నేడు జాతీయ బాలికల దినోత్సవం
కరాటే అనేది మార్షల్ ఆర్ట్ మాత్రమే కాదు... మహత్తరమైన ఫిలాసఫీ కూడా. ఆ తత్వంలో... మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే... సాహసంతో దూసుకెళ్లే స్ఫూర్తి దాగుంది. అందుకే కరాటే అనే ఆత్మరక్షణ విద్య అత్యవసరం అయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న వంద విద్యాసంస్థల్లో 30 రోజుల పాటు 50 వేల మంది అమ్మయిలకు కరాటే క్లానుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు...
అక్షరక్రమంలోనే కాదు, ఆత్మరక్షణలోనూ అనంతపురం జిల్లాను ముందు వరుసలో ఉంచే లక్ష్యంగా అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పాఠశాలల నుంచి కాలేజీల వరకు కరాటే క్లాసుల నిర్వహణకు చొరవ తీసుకున్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ సహకారంతో ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆర్డీటీ సంస్థ ప్రతినిధులతో కలసి అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యతోపాటు యోగా, మానసిక వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న సామాజిక ఉద్యమకారిణి, తొలితరం ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, జడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల పరిధిలోని బాలికల పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. (National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?)
‘నిజం చెప్పాలంటే కొన్నిరోజుల ముందువరకు ఇల్లు దాటి ఒంటరిగా బయటికి రావాలంటే భయంగా ఉండేది. ఎవరైనా కామెంట్ చేస్తారేమో అనే భయమే దీనికి కారణం. ఒకరోజు మా అక్క ను ఎవరో అసభ్యంగా కామెంట్ చేస్తే ఇంట్లో చెప్పి ఏడ్చింది. అప్పటినుంచి నాకు కూడా అలాంటి అనుభవం ఎదురవుతుందేమోననే భయం ఏర్పడింది. కరాటే క్లాసులకు హాజరు కావడం వల్ల నాలో ఉన్న ఆ భయం పోయింది. ఇప్పుడు నేను నిశ్చింతగా బయటికి వెళుతున్నాను. ఎవరైనా కామెంట్ చేస్తే వారిని ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చుకు వెళ్లగలననే నమ్మకం వచ్చింది’ అంటుంది పల్లవి.
‘కరాటే నేర్చుకోవడం అనేది ఎవరినో భయపెట్టడానికి కాదు. మనం ధైర్యంగా ఉండడానికి. కరాటేలాంటి ఆత్మరక్షణ విద్యల వల్ల క్రమశిక్షణ, ఆరోగ్య స్పృహ పెరుగుతుందనేది అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను’ అంటుంది శ్రీలత. (National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్!)
‘మా అమ్మాయికి ఎంసెట్ కోచింగ్ ఇప్పటినుంచే ఇప్పిస్తున్నాం’ అని ఘనంగా చెప్పుకునే తల్లిదండ్రులను, ‘అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ఎందుకు!’ అని ఆశ్చర్యపడేవాళ్లను ఎందరినో చూస్తుంటాం. పల్లవి, శ్రీలత, ఆఫ్రోజ, భార్గవి.. లాంటి అమ్మాయిల మనసులో మాట విన్నప్పుడు కరాటే నుంచి యోగా వరకు శిక్షణ తరగతులు నిర్వహణ అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.– ఖాజీ హిదాయతుల్లా, సాక్షి, అనంతపురం సిటీ
ఎప్పుడు ఏ ఆపద వచ్చినా...
జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది అమ్మాయిలను ఆత్మరక్షణ విద్యలో ఆరితేరేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు ప్రతి మండలం లో కార్యక్రమాన్ని నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించి అమలు చేస్తున్నాం. నాలుగు రిసోర్స్ టీమ్‌లు అందుబాటులో ఉంటాయి. వాటికి వీరవాహిని, బలప్రభ, సురసేన, శక్తిసేనగా నామకరణం చేశాం. సంక్షేమ శాఖ, కరాటే అసోసియేషన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు ప్రతి టీమ్‌ను పర్యవేక్షిస్తారు. ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా సమర్థంగా తిప్పికొట్టేలా అమ్మాయిలను తీర్చిదిద్దుతున్నాం. పది నుంచి పద్దెనిమిది ఏళ్లలోపు టీ నేజ్ అమ్మాయిలకు వచ్చే సమస్యలపైన అవగాహన కల్పిస్తున్నాం. – బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్, అనంతపురం
అదృష్టంగా భావిస్తున్నా...
కరాటే, యోగా, మానసిక వికాసం, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఉచితంగా శిక్షణ పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరైనా ఆకతాయులు నా జోలికి వస్తే తోక ముడిచి పరుగెత్తేలా చేయగలననే నమ్మకం వచ్చింది. అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచే ఇటువంటి శిక్షణ ఇస్తే మరింత బాగుంటుంది.– జి. భార్గవి, ఇంటర్ విద్యార్థిని, రాప్తాడు
సెల్ఫ్–డిఫెన్స్
సాహసానికి జెండర్ భేదం లేదు. అయితే కొన్ని ఆటలు మాత్రం ‘పురుషులకు మాత్రమే’ కోట గోడలలో బంధీలై పోయాయి. ఇప్పుడు ఆ కోటలు బ్రద్దలవుతున్నాయి. తమిళనాడులో ‘ఇలవట్ట కల్’ అనేది పురాతన ఆట. పెద్ద పెద్ద గుండ్రాళ్లను ఎత్తి పడేసే ఈ ఆటలో పురుషులు మాత్రమే పాల్గొనేవారు. మహిళలు ప్రేక్షక΄ాత్రకే పరిమితం అయ్యేవారు. ఈసారి మాత్రం మేము సైతం అంటూ ‘ఇలవట్ట కల్’లో మహిళలు సత్తా చాటారు. భవిష్యత్ తరాలకు తరగని ఉత్సాహాన్ని ఇచ్చారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఈసారి మహిళల కోసం ‘ఇలవట్ట కల్’ ప్రత్యేకంగా నిర్వహించారు. 47 కేజీలు, 67 కేజీల విభాగంలో మహిళలు సత్తా చాటారు.
ఎత్తే సత్తా
‘ఇలవట్ట కల్’ ΄ోటీలలోపాల్గొన్న భవధరణి 67 కేజీల బరువు ఉన్న రాతిగుండును ఏకంగా రెండు సార్లు అలవోకగా ఎత్తిపడేసి మొదటి బహుమతిని గెలుచుకుంది. ‘ఈ ΄ోటీలలో ΄ాల్గొనడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి... సంప్రదాయంగా వస్తున్న ఆటలను కాపాడుకోవడం. రెండు... ఇలవట్ట కల్‌లో మహిళలు కూడా సత్తా చాటగలరు అని నిరూపించడం’ అంటుంది భవధరణి.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment