
అర్జున్ అదిరెన్
కరాటేలో రాణిస్తున్న గిరిపుత్రుడు
‘ఆల్ ఇండియూ కునిబకాయ్‌డు’ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం
చైనాలో జరిగే అంతర్జాతీయ స్థారుు పోటీలకు అర్హత
‘మందలో ఒకరిగా కాకుండా వందలో ఒకరిగా ఉండు..’ అని స్వామి వివేకానందుడు చెప్పిన సూక్తిని ఈ యువకుడు ఆచరించాడు. పేదరికం వెంటాడినా.. కష్టాలు చుట్టుముట్టినా.. అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో ముందుకుసాగాడు. ఈ మేరకు తనకు ఇష్టమైన కరాటేలో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు ఆ గిరిపు త్రుడు. కష్టపడితే విజయం ఎన్నటికైనా వరిస్తుందని ఆశిస్తున్నాడాయన. ‘శ్రమయేవ జయతే’ అని నినదిస్తున్న కరాటే కింగ్ అర్జున్‌పై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.
గూడూరు : మండలంలోని బొల్ల్లేపల్లి శివారులోని బంచరాయితండాకు చెందిన బానోతు ఈర్యా, కాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు అర్జున్‌కు కరాటే అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఈర్యా, కాంతమ్మలు తమకున్న రెండెకరాల పొలాన్ని సాగుచేస్తూ ఇద్దరు కొడుకులను చదివిస్తున్నారు. కాగా, అర్జున్ 1 వ తరగతి నుంచి 10 వరకు గూడూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నాడు. 2009లో పదో తరగతి వచ్చే సరికి ఆయనకు కరాటే నేర్చుకోవాలనే కోరికి పుట్టింది. ఈ క్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లి కరాటే ఎవరు నేర్పిస్తారని అడుగగా.. నర్సంపేటలో కరాటే మాస్టర్లు ఉంటారని చెప్పారు.
రచ్చ శ్రీనివాస్ దగ్గర శిక్షణ..
పదో తరగతి పాసైన తర్వాత అర్జున్ నర్సంపేటలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. ఈ సమయంలో ఆయనకు కరాటే కోచ్ రచ్చ శ్రీనివాస్ (ఆంధ్రప్రదేశ్ కరాటే చీఫ్ ఇన్‌స్ట్రక్టర్) పరిచయమయ్యాడు. దీంతో అర్జున్.. రచ్చ శ్రీనివాస్ నడిపిస్తున్న జపాన్ కరాటే క్లబ్‌లో చేరి శిక్షణ పొందాడు. నాలుగేళ్లలోనే ఎన్నో మెలకువలు నేర్చుకొని, జాతీయస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు.
పసిడి పతకం సాధించడమే లక్ష్యం...
2014లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలో పాల్గొని అంతర్జాతీయస్థాయికి పోటీలకు అర్హత సాధించడం ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకొని మంచిపేరు తెచ్చుకోవాలనే తపన మా గురువు రచ్చ శ్రీనివాస్ వల్ల నెరవేరింది. మాస్టర్ సహకారంతో అంతర్జాతీయస్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించి దేశానికి పేరు తీసుకొస్తాను. -బానోతు అర్జున్
పతకాల పంట..
శిక్షణ పొందుతున్న క్రమంలోనే అర్జున్ జిల్లా, రాష్ర్ట, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. ఈ మేరకు పలు ఈవెంట్లలో 4 పసిడి పతకాలు, 2 సిల్వర్ మెడల్స్, పలుమార్లు బ్లాక్‌బెల్టులు సాధించాడు. స్పారింగ్, కటాస్, గ్రూప్ కటాస్ ఇలా ప్రతీ విభాగంలో సత్తాచాటుతూ పతకాలు సాధిస్తున్నాడు. కాగా, 2015లో మానుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన అర్జున్ ప్రస్తుతం ఖమ్మంలో హెచ్‌పీటీ చేస్తున్నారు.
అంతర్జాతీయ పోటీలకు అర్హత..
2014లో కాజీపేటలో జరిగిన రెఫరీ ట్రైనింగ్ ఎంపికలో అర్జున్ పాల్గొని కరాటేకు సంబంధించిన అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచాడు. ఈ మేరకు ఢిల్లీలో అదే ఏడాది జరిగిన ‘ఆల్ ఇండియా కునిబకాయ్‌డు చాంపియన్‌షిప్’లో కాంస్య పతకం సాధించి మరో నాలుగు నెలల్లో చైనాలో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించాడు. 2014లో నర్సంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఒక్క టోర్నమెంట్‌లోనే నాలుగు విభాగాల్లో రెండు చొప్పున బంగారు, వెండి పతకాలు సాధించాడు. డిగ్రీ చదువుతూనే మూడు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. పది పూర్తిచేసిన తన తమ్ముడికి కూడా కరాటే నేర్పిస్తున్నారు.