయనకు కరాటే కోచ్ రచ్చ శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్ కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్) పరిచయమయ్యాడు. దీంతో అర్జున్.. రచ్చ శ్రీనివాస్ నడిపిస్తున్న జపాన్ కరాటే క్లబ్లో చేరి శిక్షణ పొందాడు. నాలుగేళ్లలోనే ఎన్నో మెలకువలు నేర్చుకొని, జాతీయస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. పసిడి పతకం సాధించడమే లక్ష్యం... 2014లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలో పాల్గొని అంతర్జాతీయస్థాయికి పోటీలకు అర్హత సాధించడం ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకొని మంచిపేరు తెచ్చుకోవాలనే తపన మా గురువు రచ్చ శ్రీనివాస్ వల్ల నెరవేరింది. మాస్టర్ సహకారంతో అంతర్జాతీయస్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించి దేశానికి పేరు తీసుకొస్తాను. -బానోతు అర్జున్ పతకాల పంట.. శిక్షణ పొందుతున్న క్రమంలోనే అర్జున్ జిల్లా, రాష్ర్ట, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. ఈ మేరకు పలు ఈవెంట్లలో 4 పసిడి పతకాలు, 2 సిల్వర్ మెడల్స్, పలుమార్లు బ్లాక్‌బెల్టులు సాధించాడు. స్పారింగ్, కటాస్, గ్రూప్ కటాస్ ఇలా ప్రతీ విభాగంలో సత్తాచాటుతూ పతకాలు సాధిస్తున్నాడు. కాగా, 2015లో మానుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన అర్జున్ ప్రస్తుతం ఖమ్మంలో హెచ్‌పీటీ చేస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు అర్హత.. 2014లో కాజీపేటలో జరిగిన రెఫరీ ట్రైనింగ్ ఎంపికలో అర్జున్ పాల్గొని కరాటేకు సంబంధించిన అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచాడు. ఈ మేరకు ఢిల్లీలో అదే ఏడాది జరిగిన ‘ఆల్ ఇండియా కునిబకాయ్డు చాంపియన్‌షిప్’లో కాంస్య పతకం సాధించి మరో నాలుగు నెలల్లో చైనాలో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించాడు. 2014లో నర్సంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఒక్క టోర్నమెంట్‌లోనే నాలుగు విభాగాల్లో రెండు చొప్పున బంగారు, వెండి పతకాలు సాధించాడు. డిగ్రీ చదువుతూనే మూడు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. పది పూర్తిచేసిన తన తమ్ముడికి కూడా కరాటే నేర్పిస్తున్నారు. -
'ఆమె' ప్రపంచాన్ని జయించింది!
ఆమె ఇప్పుడు ప్రపంచాన్ని జయించింది. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ టెలివిజన్ సర్వీస్ తీస్తున్న డాక్యుమెంటరీకి కథగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న లింగ వివక్షపై సానుకూల మార్పులను ప్రోత్సహించే నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రానికి కథాంశమైంది. కోల్ కత్తా మురికివాడలనుంచి పుట్టిన ముత్యంలా.. అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ గా పేరు తెచ్చుకోవడమే కాక... డాక్యుమెంటరీకి ఎంపికైన ఏకైక భారతీయురాలుగా అయేషా నూర్ గుర్తింపు పొందింది. మూర్ఛరోగం, పేదరికంతో పోరాడుతూనే తన లక్ష్యాన్ని సాధించింది కోల్ కత్తా మురికి వాడకు చెందిన 19ఏళ్ళ యువతి అయేషా నూర్. తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ మరణించినా.. ఆమె వెనుకంజ వేయలేదు. తన కరాటే కోచ్ ప్రోత్సాహంతో ప్రపంచ ప్రఖ్యాత బ్లాక్ బెల్ట్ ను సాధించింది. ఐదు దేశాలకు చెందిన ఐదుగురు యువతుల వ్యక్తిగత గాధలను ఐటీవీ సర్వీసెస్ తెరకెక్కించింది. ఐదుగురి కథాంశం ఒకేలా ఉన్నా... ఒక్కో యువతీ ఇతర యువతులకు ఒక్కో రకంగా సహాయం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంటారు నెదర్లాండ్ కు చెందిన చిత్ర నిర్మాత కోయెన్ సూయిడ్ గీస్ట్. కోల్ కత్తాలోని మురికివాడకు చెందిన మాఫిడల్ ఇస్లాం లైన్ లోని రెండు బిర్యానీ దుకాణాల మధ్య ఉన్న ఒకే ఒక్క గదిలో అయేషా కుటుంబం నివసిస్తోంది. థాయ్ పిఛాయ్ ఇంటర్నేషనల్ యూత్ కరాటే ఛాంపియన్ షిప్ కు సారధ్యాన్ని వహించిన అయేషా... పన్నెండు మంది సభ్యులున్న భారత జట్టులో ఒకే ఒక్క యువతి. 2012 లో రాష్ట్ర, జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ లో మూడు బంగారు పతకాలను కూడ సాధించింది. రాజ్ బజార్ సైన్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ప్రతి ఆదివారం సాయంత్రం బాలికలు, యువతులు ఆత్మ రక్షణకోసం అయేషా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టి ఎందరికో తర్ఫీదునిస్తోంది. ''తండ్రి మరణంతో కుటుంబాన్ని ఈడ్చేందుకు, కడుపు నింపుకునేందుకు నా తల్లి కుట్టుపని చేయడం ప్రారంభించింది. ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కరువే. నా కోచ్ ఎం. ఎ. అలీ. ఆయనకు ముందుగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా నాకేదీ సాధ్యమయ్యేది కాదు'' అంటుంది అయేషా. 1988 లో ఓ ప్రముఖ కరాటే టోర్నమెంట్ లో స్వర్ణం సాధించారు అలీ... కుటుంబాన్ని నెట్టేందుకు తాత్కాలిక షూ వ్యాపారం చేసే అయేషా సోదరుడు తన్వీర్.. ఆమె పట్టుబట్టడంతో.. అలీవద్ద శిక్షణకు చేర్పించాడు. ఆమె పట్టుదలే.. అనుకున్నది సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచానికే లింగ వివక్షపై అవగాహన కల్పించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ..లక్ష్య సాధనే ధ్యేయంగా గుర్తింపు పొందిన అయేషా నూర్ కథ... ఇప్పుడు ఓ అసాధారణ గాధగా తెరకెక్కింది. జోర్ధాన్, కెన్యా, పెరు, బంగ్లాదేశ్ లకు చెందిన మరో నలుగురు మహిళల కథలతోపాటు అయేషా నూర్ జీవిత కథ చిత్రంగా రూపొందింది. లాభాపేక్ష లేని సంస్థగా ఐ టీ వీ సర్వీస్... పలు అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రాజెక్లులకు నిధులను ఇచ్చి ప్రోత్సహిస్తుంది. యూఎస్ కాంగ్రెస్ ఆదేశంతో 1988 లో ఈ సంస్థ స్థాపించారు. అయితే డాక్యుమెంటరీ విషయం కోల్ కత్తా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియడంతో, మైనారిటీ వ్యవహారాల శాఖ అయేషా నూర్ కు సాహాయం అందించేందుకు ప్రయత్నించింది. అయితే అయేషా దాన్ని స్వచ్ఛందంగా తిరస్కరించింది. -
అమ్మాయిలకు జూడో, కరాటేలో శిక్షణ
ఆత్మరక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌లోని 90 వేల మంది అమ్మాయిలకు జూడో, కరాటేలలో శిక్షణ ఇవ్వనున్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అక్కడి మాధ్యమిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఈ శిక్షణ ఇవ్వాలి. అన్ని పాఠశాలల్లో ఉన్న విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇప్పించడం వెంటనే మొదలుపెట్టాలని మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఆదేశించారు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాలతో పాటు ఈ శిక్షణను కూడా ఒక భాగంగా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొన్ని నెలల క్రితమే ఈ విషయమై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ జూడో సమాఖ్య ప్రధాన కార్యదర్శి మునవ్వర్ అంజార్‌ను సలహాదారుగా నియమించారు. -
ఐవైఎఫ్ సమ్మేళనం..
-
అందంలోనే కాదు...ఆదర్శంలోనూ మోడలే!
ఛాంపియన్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యపతకాలు... ఈ సుందరాంగి సాధించిన ఈ పతకాలు అందాల పోటీలలో కాదు... కరాటేలో సాధించినవి. ముంబాయిలో పుట్టి పెరిగిన మోడల్ సంధ్యాశెట్టి ఐదడుగుల తొమ్మిదంగుళాల ఎత్తు, చామనఛాయ రంగు, చూడగానే ఆకట్టుకునే కళ్లు, సిల్కీ శిరోజాలతో... గిలిగింతలు పెట్టే సౌష్ఠవంతో ఉంటుంది. విశేషం ఏమిటంటే కరాటేలో బ్లాక్బెల్ట్తోపాటు నేషనల్ ఛాంపియన్ షిప్ కూడా సాధించిందీమె. ఇటీవలే మహారాష్ర్టలో జరిగిన కరాటే అసోసియేషన్ ఛాంపియన్ షిప్ పోటీలలో కాంస్యపత కాన్ని కైవసం చేసుకున్న సంధ్య... తనకొచ్చిన పతకాన్ని ఆడియన్స్‌కు చూపిస్తూ... ‘ఇప్పుడు నేను సాధించింది కాంస్యమే కావచ్చు కానీ, వచ్చేసారికి సువర్ణం సాధించి తీరతాను’ అంటూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కాలేజీలో చదివేటప్పుడే స్నేహితులామెను ఫెమినా మిస్ ఇండియా ఉమెన్ పెజంట్లో పాల్గొనవలసిందిగా ఒత్తిడి చేసి మరీ ఒప్పించారు. అందాల ప్రపంచంలో అలా పడింది ఆమె తొలి అడుగు. ఆ తర్వాత ఆమె అనేక ర్యాంప్ షోస్, ప్రింట్, మ్యూజిక్ వీడియోలలోనూ పాల్గొంది. పలు బుల్లితెర షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. ‘లెవి’, ‘నల్లి’, ‘షాపర్స్ స్టాప్’, ‘రూపమ్’, ‘డిగ్జామ్’ తదితర బ్రాండ్లకు ప్రచారం నిర్వహించింది. విక్రమ్ ఫాద్నిస్, షైనా ఎన్సీ, కౌషిక్ షిమాంకర్, అనితా డోంగ్రే, స్వప్నిల్ షిండే వంటి డిజైనర్లకోసం ర్యాంప్ వాక్ చేసింది. డిస్కవరీ ఛానెల్లో ‘గో ఇండియా’ కార్యక్రమానికి అతిథేయిగా వ్యవహరించింది. ‘‘మోడలింగ్ అన్నా, నటన అన్నా చాలా ఇష్టం. ఈ రెండు రంగాలలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, నాకు ఎంతో ప్రీతికరమైన క్రీడలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు’’ అని చెబుతోంది ఈ అందాల భామ. ‘‘అందరికీ నేను ఒక మోడల్‌గా, నటిగా, టీవీ ప్రెజెంటేటర్గానే తెలుసు. నాకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉందని, నేను అందులో ఛాంపియన్ షిప్ సాధించానని తెలిసింది అతి కొద్దిమందికి మాత్రమే’’ అంటుంది. ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకున్న సంధ్యకు ట్రావెలింగ్ అన్నా, కొత్తవారితో స్నేహం చేయడమన్నా, కొత్తరకాల వంటకాలు తయారు చేయడమన్నా ఎంతో మక్కువ అట. ఖరీదుకంటే సౌకర్యవంతమైన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తాననీ, రకరకాల యాక్సెసరీస్ అన్నా, పాదరక్షలన్నా ప్రాణం పెడతాననీ చెప్పే ఈ సుందరాంగి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం లోనూ, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం లోనూ ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం అంత కష్టం కాకపోయినప్పటికీ, అందులో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదనీ, ఆహారం విషయంలోనూ, వ్యాయామాల విషయంలోనూ అప్రమత్తంగా ఉంటూ వ్యవహరిస్తూ క్రమశిక్షణతో వ్యవహరిస్తేగానీ అందులో రాణించలేమంటుంది. రాత్రిళ్లు త్వరగా నిద్రపోతానని, పొద్దున్నే లేచి, వ్యాయామం చేస్తానని, ఆ తర్వాత కాసేపు శరీరం బాగా అలసిపోయేలా ఆటలాడతాననీ చెప్పే సంధ్యాశెట్టి అతివల ఆత్మరక్షణకోసం మార్షల్ ఆర్ట్స్‌లో ఉచిత శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. అంతేకాదు, గుర్రపు స్వారీ, ఈత శిక్షణ, వెయిట్ లిఫ్టింగ్లలోనూ ఉచిత శిక్షణ ఇప్పిస్తోందట. నిజంగా మనసున్న మంచి మోడల్ కదా! - డి.శ్రీలేఖ -
మోడీని కరాటే నేర్పించమంటున్న అక్షయ్ కుమార్
కరాటే ఎక్స్పర్ట్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గత అయిదేళ్లుగా సెల్ఫ్ డిఫెన్స్ ను పాపులరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళలపై దాడులను తగ్గించాలన్నా, గూండాయిజం నశించాలన్నా ఆత్మరక్షణ కోసం కరాటేని అందరూ నేర్చుకోవాలన్నదే ఆయన ప్రయత్నం. దీని కోసం ఆయన ఒక ప్రత్యేక ట్రెయినింగ్ ఇన్స్ టిట్యూట్ కూడా స్థాపించారు. అందుకే అక్షయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కరాటేని ప్రజలందరికీ నేర్పించేలా, స్కూళ్లలో తప్పనిసరిగా నాలుగేళ్ల కోర్సులను పెట్టేలా చర్యలు తీసుకొమ్మని కోరారు. కరాటేని విద్యలో భాగం చేయాలని ఆయన కోరారు. మోడీ తన ప్రతిపాదనకు ఓకే చెప్పారని, ఈ దిశగా చర్యలు తీసుకుంటారని అక్షయ్ అంటున్నారు. -
చిన్నారులకు కరాటేలో శిక్షణ
హైదరాబాద్: కరాటేలో క్రీడలో భాగంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ‘కొబుడో’ క్రీడలో ఇటీవల చిన్నారులకు ప్రత్యేకంగా శిక్షణా శిబిరం నిర్వహించారు. నిజాంపేటలోని మాపుల్స్ స్కూల్లో ఈ కార్యక్రమం జరిగింది. రెన్షీ కోలా ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాంప్‌ను కోచ్ తన్నీరు మోహన్ పర్యవేక్షించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ కోచ్ క్యోషి సీఎస్ అరుణ్ మాచయ్య, క్యోషి కేఎస్ రామ్‌కుమార్ ఈ శిక్షణా శిబిరానికి హాజరై చిన్నారులకు కొబుడోలో సూచనలిచ్చారు. ఇందులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కుర్రకారు జోరు... బుడతల హుషారు
-
ఆడపిల్ల ఆత్మ రక్షణకు కరాటే అవసరమే
పుల్కల్, న్యూస్‌లైన్ : ఆత్మరక్షణకు ఆడపిల్లలకు కరాటే అవసరమంటున్నాడు మండలంలోని వెంకటకిష్టాపూర్ గ్రామానికి చెందిన కొండ్రేపల్లి రమేష్. తనకు మార్షల్ ఆర్ట్స్ అంటే అతనికి ప్రాణమని, ఇష్టంగా కష్టపడి నేర్చుకుని మాస్టర్ అయినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం సిద్దిపేటలో ఎంసీజే చేస్తూ తాను నేర్చుకున్న విద్యను పది మందికి నేర్పుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ర మేష్. 2007వ సంవత్సరంలో వెంకటకిష్టాపూర్లో ఇంటర్నేషనల్ శాలిన్ కుంగ్‌ఫూ లయన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించిన రమేష్.. 2010లో బ్లాక్ బెల్ట్ పొందాడు. 2011వ సంవత్సరంలో మల్కాజిగిరి సికింద్రాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియన్ టోర్నమెంట్లో బెస్ట్ ఇన్స్‌ఫెయిర్ అవార్డు పొందాడు. 2012లో సికింద్రాబాద్‌లో జరిగిన స్టేట్ లెవల్ టైగర్ కుంగ్‌ఫూలో కటాస్ అవార్డు సాధించాడు. 2013లో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డిగ్రీ అందుకున్నాడు. ఇలా అతను మార్షల్ ఆర్ట్స్‌లో ఓ వైపు విజయాలు సాధించుకుంటు మరోవైపు పేద పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం సిద్దిపేటలో ఎంసీజే చదువుతూ విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. అందులో పేద విద్యార్థులు, ఆడ పిల్లలకు ఉచితంగానే కరాటే నేర్పుతున్నాడు. ఇటీవల తన సొంత గ్రామంలో తన వద్ద కరాటే నేర్చుకున్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి జోగిపేట సీఐ సైదానాయక్ చేతుల మీదుగా వివిధ విభాగాల్లో బెల్టులను అందించారు. -
కరాటేలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
కూచిపూడి, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈ నెల 17న నిర్వహించిన ఏపీ అంతర్ జిల్లా గోజోరియో కరాటే ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో మొవ్వ మండలం కోసూరు, మొవ్వ విద్యార్థులు పలు పతకాలు సాధించారు. కోసూరు విజయశ్రీ సన్‌ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు డి.పి.ఎస్.మణికంఠ అండర్-9 విభాగంలో కటాలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. సీహెచ్.వంశీ కటాలో మూడో స్థానంలో నిలిచాడు. అండర్-10 కటాలో జె.మోహన్చైతన్య మూడో స్థానం, కటాలో డి.మనోజ్‌వర్మ మూడో స్థానంలో నిలిచాడు. అండర్ 11 కటాలో ఎ.దినేష్‌కుమార్, డి.రోహిత్ మూడో స్థానం, అండర్ 12 కటాల్లో సీహెచ్.జితేంద్ర రెండో స్థానం, ఎ.చైతన్య సాయి మూడో స్థానాన్ని పొందారు. వీరిని కరస్పాండెంట్ పున్నంరాజు, ప్రిన్సిపాల్ జోసఫ్ అభినందించారు. అలాగే మొవ్వ హోలీ స్పిరిట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థి కె.వి.ఎస్.భరత్‌కుమార్ అండర్-14 కటాలో మొదటి స్థానం, కుమితిలో రెండో స్థానం, కటాలో రెండో స్థానం సాధించారు. అండర్-9లో ఎం.రఘురామ్ టీమ్ కటాలో మొదటి స్థానం, కుమితిలో మూడో స్థానం సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ సిస్టర్ ఫిలోమినీ జేమ్స్ అభినందించారు. ‘కొమ్మారెడ్డి’ విద్యార్థులకు పతకాలు బంటుమిల్లి రూరల్ : అంతర్ జిల్లా గోజో రియో కరాటే ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీలలో బంటుమిల్లిలోని కొమ్మారెడ్డి టాలెంట్ హైస్కూల్ విద్యార్థులు పలు అంశాలలో పతకాలు గెలుపొందినట్లు పాఠశాల డెరైక్టర్ కె.కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కటా విభాగంలో ఆర్. చిద్విలాస్, కె.సాయినితిన్, ఎ.రవీనాశ్రీ, కె.బాలాజీ బంగారు పతకాలు, వై. వెంకటరత్నం, పి.సందీప్ రజతపతకాలు, జె.అంజనిబాబు, వై.కార్తికేయవెంకట్ కాంస్య పతకాలు సాధించినట్టు వివరించారు. టీం కటా విభాగంలో వీరు తృతీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. విజేతలను పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, కోచ్ ఎస్. వెంకటేశ్వరరావు, మంగళవారం అభినందించారు. -
కఠోర దీక్షకు కరెక్ట్ స్పెల్లింగ్
అనూరాధ ఒక ఉన్నత ఆశయంతో... తన కూతుర్ని పెంచుతున్నారు. ఉదయశ్రీ తన తల్లి కోసం... ఒక అందమైన కలను కంటోంది! తల్లి ఆశయం ఫలిస్తే... ‘పుట్టింది ఆడపిల్లా!’ అన్న నోళ్లు మూతపడతాయి. కూతురి కల నెరవేరితే... ఒబామా మెచ్చుకోలుగా అమ్మవైపు చూస్తారు. ఆశయం, కల... ఒకటే అయినట్లు... ఈ తల్లీకూతుళ్లు ఒకరి కోసం ఒకరు పట్టినదీక్షలోని కఠోర సాధనే... నేటి మన ‘లాలిపాఠం’. ‘కరాటేలో చిన్నారుల ప్రతిభ’ అనే హెడ్డింగ్‌తో పెద్ద ఫొటోతో వార్తలు ప్రచురితమవుతుంటాయి. తైక్వాండో విజేతలు అంటూ మరో వార్త, అబాకస్ విన్నర్ అంటూ మరోటి... ఇలా ప్రచురితమైన ప్రతి వార్తనీ చదువుతాం, కానీ వార్తల్లో ఒక అమ్మాయి తరచూ కనిపిస్తుంటే... మరికొద్దిరోజుల్లో అదే అమ్మాయి స్పెల్‌బీ పోటీల్లో సర్టిఫికేట్‌తో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒకదానికొకటి పొంతనలేని పోటీల్లో కనిపిస్తుందేమిటి? అనే సందేహం వస్తుంది. ఆ సందేహానికి సమాధానమే ఉదయశ్రీ. ఇన్ని రంగాల్లో ప్రతిభావంతురాలిని చేయడంలో ని తమ అనుభవాలను చెప్పారు ఉదయశ్రీ తల్లి అనూరాధ. కంటికి రెప్పలాగ... ‘‘ఉదయ... మేము అమెరికాలో ఉండగా పుట్టింది. పాప మొదటి పుట్టినరోజుకి కుటుంబ సమేతంగా ఇండియాకి వచ్చాం. ఆ తర్వాత ఏడాదికి మా వారు గోపాలకృష్ణ అమెరికా వెళ్లారు. హైదరాబాద్‌లో నేను పాపకు తల్లీదండ్రీ అయి పెంచుతున్నాను. ఉదయ ఆరోగ్యం నాకు ఎప్పుడూ పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుంటే బుగ్గ కందిపోయి ఎర్రగా ర్యాష్ వచ్చేది, అది అంతటితో ఆగిపోక పుండయ్యేది. డెర్మటాలజిస్టుకి చూపిస్తే మరీ సున్నితమైన చర్మం అని చాలా నియమాలు చెప్పారు. పెర్ఫ్యూమ్లు కాదు కదా పౌడర్ కూడా వాడకూడదు. సబ్బు కూడా ‘సెన్సిటివ్ స్కిన్’నే వాడాలి. ఏడాదికి కావల్సిన సబ్బులను అమెరికా నుంచే తెప్పించుకుంటాను. వాతావరణం మారితే ఆస్త్మా ఇబ్బంది పెట్టేది. ఉదయకు అకస్మాత్తుగా జ్వరం వచ్చేది. ఏ క్షణాన జ్వరం వస్తుందోననే భయంతోనే గడిపేదాన్ని. అర్ధరాత్రి హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సి వచ్చేది. వీటికి తోడు ముక్కు నుంచి రక్తం ధారగా కారేది. సర్జరీ చేసిన తర్వాత కూడా పూర్తిగా తగ్గలేదు. సాక్షి స్పెల్ బీ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరిగిన రోజు ఉదయం కూడా ఇదే తంతు. ఆ పరిస్థితిలో కాంటెస్ట్‌కి వెళ్లవద్దు అంటే వినలేదు, నాకంటే మొండిది ఉదయ. అలాగే రాసింది. ఇంతకంటే పెద్ద సాహసం తైక్వాండో పోటీలప్పుడు జరిగింది. కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో పోటీలు జరుగుతున్నాయి. ఉదయకు ఆస్త్మా తీవ్రంగా ఉంది. మాస్టారు ‘ఈ కండిషన్లో చేయవద్దు’ అంటే వినక, ఆయాసం తగ్గిన తర్వాత చేసి గెలిచింది’’ అన్నారు అనూరాధ. పట్టు వదలదు! బ్రాంకైల్ ఆస్త్మా, నాజల్ బ్లీడింగ్ సమస్యలు ఉన్న అమ్మాయిని తైక్వాండో వంటి యుద్ధకళలు సాధన చేయించడం అంటే పెద్ద సాహసమే కదా అన్నప్పుడు అనూరాధ ‘‘నిజమే, కానీ ఉదయ మూడేళ్ల వయసు నుంచి టీవీలో తైక్వాండో, కరాటే ప్రోగ్రాములు చూసినప్పుడు ‘నేనూ అలా చేస్తా’ అంటూ గాల్లోకి చేతులు ఊపుతూ అనుకరించేది. తనకి అంత ఇష్టం ఉంది కదా అని నేర్పించాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఈ ఏడాది వస్తుంది’’ అన్నారామె. అబాకస్, తైక్వాండో, ఒకాబులరీ క్లాసులు ఇన్నింటిని ఎలా సమన్వయం చేసేవారన్నప్పుడు... ‘‘వారంలో ఒక్కొక్కటి రెండు రోజులు ఉండేవి, శని, ఆదివారాల్లో స్పెషల్క్లాసులుండేవి. ఇన్నింటినీ చూసుకుంటూనే స్కూల్లో ఏప్లస్ గ్రేడ్‌లోనే ఉంటోంది. ఆరోగ్య సమస్యల మధ్య తనను ఇంతలా ప్రాక్టీస్ చేయించడం ఎందుకని కొన్నింటిని తగ్గిద్దాం అని నేను అనుకున్నా ఉదయ ఒప్పుకోదు. ఆడపిల్ల... అన్నింటా మిన్న! మీ అమ్మాయిని అందరిలో ఒకటిగా కాకుండా కొందరిలో ఒకటిగా తీర్చిదిద్దాలనే కోరిక మీ దంపతుల్లో ఎవరిది అన్నప్పుడు ‘‘నా దృష్టిలో ఆడపిల్ల దేనిలోనూ తక్కువ కాదు. ఆడపిల్ల పుట్టిందని ఆ బిడ్డను వివక్షకు గురిచేసేవాళ్లకు, జాతకం మంచిది కాదని ఒక వ్యక్తిని నిర్లక్ష్యంగా చూసే మనస్తత్వాలకు చెంప పెట్టుగా నా బిడ్డను చూపించాలనుకున్నాను. మహిళ సాధించలేనిదంటూ ఏదీ ఉండదని సమాజానికి చెప్పాలనుకున్నాను. ఆ కసి నాలో మొండితనాన్ని కూడా పెంచింది. అందుకే ఎంత ఖర్చవుతున్నా నా అవసరాలు మానుకుని మరీ తనకి కోచింగ్ ఇప్పిస్తున్నాను. పోయినేడాది దీపావళికి ముందు ఇంటర్నేషనల్ స్పెల్‌బీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ కోచింగ్‌కి పన్నెండు వేలు ఖర్చవుతుంది. ఈ ఖర్చుని భరించడం ఇబ్బంది అనిపించి ఇంట్లోనే ప్రాక్టీస్ చేయిద్దామని పుస్తకాల కోసం బుక్‌షాపుల్లో వెతుకుతున్నాను. ఉదయకు కూడా పరిస్థితి అర్థం అయిందనుకుంటా. అప్పుడు నాతో ‘ఈ సారి టపాకాయలు మానేసి ఈ బుక్ కొనుక్కుంటాను’ అని కేంబ్రిడ్జి ఇంగ్లిష్ ప్రనన్సియేషన్ డిక్షనరీ కొనుక్కుంది. దాంతోనే స్పెల్ బీ పోటీలకు ప్రిపేరయింది’’ అన్నారు అనూరాధ. రోజుకో స్తోత్రం! ఉదయలో గ్రహించే శక్తి ఎక్కువని చెప్తూ... ‘‘పాప పుట్టినతర్వాత ప్రశాంతంగా పూజ చేసుకునే తీరిక ఉండేది కాదు. దాంతో పాపను ఆడిస్తూ, ఉయ్యాల ఊపుతూ స్తోత్రాలు పాడేదాన్ని. ఒకసారి తను కూడా తిరిగి పలకసాగింది. అప్పటికి ఇంకా ఉదయకి రెండేళ్లు కూడా నిండలేదు. వచ్చీరాని మాటలతో సహస్రనామాలను పలుకుతుండడంతో రోజుకో స్తోత్రం చొప్పున నేర్పించాను. అలాగే రాత్రి కరెంటు పోతే రామాయణ, భారతాలు చెప్పేదాన్ని. స్పెల్ బీ కాంపిటీషన్‌కి ప్రిపేరయ్యేటప్పుడు నేను పగలు సీడీ విని ఉచ్చారణ నేర్చుకుని, సాయంత్రం పాపతో ప్రాక్టీస్ చేయించేదాన్ని. తనలో స్కిల్ ఉంది. శిక్షణ ఇస్తే రాణిస్తుందని లాయర్‌గా ప్రాక్టీస్ మానేసి నా జీవితాన్ని తనకోసం మలుచుకున్నాను’’ అన్నారు. తల్లిగా బిడ్డ భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగినప్పుడు అక్కడే ఉన్న ఉదయ ‘‘అమెరికాలో స్పెల్‌బీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. అమ్మను అమెరికాకు తీసుకెళ్లాలి. అమ్మ చూస్తుండగా నేను ఒబామా చేతులమీదుగా అవార్డు తీసుకోవాలి’’ అని చెప్పింది. పదకొండేళ్ల అమ్మాయిలో ఇంత పెద్ద కల, అంతకు మించిన ఆత్మవిశ్వాసం పెంపకంలో రావల్సిందేనేమో. ఉదయ కల నెరవేరాలని ఆశిద్దాం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇష్టం అన్న ప్రతిదీ నేర్పిస్తున్నాను! ఇప్పుడు అబాకస్ క్లాస్ లేదు. తనకి కొంచెం ఖాళీ వస్తుందనుకుంటే చెస్ నేర్చుకుంటానంది ఉదయ. ఈ మధ్యలో డ్రాయింగ్ క్లాసులకూ వెళ్తోంది. బొమ్మలు చాలా బాగా వేస్తుంది. యూరప్‌లో జరిగే జూనియర్ లెవెల్ పెయింటింగ్ కాంపిటీషన్‌కి పంపించారు డ్రాయింగ్ మాస్టారు. నేను నేర్పించినవన్నీ ఉదయ కావాలని అడిగినవే. నాకు ఇష్టమైన వీణ, నాట్యం నేర్పిద్దాం అనుకున్నాను. కానీ తనకవి ఏ మాత్రం ఇష్టం లేదు. నేను వీణ మీటినప్పుడు వినడానికి కూడా ఇష్టపడదు. - అనూరాధ, ఉదయశ్రీ తల్లి ఉదయశ్రీ విజయాలు అబాకస్‌లో... ఎనిమిది లెవెల్స్‌లో ఫస్ట్ ప్రైజ్ 2012 - స్టేట్ చాంపియన్‌షిప్ 2011- అబాకస్ ట్రోఫీ రన్నర్ అప్ తైక్వాండోలో... 2010లో రెండు బంగారు పతకాలు 2011, 2012లో బంగారు పతకాలతో హ్యాట్రిక్ స్పెల్ బీ... ఈ ఏడాది ఏప్రిల్‌లో బెంగళూరులో మార్స్ సంస్థ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ స్పెల్ బీ 2013’లో ‘బడ్డింగ్ స్టార్’ అవార్డు.