
ఆటకు పట్టం
కరాటే, స్విమ్మింగ్‌లో రాణిస్తున్న ఖుషీధర్‌రెడ్డి
మూడేళ్ల ప్రాయంలోనే బంగారు పతకం
జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు
మూడేళ్ల ప్రాయంలోనే బంగారు పతకాన్ని కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాడు ఈ బుడతడు. స్వతహాగా క్రీడాకారుడైన తండ్రి ప్రోత్సాహం.. ఆ వెనువెంటే కన్నతల్లి చల్లని దీవెనలు తోడు కావడంతో కరాటే, స్విమ్మింగ్‌లో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అతనే రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వెన్నపూస లోకేశ్వరరెడ్డి, లత దంపతుల కుమారుడు ఖుషీధర్‌రెడ్డి. ప్రస్తుతం ప్రసన్నాయపల్లిలోని ఎల్‌ఆర్‌జీ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న ఖుషీధర్‌రెడ్డి.. క్రీడలతో పాటు చదువులోనూ రాణిస్తున్నాడు. స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయిలో నాల్గో స్థానంలో ఉండగా... కరాటేలో అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటుకున్నాడు. ఇక చదువులో తన పాఠశాలలో ఐదో ర్యాంక్ సాధించాడు.
- అనంతపురం సప్తగిరిసర్కిల్
తొలి గురువు తండ్రే
స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన లోకేశ్వరెడ్డి.. కర్రసాములో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు. అదే చిన్నారి ఖుషీధర్‌రెడ్డిని ఆకర్షించింది. తన తండ్రి వద్ద కర్రసాము అభ్యసిస్తూ అదే సమయంలో కరాటేలోనూ తండ్రి నుంచి మెలకువలు తెలుసుకుంటూ వచ్చాడు. ఖుషీధర్ రెడ్డిలోని ఆసక్తిని గమనించిన లోకేశ్వరరెడ్డి అతడిని 2010లో తైక్వాండో శిక్షకుడు గురుస్వామి వద్దకు చేర్చాడు. అదే ఏడాది ఆగస్టులో శ్రీకృష్ణదేవరాయల పంచ శతాబ్ధి పట్టాభిషేక మహోత్సవాలను పురస్కరించుకుని అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో 18 కేజీల విభాగంలో ఖుషీధర్‌రెడ్డికి తొలిసారిగా తన ప్రతిభను చాటుకునే అవకాశం దక్కింది.
ఆ పోటీల్లో అద్భుతంగా రాణించిన అతను బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అదే సమయంలో స్కూల్ ఆఫ్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ (సిమ) చేరాడు. గురువు ఆర్నాల్డ్ విక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఖుషీధర్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని కటాస్ విభాగంలో ప్రథమ, కుబుడో (కర్రసాము)లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. కర్ణాటకలోని ఫెడరేషన్ ఆఫ్ ఒకినోవా కరాటే గుజురియో డు కరాటే రెన్మాయ్ ఇండియా ఆధ్వర్యంలోని జిల్లా శిక్షకుడు శ్రీనివాసరావు వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొంది హరిహరలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇండోనేపాల్ అంతర్జాతీయ కరాటే పోటీల్లో కటాస్‌లో ప్రథమ, కుబుడోలో ద్వితీయస్థానంలో నిలిచాడు.
స్విమింగ్‌లోనూ అసమాన ప్రతిభ
2014లో సరదాగా నేర్చుకున్న ఈత.. అదే ఏడాది మేలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఖుషీధర్‌రెడ్డికి జిల్లా నుంచి ప్రాతినిథ్యం దక్కేలా చేసింది. అదే ఏడాది ఆగస్ట్‌లో జిల్లా స్థాయి అండర్-8 విభాగం ఈత పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అదే ఏడాది డిసెంబర్ 17, 18 తేదీల్లో కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో 200 మీ।। వ్యక్తిగత మిడ్‌లే విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచాడు. 50 మీ।। బ్యాక్ స్ట్రోక్ విభాగంలో తృతీయ, 100 మీ।। ఫ్రీ స్టైల్ విభాగంలోనూ తృతీయ బహుమతి సాధించి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. 2016 జూన్‌లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన జాతీయస్థాయి ఈత పోటీల్లో పాల్గొని నాల్గోస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి ఈత పోటీల్లోనూ నాల్గో స్థానంలో నిలిచాడు. ఒలంపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఖుషీదర్‌రెడ్డి... తన ప్రతి విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు కోచ్‌లు రవిశేఖర్‌రెడ్డి, రాజశేఖర్ పాత్ర మరువలేనిదని అంటున్నాడు.