Obavva: కోటను కాపాడేందుకు వెళ్లి ప్రాణత్యాగం.. అసలు ఎవరీ ఓబవ్వ? | Obavva Art Of Self Defence Center In Karnataka: Who Is Obavva | Sakshi
Sakshi News home page

Obavva: ఆత్మరక్షణ మంత్రం... ఓబవ్వ.. కోటను కాపాడేందుకు వెళ్లి ప్రాణత్యాగం.. అసలు ఎవరీమె? ఆమె కథ!

Published Thu, Feb 10 2022 4:33 PM | Last Updated on Thu, Feb 10 2022 4:39 PM

Obavva Art Of Self Defence Center In Karnataka: Who Is Obavva - Sakshi

Obavva Art Of Self Defence Center In Karnataka: బెంగళూరులోని ‘ఓబవ్వ ఆర్ట్‌ ఆఫ్‌ సెల్ఫ్‌–డిఫెన్స్‌ ట్రైనింగ్‌’ సెంటర్‌ దగ్గరికి వెళ్లడానికి ముందు పద్దెనిమిదో శతాబ్దంలోని చిత్రదుర్గ కోట దగ్గరికి వెళ్లాలి. చిత్రదుర్గ కోట అనగానే గుర్తొచ్చే పేరు...ఓబవ్వ. ఎవరు ఆమె? చిత్రదుర్గ కోటకు మైసూర్‌ నవాబు హైదర్‌ అలి నుంచి ముప్పు పొంచి ఉంది. ఆ ముప్పు ఒకరోజు దగ్గరికి రానే వచ్చింది. హైదర్‌అలి సైన్యాలు ఉత్సాహవేగంతో కోటను స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నాయి.

ఇది గమనించిన ఓబవ్వ తన ఇంటికి పరుగెత్తుకు వెళ్లింది. కోటలో పనిచేసే ఒక సైనికుడి భార్య ఓబవ్వ. ఇంటికి వెళ్లగానే భర్త భోజనం చేస్తున్న దృశ్యం కంటపడింది. ఆ సమయంలో భర్తకు దుర్వార్త ఎందుకు చెప్పాలనుకుందో ఏమో వెనక్కి వచ్చింది. ఎలాగైనా సరే కోటను కాపాడుకోవాలి. కోటను కాపాడుకోవాలంటే దూసుకొస్తున్న సైన్యాలతో పోరాడాలి. తనకేమో ఎలాంటి యుద్దవిద్యలు తెలియవు.

కానీ సంకల్పం బలమైనదైనప్పుడు మనసు సాయుధం అవుతుంది. పదునైన ఆయుధం అవుతుంది. తనకు ఒక రోకలి కనిపించింది. అంతే...ఆ రోకలిని అందుకొని బయలుదేరింది. దొరికినవాడిని దొరికినట్లు చావబాదింది. హైదర్‌ అలి సైన్యాలతో పోరాడే క్రమంలో వీరమరణం పొందింది ఓబవ్వ. ఇక అప్పటి నుంచి జానపదాల్లో ఆమె జీవితం పాటైంది. కథ అయింది. ఎన్నో సృజనాత్మక రూపాల్లోకి వెళ్లి అప్పటికి ఇప్పటికీ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది. 

తాజా విషయానికి వస్తే కర్నాటక ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ...  స్కూలు, కాలేజిలో చదివే అమ్మాయిల కోసం ఈ వీరవనిత పేరు మీద ‘ఓబవ్వ ఆర్ట్‌ ఆఫ్‌ సెల్ఫ్‌–డిఫెన్స్‌ ట్రైనింగ్‌’ ప్రారంభించింది. ‘మహిళలను గౌరవించే సమాజం మనది. స్త్రీలపై జరిగే హింస, వేధింపులకు అడ్డుకట్టవేయడానికి చట్టాలు తయారుచేసుకున్నాం. రకరకాల విధానాలకు రూపకల్పన చేసుకున్నాం. దీనితో పాటు ఆత్మరక్షణ విద్య కూడా కావాలి. ఆత్మరక్షణ విద్యతో అల్లరిమూకలకు గుణపాఠం చెప్పవచ్చు’ అంటున్నారు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై.

మొదటి దశలో భాగంగా వెనకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో చదువుకునే యాభైవేల మంది అమ్మాయిలకు శిక్షణ ఇస్తారు. పోలీస్‌ ట్రైనింగ్‌ స్కూల్స్‌ కూడా తమవంతు సహాయాన్ని అందిస్తాయి. కార్యక్రమం ప్రారంభోత్సవం తరువాత ధర్మపుర ‘రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ స్కూలు’ అమ్మాయిలు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ‘హా’ ‘హూ’ అంటూ గట్టిగా వినిపించే ఆ శబ్దాలలో నిశ్శబ్దమైన మంత్రం వినిపించింది. ఆ ఉత్తేజిత మంత్రం పేరు...ఓబవ్వ. వీరవనిత ఓబవ్వను తలుచుకుంటే ఏ తరంలోనైనా వినిపించే గట్టి మాట... ‘ఆపత్కాలంలో గుండె నిండా ఆత్మవిశ్వాసం నిండాలి. అది ఆత్మరక్షణ ఆయుధమై శత్రువును భయపెట్టాలి’!

చదవండి: Relief From Muscle Pain: పిక్కలు, తొడ కండరాలు బిగుసుకుపోతున్నాయా... మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగారో..!
  Tharagai Aradhana: ఈ బుజ్జి బంగారం.. 9 నెలలకే ఈత నేర్చుకుంది... ఇప్పుడు సముద్రంలో ఈదుతూ..600 కిలోల చెత్త తీసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement