British MPs
-
ఎంపీలకు ఉచితంగా ఆత్మరక్షణ విద్య
లండన్: బ్రిటన్ ఎంపీలకు ఆత్మరక్షణ విద్యల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఆకస్మిక దాడులను ఎలా ఎదుర్కొవాలో నేర్పించనున్నారు. మహిళా ఎంపీ జో కాక్స్ తన నియోజకవర్గం వెస్ట్ యార్క్‌షైర్‌లో హత్యకు గురైన నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులకు సెల్ఫ్ డిఫెన్స్ పాఠాలు బోధించనున్నారు. జూడో, జుజిట్సు, స్ట్రీట్ ఫైట్, బాక్సింగ్ అంశాలతో కూడిన క్రావ్ మాగా హెబ్రూ విద్యలో ఎంపీలకు శిక్షణ యిస్తారు. ఇందులో భాగంగా తుపాకీ, కత్తి దాడుల నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో నేర్పుతారు. దుండగులు, తీవ్రవాదులు, రాజకీయ అతివాదుల దాడుల నుంచి ఎలా బయటపడేందుకు మెలకువలు బోధిస్తారని 'డైలీ టెలిగ్రాఫ్' వెల్లడించింది. పార్లీ-ట్రైనింగ్ అనే సంస్థ ఈ శిక్షణ ఇవ్వనుంది. దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పుతామని పార్లీ-ట్రైనింగ్ వ్యవస్థాపకుడు మెండోరా తెలిపారు. అయితే ప్రతిదాడుల గురించి నేర్పించబోమని స్పష్టం చేశారు. -
2020 నుంచి బ్రిటిష్ ఎంపీలకు మద్యం ఉండదు!
లండన్: 2020 నాటికి బ్రిటిష్ ఎంపీలుగా ఉండేవారు కొద్దిరోజులపాటు మద్యం మానుకోవాల్సి రావచ్చు. ప్రస్తుతం వారు ఉంటున్న ‘ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్స్ పార్లమెంటు’ భవనం నవీకరణ పనులను 2020లో మొదలు పెట్టనున్నారు. ఆ సమయంలో వారికి తాత్కాలికంగా ‘రిచ్మండ్ హౌస్’లో వసతి కల్పిస్తారు. ఈ భవనంలో ఇస్లాం నిబంధనలు అమలవుతున్నందున మద్యం తాగడం నిషేధం. కాబట్టి రిచ్మండ్ హౌస్‌లో ఉన్నన్ని రోజులూ ఎంపీలు మద్యం తాగకూడదు. పాత భవనం నవీకరణ పూర్తయ్యి, అక్కడికి మారేవరకు పరిస్థితి ఇంతే. -
అతనో బఫూన్, పిచ్చోడు!
లండన్: ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై బ్రిటన్ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనో 'బఫూన్', 'పిచ్చివాడు' అంటూ విమర్శలు చేశారు. అయితే ఆయనను బ్రిటన్‌లో అడుగుపెట్టకుండా శాశ్వతంగా నిషేధించాలన్న తీర్మానాన్ని మాత్రం ఏకగ్రీవంగా తోసిపుచ్చారు. బ్రిటన్‌లో ప్రవేశించకుండా ట్రంప్‌ను నిషేధించాలన్న తీర్మానంపై బ్రిటన్ పార్లమెంటులో వాడీవేడి చర్చ జరిగింది. ఆయన రాకను నిషేధించాలంటూ దాదాపు 5 లక్షల మంది ఓ ఆన్లైన్ పిటిషన్‌పై సంతకం చేసిన నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటు ఈ అంశంపై చర్చ చేపట్టింది. బ్రిటన్‌లో ట్రంప్‌కు భారీ ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. తన రాకను నిషేధించాలన్న ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ బ్రిటన్‌లోని తన పెట్టుబడులను ఉపసంహరిస్తానని హెచ్చరించారు. కానీ ట్రంప్ అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన స్కాట్లాండ్ రాష్ట్రం ఎంపీలే ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ బ్రిటన్ రాకుండా నిషేధించాలని చర్చ సందర్భంగా వారు గట్టిగా డిమాండ్ చేయడం గమనార్హం. అమెరికాలోకి ముస్లింలు రాకుండా తాత్కాలికంగా నిషేధించాలని, అక్రమ వలసదారులు రాకుండా సరిహద్దులు మూసివేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఎంపీలు గేవిన్ రాబిన్సన్, అలెక్స్ చాక్ తీవ్రంగా తప్పుబట్టారు. తనవైపు జనాలను ఆకర్షించుకునేందుకు ట్రంప్ బఫూన్లా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆలోచన ధోరణి హేతుబద్ధంగా లేదని ఎంపీలు విమర్శించారు. -
పార్లమెంటేరియన్ల చేతిలో పాన్‌కేకులు!
వేషధారణను బట్టి ఫైవ్‌స్టార్ హోటల్ షెఫ్లలా ఉన్నారు కానీ నిజానికి వీళ్లు బ్రిటన్ ఎంపీలు. మరి ఆ చేతుల్లో పాన్లు, ఎగురుతున్న కేక్‌లు ఏమిటంటే... ఇదంతా ఒక చారిటీ ప్రోగ్రామ్. చేతిలో పాన్‌తో ఒక రొట్టెను గాల్లో ఎగరేస్తూ తిరిగి పట్టుకొంటూ పరిగెత్తడానికి వీళ్లు ప్రాక్టీస్ అవుతున్నారు. ప్రతియేటా బ్రిటన్ ఎగువసభ, దిగువసభకు చెందిన పార్లమెంటేరియన్లు ఒక టీమ్‌గా, పొలిటికల్ జర్నలిస్టులంతా మరో టీమ్‌గా ఈ రేస్‌లో పాల్గొంటారు. దీన్నే పాన్కేక్ రేస్ అని అంటారు. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం జరిగింది. రాజకీయ ప్రముఖులు పాల్గొనే షో కాబట్టి దీనికి మంచి ఆదరణ కనిపించింది. విరాళాలూ బాగానే పోగయ్యాయి.