ఎందుకు ప్రశ్నించరు?! ఎందుకు పోరాడరు?! ఎందుకు కష్టపెట్టుకుంటారు?! ఎందుకు ఆధారపడతారు?! అపర్ణా రాజవత్‌కు చిన్నప్పడు అన్నీ సందేహాలే. ఆ ప్రశ్నలకు తానే సమాధానం వెతికింది. నైపుణ్యం సంపాదించడానికి తోడబుట్టిన అన్నలతోనే పోరాడింది. కరాటే నేర్చుకుంది. ఇప్పుడు ఈ నాలుగుపదుల వయసులో గత నాలుగేళ్లుగా లక్షాయాభైవేల మందికి ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తూ వచ్చారు అపర్ణ. లైంగిక అసమానత, హింసకు వ్యతిరేకంగా నిలిచే పోరాటంలో ఇతర మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ‘పింక్ బెల్డ్ మిషన్’ పేరుతో రెండువేల మంది సుశిక్షితులైన ట్రెయినర్లను కూడా అపర్ణ సిద్ధం చేశారు.
అపర్ణ నేతృత్వం లోని ‘పింక్ బెల్ట్ మిషన్’ ఈ ఏడాది ఆగ్రాలో 7,401 మంది మహిళలతో ఆత్మరక్షణ శిక్షణ తరగతి నిర్వహించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. ‘‘నా తరవాతి లక్ష్యం ఇరవై లక్షల మంది బాలికలకు ఆత్మరక్షణ విద్య నేర్పడం. గృహ హింస బాధితుల కోసం హాస్టళ్ల నిర్వహణలో నిమగ్నమవ్వడం. న్యాయనిపుణులు, యాక్టివిస్టులు, కౌన్సెలర్లు వంటి నిపుణులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి మహిళల సమస్యలకు తగు పరిష్కారాలు అన్వేషించడం’’ అని తెలిపారు అపర్ణ.
అబ్బాయిలతో పోటా పోటీగా!
నోయిడాలో పుట్టి పెరిగిన అపర్ణ.. ‘‘నాది ఒక ప్రాంతం అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను భారతీయ మహిళను. ఈ సమైక్య భావనతో దేశీయంగా మా మిషన్ ద్వారా మహిళలకోసం చేసే కార్యక్రమాలు 12 రాష్ట్రాల్లో చురుగ్గా కొనసాగుతున్నాయి’’ అంటారు అపర్ణ. ఆ విధంగా ఆమె తన భారతీయతను కూడా చాటుతున్నారు. సంప్రదాయ రాజ్‌పుత్ కుటుంబంలో ఐదుగురు తోబొట్టువులలో ఒకరుగా పుట్టిన అపర్ణకు ఇద్దరు అన్నలు ఉన్నారు. ‘‘ప్రతీదానికి అడ్డుగా నిలబడేవారు. వారితో శారీరక హింసలను కూడా భరించాల్సి వచ్చింది. నన్ను నేను రక్షించుకునే ఏకైక మార్గం నా అంతఃశక్తి అని నాకు ఆ వయసులోనే అర్థమైంది. నా వయసు అమ్మాయిలు బొమ్మలతో ఆడుకుంటుంటే నేను కరాటే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ క్లాసుల్లో అంతా అబ్బాయిలే ఉన్నారని గమనించిన తరువాత, మా అమ్మను అడిగాను నేనూ ఆ తరగతిలో చేరుతాను అని. నా ఉత్సాహాన్ని చూసి, ఎట్టకేలకు మా అమ్మ అంగీకరించింది’ అన్నారు అపర్ణ. తొమ్మిదో తరగతి చదివే సమయానికి బ్లాక్ బెల్ట్ సంపాదించారు ఆమె. అంతటితో ఊరుకోలేదు తన చుట్టూ ఉన్న మహిళలకు మార్షల్ ఆర్ట్స్ బోధించడం ప్రారంభించారు. కరాటేలో 13 జాతీయ స్థాయి టైటిళ్లను గెలుచుకున్న అపర్ణ, జాతీయ ఛాంపియన్‌షిప్, రెండుసార్లు దక్షిణాసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో రజత పతక విజేతగా నిలిచారు. అనుకోకుండా ఒక ప్రమాదానికి గురై ఆసియా కరాటే ఛాంపియ¯Œ షిప్‌లో పాల్గొనలేక పోయారు. దీంతో ఆమె తన శక్తిని శిక్షణకు మళ్లించాలని నిశ్చయించుకున్నారు. తరువాత ప్రపంచవ్యాప్త ప్రయాణాలకు టూర్ సూపర్‌వైజర్ గా మారారు.
శక్తి సంకేతం పింక్ బెల్ట్
2012 లో ఢిల్లీలో 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం, హత్య గురించి విన్నాక అపర్ణ స్థిమితంగా ఉండలేకపోయారు. ‘‘అమ్మాయిలపై జరిగే నేరాల గణాంకాలను అధ్యయనం చేశాను. ప్రతీ యేడాది మహిళలపై పెరుగుతున్న రకరకాల హింసల గురించి తెలుసుకున్నాను. ప్రపంచ దేశాల్లో భారతదేశం మహిళలకు ప్రమాదకరం అనే నిపుణుల నివేదికలను పరిశీలించాను. అప్పుడే, మహిళలకు మార్షల్ ఆర్ట్స్‌లో ఆత్మరక్షణకు శిక్షణ ఇవ్వాలని బలంగా అనుకున్నాను. నాలో ఉన్న వాగ్ధాటి సామర్థ్యాన్ని ఆసరాగా తీసుకున్నాను. పూర్తి సామర్థ్యంతో 2016లో ‘పింక్ బెల్ట్ మిషన్’ను ఏర్పాటు చేశాను. అమ్మాయిలను మా మిషన్ త్వరగానే ఆకట్టుకుంది. మొదట్లో అమ్మాయిలు పెద్ద సంఖ్యలో రాలేదు, కానీ మార్పే లక్ష్యంగా ముందుకు సాగాను’’ అని వివరించారు అపర్ణ. మార్షల్ ఆర్ట్స్ బోధనతో పాటు, మోటివేషనల్ స్పీకర్‌గానూ ఆమె రాణిస్తున్నారు.
నైపుణ్యాల గుర్తింపు
పింక్ బెల్ట్ మిషన్ ద్వారా మహిళలకు ఆత్మరక్షణ, విద్య, వృత్తి నైపుణ్యం అనే అంశాలు కేంద్రంగా మూడు వేర్వేరు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారు అపర్ణ. ‘‘ఇప్పటివరకు, మా మిషన్ 1.5 లక్షల మంది యువతులు, మహిళల జీవితాలను ప్రభావితం చేసింది. మా మిషన్ ప్రతి భారతీయ మహిళకు ఆరోగ్య అవగాహన, భద్రతా పద్ధతులు, చట్టపరమైన హక్కులు, సైబర్ క్రైమ్, ఆత్మరక్షణ, కంప్యూటర్ అక్షరాస్యత, లైంగిక, గృహ హింసల నివారణ, వృత్తి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని బలోపేతం చేస్తుంది. ఇప్పుడు ఈ మిషన్ కార్యక్రమాలను మరింతగా విస్తృతం చేసి ఇతర రాష్ట్రాల్లోని మహిళలకూ అవగాహన కల్పించే దిశగా సాగుతున్నాను’’ అంటున్నారు అపర్ణ.
Comments
Please login to add a commentAdd a comment