ఎంపీలకు ఉచితంగా ఆత్మరక్షణ విద్య
లండన్: బ్రిటన్ ఎంపీలకు ఆత్మరక్షణ విద్యల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఆకస్మిక దాడులను ఎలా ఎదుర్కొవాలో నేర్పించనున్నారు. మహిళా ఎంపీ జో కాక్స్ తన నియోజకవర్గం వెస్ట్ యార్క్షైర్లో హత్యకు గురైన నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులకు సెల్ఫ్ డిఫెన్స్ పాఠాలు బోధించనున్నారు. జూడో, జుజిట్సు, స్ట్రీట్ ఫైట్, బాక్సింగ్ అంశాలతో కూడిన క్రావ్ మాగా హెబ్రూ విద్యలో ఎంపీలకు శిక్షణ యిస్తారు. ఇందులో భాగంగా తుపాకీ, కత్తి దాడుల నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో నేర్పుతారు.
దుండగులు, తీవ్రవాదులు, రాజకీయ అతివాదుల దాడుల నుంచి ఎలా బయటపడేందుకు మెలకువలు బోధిస్తారని 'డైలీ టెలిగ్రాఫ్' వెల్లడించింది. పార్లీ-ట్రైనింగ్ అనే సంస్థ ఈ శిక్షణ ఇవ్వనుంది. దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పుతామని పార్లీ-ట్రైనింగ్ వ్యవస్థాపకుడు మెండోరా తెలిపారు. అయితే ప్రతిదాడుల గురించి నేర్పించబోమని స్పష్టం చేశారు.