ధీశాలి 'బహుముఖ ప్రజ్ఞాశాలి' | karate padmaja special story on women empowerment | Sakshi
Sakshi News home page

ధీశాలి 'బహుముఖ ప్రజ్ఞాశాలి'

Published Wed, Feb 14 2018 12:57 PM | Last Updated on Wed, Feb 14 2018 12:57 PM

karate padmaja special story on women empowerment - Sakshi

1995లో ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి ఉమన్‌ బ్లాక్‌ బెల్ట్‌ ఫస్ట్‌ డాన్‌గా పద్మజ

అది 1980 దశకం..అప్పుడప్పుడే కరాటే అంటే యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న పద్మజ కూడా ఆ యుద్ధ క్రీడంటే మక్కువ చూపి శిక్షణ పొందడం మొదలుపెట్టారు. క్రమంగా మెళకువలు నేర్చుకుంటూ జిల్లాలో మొట్టమొదటి ఉమన్‌ బ్లాక్‌బెల్ట్‌ ఫస్ట్‌ డాన్‌గా నిలిచారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ పతకాలు కైవసం చేసుకున్నారు. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యను ఇతరులకు కూడా పంచాలనుకుని ఇప్పటి వరకు కొన్ని వందల మంది బాల బాలికలకు, షీ టీంలకు ఆత్మరక్షణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. కరాటే శిక్షకురాలిగానే కాదు..ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా, చిత్రకారిణిగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ చాటుతున్న పద్మజపై ‘సాక్షి’ కథనం.

ఒంగోలు వన్‌టౌన్‌: మేదరమెట్ల నుంచి వచ్చి ఉద్యోగరీత్యా ఒంగోలులో స్థిరపడిన చిలకమర్తి గోపాలకషమూర్తి, రమాదేవి దంపతులకు ఒక్కగానొక్క కూతురు పద్మజ. తండ్రి విద్యుత్‌ శాఖలో జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కావడంతో పద్మజ తన అన్న చంద్రశేఖర్‌ (మ్యాథ్స్‌ లెక్చరర్, హైదరాబాద్‌) తమ్ముడు కష్ణమోహన్‌ (ఫార్మాసూట్‌ సైంటిస్ట్, న్యూయార్క్‌)తో సమానంగా పెరిగింది. ఒంగోలు శర్మా కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన పద్మజ 1993లో బీఎస్సీ, బీఈడీ పట్టా తీసుకున్నారు. 1996లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా కొత్తపట్నం మండలం బజ్జిరెడ్డి గమళ్లపాలెం పాఠశాలలో ఉద్యోగినిగా చేరారు. 2009లో  స్కూల్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ రావడంతో ఇంగ్లిష్‌ టీచర్‌గా మద్దిపాడు మండలం బసవన్నపాలెం ఉన్నతపాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం చిన్నగంజాం హైస్కూల్‌ నందు ఇంగ్లిష్‌ ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు.

కరాటే పద్మజ
1980 దశకంలో కరాటే శిక్షణ యువతీయువకులను విపరీతంగా ఆకర్షించింది.  పద్మజ డిగ్రీ చదివే రోజుల్లో ఒంగోలు మహిళా మండలి వద్ద ప్రతిరోజూ ప్రముఖ కరాటే మాస్టర్‌ వలిశెట్టి రవి యువకులకు కరాటే శిక్షణ ఇవ్వడం గమనించి, కరాటే నేర్చుకోవాలన్న ఆసక్తిని నేరుగా రవి మాస్టర్‌కి తెలిపింది. అలా యుద్ధ నైపుణ్య విద్యలో తొలి అడుగులు వేసిన పద్మజ 1995లో ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి ఉమెన్‌ బ్లాక్‌ బెల్ట్‌ ఫస్ట్‌ డాన్‌గా, 2017 జనవరి 8న ఉమెన్‌ బ్లాక్‌ బెల్ట్‌ ఫోర్త్‌ డాన్‌గా నిలిచింది. 2015లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియం (హైదరాబాదు)లో జరిగిన నేషనల్‌ బూడోకాన్‌ ఈవెంట్‌లో ‘కట’ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించింది. ఉద్యోగరీత్యా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పటికీ స్వార్డ్, స్టిక్, నాన్‌చక్‌ ప్రాక్టీస్‌ కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇంగ్లిష్‌ ఉపాధ్యాయినిగా ...
తను పని చేస్తున్న చోట పలువురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా నవోదయ, గురుకుల పాఠశాలలకు అర్హత సాధించడంలో చేయూతనిచ్చారు.
2009 నుంచి జిల్లా రీసోర్స్‌ పర్సన్‌గా కొనసాగుతూ విద్యాశాఖ నిర్వహించిన వివిధ శిక్షణా శిబిరాల్లో ఆంగ్ల బాషా శిక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు.
2016లో బెంగళూర్‌లో  రీజినల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ సౌత్‌ ఇండియా (ఆర్‌ఐఇఓస్‌ఐ) ఆధ్వర్యంలో జరిగిన క్యాంప్‌లో జిల్లా విద్యాశాఖ సహకారంతో సీఈఎల్‌టీ ట్రైనింగ్‌ తీసుకున్నారు.
2017 ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజున స్పాట్‌ వాల్యుయేషన్‌కి వచ్చిన సుమారు 100 మంది సహచర ఇంగ్లిష్‌ ఉపాధ్యాయులతో ‘ఇంగ్లిష్‌–ప్రకాశం’ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 300 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ గ్రూప్‌ ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు ఇంగ్లిష్‌ బోధనలో వచ్చే  సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సమన్వయపరచడం.
2017లో ఏపీ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్, బ్రిటీష్‌ కౌన్సిల్‌ వారు సంయుక్తంగా నిర్వహించిన ఇంగ్లిష్‌ ట్రైనింగ్‌ క్యాంపులో మాస్టర్‌ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ అంశంపై రాష్ట్రీయ మాధ్యమిక విద్యా మిషన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) వారు నిర్వహించిన క్యాంపులో మాస్టర్‌ ట్రైనర్‌గా శిక్షణ పొందారు.

ప్రేమ వివాహం  
కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదవడం, పద్మజ తండ్రి వత్తి రీత్యా బయటి ప్రపంచంతో మమేకం కావడంతో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ ప్రతి విషయాన్ని అందరూ కలిసి మాట్లాడుకోవటం, కలిసి నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా మారిన నేపధ్యంలోనే పద్మజ తన సహవిద్యార్థి వై.ఎస్‌.దిగ్విజయ్‌ను మతాంతర వివాహం చేసేకున్నారు. పెళ్లి జరిగిన తొలి రోజుల్లో ఇద్దరి కుటుంబాల భావ సంఘర్షణ వల్ల ఏర్పడిన అరమరికలు అనతికాలంలోనే సమసిపోయి ఇద్దరి కుటుంబాలు ఆదర్శంగా నిలిచాయి. 80 దశకంలో విప్లవ భావాలు యువతలో మెండుగా ఉన్న రోజులు. ప్రేమంటే భావావేశంతో కలిగేదనిపిస్తున్న నేటి ప్రేమ కథలకు భిన్నంగా, భావసారూప్యతతో జీవిత భాగస్వాములైన పద్మజ, దిగ్విజయ్‌లను చూసి నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కుటుంబం గురించి
ఒంగోలు జక్రయ్య ఆస్పత్రి వీధిలో నివసిస్తోంది పద్మజ కుటుంబం. భర్త వై.ఎస్‌.దిగ్విజయ్‌ ఒంగోలు నగరంలోని పేస్‌ గ్లోబల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలు బయాలజీ సైన్స్‌ టీచర్‌గా సేవలందించిన దిగ్విజయ్‌ ఒక లోకల్‌ ఛానెల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వివేక్‌ (21) శ్రీకాకుళం డెంటల్‌ కాలేజీలో డెంటల్‌ సర్జన్‌ (బీడీఎస్‌) చదువుతున్నాడు. విక్రాంత్‌ (18) విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్నాడు. తల్లి వద్ద కరాటే శిక్షణ పొందిన ఈ ఇద్దరు పిల్లలు గ్రీన్‌ బెల్ట్‌ పొందారు.
‘సమాజం కోసం నా వంతుగా ... ప్రభుత్వంగానీ, వలంటరీ ఆర్గనైజేషన్స్‌గానీ నగరంలో ఏదైనా వేదిక ఏర్పటు చేయగలిగితే ఉదయం ఆత్మరక్షణ యుద్ధ నైపుణ్యం శిక్షణ, సాయంత్రం ఇంగ్లిష్‌ మాట్లాడటం, బోధనా నైపుణ్యం, బాషా సమస్యలపై ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’     అంటున్న పద్మజ ఆశ నెరవేరాలని ఆశిద్దాం.

ఉపాధ్యాయినిగా.. ఆత్మరక్షణ  నైపుణ్య శిక్షకురాలిగా
1995–96 లో ఖాశీం మెమోరియల్‌ బాలికలపాఠశాల (దర్శి) విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చారు.
2006లో ప్రకాశం జిల్లా సర్వశిక్ష అభియాన్‌ పీడీరఘుకుమార్‌ ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహించిన  వేసవి శిక్షణ శిబిరంలో ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించారు.
2012 నిర్భయ ఘటన తరువాత ఒంగోలు వాకర్స్‌క్లబ్‌ లో మాస్టర్‌ ఎ.రవిశంకర్‌తోపాటు పలువురికిప్రాక్టీస్‌లో సేవలందిచారు.
2014 నుంచి స్థానిక జక్రయ్య ఆసుపత్రి ఆవరణలో డా.జాకబ్‌ జక్రయ్య, డా.సారా జార్జి ల సహకారంతో స్థానికులకు కరాటే  శిక్షకురాలిగా నిలిచారు. డా.సారా జార్జి కూడా పద్మజ వద్ద శిక్షణ పొందుతున్నారు.
2016లో ఒంగోలులో జరిగిన ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ ఉత్సవాలలో  మద్దులూరు (సంతనూతలపాడు) హైస్కూల్‌ విద్యార్థులతో కలిసి ఆత్మరక్షణ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించారు.
2016లో తన గురువు వలిశెట్టి రవి స్థాపించిన రుద్రమదేవి డిఫెన్స్‌ అకాడమీ (హైదరాబాదు) సహకారంతో తెలంగాణలో షీ టీం ఆధ్వర్యంలో అనేక మంది ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనర్స్‌కి శిక్షణ ఇచ్చారు.
2017 నుంచి చిన్నగంజాం ఏడో తరగతి బాలికలకు శిక్షణ ఇస్తున్నారు.

చిత్రకారిణిగా
ఏకకాలంలో ఉపాధ్యాయినిగా, యుద్ధనైపుణ్య శిక్షకురాలిగా , చిత్రాకారిణిగా ,భార్యగా, అమ్మగా, విభిన్న పాత్రలను పోషిస్తున్న «ఈ ధీశాలి తన భావాలకు రూపాలనిస్తూ అనేక చిత్రాలకు జీవం పోశారు. ఆమెను కలవడానికి వచ్చే మిత్రులు, సందర్శకులను ఇంటిలో గోడలను అలంకరించిన ఆమె పెయింటింగ్స్‌ కచ్చితంగా ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. 2005లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థాన్‌ నిర్వహించిన ఫ్రీ హ్యాండ్‌ పెయింటింగ్‌ కోర్సును ఫూర్తి చేశారు. 2009 మార్చిలో ఫెవీక్రిల్‌ సంస్థ ఇచ్చిన ఎక్స్పర్ట్‌ టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement