ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి | Self Defence Lessons From Lasmi Samrajyam | Sakshi
Sakshi News home page

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

Published Thu, Jul 18 2019 12:02 PM | Last Updated on Thu, Jul 18 2019 12:02 PM

Self Defence Lessons From Lasmi Samrajyam - Sakshi

∙∙శిక్షణలో భాగంగా, మహిళా పోలీసులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న లక్ష్మీసామ్రాజ్యం

ఆడవారిపై జరుగుతున్న నేరాలు, ఘోరాలకు అంతులేకుండా పోతోంది.  సమాజంలో నేర స్వభావం పెరుగుతున్న కొద్దీ.. అది స్త్రీల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పటం అవసరం. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చింది రుద్రమదేవి సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీ.. దాని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పాలనే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సిక్స్‌ డాన్‌గా మూడుసార్లు పేరు సంపాదించిన నర్రా లక్ష్మీసామ్రాజ్యం ముందడుగు వేసింది.. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గరిమెనపెంట గ్రామానికి చెందిన ఈ ధీర వనితే లక్ష్మీసామ్రాజ్యం.

అహింసా మూర్తులు అయిన బౌద్ధ భిక్షువుల ఆత్మరక్షణార్థం ఆవిర్భవించిన అద్భుతమైన విద్య కరాటే. ఆరోగ్యంతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక వికాసంతో పాటు మనో«ధైర్యాన్ని కలుగజేసే అద్భుతమైన శక్తి కరాటేకు ఉందని లక్ష్మీసామ్రాజ్యం చెబుతారు. ‘చీమకు కూడా హాని తలపెట్టకు, చిరుతపులి కళ్లలోని క్రూరత్వపు చూపులకు కూడా వెరవకు–’ అని చెప్పిన తన కరాటే మాస్టర్‌ రవి మాటలు తూచా తప్పకుండా పాటిçస్తున్నానన్నారు సామ్రాజ్యం.

ఆపద సమయంలో ఆత్మరక్షణకు శక్తి టీములు..
విద్యార్థినులు, మహిళలు, ఉద్యోగినులు ఎవరైనా సరే ఆపద సమయంలో ఆందోళన చెందకుండా తమను తాము రక్షించుకొనేందుకు అన్ని వయసుల మహిళలకు శిక్షణ ఇచ్చేలా శక్తి టీములు తయారయ్యాయి.. చెయిన్‌ స్నాచింగ్, చేయి పట్టుకొని హగ్‌లు ఇచ్చే సందర్భంలో, ఆకస్మిక దాడికి దిగడం...లాంటి అనేక సందర్భాలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు 15 అంశాలలో శిక్షణ ఇచ్చి మహిళలను సుశిక్షితులుగా చేస్తున్నారు రుద్రమదేవి సెల్ప్‌ డిఫెన్స్‌ సంస్థ శిక్షకులు రవి, లక్ష్మీ సామ్రా జ్యం, చందు శ్రీనివాస్‌..

అవార్డులు – రివార్డులు
లక్ష్మీసామ్రాజ్యం కరాటే ప్రతాపానికి జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు పలు విజయాలు సొంతం చేసుకొని సిక్స్‌ డాన్‌ (కాయ్‌) మూడు సార్లు సాధించింది.. 2001లో మలేసియాకు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ రిక్నీవాంగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్‌పోటీలలో బ్లాక్‌బెల్టును సొంతం చేసుకుంది. 2003లో శ్రీలంకలోని మాతలి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన పోటీలలో బంగారు పతకం, ముంబై, విజయవాడలలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో బంగారు పతకాలు సాధించింది. 2005లో నెహ్రూ యువకేంద్రం వారిచే ఉత్తమ యువతి అవార్డు, అప్పటి ముఖ్యమంత్రి దివంగనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, నాటి గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా అవార్డు అందుకుని తోటి యువతులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

మహిళా పోలీసులకు శిక్షణ..
రుద్రమదేవి సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమి సంస్థ ద్వారా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో మహిళా పోలీసులతో పాటు విద్యార్థినులకు శిక్షణ ఇవ్వటం జరిగిందని, ప్రభుత్వం, అధికారులు చేయూతనిస్తే గ్రామీణ ప్రాంతాలలో కూడా మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వాలన్నదే లక్ష్యం అని చెబుతారు లక్ష్మీసామ్రాజ్యం.గత ఏడాది కాలంగా ప్రకాశం జిల్లాలో 385 ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సంధ్యారాణి ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని, గతేడాది టీవి షోలో మహారాణి ప్రోగ్రాంలో పాల్గొని కరాటేలో మెళకువలు వివరించడం ద్వారా ప్రేక్షకుల అభినందనలు అందుకున్నానని, తాను ఇన్ని విజయాలు సాధించటానికి కారణమైన తల్లిదండ్రులకు, కరాటే మాస్టర్‌ రవి, షావలిన్‌లకు రుణపడి ఉంటానని అన్నారు.  – నాగం వెంకటేశ్వర్లు,సాక్షి, కొనకనమిట్ల, ప్రకాశం జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement