self defence lessons
-
Asha Suman: ఆత్మవిశ్వాసమే అసలైన గురుదక్షిణ
రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో దివ్యాంగురాలైన ఒక స్టూడెంట్ అత్యాచారానికి గురైన సంఘటన ఆశా సుమన్‌ను షాక్‌కు గురి చేసింది. స్కూలు, కాలేజిల్లో చదివే అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని ఆ సమయంలో సంకల్పించుకుంది ఆశ. దివ్యాంగులు, సాధారణ యువతులు 30 వేల మందికి పైగా ఆత్మరక్షణ విద్యలు నేర్పించిన ఉపాధ్యాయురాలు ఆశా సుమన్ గురించి... తొమ్మిది సంవత్సరాల క్రితం రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని ఖార్కర గ్రామంలో... ఆరోజు స్కూల్‌కు వెళ్లింది ఆశా సుమన్. బడిలో మగపిల్లలు తప్ప ఆడపిల్లలు ఎవరూ కనిపించలేదు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఈ లోపే ఎవరో ఊళ్లో జరిగిన దుర్ఘటన గురించి చెప్పారు. దివ్యాంగురాలైన ఒక అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ సంఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. విషయం తెలిసిన ఆశ హుటాహుటిన బాధితురాలి ఇంటికి వెళ్లింది. ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు చెవిన పడుతున్నప్పుడు ఆమె మనసు దుఃఖసముద్రం అయింది. ఈ సంఘటన ప్రభావంతో కొద్దిమంది తల్లిదండ్రులు అమ్మాయిలను స్కూల్‌కు పంపడం మాన్పించారు. నిజానికి ఆ ప్రాంతంలో ఆడపిల్లల చదువుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇచ్చే వాళ్లు కూడా తమ ఇంటి ఆడపిల్లలను బడికి పంపడానికి భయపడుతున్నారు. స్కూల్‌కు వెళ్లినా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా ఆ పాశవిక సంఘటన, తల్లిదండ్రులపై దాని ప్రభావం పడి ఆడపిల్లలు స్కూల్‌కు దూరం కావడం... ఇవి పదేపదే గుర్తుకు వచ్చి ఆశను విపరీతంగా బాధపెట్టాయి. ‘ఆ అమ్మాయికి తనను తాను రక్షించుకోవడం తెలిస్తే ఇలా జరిగేది కాదేమో. ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్య నేర్పాలి’ అనుకుంది. మొదటి అడుగుగా... పిల్లల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడింది. పిల్లలను తిరిగి స్కూల్‌కు పంపించడానికి వారు మొదట్లో ససేమిరా అన్నారు. చదువు అనేది ఎంత అవసరమో వివరించి, అమ్మాయిలు తమను తాము కాపాడుకునే ఆత్మరక్షణ విద్యల గురించి చెప్పి వారిలో మార్పు తీసుకువచ్చింది. కొన్ని రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి అమ్మాయిలను తన స్కూటర్‌పై స్కూల్‌కు తీసుకువచ్చేది. రెండు నెలల తరువాత పరిస్థితి మామూలుగా మారింది. స్కూల్లోని అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించడంతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పేది. ఆశ గురించి విన్న చుట్టుపక్కల ఊళ్లలోని స్కూల్, కాలేజీ వాళ్లు ‘మా స్టూడెంట్స్‌కు కూడా నేర్పించండి’ అంటూ ఆహ్వానిం చారు. కాదనకుండా వారి ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో స్కూళ్లు, కాలేజీలలో ఎంతోమంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించింది. వైకల్యం ఉన్న బాలికలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పే విధానం వేరుగా ఉంటుంది, వారు సులభంగా అర్థం చేసుకునేలా, అర్థం చేసుకున్నది ఆచరణలో చేసేలా రోజువారి సంఘటనలను ఉదాహరిస్తూ, డమ్మీని ఉపయోగిస్తూ నేర్పిస్తుంటుంది. దృష్టిలోపం ఉన్న మౌనిక అనే స్టూడెంట్ ఆశ టీచర్ దగ్గర సెల్ఫ్–డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుంది. ‘నేను బయటికి ఎక్కడికి వెళ్లినా తోడుగా అన్నయ్య వచ్చేవాడు. అన్నయ్య లేకుంటే బయటకు వెళ్లడానికి సాహసించేదాన్ని కాదు. అయితే ఇప్పుడు నా గురించే నేనే కాదు, తల్లిదండ్రులు కూడా భయపడడం లేదు. ఎవరైనా నాకు చెడు చేయడానికి ముందుకు వస్తే నిమిషాల్లో మట్టి కరిపించగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌనిక. స్టూడెంట్స్లోనే కాదు వారి తల్లిదండ్రులలోనూ ఇప్పుడు ఎంతో ధైర్యం వచ్చింది. ‘చాలామందిలాగే నేను కూడా మా అమ్మాయిని స్కూల్‌కు పంపడానికి భయపడ్డాను. ఇప్పుడు అలాంటి భయాలేవీ లేవు. స్కూల్ అయిపోగానే అమ్మాయిల కోసం ఆశా టీచర్ నిర్వహిస్తున్న సెల్ఫ్–డిఫెన్స్ క్లాసులను దగ్గర నుంచి చూశాను. అమ్మాయిల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. ప్రతి స్కూల్లో ఆశలాంటి టీచర్ ఒకరు ఉండాలి’ అంటున్నాడు ఆ ఊరికి చెందిన జస్వంత్. అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆశ టీచర్ చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆత్మరక్షణ విద్యల వల్ల అమ్మాయిల్లో కనిపించే ఆత్మవిశ్వాసమే తనకు అసలు సిసలు గురుదక్షిణ అంటుంది ఆశా సుమన్. -
Obavva: కోటను కాపాడేందుకు వెళ్లి ప్రాణత్యాగం.. అసలు ఎవరీ ఓబవ్వ?
Obavva Art Of Self Defence Center In Karnataka: బెంగళూరులోని ‘ఓబవ్వ ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్–డిఫెన్స్ ట్రైనింగ్’ సెంటర్ దగ్గరికి వెళ్లడానికి ముందు పద్దెనిమిదో శతాబ్దంలోని చిత్రదుర్గ కోట దగ్గరికి వెళ్లాలి. చిత్రదుర్గ కోట అనగానే గుర్తొచ్చే పేరు...ఓబవ్వ. ఎవరు ఆమె? చిత్రదుర్గ కోటకు మైసూర్ నవాబు హైదర్ అలి నుంచి ముప్పు పొంచి ఉంది. ఆ ముప్పు ఒకరోజు దగ్గరికి రానే వచ్చింది. హైదర్‌అలి సైన్యాలు ఉత్సాహవేగంతో కోటను స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నాయి. ఇది గమనించిన ఓబవ్వ తన ఇంటికి పరుగెత్తుకు వెళ్లింది. కోటలో పనిచేసే ఒక సైనికుడి భార్య ఓబవ్వ. ఇంటికి వెళ్లగానే భర్త భోజనం చేస్తున్న దృశ్యం కంటపడింది. ఆ సమయంలో భర్తకు దుర్వార్త ఎందుకు చెప్పాలనుకుందో ఏమో వెనక్కి వచ్చింది. ఎలాగైనా సరే కోటను కాపాడుకోవాలి. కోటను కాపాడుకోవాలంటే దూసుకొస్తున్న సైన్యాలతో పోరాడాలి. తనకేమో ఎలాంటి యుద్దవిద్యలు తెలియవు. కానీ సంకల్పం బలమైనదైనప్పుడు మనసు సాయుధం అవుతుంది. పదునైన ఆయుధం అవుతుంది. తనకు ఒక రోకలి కనిపించింది. అంతే...ఆ రోకలిని అందుకొని బయలుదేరింది. దొరికినవాడిని దొరికినట్లు చావబాదింది. హైదర్ అలి సైన్యాలతో పోరాడే క్రమంలో వీరమరణం పొందింది ఓబవ్వ. ఇక అప్పటి నుంచి జానపదాల్లో ఆమె జీవితం పాటైంది. కథ అయింది. ఎన్నో సృజనాత్మక రూపాల్లోకి వెళ్లి అప్పటికి ఇప్పటికీ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది. తాజా విషయానికి వస్తే కర్నాటక ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ... స్కూలు, కాలేజిలో చదివే అమ్మాయిల కోసం ఈ వీరవనిత పేరు మీద ‘ఓబవ్వ ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్–డిఫెన్స్ ట్రైనింగ్’ ప్రారంభించింది. ‘మహిళలను గౌరవించే సమాజం మనది. స్త్రీలపై జరిగే హింస, వేధింపులకు అడ్డుకట్టవేయడానికి చట్టాలు తయారుచేసుకున్నాం. రకరకాల విధానాలకు రూపకల్పన చేసుకున్నాం. దీనితో పాటు ఆత్మరక్షణ విద్య కూడా కావాలి. ఆత్మరక్షణ విద్యతో అల్లరిమూకలకు గుణపాఠం చెప్పవచ్చు’ అంటున్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. మొదటి దశలో భాగంగా వెనకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో చదువుకునే యాభైవేల మంది అమ్మాయిలకు శిక్షణ ఇస్తారు. పోలీస్ ట్రైనింగ్ స్కూల్స్ కూడా తమవంతు సహాయాన్ని అందిస్తాయి. కార్యక్రమం ప్రారంభోత్సవం తరువాత ధర్మపుర ‘రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్ స్కూలు’ అమ్మాయిలు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ‘హా’ ‘హూ’ అంటూ గట్టిగా వినిపించే ఆ శబ్దాలలో నిశ్శబ్దమైన మంత్రం వినిపించింది. ఆ ఉత్తేజిత మంత్రం పేరు...ఓబవ్వ. వీరవనిత ఓబవ్వను తలుచుకుంటే ఏ తరంలోనైనా వినిపించే గట్టి మాట... ‘ఆపత్కాలంలో గుండె నిండా ఆత్మవిశ్వాసం నిండాలి. అది ఆత్మరక్షణ ఆయుధమై శత్రువును భయపెట్టాలి’! చదవండి: Relief From Muscle Pain: పిక్కలు, తొడ కండరాలు బిగుసుకుపోతున్నాయా... మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగారో..! Tharagai Aradhana: ఈ బుజ్జి బంగారం.. 9 నెలలకే ఈత నేర్చుకుంది... ఇప్పుడు సముద్రంలో ఈదుతూ..600 కిలోల చెత్త తీసి.. -
ఎందుకు ప్రశ్నించరు.. ఎందుకు పోరాడరు?!
ఎందుకు ప్రశ్నించరు?! ఎందుకు పోరాడరు?! ఎందుకు కష్టపెట్టుకుంటారు?! ఎందుకు ఆధారపడతారు?! అపర్ణా రాజవత్‌కు చిన్నప్పడు అన్నీ సందేహాలే. ఆ ప్రశ్నలకు తానే సమాధానం వెతికింది. నైపుణ్యం సంపాదించడానికి తోడబుట్టిన అన్నలతోనే పోరాడింది. కరాటే నేర్చుకుంది. ఇప్పుడు ఈ నాలుగుపదుల వయసులో గత నాలుగేళ్లుగా లక్షాయాభైవేల మందికి ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తూ వచ్చారు అపర్ణ. లైంగిక అసమానత, హింసకు వ్యతిరేకంగా నిలిచే పోరాటంలో ఇతర మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ‘పింక్ బెల్డ్ మిషన్’ పేరుతో రెండువేల మంది సుశిక్షితులైన ట్రెయినర్లను కూడా అపర్ణ సిద్ధం చేశారు. అపర్ణ నేతృత్వం లోని ‘పింక్ బెల్ట్ మిషన్’ ఈ ఏడాది ఆగ్రాలో 7,401 మంది మహిళలతో ఆత్మరక్షణ శిక్షణ తరగతి నిర్వహించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. ‘‘నా తరవాతి లక్ష్యం ఇరవై లక్షల మంది బాలికలకు ఆత్మరక్షణ విద్య నేర్పడం. గృహ హింస బాధితుల కోసం హాస్టళ్ల నిర్వహణలో నిమగ్నమవ్వడం. న్యాయనిపుణులు, యాక్టివిస్టులు, కౌన్సెలర్లు వంటి నిపుణులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి మహిళల సమస్యలకు తగు పరిష్కారాలు అన్వేషించడం’’ అని తెలిపారు అపర్ణ. అబ్బాయిలతో పోటా పోటీగా! నోయిడాలో పుట్టి పెరిగిన అపర్ణ.. ‘‘నాది ఒక ప్రాంతం అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను భారతీయ మహిళను. ఈ సమైక్య భావనతో దేశీయంగా మా మిషన్ ద్వారా మహిళలకోసం చేసే కార్యక్రమాలు 12 రాష్ట్రాల్లో చురుగ్గా కొనసాగుతున్నాయి’’ అంటారు అపర్ణ. ఆ విధంగా ఆమె తన భారతీయతను కూడా చాటుతున్నారు. సంప్రదాయ రాజ్‌పుత్ కుటుంబంలో ఐదుగురు తోబొట్టువులలో ఒకరుగా పుట్టిన అపర్ణకు ఇద్దరు అన్నలు ఉన్నారు. ‘‘ప్రతీదానికి అడ్డుగా నిలబడేవారు. వారితో శారీరక హింసలను కూడా భరించాల్సి వచ్చింది. నన్ను నేను రక్షించుకునే ఏకైక మార్గం నా అంతఃశక్తి అని నాకు ఆ వయసులోనే అర్థమైంది. నా వయసు అమ్మాయిలు బొమ్మలతో ఆడుకుంటుంటే నేను కరాటే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మార్షల్ ఆర్ట్స్ క్లాసుల్లో అంతా అబ్బాయిలే ఉన్నారని గమనించిన తరువాత, మా అమ్మను అడిగాను నేనూ ఆ తరగతిలో చేరుతాను అని. నా ఉత్సాహాన్ని చూసి, ఎట్టకేలకు మా అమ్మ అంగీకరించింది’ అన్నారు అపర్ణ. తొమ్మిదో తరగతి చదివే సమయానికి బ్లాక్ బెల్ట్ సంపాదించారు ఆమె. అంతటితో ఊరుకోలేదు తన చుట్టూ ఉన్న మహిళలకు మార్షల్ ఆర్ట్స్ బోధించడం ప్రారంభించారు. కరాటేలో 13 జాతీయ స్థాయి టైటిళ్లను గెలుచుకున్న అపర్ణ, జాతీయ ఛాంపియన్షిప్, రెండుసార్లు దక్షిణాసియా కరాటే ఛాంపియన్‌షిప్‌లో రజత పతక విజేతగా నిలిచారు. అనుకోకుండా ఒక ప్రమాదానికి గురై ఆసియా కరాటే ఛాంపియ¯Œ షిప్లో పాల్గొనలేక పోయారు. దీంతో ఆమె తన శక్తిని శిక్షణకు మళ్లించాలని నిశ్చయించుకున్నారు. తరువాత ప్రపంచవ్యాప్త ప్రయాణాలకు టూర్ సూపర్వైజర్ గా మారారు. శక్తి సంకేతం పింక్ బెల్ట్ 2012 లో ఢిల్లీలో 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం, హత్య గురించి విన్నాక అపర్ణ స్థిమితంగా ఉండలేకపోయారు. ‘‘అమ్మాయిలపై జరిగే నేరాల గణాంకాలను అధ్యయనం చేశాను. ప్రతీ యేడాది మహిళలపై పెరుగుతున్న రకరకాల హింసల గురించి తెలుసుకున్నాను. ప్రపంచ దేశాల్లో భారతదేశం మహిళలకు ప్రమాదకరం అనే నిపుణుల నివేదికలను పరిశీలించాను. అప్పుడే, మహిళలకు మార్షల్ ఆర్ట్స్‌లో ఆత్మరక్షణకు శిక్షణ ఇవ్వాలని బలంగా అనుకున్నాను. నాలో ఉన్న వాగ్ధాటి సామర్థ్యాన్ని ఆసరాగా తీసుకున్నాను. పూర్తి సామర్థ్యంతో 2016లో ‘పింక్ బెల్ట్ మిషన్’ను ఏర్పాటు చేశాను. అమ్మాయిలను మా మిషన్ త్వరగానే ఆకట్టుకుంది. మొదట్లో అమ్మాయిలు పెద్ద సంఖ్యలో రాలేదు, కానీ మార్పే లక్ష్యంగా ముందుకు సాగాను’’ అని వివరించారు అపర్ణ. మార్షల్ ఆర్ట్స్ బోధనతో పాటు, మోటివేషనల్ స్పీకర్‌గానూ ఆమె రాణిస్తున్నారు. నైపుణ్యాల గుర్తింపు పింక్ బెల్ట్ మిషన్ ద్వారా మహిళలకు ఆత్మరక్షణ, విద్య, వృత్తి నైపుణ్యం అనే అంశాలు కేంద్రంగా మూడు వేర్వేరు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారు అపర్ణ. ‘‘ఇప్పటివరకు, మా మిషన్ 1.5 లక్షల మంది యువతులు, మహిళల జీవితాలను ప్రభావితం చేసింది. మా మిషన్ ప్రతి భారతీయ మహిళకు ఆరోగ్య అవగాహన, భద్రతా పద్ధతులు, చట్టపరమైన హక్కులు, సైబర్ క్రైమ్, ఆత్మరక్షణ, కంప్యూటర్ అక్షరాస్యత, లైంగిక, గృహ హింసల నివారణ, వృత్తి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని బలోపేతం చేస్తుంది. ఇప్పుడు ఈ మిషన్ కార్యక్రమాలను మరింతగా విస్తృతం చేసి ఇతర రాష్ట్రాల్లోని మహిళలకూ అవగాహన కల్పించే దిశగా సాగుతున్నాను’’ అంటున్నారు అపర్ణ. -
ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి
ఆడవారిపై జరుగుతున్న నేరాలు, ఘోరాలకు అంతులేకుండా పోతోంది. సమాజంలో నేర స్వభావం పెరుగుతున్న కొద్దీ.. అది స్త్రీల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పటం అవసరం. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చింది రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ.. దాని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పాలనే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో కరాటేలో బ్లాక్‌బెల్ట్ సిక్స్ డాన్‌గా మూడుసార్లు పేరు సంపాదించిన నర్రా లక్ష్మీసామ్రాజ్యం ముందడుగు వేసింది.. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గరిమెనపెంట గ్రామానికి చెందిన ఈ ధీర వనితే లక్ష్మీసామ్రాజ్యం. అహింసా మూర్తులు అయిన బౌద్ధ భిక్షువుల ఆత్మరక్షణార్థం ఆవిర్భవించిన అద్భుతమైన విద్య కరాటే. ఆరోగ్యంతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక వికాసంతో పాటు మనో«ధైర్యాన్ని కలుగజేసే అద్భుతమైన శక్తి కరాటేకు ఉందని లక్ష్మీసామ్రాజ్యం చెబుతారు. ‘చీమకు కూడా హాని తలపెట్టకు, చిరుతపులి కళ్లలోని క్రూరత్వపు చూపులకు కూడా వెరవకు–’ అని చెప్పిన తన కరాటే మాస్టర్ రవి మాటలు తూచా తప్పకుండా పాటిçస్తున్నానన్నారు సామ్రాజ్యం. ఆపద సమయంలో ఆత్మరక్షణకు శక్తి టీములు.. విద్యార్థినులు, మహిళలు, ఉద్యోగినులు ఎవరైనా సరే ఆపద సమయంలో ఆందోళన చెందకుండా తమను తాము రక్షించుకొనేందుకు అన్ని వయసుల మహిళలకు శిక్షణ ఇచ్చేలా శక్తి టీములు తయారయ్యాయి.. చెయిన్ స్నాచింగ్, చేయి పట్టుకొని హగ్‌లు ఇచ్చే సందర్భంలో, ఆకస్మిక దాడికి దిగడం...లాంటి అనేక సందర్భాలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు 15 అంశాలలో శిక్షణ ఇచ్చి మహిళలను సుశిక్షితులుగా చేస్తున్నారు రుద్రమదేవి సెల్ప్ డిఫెన్స్ సంస్థ శిక్షకులు రవి, లక్ష్మీ సామ్రా జ్యం, చందు శ్రీనివాస్.. అవార్డులు – రివార్డులు లక్ష్మీసామ్రాజ్యం కరాటే ప్రతాపానికి జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు పలు విజయాలు సొంతం చేసుకొని సిక్స్ డాన్ (కాయ్) మూడు సార్లు సాధించింది.. 2001లో మలేసియాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ రిక్నీవాంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్పోటీలలో బ్లాక్బెల్టును సొంతం చేసుకుంది. 2003లో శ్రీలంకలోని మాతలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలలో బంగారు పతకం, ముంబై, విజయవాడలలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాలు సాధించింది. 2005లో నెహ్రూ యువకేంద్రం వారిచే ఉత్తమ యువతి అవార్డు, అప్పటి ముఖ్యమంత్రి దివంగనేత వైఎస్ రాజశేఖరరెడ్డి, నాటి గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డు అందుకుని తోటి యువతులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మహిళా పోలీసులకు శిక్షణ.. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమి సంస్థ ద్వారా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మహిళా పోలీసులతో పాటు విద్యార్థినులకు శిక్షణ ఇవ్వటం జరిగిందని, ప్రభుత్వం, అధికారులు చేయూతనిస్తే గ్రామీణ ప్రాంతాలలో కూడా మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వాలన్నదే లక్ష్యం అని చెబుతారు లక్ష్మీసామ్రాజ్యం.గత ఏడాది కాలంగా ప్రకాశం జిల్లాలో 385 ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్యుకేషన్ కమిషనర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని, గతేడాది టీవి షోలో మహారాణి ప్రోగ్రాంలో పాల్గొని కరాటేలో మెళకువలు వివరించడం ద్వారా ప్రేక్షకుల అభినందనలు అందుకున్నానని, తాను ఇన్ని విజయాలు సాధించటానికి కారణమైన తల్లిదండ్రులకు, కరాటే మాస్టర్ రవి, షావలిన్లకు రుణపడి ఉంటానని అన్నారు. – నాగం వెంకటేశ్వర్లు,సాక్షి, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా -
ఎంపీలకు ఉచితంగా ఆత్మరక్షణ విద్య
లండన్: బ్రిటన్ ఎంపీలకు ఆత్మరక్షణ విద్యల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఆకస్మిక దాడులను ఎలా ఎదుర్కొవాలో నేర్పించనున్నారు. మహిళా ఎంపీ జో కాక్స్ తన నియోజకవర్గం వెస్ట్ యార్క్‌షైర్‌లో హత్యకు గురైన నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులకు సెల్ఫ్ డిఫెన్స్ పాఠాలు బోధించనున్నారు. జూడో, జుజిట్సు, స్ట్రీట్ ఫైట్, బాక్సింగ్ అంశాలతో కూడిన క్రావ్ మాగా హెబ్రూ విద్యలో ఎంపీలకు శిక్షణ యిస్తారు. ఇందులో భాగంగా తుపాకీ, కత్తి దాడుల నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో నేర్పుతారు. దుండగులు, తీవ్రవాదులు, రాజకీయ అతివాదుల దాడుల నుంచి ఎలా బయటపడేందుకు మెలకువలు బోధిస్తారని 'డైలీ టెలిగ్రాఫ్' వెల్లడించింది. పార్లీ-ట్రైనింగ్ అనే సంస్థ ఈ శిక్షణ ఇవ్వనుంది. దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పుతామని పార్లీ-ట్రైనింగ్ వ్యవస్థాపకుడు మెండోరా తెలిపారు. అయితే ప్రతిదాడుల గురించి నేర్పించబోమని స్పష్టం చేశారు.