![Visakhapatnam Sisters Win Medals In Karate](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/karate.jpg.webp?itok=aKSlyJgq)
వారి ఇంటిపేరు ఏమిటో చాలామందికి తెలియదు. ‘కరాటే సిస్టర్ప్’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన విశాఖపట్నంకు చెందిన కృష్ణప్రియ, జ్యోతి, సంగీత కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెల్చుకున్నారు. కర్రసాము, చెస్‌లోనూ రాణిస్తున్నారు...
జీవీఎంసీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న రామారావు ముగ్గురు కుమార్తెలు సంగీత, కృష్ణప్రియ, జ్యోతి కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. విశాఖ మహా నగరంలోని పీ అండ్ టీ కాలనీలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ (ఎన్ ఎంసీహెచ్)లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. ఒక వైపు చదువు, మరోవైపు కరాటేలో ప్రావీణ్యం చూపుతున్నారు.
కృష్ణప్రియ (16) డబ్లు్యఆర్‌ఐ ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్–2017 పోటీలలో రజతం, ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2018 పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు, నెట్‌షాడోకాన్ నేషనల్ ఛాంపియన్ షిప్–2019 ఓపెన్ కరాటే పోటీలలో వెండి, కాంస్య పతకాలు, దక్షిణ భారత కరాటే ఛాంపియన్ షిప్–2020 పోటీల్లో రజత, కాంస్య పతకాలు, 5వ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో స్వర్ణ, వెండి పతకాలు, 13వ జాతీయ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే కుంగ్‌ఫూ ఛాంపియన్ షిప్–2022 పోటీలలో రజత, వెండి పతకాలు, 8వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్–2025 ΄ోటీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు....ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పతకాలు సాధించింది.
ఈ నెలలో విశాఖలోని పోర్టు స్టేడియంలో జరిగిన 81వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్–2025 పోటీలలో ముగ్గురు సోదరీమణులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీలలో జ్యోతి బంగారు పతకం, వెండిపతకాలు, కృష్ణప్రియ ఏకంగా రెండు బంగారు పతకాలు, సంగీత వెండి, కాంస్య పతకాలు సాధించింది. విశాఖలో జరిగిన ఈ పోటీలలో విశాఖకు చెందిన ఈ ముగ్గురు సోదరీమణులు ఒకే వేదిక మీద సత్తా చాటి పతకాలు అందుకొని భేష్ అనిపించుకున్నారు.
‘రామారావుకు నేనే కరాటేలో శిక్షణ ఇచ్చాను. 1989 నుంచి కరాటే అకాడమీ నిర్వహిస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా రామారావు ముగ్గురు కుమార్తెలకు కూడా కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. ఈ ముగ్గురు పిల్లలకు కష్టపడే తత్వం ఉంది. మంచి భవిష్యత్ ఉంది’ అంటున్నాడు కరాటే కోచ్ ఎల్లారావు.
‘పిల్లలు సరదాగా కరాటే నేర్చుకుంటున్నారు అనుకున్నానుగానీ ఇంత పేరు తెచ్చుకుంటారు అనుకోలేదు. వారి విజయాలకు ఒక తండ్రిగా మురిసిపోతున్నాను. గర్విస్తున్నాను’ అంటున్నాడు రామారావు. కరాటే అంటే నిండైన ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసమే ముగ్గురు సోదరీమణులకు ఆభరణం. వారు కరాటేలో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆశిద్దాం.
– దుక్కా మురళీకృష్ణారెడ్డి, సాక్షి, సీతమ్మధార, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment