we-inspirational-women
-
అమ్మ ప్రేమకు ప్రతిరూపం
కొవ్వూరు రూరల్ : అమ్మ.. అంటేనే త్యాగం. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం శాంతకుమారి. తనకు ఎంతో ఇష్టమయిన పిన్నికూతురు (వరుసకు అక్క) ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమెకున్న ఇద్దరు పిల్లలూ అనాథలుగా మిగిలారు. అంతే క్షణం ఆలోచించకుండా ఆమె వారిని అక్కున చేర్చుకుంది. సమాజం ఏమనుకున్నా ఫర్వాలేదనుకుని.. పెళ్లి కాకుండానే తల్లిగా మారింది. ‘అమ్మ’.. అన్న ఆ పిల్లల పిలుపులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ 16 ఏళ్లు గడిపేసింది. పిల్లలే సర్వస్వంగా జీవిస్తోన్న ఆ మహిళ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా పేరు నేతుల శాంతకుమారి. మాది కొవ్వూరు మండలం మద్దూరు. నేను ప్రస్తుతం గ్రామంలోనే అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నాను. మా తల్లిదండ్రులు నేతుల రూతమ్మ, గమరిఏలు. నాన్న దైవసేవ చేసేవారు. ఈ క్రమంలో మా పిన్ని కూతురు రాణికి మద్దూరులోనే సంబంధం చూసి అమ్మా నాన్న పెళ్లి చేశారు. వారి సంసారం సుమారు ఐదేళ్లు సాఫీగానే సాగింది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. కొన్ని కారణాలతో మా అక్క రాణి 16 ఏళ్ల క్రితం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి వారి పిల్లలు దివ్యతేజకు మూడేళ్లు, రాజబాబుకు 6 నెలలు. తండ్రి పిల్లలను పట్టించుకోలేదు. అప్పటికి సమారు నాకు 22 ఏళ్లు. అక్క రాణి నాతో చాలా బాగా ఉండేది. ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. ఆ ప్రేమతోనే నేను అక్క పిల్లలను చేరదీశాను. అప్పుడే అంగన్వాడీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ పిల్లలే జీవితం అనుకున్నాను. ఈ క్రమంలో పెళ్లి ప్రసక్తి పక్కన బెట్టాను. ఇంట్లో ఎవరూ వత్తిడి చేయకపోయినా, బంధువులు, స్నేహితులు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అయినా నేను పిల్లలే లోకం అనుకున్నాను. ఇప్పుడు రాజబాబుకు 17 ఏళ్లు. మద్దూరు హైస్కూలులో 10వ తరగతి చదువుతున్నాడు. కూతురు దివ్యతేజ 10వ తరగతి వరకూ చదివి ఆపేసింది. వాళ్లే నా సర్వస్వం.. నాకు వాళ్లను చూస్తుంటే నా పిల్లలుగానే అనిపిస్తారు. వాళ్లూ అలానే ఉంటారు. అందుకే ఎప్పుడూ పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని త్యాగం చేశానని అనిపించదు. కంటేనే తల్లి అనుకుంటే ఎలా.. మనసు ఉంటే ఎవరైనా మన పిల్లలే.. నా శక్తి మేరకు వాళ్ల కోసం ఇంకా కష్టపడతాను.’ -
నారీమణీ నీకు వందనం!
అనకాపల్లి: అంగవైకల్యం ఆమె ముందు తలవంచింది. పుట్టుకతోనే మరుగుజ్జుగా ఉన్నా ఏనాడూ అధైర్యపడలేదు. మిగిలినవారికి స్ఫూర్తిగా, మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నారు అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ జిలానీబేగం గౌసియా. మదీన్షా, కాదూన్బేబీ దంపతులకు ఐదుగురు సంతానం. వారికి కలిగిన పిల్లల్లో నాలుగో సంతానమైన గౌష్య చిన్నప్పటి నుంచి మరుగుజ్జు. అయినా మొక్కవోనిదీక్ష ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. మరుగుజ్జునని బాధపడకుండా బాగా చదువులో రాణించి ఉన్నతస్థాయికి వెళ్లడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోయారు. విశాఖ శివాజీపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో చదివిన ఆమె ఆంధ్రాయూనివర్సిటీ హైస్కూల్లో ఉన్నత తరగతులు, కృష్ణా కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివారు. తర్వాత ఎకనమిక్స్‌లో పీహెచ్డీ చేసిన ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2009లో గ్రూప్–2లో సబ్‌రిజిస్ట్రార్‌గా ఎంపికై టెక్కలి, కొత్తవలస, ప్రస్తుతం అనకాపల్లిలో సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈమెను నర్సీపట్నానికి డిప్యుటేషన్‌పై పంపారు. ఆరోగ్యంగా బాగా ఉండి జీవనోపాధి లేదని ఆలోచించకుండా కష్టించేతత్వం ఉంటే ఉన్నతస్థానాలకు వెళ్లవచ్చని గౌష్య చెబుతున్నారు. లక్ష్యంతో కృషి చేస్తే విజయం తమ దరి చేరుతుందని ఆమె పేర్కొన్నారు. -
వనితా సలాం
మహిళామూర్తిని వర్ణించేందుకు పదాలు చాలవు. సమాజంలో అంతటి ప్రాధాన్యం ఉన్న మహిళలు ప్రస్తుతం వివక్షను ఎదుర్కొంటున్నారు. రక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, అవి ఎందుకూ పనికి రాకుండాపోతున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో సమాజ రుగ్మతలను ఎదిరిస్తూ స్వయం సాధికారత వైపు మహిళలు అడుగులేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. మనం సంతోషంగా ఉన్నాం. ఇదే మనకు వరమని సరిపుచ్చుకోలేదామె. అందరూ సంతోషంగా ఉండాలని తపన పడుతున్నారు. యువకుల్లో సైతం సేవాభావాన్ని పెంపొందిస్తూ దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు మీ కోసం మేము ఫౌండేషన్‌కు తెరవెనుక సూత్రధారిగా ఉంటూ నడిపిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు కొడవలూరు మండలం బసవాయపాళేనికి చెందిన గనకాల సుమలత. కొడవలూరు: కొడవలూరు మండలం బసవాయపాళేనికి చెందిన సుమలత వివాహానంతరం నెల్లూరులో స్థిరపడ్డారు. ఆమె ఇతరులకు సాయపడటంలోనే సంతృప్తి ఉందని భావించారు. ఆమెలోని సేవాభావాన్ని భర్త హరికృష్ణకు వివరించారు. ఆమె సమాజ సేవాభావానికి ఆయన అడ్డు చెప్పకుండా తనవంతు ప్రోత్సాహించారు. భావాలకు భర్త సహకారం కూడా తోడవడంతో సేవా కార్యక్రమాల వైపు అడుగులేశారు. సేవ దిశగా ప్రోత్సాహం సేవా దృక్పథం ఉన్న సుమలత కార్యక్రమాల అమలుకు ఒక వేదిక అవసరమని భావించారు. ఇలాంటి కార్యక్రమాలను యువకులైతే ఎంతో ఉత్సాహంగా చేపట్టగలరని నిర్ణయించుకున్న ఆమె స్వగ్రామానికి చెందిన యువకుడు చల్లకొలుసు కార్తీక్‌లోని సేవా భావాన్ని గుర్తించారు. దిక్కులేని వారికి సాయపడేందుకు తన వంతు సాయమందిస్తానని కార్తీక్‌తో తన మనస్సులోని మాటను తెలిపారు. సేవ చేయడంపై ఆసక్తి ఉన్న అతడు తన మిత్రుడైన పోసిన సునీల్‌కుమార్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. అందుకు సునీల్‌కుమార్ కూడా ఉత్సుకత చూపడంతో సేవాభావమున్న స్నేహితులతో కలిసి మీ కోసం మేము ఫౌండేషన్‌ను స్థాపించారు. ఫౌండేషన్‌లో కోశాధికారిగా ఉంటున్న సుమలత సంస్థ నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమంలో తన వంతు సాయం అందిస్తున్నారు. వృద్ధులకు వస్త్ర, అన్నదానం చేయడం, ప్లాట్‌ఫారాలపై ఉంటున్న వారికి దుప్పట్లు, వస్త్రాలను అందించడం, అనాథ పిల్లలకు వారి అవసరాలను తెలుసుకొని సాయపడుతున్నారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణా లను నిలపడంలోనూ ఫౌండేషన్ ముందంజలో ఉంది. సాయంలోనే తృప్తి ఇతరులకు సాయపడటంలో ఎంతో సంతృప్తి ఉంది. మనం ఎంతగా సుఖపడినా, ఇతరులకు సాయపడటంలో ఉన్న సంతృప్తి ఎందులో ఉండదు. ఇతరుల ఆకలిని తీర్చినపుడు, ఆపదల్లో రక్తదానం చేసినప్పుడు వారు చూపే కృతజ్ఞత మనస్సును కదిలిస్తుంది. అందువల్లే ఉన్నంతలో ఇతరులకు సాయపడాలని నిర్ణయించుకున్నా. మరిన్ని సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా చేపట్టాలన్నదే నా లక్ష్యం. : గనకాల సుమలత,మీ కోసం మేము ఫౌండేషన్ కోశాధికారి -
ఒకే సంవత్సరంలో 4 ప్రభుత్వ ఉద్యోగాలు
చిత్తూరు, మదనపల్లె:మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన రమణ, సావిత్రి దంపతులకు శిరీషా, జ్యోత్స ఇద్దరు కుమార్తెలు. రమణ వ్యవసాయం చేస్తుండగా, సావిత్రి నిమ్మనపల్లెలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. పెద్ద కుమార్తె శిరీషా. చిన్నప్పటి నుంచి ఈమె చదువులో మెరిక. ఈ క్రమంలో ఎంటెక్ పూర్తి చేసింది. అదే ఏడాది ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి, ఉద్యో గం సాధించింది. మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈగా పనిచేస్తోంది. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు 2017లో ఏపీపీఎస్సీ విడుదల చేసిన అన్ని ఉ ద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసింది. ఫిబ్రవ రి, ఏప్రిల్‌లో రాసిన పరీక్షల్లో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ హైడ్రాలజిస్ట్, ఎన్విరాన్మెంట్ విభాగాల్లో ఏఈ పోస్టులు, జెన్కో ఏఈ గా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. తాజాగా 2018 జనవరిలో జరిగిన గ్రూప్స్ ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. జన్మభూమిపై మమకారంతో.. కడప గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో జిల్లా అధికారిగా నెలపాటు ఉద్యోగం చేసిన శిరీషా జన్మభూమిపై మమకారంతో ఆ ఉద్యోగాన్ని వ దులుకుని, మదనపల్లె మున్సిపాలిటీలో ఎన్వి రాన్మెంట్ ఏఈగా పనిచేస్తోంది. మా నాన్నే నాకు స్ఫూర్తి.... ఆడపిల్లల చదువులకు ఎందుకు అన్న బంధువులు మాటలు వినకుండా, పిల్లలే నా సర్వస్వం అనుకున్నాడు మా నాన్న. మా ఉన్నతి చూసి మురిసిపోయిన మా నాన్నే నాకు స్ఫూర్తి. – శిరిషా -
అ‘త్త’మ్మ
అమ్మతనం కోసం పరితపించిన దివ్యాంగురాలు ఒకరు. ఆమె కల నెరవేరిందని సంతోష పడే అత్త మరొకరు. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అత్త అనే పదానికే సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చారు. గయ్యాళి పేరును తుడిచేసి.. అ‘త్త’మ్మ అని చాటిచెబుతున్నారు. వారే పుత్తూరుకు చెందిన కోడలు రాజాలియోనా.. అత్త శోభారాణి. ఆ ఇద్దరూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, తిరుపతి: ‘నా పేరు పల్లం రాజాలియోనా. నేను పుట్టింది శ్రీకాళహస్తిలో. పోలియో కారణంగా రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. అమ్మ కృపావరమ్మ మెడికల్ ఫీల్డ్‌లో పనిచేస్తోంది. నాన్న రాజు సినిమా థియేటర్లో పనిచేస్తున్నాడు. అమ్మ వృత్తిరీత్యా ఇంటి వద్ద ఉండే అవకాశమే లేదు. కాళ్లు పనిచేయకపోయినా ఆత్మస్తైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేది. ఆ సమయంలో అన్నీ నాయనమ్మ వైలెటమ్మే చూసుకునేది. నాకు కాళ్లు లేవని ప్రేమగా ఆదరించేది. ఎనిమిదో తరగతి వరకు శ్రీకాళహస్తిలోనే చదువుకున్నా. నాయనమ్మ ఆరోగ్యం క్షీణించింది. తప్పని పరిస్థితుల్లో నన్ను పుత్తూరులో ఉన్న అమ్మమ్మ పరంజోతమ్మ వద్దకు చేర్చారు. అప్పటి నుంచి అమ్మమ్మే నాకు అన్నీ. తొమ్మిది, పదో తరగతి పుత్తూరులోనే చదువుకున్నా. వికలాంగురాలిని కావడంతో మైసూరులో జేఎస్ఎస్ మహా విద్యాపీఠంలో డిప్లొమో, కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాను. పుత్తూరులో ఉద్యోగం దొరక్క 2005లో చెన్నైకి వెళ్లా. వర్కింగ్ హాస్టల్లో ఉంటూ ఎస్బీఐ కాల్సెంటర్లో 2010 వరకు పని చేశా. ఆ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పెయింటర్ దీపక్‌కుమార్ ఆన్లైన్ ద్వారా పరిచమయ్యారు. అతనికి ఒక కాలు సరిగా పనిచేయదు. తల్లిదండ్రుల సమక్షంలో వివాహం జరిగింది. ఇద్దరం చెన్నైలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాళ్లం. కొన్నాళ్లకు భర్తకు కూడా తనతో పాటే ఎస్బీఐ కాల్సెంటర్లో పనిదొరికింది. భర్త నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు’. ప్రాణాలు పోయినా బిడ్డ కావాలనుకున్నా.. నేను చాలా మొండిదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు పట్టుదల ఎక్కువ. నాకు కాళ్లు పనిచేయకపోయినా ఇంట్లో ఎవ్వరూ నన్ను తక్కువ చేసి చూసేవారు కాదు. తన జీవితం ఇంతటితోనే అంతమైపోవాలా? అని ఆలోచించేదాన్ని. అమ్మా అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. తనలా కాకుండా పుట్టే పిల్లలను మంచి చదువులు చదివించి ప్రయోజకుల్ని చేయాలని నిర్ణయించుకున్నా. వివాహం అయ్యాక డాక్టర్ని కలిశాం. గర్భం దాల్చితే తల్లి ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించారు. ప్రాణం పోయినా పర్వాలేదని పిల్లలు కావాలని నిర్ణయించుకున్నా. గర్భం దాల్చిన తర్వాత చెన్నైలో ఉండడం మంచిది కాదని పుత్తూరుకు వచ్చేశాం. పుత్తూరు మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించా. కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం ఇస్తామని చెప్పారు. నాకు కాదు భర్త దీపక్‌కు ఇస్తామని చెప్పారు. తరువాత ఆయన ఉద్యోగం నాకు ఇప్పించాడు. ప్రస్తుతం పుత్తూరు మున్సిపాలిటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. భర్త ఆటో నడుపుతున్నాడు. పండంటి పాపకు జన్మనిచ్చా పురిటినొప్పులతో తిరుపతిలో తిరుపతిలో ఆసుపత్రులన్నీ తిరిగినా డాక్టర్లు బిడ్డను బతికిస్తాము, తల్లి గురించి చెప్పలేమని చెప్పారు. ప్రాణం పోయినా పర్వాలేదు బిడ్డకావాలని పట్టుబట్టా. భర్త ఒప్పుకోలేదు. తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు నా పరిస్థితిని చూసి తిట్టారు. ‘శరీరంలో ఎముకలు కూడా సరిగాలేవు. నీ ఆరోగ్యం ఏమిటి.. గర్భం దాల్చటం ఏంటమ్మా’ అన్నారు. దేవుడిచ్చిన వరం అమ్మతనం. నా ప్రాణం పోయినా పర్వాలేదు. బిడ్డ కావాలి సార్’ అని అన్నాను. డాక్టర్ నా మాటలు విని చలించిపోయారు. అతికష్టమ్మీద పండంటిపాప పుట్టింది. నా పరిస్థితి సీరియస్ అయ్యింది. రెండు రోజులు స్పృహలో లేను. నేను బతకనేమో అనుకున్నారంతా. డాక్టర్ దేవుడిలా నా ప్రాణాలు కాపాడారు. నేను కళ్లు తెరవడంతో డాక్టర్ కూడా సంతోషపడ్డారు. అమ్మనయ్యాను అని తెలిసి సంబరపడ్డాను. అత్తమ్మే అన్నీ నా భర్త దీపక్ అమ్మ శోభారాణి. ప్రస్తుతం అన్నీ తానై చూసుకుంటోంది. చిన్న బిడ్డలా సపర్యలు చేస్తోంది. పాప ఆలనా, పాలనా అన్నీ తనే చూసుకుంటుంది. వంట చేయడం, పాపకు, నాకు స్నానం చేయించడం, బాత్రూముకి తీసుకెళ్లడం అన్నీ అత్తమ్మే. అత్తాకోడళ్లకు పడకుండా కొట్టుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. అయితే మేము అందుకు విరుద్ధం. నాకు, నా బిడ్డకు అత్తమ్మే అమ్మ. నన్ను అత్తమ్మ చూసుకున్నట్లు మా అమ్మ కూడా చూసుకోలేదు. ఆమె నాకు అమ్మకంటే ఎక్కువ. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటాను. అదేవిధంగా భర్త కూడా. ఇంట్లో భర్త, అత్తమ్మ, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. నేను వికలాంగురాలిని అనే ఆలోచనే రాకుండా చూసుకుంటున్నారు. మానవత్వం బతికే ఉందనటానికి నా చుట్టూ ఉన్న వాళ్లే నిదర్శనం అని పల్లం రాజాలియోనా స్పష్టం చేశారు. -
డాక్టర్ కలెక్టర్..
డాక్టర్‌గా రోగులకు సేవ చేయాలనుకుని ఆ వృత్తిలోకి అడుగు పెడితే అక్కడజరుగుతున్న అక్రమాలు వెక్కిరించాయి. ధైర్యంగా ఎదిరిస్తే వేధింపులుపెరిగాయి. లాభం లేదని సమస్యను ఐఏఎస్ అధికారికి దృష్టికి తీసుకెళ్లగానే సమస్య పరిష్కారమైంది. ఈ ఒక్క సంఘటన ఆమెలో చాలా మార్పులుతెచ్చింది. ‘నేనూ ఐఏఎస్ చదివితే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించవచ్చు కదా..!’ అని ప్రశ్నించుకుని ఆ దిశగా అడుగులు వేసిందామె. తల్లి ప్రోత్సాహంతో అనుకున్నది సాధించి.. సర్వీసులో పేదల పక్షాననిలిచారు. ఆమే ప్రస్తుత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా యోగితా తనమనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, సిటీబ్యూరో: ఐఏఎస్‌కు ఎంపికయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. విశాఖ జిల్లాలో ఏడాది పాటు శిక్షణ పూర్తి చేశా. ఏజెన్సీలో నెల రోజులపాటు ఉండడంతో గిరిజనుల పరిస్థితులపై అవగాహన వచ్చింది. అక్కడి మహిళలతో మమేకమయ్యా. భద్రాచలం సబ్ కలెక్టర్‌గా, రంపచోడవరం ఐటీడీఏ పీఓగా పనిచేసినప్పుడు మహిళల భాగస్వామ్యంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశా. గిరిజనుల ఆదరణ మరువలేని అనుభూతిగా మిగిలింది. మూడున్నరేళ్లు యూఎన్‌డీపీలో పనిచేశా. గ్రామీణ అభివృద్ధిపై పూర్తిగా పట్టు సాధించాను. ఐఏఎస్‌లో ఉండి కూడా గ్రామీణాభివృద్ధిపై పీజీ కోర్సు చేశా. గ్రామీణ ప్రజలకు దగ్గరి నుంచి సేవలందించే అవకాశం లభించడం తృప్తి కలిగించింది. ♦ పుట్టింది.. పెరిగింది జమ్మూలోనే. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. స్కూల్లో చదువుతున్నప్పుడు ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఇంటర్లో ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నా. తర్వాత డాక్టర్ కావాలని వెంటనే సైన్స్ గ్రూప్‌లోకి మారిపోయా. ♦ జమ్మూ మెడికల్ కళాశాలలో వైద్య విద్య అభ్యసించాను. పీహెచ్సీలో ఇంటర్నషిప్ చేస్తున్నప్పుడు అక్కడి పరిస్థితులు బాధ కలిగించాయి. వైద్య సేవల్లో పారదర్శకత లేదు. మందులను ఇతర ప్రయోజనాలకు వాడుతున్నారు. ఈ విషయంపై సూపరింటెండెంట్‌కు లేఖ రాశాను. స్పందన లేదు కదా సమస్యలు మరింత పెరిగాయి. అ సమయంలో కమిషనర్‌గా ఓ యువ ఐఏఎస్ అధికారి వచ్చారు. ఆయన జోక్యంతో పీహెచ్సీలో మార్పు వచ్చింది. అప్పుడే అనుకున్నా సివిల్స్‌తోనే సమాజంలో మార్పు సాధ్యమని. ♦ అప్పటికే మా అన్నయ్య డానిష్ రాణా ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నారు. దీంతో నేనూ ఐఏఎస్ కావాలని నిర్ణయిచుకున్నా. మా అమ్మ కూడా నన్ను అలాగే చూడాలనుకుంది. దాంతో నాలో పట్టుదల పెరిగి పరీక్షలు రాశా. మొదటిసారి మెయిన్స్ క్లియర్ అయినా ఇంటర్వ్యూ రాలేదు. రెండోసారి ప్రిలిమ్స్ దగ్గరే ఆగిపోయింది. మూడో ప్రయత్నంలో ఐఆర్టీఎస్ వచ్చింది. నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌కు 2003 బ్యాచ్‌కు ఎంపికయ్యాను. ♦ మహిళలకు దృఢమైన సంకల్పం, తనపై తనకు నమ్మకం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలదు. మాతృమూర్తిలో మార్పు చాలా అవసరం. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. తండ్రి కంటే తల్లికే పిల్లల మాటలు అర్థమవుతాయి. ఆడపిల్లలను చదివించాలి. ప్రయోజకులను చేయాలి. అన్నింటికీ విద్య ప్రధాన మూలం. చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలి. ♦ ఐఏఎస్‌గా పనితీరు గుర్తింపు ఇస్తోంది. ముందుగా ఉద్యోగులకు ఒక క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే టీం వర్క్‌తో మంచి ఫలితాలు వస్తాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు కేంద్రం నుంచి ఎన్ఆర్ఈజీఏ కింద ఉత్తమ జిల్లాగా గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తమ కలెక్టర్‌గా అవార్డు అందించింది. ప్రధాని చేతులు మీదుగా ఈ–నామ్ ఎక్స్‌లెన్సీ అవార్డు అందుకున్నాను. తాజాగా బేటీ బచావో బేటీ పడావో అవార్డు కూడా వచ్చింది. -
ఇంతకన్నా ఎవరైనా ఉంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిమ్స్... అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏఐఐఎంఎస్) ఆస్పత్రి. ధనవంతులకు, పేదవాళ్లకు ఎలాంటి తారతమ్యం లేకుండా సకల వైద్య సేవలు అందించే సంస్థ. ముఖ్యంగా ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించే ఆర్థిక స్థోమతలేని పేదల పాలిట కల్పవల్లి. 1956లో ఢిల్లీలో ఏర్పాటైన ఎయిమ్స్ 2012లో మొదటి సారి విస్తరించి దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఎయిమ్స్ ఆస్పత్రిని స్థాపించిన మహా వ్యక్తి, ఓ మహిళా శక్తి గురించి మనం కాల గమనంలో మర్చిపోయాం. ఆమెనే కపూర్తలా యువరాణి అమత్ కౌర్. మహారాజా కుటుంబానికి చెందిన యువరాణి అవడం వల్ల కోటలో ఉండే కోట్ల రాసుల్లో కొన్ని రాసులను కుమ్మరించి ఎయిమ్స్ ఆస్పత్రిని స్థాపించి ఉంటారులే అనుకుంటే పొరపాటే. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తికాగానే విదేశీ పాలకుల నుంచి భారత్ విముక్తి కోసం జాతీయ ఉద్యమంలో చేరి వీరోచిత పోరాటం సాగించిన మహిళామణి ఆమె. రాజకుటుంబ వారసత్వాన్ని వదులుకొని చివరి వరకు నిరాడంబరంగా జీవించడమే కాకుండా, పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్ని దేశం కోసం, మహళల హక్కుల కోసం, వారి సాధికారికత కోసం ధారపోసిన ధీరవనిత ఆమె. ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్లూహెచ్ఓ) పాలనా వ్యవహారాలు చూసే వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి అధ్యక్షులుగా (1950లో) ఆసియా ఖండం నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి, తొలి మహిళగా ఆమె రికార్డు సష్టించారు. భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో పనిచేసిన దేశ తొలి ఆరోగ్యశాఖ మంత్రి కూడా ఆమెనే. ఆమె 1945లో లండన్‌లో జరిగిన యునెస్కో కాన్ఫరెన్స్‌కు భారత అధికారిక ప్రతినిధిగా హాజరయ్యారు. 1926లోనే ఆమె ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసి మహిళల హక్కుల కోసమే కాకుండా బాల్య వివాహాలు, మహిళలను దాచేసే పరధా సంస్కతి, దేవదాసీల విధానానికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం జరిపారు. ఆమె పోరాటం కారణంగానే భారత ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును 14 నుంచి 18 ఏళ్లకు పెంచింది. మహిళల విద్యాభివద్ధి కోసం ఆమె ‘అఖిల బారత మహిళా విద్యా నిధి సంఘం’ను కూడా ఏర్పాటు చేశారు. బహు భార్యత్వం లాంటి మత సంప్రదాయాలకు వ్యతిరేకంగా కూడా పోరాడారు. ఆమె చిన్నతనంలోనే హాకీ, క్రికెట్ టీమ్‌లకు కెప్టెన్‌గా పనిచేశారు. పాటియాలలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్’ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. అమత్ కౌర్ 1889, ఫిబ్రవరి 2వ తేదీన కపుర్తలా రాజకుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రాజా హర్నామ్ సింగ్. ఆయన అప్పటి కపుర్తలా రాజుకు స్వయాన తమ్ముడు. ఒకప్పుడు స్వతంత్ర రాష్ట్రంగా ఉన్న కపుర్తలా ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో కలిసింది. కౌర్ తండ్రికి ఏడుగురు సంతానం కాగా, ఒక్కరే అమ్మాయి. అమత్ కౌర్ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా లక్నోలోనే సాగింది. మాధ్యమిక విద్యాభ్యాసం ఇంగ్లండ్‌లోని డోర్సెట్‌లో ‘షెర్బోర్న్ స్కూల్ ఫర్ గర్ల్స్’లో జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో పూర్తి చేశారు. 1918లో మాతదేశానికి తిరిగొచ్చారు. అదే సమయంలో అమత్‌సర్‌లో భారత పౌరులకు, బ్రిటీష్ సైనికులకు మధ్య వీధి పోరాటాలు జరగడంతో పంజాబ్ ప్రజలంతా బ్రిటీష్ పాలకులపై ఆగ్రహోదగ్రులై ఉన్నారు. వారిని అణచివేయడం కోసం బ్రిటీష్ పాలకులు రోలాట్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత 1919, ఏప్రిల్ నెలలో జరిగిన ‘జలియన్‌వాలాబాగ్’ ఊచకోత ఘటన ప్రజల్లో మండుతున్న అగ్నికి ఆజ్యం పోసింది. ఈ దశలో తన తండ్రికి స్నేహితుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాయకుడైన గోపాల్ కష్ణ గోఖలేను అమత్ కౌర్ కలుసుకున్నారు. అప్పుడు గోఖలే ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ’ అనే సంస్థను ఏర్పాటు చేసి నిమ్నవర్గాల ప్రజల కోసం కృషి చేస్తున్నారు. దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చూసి అమత్ కౌర్ స్ఫూర్తి పొందారు. వెంటనే దేశ జాతీయోద్యమంలో చేరారు. ‘విదేశీ పాలకుల చెర నుంచి నా భారత దేశం విముక్తిని చూడాలని నాలో ఉద్భవించిన భలమైన కోరిక ప్రజ్వరిల్లడానికి స్ఫూరినిచ్చిందీ ఆయనే’ అంటూ ఆ తర్వాత ఆమె గోఖలే గురించి రాసుకున్నారు. ఆయన ద్వారా జాతిపితి మహాత్మా గాంధీ గురించి తెలుసుకొని గాంధీజీ ఆశ్రయంలో పనిచేయాలనుకున్నారు. ఆ మేరకు గాంధీకి ఓ లేఖ కూడా రాశారు. అయితే ఇంతలో తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా ఆమె కపుర్తలా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఉంటూ కూడా ఆమె పేదలు, బడుగు వర్గాలు, ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం కషి చేశారు. 1926లో ‘ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్’ను స్థాపించి మహిళల హక్కులు, సాధికారిత కోసం తన పోరాటాన్ని ఉధతం చేశారు. 1930లో ఆమె తల్లిదండ్రులు మరణించడంతో కౌర్ కపుర్తలాను పూర్తిగా విడిచేసి స్వాతంత్య్ర పోరాటంలో మహిళలకు నాయకత్వం వహించారు. మహాత్మాగాంధీ చేపట్టిన దండియాత్రలో, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె అంకితభావాన్ని అర్థం చేసుకున్న గాంధీజి 1936, అక్టోబర్‌లో ఆమెకో లేఖ రాశారు. ‘తన మిషన్ సాధించడానికి అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్న ఓ మహిళ కోసం నేను వెతుకుతున్నాను. ఆలాంటి మహిళ మేరేనా, మేరేనా ఆ ఒక్కరు!’ అన్న గాంధీ పిలుపుకు స్పందించి ఆమె గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా చేరిపోయారు. దేశ తొలి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానించే వరకు ఆమె గాంధీజీ కార్యదర్శిగానే ఉన్నారు. ఆమె ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘ట్యూబర్కులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్, ది సెంట్రల్ లెప్రసీ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్, రాజ్‌కుమారి అమత్ కౌర్ కాలే జ్ ఆఫ్ నర్సింగ్’ ఏర్పాటు చేశారు. వివిధ అంతర్జాతీయ వేదికలను అడ్రెస్ చేసిన అనుభవంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఏర్పాటుకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్, పశ్చిమ జర్మనీ, అమెరికా దేశాల నుంచి నిధులను సమీకరించారు. ఎయిమ్స్‌లో పనిచేసే డాక్టర్లు, నర్సుల ఉపశమనం కోసం తన పూర్వికుల నుంచి తనకు సంక్రమించిన సిమ్లాలోని ‘మనోర్విల్లీ’గా పిలిచే రాజభవనాన్ని కేటాయించారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ 150వ వార్షికోత్సవం సందర్భంగా 1961లో అమత్ కౌర్ స్థాపించిన ఎయిమ్స్‌ను ప్రపంచంలో పేరుపొందిన ఉన్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తించింది. ఆ తర్వాత కౌర్ తన పోరాటాన్ని ప్రధానంగా మలేరియా మహమ్మారి వైపు మళ్లించారు. అప్పటికే భారత దేశంలో ఏడాదికి పది లక్షల మంది ప్రజలు మలేరియా వల్ల మరణిస్తున్నారు. మలేరియాకు వ్యతిరేకంగా ఆమె గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన చర్యల వల్ల ఆమె దాదాపు నాలుగు లక్షల మంది ప్రజల ప్రాణాలను రక్షించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1964లో ఆమె తన 75వ ఏట ప్రశాంతంగా కన్నుమూశారు. సిమ్లాలోని మనోర్విల్లీ భవనం. అప్పటి గవర్నర్ జనరల్ సీ. రాజగోపాలాచారి, ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూలతో దేశ తొలి ఆరోగ్య శాఖా మంత్రిగా అమృత్ కౌర్. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ మహిళల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న కౌర్. మహాత్మా గాంధీతో అమృత్ కౌర్. మలేరియా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అమృత్ కౌర్. -
స్ఫూర్తిదాయక మహిళామణులు
సమాజం ఎప్పుడు మగవారు చేసే పనికే విలువ ఇస్తుంది. మగవారు అంటేనే శక్తిమంతులు, ఏమైనా చేయగలరు అనే భావనలో ఉంటుంది. స్త్రీ అంటే బలహీనురాలు, ఇంటిని చక్కపెట్టుకోవడం వరకే ఆమెకు చేతనవుతుంది అనే అనుకుంటుంది. కానీ ఇక్కడ మనందరం ఒక విషయాన్ని మరవకూడదు భారత స్వాతంత్ర పోరాటానికి పునాది వేసిందే ఒక మహిళా....నేటి మారుతున్న సమాజంతో పాటు స్త్రీ పాత్ర కూడా మారింది. ప్రస్తుతం భారతీయ మహిళా అంటే కేవలం ఇంటికే పరిమితమయ్యే ఒక అబల కాదు. నేడు ప్రతిరంగంలో వారు దూసుకుపోతున్నారు. తమను బంధించే సనాతన ఆచార సంప్రదాయాలను తెంచుకుని ప్రతిరంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. కేవలం ఇంటిని చక్కబెట్టడం మాత్రమే కాకుండా సామాజిక మార్పు కోసం కృషి చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో ప్రముఖమైన మహిళా సామాజిక సంఘసంస్కర్తల గురించి తెలుసుకుందాం..... ఝాన్సీ లక్ష్మీబాయి భారత స్వాతంత్ర పోరాటంలో తొలి ఘట్టం 1857లో జరిగిన ‘‘సిపాయిల తిరుగుబాటు’’. చరిత్రకేక్కిన ఈ సంఘటనలో పాల్గొన్నది ఒకే ఒక్క మహిళ. కానీ చాలామందికి తెలియని ఆ వీరనారే ఝాన్సీ లక్ష్మీభాయి. భారతీయ స్త్రీ అంటే కేవలం అందానికి మాత్రమే కాదు ధైర్యానికి ప్రతీక అని నిరూపించింది. బ్రిటిష్ వారి కబంధ హస్తాలనుంచి దేశాన్ని విడిపించడం కోసం విరోచితంగా పోరాడి మిగితా వారికి స్ఫూర్తిగా నిలిచింది. సరోజిని నాయుడు భారత స్వాతంత్ర పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయే మరో వనిత సరోజిని నాయుడు. ఆమెకున్న బిరుదు భారత కోకిల. శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించింది. గొప్ప కవయిత్రి కూడా. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ పదవి నిర్వహించిన తొలి మహిళ. దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఆమే చేసిన సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఆమేను కైసెర్-ఐ-హింద్ పతకంతో సత్కరించింది. అరుణ రాయ్ మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అవినీతి వల్ల బాధపడినవారే. కానీ ఎవ్వరూ ముందుకు వచ్చి దీనిగురించి పోరాడినవారు లేరు అలాంటి సందర్భంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, ప్రభుత్వంలో పారదర్శకతను తీసుకురావాలని నిర్ణయించుకుంది ఒక మహిళ. ఆమే అరుణ రాయ్. ఒక టీచర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి తర్వాత గొప్ప సామాజిక కార్యకర్తగా మారింది. ఆమె 1967 సంవత్సరంలోఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. కార్మికులు మరియు రైతులు మేలు కోసం స్థాపించినన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (ఎమ్కేఎస్ఎస్)లో చేరి ప్రముఖ నాయకురాలిగా ఎదిగింది. సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ) రావాడానికి కారణం ఆమే చేసిన కృషే. అవినీతి రహిత సమాజం కోసం ఆమే చేస్తున్న కృషికి గాను ఎన్నో అవార్డులు అందుకుంది. మేధాపాట్కర్ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో ప్రాజేక్టులను తలపెడుతుంది. కానీ దాని వల్ల నిర్వాసితులైన వారి గురించి మాత్రం పట్టించుకోదు. అలాంటివారి తరుపున నిలబడి పోరాడుతున్న మహిళ మేధా పాట్కర్. ఒక ప్రముఖ కార్మిక నాయకుడి ఇంట్లో జన్మించిన పాట్కర్‌కు సమాజసేవ అంటే మక్కువ. కార్మికులు,రైతుల జీవితాలను మెరుగుపర్చడం ఆమే లక్ష్యం. ఆమే చిన్నతనం నుంచే సమాజసేవను ప్రారంభించింది. కానీ నర్మాదా బచావో ఆందోళన ద్వారా అందరికి ఆమే పరిచితురాలయ్యింది. కిరణ్ బేడి పరిచయం అవసరంలేని మహిళ. మనదేశంలో పోలీసులంటే అందరికి భయమే, స్త్రీలకయితే మరీనూ. అలాంటి రంగంలో మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. ఆమే ప్రముఖ సామాజిక కార్యకర్త. కిరణ్ బేడి సంకల్పం, అంకితభావం ఉంటే ప్రతి ఒక్కరూ తన లక్ష్యాన్ని సాధించవచ్చనడానికి ఆమె ఒక ఉదాహరణ. పశ్చిమ ఢిల్లీలో ఐపిఎస్ అధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలపై జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాయి. తీహార్ జైల్లో ఆమె తీసుకువచ్చిన సంస్కరణలకు గాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. 1993లో రామన్ మెగసెసే అవార్డును కూడా అందుకుంది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్‌కి మొదటి పోలీస్ సలహాదారుగా కిరణ్ బేడి నియమితురాలయ్యింది. షాహీన్ మిస్త్రీ సమాజంలోని అసమానతలకు ప్రధాన కారణం విద్య. మనదేశంలో విద్యాహక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించినప్పటికీ నేటికి ఎంతో మందికి అది అందని ద్రాక్షేగానే మిగిలింది.ఇలాంటి పరిస్ధితుల్లో మురికివాడల పిల్లల పరిస్థితి మరీ దారుణం. అలాంటి ముంబై మురికివాడల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం కృషి చేస్తున్న వ్యక్తి షాహీన్ మిస్త్రీ. ముంబైలో సామాన్య కుటుంబంలో పుట్టినన షాహీన్ మిస్త్రీ సమాజంలో విద్యా సమానత్వం కోసం ముంబయి మురికివాడల పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించడం కోసం చేసిన పోరాటాలు నేడు ఆమేకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చాయి. ముంబాయి మురికివాడల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచడం కోసం ఆమే ‘‘ఆకాంక్ష ఫౌండేషన్’’ను స్థాపించింది. ఆమే చేసిన సేవలకు గాను ఎన్నో గ్లోబల్ పురస్కారాలను అందుకుంది. ఇరోమ్ షర్మిల ఈశాన్య రాష్ట్రాలు ప్రకృతి అందాలకే కాదు, ఎల్లప్పుడు సైనిక పహారాలో ఉండే ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందాయి. అక్కడి సాయుధ దళాలకు కేంద్రం ఎన్నో ప్రత్యేక అధికారాలను కల్పించింది. దాంతో వారి విచ్చలవిడితనానికి హద్దులు లేకుండా పోయింది. ఇందుకు నిదర్శనం ‘‘మాల్కం-ఊచకోత’’. ఈ ఘటనలో పదిమంది అమాయకులను కారణం లేకుండా హతమార్చాయి సైనిక దళాలు. ఈ దాడితో చలితురాలై, ఏకధాటిగా 500వారాల పాటు నిరహారదీక్ష చేస్తూ ఉక్కుమహిళాగా గుర్తింపు పొందింది మణిపూర్‌కు చెందిన ఇరోమ్ షర్మిల. కేంద్రం ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తున్నసాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణకోసం షర్మిల చేపట్టిన ఈ దీక్ష ప్రపంచంలోనే సుదీర్ఘ నిరాహార దీక్ష. ప్రమీలా నెసర్గి ప్రమీలా నెసర్గి వృత్తిరిత్యా న్యాయవాది ప్రవృత్తిరిత్యా మహిళల హక్కుల కోసం పోరాడే ఒక ప్రసిద్ధ సామాజిక కార్యకర్త. స్వతంత్ర న్యాయవాది అయినా ఆమే బాల కార్మికులు,లైంగిక హింస, మహిళల భద్రత, ఖైదీల దుస్థితి వంటి కొన్ని తీవ్రమైన సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తన వృత్తిలో భాగంగా పలు వివాదాస్పద సమస్యలను చేపట్టి అనేక విమర్శలు ఎదుర్కొంది. లక్ష్మి అగర్వాల్ తమ మొహం మీద చిన్న మొటిమ, మచ్చ వస్తేనే ఆడపిల్లలు భరించలేరు, అలాంటిది మొహం మీద యాసిడ్దాడి జరిగితే వారి పరిస్థితి వర్ణానాతీతం. నలుగురిలో కలవడం కాదు కదా అసలు సమాజమే వారిని దూరం పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని మహిళల పట్ల జరిగే శారీరక, మానసిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంది లక్ష్మి అగర్వల్ ఓ యాసిడ్ దాడి బాధితురాలు. ఈ ఘటన తర్వాత సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాలకు కొన్ని నియంత్రణలను రూపొందించింది, యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా కొన్ని కఠిన చట్టాలను చేసింది. ప్రస్తుతం లక్ష్మీ అగర్వాల్ భారతదేశంలో యాసిడ్ దాడుల నిరోధానికి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రచారకురాలిగా, టీ.వీ. వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంది. -
ధరణీ ‘దాత’
శంషాబాద్: ఊరు గాని ఊరికి అమ్మ తోడుగా వచ్చారు. అరణ్యం లాంటి ప్రదేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లారు. ఆమే ‘ధరణీ మాత’. తల్లిదండ్రులు పెట్టిన పేరు ధరణీ భాను. కానీ ‘మాత’గానే సుపరిచయం. ప్రభుత్వ పథకాలకు భూమిని విరాళంగా ఇచ్చి ‘ధరణి దాత’య్యారు. ధర్మసాయి నిలయాన్ని పూర్తి చేసేందుకు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. గిట్టనివాళ్లు ఊరు విడిచి వెళ్లమన్నప్పుడు మనోనిబ్బరాన్ని సడలించకుండా తన సేవా ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుత సమాజంలో మహిళలలు మనో ధైర్యం కోల్పోకుండా బతకాలంటున్నారామె. తన ప్రయాణంలో ఎదురైన పరిస్థితులను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే.. నేను బెంగళూరు నగరంలో జన్మించాను.. నాన్న సుందరాజ్ అయ్యంగార్, అమ్మ సుందరమ్మకు రెండో సంతానాన్ని. మా అక్క ప్రముఖ గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతలాదేవి. చిన్ననాటి నుంచే ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. నాన్న సాయిబాబా భక్తుడు నేను ఆయన బాటలోనే ప్రయాణించాను. ఆలయం కోసం ఇక్కడికి.. 1988లో బాబా ఆలయ నిర్మాణం కోసం మా బాబాయిని తోడుగా నా మదిలో మెదిలిన శంషాబాద్ ఊరు చివరలో ఉన్న ఈ కొండ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడే ఆలయం నిర్మించాలని స్థలం కొనుగోలు చేశా. అక్కడ మొదలైన కష్టాలు కొన్నేళ్ల పాటు వెంటాడాయి. ఆలయ నిర్మాణం కొందరికి నచ్చలేదు. దాడులు చేసేందుకు ప్రయత్నించారు. కానీ నా ఆశయానికి స్థానికులు కొందరు అండగా నిలబడ్డారు. దుష్ట శక్తుల ప్రయత్నం నాలో మరింత ధైర్యాన్నిచ్చింది. ఇక్కడే శాశ్వతంగా ఉండాలని నిశ్చయించుకుని ఆలయం పూర్తి చేశాను. ఆసరా కోసం వచ్చే అతివలకు అండగా ఉంటున్నాను. అది మా అదృష్టం.. శంషాబాద్ కరెంటు కష్టాలు తీర్చేందుకు మూడేళ్ల క్రితం అదనపు సబ్‌స్టేషన్ నిర్మించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఆలయాని వచ్చిన అధికారులు స్థలం గురించి అడిగారు. కరెంటు కష్టాలు తగ్గాలనే ఉద్దేశంలో వెంటనే వేయి గజాల స్థలాన్ని విద్యుత్ శాఖకు ఇచ్చాను. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల జలమండలి భారీ రిజర్వాయర్ కోసం ఎంతో విలువైన 1200 గజాల స్థలాన్ని ఇచ్చాను. ఇవన్నీ గ్రామ ప్రజలకు మేలు చేసేవే. ఇది మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. మహిళల ఆలోచనలో మార్పు రావాలి సమాజంలో ఆడవాళ్లకు ఆడవారే శత్రువులుగా ఉండడం బాధ కలిగిస్తుంది. బాలికల పెంపకం నుంచి మొదలవుతున్న వివక్ష అలాగే కొనసాగుతోంది. మహిళలు తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడంతోనే ఇంకా సాధికారత కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి పూర్తిగా మారాలి.. తాము పడ్డ కష్టాలు సాటి ఆడబిడ్డ పడకూడదని భావించాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. -
అమ్మను మించి దైవమున్నదా..!
బిడ్డకు ఏ కష్టం వచ్చినా ‘తల్లి’డిల్లిపోతుంది. తొమ్మిది నెలలు కడుపులో పెంచాను కదా! భారం దిగిపోయింది అనుకోదు. జీవితాంతం కళ్లలో పెట్టుకుని కాపాడుతుంది. కష్టకాలంలో తాను వెన్ను కాసి బిడ్డను కంటికి రెప్పలా సాకుతుంది. ఏ కారణం చేతనైనా ఇంటికి మగదిక్కు దూరమైతే.. తానే కాయకష్టం చేసి కుటుంబానికి పెద్ద దిక్కవుతోంది. అందుకే అమ్మను మించి దైవం లేదు.. అటువంటి అమృతమూర్తుల కథనమే ఇది.. ఆ వివరాలు వారి మాటల్లోనే.. పాలకొల్లు అర్బన్: ‘నా పేరు కొల్లాపు మేరీ లలితాభాయి. మాది పెనుగొండ మండలం తూర్పు విప్పర్రు. మా వారు కొల్లాపు పాపారావు విశాఖ జిల్లా పలాసలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేసేవారు. 2006 సెప్టెంబర్ 25న హఠాన్మరణం చెందారు. మాకు ఆరుగురు ఆడకూతుళ్లు. హఠాత్తుగా ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. గుండె దిటవు చేసుకుని ఎలాగైనా ఆరుగురు కూతుళ్లను ప్రయోజకులను చేయాలని నిర్ణయించుకున్నారు. వితంతు పింఛన్ సొమ్ముతో పాటు వారసత్వంగా లభించిన కొద్దిపాటి వ్యవసాయం సాగు చేయడానికి నడుం బిగించాను. నా రెక్కల కష్టంపై పిల్లలకు ఓ దారి చూపించగలిగినందుకు ఈ రోజున ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం పెద్ద కుమార్తె హిమబిందు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త నాగార్జున సాఫ్ట్వేర్ ఇంజినీర్. రెండో కుమార్తె లక్ష్మీభాయి బీటెక్‌తో పాటు ఎంబీఏ చదివింది. ఆమె భర్త అర్జునరావు హైదరాబాద్‌లో గ్రూపు–1, గ్రూపు–2 ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ. మూడో కుమార్తె కొల్లాపు ప్రసన్న డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఉద్యోగం ప్రసన్నకు లభించింది. ప్రస్తుతం ఈమె పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయం(విజయవాడ)లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. నాలుగో కుమార్తె కొల్లాపు శిరీష అగ్రికల్చర్ డిప్లమో పూర్తి చేసి తణుకు మండలంలో ఏఈవోగా పనిచేస్తోంది. ఐదో కుమార్తె కొల్లాపు ప్రియాంక కూడా అగ్రికల్చర్ డిప్లమో చేసి పాలకొల్లు మండలంలో ఏఈవోగా విధులు నిర్వర్తిస్తోంది. ఆరో కుమార్తె కొల్లాపు రేష్మ తణుకులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. రేష్మను ఉన్నతోద్యోగిగా చూడాలని ఆశపడుతున్నాను. నాకు ఆడబిడ్డలు ఎప్పుడూ భారమనిపించలేదు. క్రమశిక్షణతో పెంచా. ముగ్గురు కూతుళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. సంతోషంగా ఉంది. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ అధిగమిస్తున్నా.’ చెప్పులు కుడుతూ..కుమార్తెను చదివిస్తూ.. ఆకివీడు: ‘నా పేరు కారుమంచి వెంకటరమణ. మా పుట్టినిల్లు ఆకివీడు. మా తల్లిదండ్రులు ముమ్మిడివరం గంగరాజు, పెద్దింట్లు. మా అత్తవారిల్లు తణుకు మండలం వీరభద్రపాలెం. పెళ్లి ఎప్పుడు అయినదో గుర్తులేదు కానీ, నా భర్త ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కాపురం సరిగా చేయకపోవడంతో పుట్టింటికి వచ్చేశాను. మెట్టినిల్లు నెట్టివేసినా, పుట్టినిల్లు అక్కున చేర్చుకుంది. నా కుమారుడు నాగ తేజ మాత్రం తండ్రి వద్దే ఉంటున్నాడు. చదువు సంధ్యలబ్బకపోవడంతో చేపల చెరువులపై ఉంటున్నాడు. కుమార్తె శిరీషను నా దగ్గర పెంచుకుంటున్నాను. కుటుంబం పోషణ కోసం తల్లి దండ్రుల వృత్తినే ఎంచుకున్నాను. ఆకివీడులో మా తల్లిదండ్రులు చెప్పులు కుట్టుకుని బతికేవారు. కాయ కష్టంతో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలను పెంచారు. తల్లిదండ్రులకు పిల్లలు పుట్టకపోవడంతో తిరుపతిలో వేకంటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. ఆ తరువాత నేను పుట్టాను. నా తరువాత మిగిలిన నలుగురు పుట్టారు. అందుకే మా పేర్ల ముందు వెంకట వచ్చే విధంగా నామకరణం చేశారు. మా ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. ఆయన్ని నమ్ముకుని, తండ్రి కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాను. మా తండ్రి చనిపోయిన తరువాత మా తల్లి అదే వృత్తిని కొనసాగించింది. నా భర్త కాపురానికి సరిగా రాకపోవడంతో నా తల్లి ఈ చెప్పుల కుట్టే వృత్తిని నాకు ఇచ్చేసి ఆదరవు చూపింది. చెప్పులు కుట్టుకునే తన ప్రదేశాన్ని నాకు ఇచ్చి జీవన భృతికి సహకరించింది. ప్రస్తుతం నేను ఉన్న చోటే చెప్పులు కుట్టుకుంటూ వచ్చే ఆదాయంతో పిల్లను చదివిస్తున్నాను. ప్రస్తుతం నా కుమార్తె శిరీష భీమవరంలోని సెంట్ఆన్స్లో టీచర్ ట్రైయినింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల టెట్ పరీక్షలకు హాజరైంది. రెక్కల కష్టంతో చదివిస్తున్న నా కూతురు ఉన్నతస్థితికి చేరుతుందన్న ఆశతోనే నేను జీవిస్తున్నాను. సొంతిల్లు, రుణం కోసం ప్రభుత్వానికి పదేపదే దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. అట్టడుగు కులంలో పుట్టినా మా పిల్లకు ఫీజు రీయింబర్స్ మెంట్గాని, ఉపకార వేతనం గాని అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు దయచూపాలి. నలుగురు సోదరులు, సోదరి, భర్త, కుమారుడు ఉన్నప్పటికీ ఏకాకిగానే రెక్కల కష్టంపై దేవుడ్ని నమ్ముకుని బతుకుతున్నాను.’ -
పోకిరీలకు ఆమె అంటే హడల్
రామవరప్పాడు (గన్నవరం) : ఖాకీ చొక్కాతో భుజాన క్యాష్ బ్యాగ్ తగిలించుకుని టికెట్.. టికెట్ అంటూ విధులు నిర్వహించే ఆర్టీసీ కండక్టర్ ఓ మేజర్ పంచాయతీకి సర్పంచ్ అయ్యింది. తాను ఒక మహిళనంటూ ఏనాడు ఆధైర్య పడకుండా 20 వేలకుపైగా జనాభా కలిగిన గ్రామాన్ని సమర్థంగా పాలిస్తోంది. తన పాలన దక్షతతో అటు గ్రామ ప్రజలను.. ఇటు సీనియర్ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమే నగర శివారులోని విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పీకా లక్ష్మీకుమారి. పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మీకుమారికి చిన్నతనం నుంచి స్వతంత్ర భావాలు ఎక్కువ. వీరిది పెద్ద కుటుంబమైనా ఆమె తల్లిదండ్రులు కష్టపడి లక్ష్మీకుమారిని చదివించారు. చదువులో ముందుండే ఆమె పాలిటెక్నిక్ కోర్సును పూర్తిచేసుకుంది. మెరిట్‌పై 1998లో విజయవాడలో సిటీ సర్వీసులకు ఆర్టీసీ కండక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. సుమారు 15 ఏళ్లు విధులు నిర్వహించిన లక్ష్మీకుమారిని వెతుక్కుంటూ 2013లో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. అంతే వెనుతిరిగి చూసుకోకుండా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. పోకిరీలకు ఆమె అంటే హడల్ లక్ష్మీకుమారి సర్పంచ్ కాకముందు కూడా తన కళ్లముందు తప్పు జరిగితే మిన్నకుండేది కాదు. ఆమె కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో బస్సులో పోకిరీలు మహిళలను వేధించడం, విద్యార్థినుల పట్ల ఈవ్‌టీజింగ్‌లకు పాల్ప డడం గమనిస్తే అందరి ముందు తగిన బుద్ధి చెప్పిన ఘటనలు అనేకం ఉన్నాయి. భర్త చనిపోయినా అధైర్యపడకుండా.. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన లక్ష్మీకుమారి సర్పంచ్ హోదాలో ప్రజాసేవకు అంకితమయ్యారు. తన అభిమాన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాభివృద్ధికి తనవంతుగా పాటుపడుతున్నారు. 2016లో ఆమె భర్త నాగమల్లి కోటేశ్వరరావు ఆటోనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సన్నిహితులు, బంధువులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మనోధైర్యం ఇవ్వడంతో తిరిగి గ్రామాభివృద్ధిపై దృష్టిసారించారు. ప్రధాన గ్రామంతో పాటు కాల్వ గట్టు ప్రాంతాల్లో పాలకవర్గ సభ్యుల సహకారంతో రూ.లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రైవస్ కాలువపై డబుల్ లైన్ వంతెన ఏర్పాటుకు శంకుస్థాపన కూడా అతితర్వలో ఈమె హయాంలో జరగనుండటం విశేషం. -
ముసలోళ్లకు పెళ్లేంటన్నారు..
అదే ఐదారేళ్ల క్రితం అరవై ఏళ్ల వయసులో ఓ మహిళ పెళ్లి చేసుకుంటోంది లేదా మరో వ్యక్తితో కలిసి ఉంటోంది.. అనే విషయం తెలిస్తే నగరం కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకునేవి. ‘ఈ వయసులో ఇదేం పని’.. అంటూ నలుగురి నోళ్లు తిట్టిపోసేవి. అయితే ఇప్పుడుపరిస్థితిలో మార్పు వచ్చింది. ఆశ్చర్యపోవడం తగ్గింది. ఎందుకంటే.. ప్రస్తుతం వృద్ధుల పెళ్లిళ్లు సిటీలో జరుగుతున్నాయి. దీనికి కారణం నిన్నటి దాకా ఒంటరిగా ఉన్న ‘రాజేశ్వరి’ కృషి. జీవితం మలిసంధ్యలో ఒంటిరి జీవితం ఎంత కష్టమో గుర్తెరిగిన ఆమె.. పెద్ద వయసు వారిని ఒక్కటి చేస్తున్నారు. సాక్షి,సిటీబ్యూరో: ‘ప్రస్తుతం మనిషి సగటు జీవిత కాలం పెరిగింది. ఇప్పుడు 60 దాటినా ఆరోగ్యంగా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అనుకోకుండా హఠాత్తుగా జీవిత భాగస్వామి దూరమైతే మిగిలిన జీవితం అంతా ఒంటరిగా గడపాల్సిందేనా? విడాకులు లేదా ఇంకేదైనా కారణంతో తోడు లేకుండా మిగిలిపోతున్న వారికి తోడు కల్పించడం కోసమే మా ‘తోడు– నీడ’ కృషి చేస్తోంది’ అని చెప్పారు రాజేశ్వరి. పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాజేశ్వరి.. నగరంలో ఒంటరి వృద్ధులకు ‘తోడు’ వెతికిపెట్టే బాధ్యతలను కొన్నేళ్ల క్రితం స్వచ్ఛందంగా తలకెత్తుకున్నారు. అయితే తొలుత చాలా మంది ఆమెను వారించారు. ముసలోళ్లేమిటి? వారికి నువ్వు పెళ్లి చేయడం ఏమిటంటూ ఎగతాళి చేశారు. అయితే రాజేశ్వరి మాత్రం పట్టు వదల్లేదు. ‘వయసు మళ్లిన వారికే తోడు కావాలి. కాని దురదృష్టవశాత్తూ ఒంటరితనం ప్రాప్తించే అవకాశాలూ పెద్ద వయసులోనే ఎక్కువ’ అంటారామె. వృద్ధుల కోసం పెళ్లి చూపులు, గెట్ టు గెదర్ వంటి ఈవెంట్లు, వారికి నాణ్యమైన జీవనాన్ని అందించే కమ్యూనిటీ సెంటర్లు, వృద్ధుల కోసం పిక్నిక్లు నిర్వహిస్తూ.. సిటీలోని సీనియర్ సిటిజన్స్‌కు పలు విధాలుగా ఆసరా అందిస్తున్నారు. ‘వృద్ధాశ్రమాలు శేష జీవితం గడిపేందుకు ఎంచుకుంటాం. మనకు నచ్చింది తినడానికో, నచ్చినట్టు ఉండడానికో అక్కడ వీలుండదు. కమ్యూనిటీ లివింగ్ ప్లేస్‌ల ద్వారా అలాంటి కొరత తీరుతుంద’ని చెప్పారు రాజేశ్వరి. లివింగ్ టు గేదర్.. ‘వృద్ధాప్యంలోనే ఒంటరి తనపు సమస్య ఎక్కువ. రెక్కలొచ్చాక పిల్లలు వెళ్లిపోయి, జీవిత భాగస్వామి సైతం దూరమైతే.. ఏకాకిగా రోజులు వెళ్లబెట్టడం కన్నా నరకం మరొకటి లేదు’ అంటారామె. పెళ్లి కావచ్చు లేదా సహజీవనం కావచ్చు.. ఇద్దరు వృద్ధులు ఇష్టపడి కలిసి జీవించాలి అనుకుంటే వారికి తోడు నీడ అండగా ఉంటుంది. వృద్ధుల ఒంటరి తనపు సమస్యను పరిష్కరించే క్రమంలో సంస్థ ప్రారంభించిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా దాదాపు 50కి పైగా ఒంటరి జీవితాలను జంటగా మలచామంటూ ఆనందంగా చెబుతారామె. అయితే ఈ క్రమంలో రాజేశ్వరి ఎదుర్కున్న ఒడిదొడుకులు అన్నీ ఇన్నీ కావు. ‘పెద్దవాళ్లు పిల్లల పెళ్లిళ్లు తమ ఇష్ట్రపకారం జరగాలని ఆశిస్తారని, అలా జరగకపోతే వారిని అదుపు చేయాలని నానా విధాలుగా ప్రయత్నిస్తారని మనకు తెలుసు. కాని తమ ఒంటరి తల్లి/ లేదా తండ్రి మలి వయసులో ఓ తోడు కోసం ఆరాటపడడాన్ని జీర్ణించుకోలేని పిల్లల సంఖ్యాఎక్కువే. నిజానికి ప్రేమించుకున్న పిల్లల పెళ్లి్లకన్నా.. పెద్దల పెళ్లికే అడ్డంకులు ఎక్కువ’ అంటారామె. పిల్లలు ఏదైనా హాలిడే ట్రిప్‌కు వెళుతుంటే తమను తీసుకువెళితే బాగుణ్నని వృద్ధులు అనుకుంటారు. ఈ పరిస్థితుల్లో తమంతట తామే సహ వయోజనులతో ట్రిప్స్‌కు ప్లాన్ చేసుకునేందుకు ఈ సంస్థ అండగా ఉంటోంది. ప్రతి మూడు నెలలకూ ఏదో ప్రాంతానికి టూర్స్ నిర్వహిస్తోంది. యువతకు మాత్రమే పరిమితం అని భావించే న్యూ ఇయర్ పార్టీల నుంచి వాలంటైన్స్‌డే వరకూ ఇందులో సభ్యులైన పెద్దలు సంబరంగా జరుపుకుంటున్నారు. ‘వృద్ధాప్యం అంటే కృష్ణా రామా అనుకుంటూ గడిపే దశ కాదు. దానికీ కలలూ కోరికలూ సరదాలూ అవసరమే. తమలాంటి పరిస్థితిలోనే ఉన్న మరికొందరితో కలిసి అవి నెరవేర్చుకునే చక్కటి వేదికే ఇది’ అంటున్న రాజేశ్వరి.. ఒంటరి వృద్ధులకు సంబంధించి ఆధునిక కాలంలోనూ పిల్లలు చాలా స్వార్ధంగా, సంకుచితంగా ఆలోచిస్తున్నారని, వారికి ఏ సరదా, ముచ్చటా అవసరం లేదని భావిస్తున్నారంటారు. వారి మలి జీవితం నిస్సారంగా గడచిపోయేందుకు తెలిసో తెలియకో దోహదం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. వీలైనంత వరకూ ఈ పరిస్థితిని మార్చడమే తన లక్ష్యం అంటున్నారు. -
‘హీరో’యిన్
భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎంత కామనో.. తెలుగు సినిమా హీరోల చుట్టూ తిరగడం అంతే కామన్. కానీ ఈ ఫార్ములాను బ్రేక్ చేసిన తారలు కూడా మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. హీరోల చుట్టూ పరిగెడుతున్న కథా కథనాలు ఒక్క సినిమాతో తమవైపుకు తిప్పుకొని చూపించారు కొంత మంది తారలు. అలాంటి మహిళామణులు మనకు ప్రతి జనరేషన్‌లోనూ కనిపిస్తారు. ఎప్పుడూ కథానాయకుల చుట్టూ తిరిగే తెలుగు సినిమా కథ అప్పుడప్పుడు హీరోయిన్ల వైపు కూడా తిరుగుతుంది. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ అంటే నాలుగు పాటలు, మరో నాలుగు సీన్స్‌కు మాత్రమే అంటూ అంటూ ఫిక్స్ అయిపోయిన రైటర్లు హీరోయిన్‌కి హీరో రేంజ్ కాన్వాసు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం హీరోతో ఆడి పాడే హీరోయిన్లు తామే లీడ్ రోల్స్‌గా మారి కథ నడిపిస్తే.. ఆ ఆలోచనతో సినిమాలు తెరకెక్కించిన దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. హీరోయిన్లకు హీరోయిజం చూపించే ట్రెండ్ కొత్తగా వచ్చిందేం కాదు.. సినిమా పుట్టిన దగ్గరనుంచి ఈ ట్రెండ్ ఉంది. భానుమతి, అంజలీ దేవిల నుంచి సూర్యకాంతం లాంటి నటీమణుల వరకు ఎందరో.. ఎన్నో అద్భుత చిత్రాల్లో లీడ్ రోల్స్ లో నటించారు. ఆయా సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటి భానుమతి. మల్టీ టాలెంటెడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ మహానటి ఎన్నో అద్భుత చిత్రాల్లో అంతా తానే అయి సినిమాలను విజయతీరాలకు చేర్చారు. భానుమతి తరువాత అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మరోనటి సూర్యకాంతం. హీరోయిన్ క్యారెక్టర్ చేయకపోయిన సినిమా అంతా తన చూట్టూ నడిచే ఎన్నో సినిమాలతో లేడీ క్యారెక్టర్‌కు హీరోయిజాన్ని ఆపాదించింది. అలాంటి ఓ సూపర్ హిట్ చిత్రమే గుండమ్మ కథ. కలర్ సినిమాలు వెండితెర మీదకు వస్తున్న రోజుల్లో కూడా ఎంతో మంది హీరోయిన్లు లేడిఓరియంటెడ్ సినిమాలతో వెండితెరకు కొత్త అందాలను తీసుకువచ్చారు. అందం అభినయంతో పాటు కాస్త డైనమిజాన్ని కూడా చూపించారు. అందాల తారలుగా పేరు తెచ్చుకున్న జయప్రద, శారద, భానుప్రియ, జయసుధ లాంటి వారు కూడా లేడీ ఓరియంటెండ్ సినిమాలతో మెప్పించారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా తన అందంతో భారతీయ సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన శ్రీదేవి కూడా అప్పుడప్పుడు గ్లామర్ ఇమేజ్ను పక్కన పెట్టి ఛాలెంజింగ్ రోల్స్‌తో సత్తా చాటింది. కెరీర్ తొలినాళ్లలోనే పదహరేళ్ల వయసు, వసంత కోకిల లాంటి విభిన్న చిత్రాలతో అలరించారు. హీరోయిన్ అంటే హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించిన మరో నటి విజయశాంతి. చాలా కాలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన విజయశాంతి, తరువాత లేడీ ఓరియంటెండ్ సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రతిఘటన, భారతనారి, కర్తవ్యం, రేపటి పౌరులు, ఒసెయ్ రాములమ్మ లాంటి సినిమాలు ఘనవిజయం సాధించటంతో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఈ జనరేషన్ లోనూ లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసిన నటీమణులకు కొదవేం లేదు. అనుష్క, నయనతార లాంటి తారలు యాక్షన్, థ్రిల్లర్ తరహా సినిమాలతో లేడీ ఓరియంటెండ్ సినిమాల హవాను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా అప్పుడప్పుడు మహిళలకు పెద్ద పీట వేస్తూ సినిమాలు రూపొందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. -
జీవితం..రంగస్థలం
సొంత ఇల్లే కాదు.. సొంత ఊరు అంటూ లేని దుర్భర బతుకు. తల్లిదండ్రులు పెట్టేబేడా సర్దుకుని ఎక్కడికెళితే అక్కడకు పయనం. పొట్ట కూటి కోసం రంగస్థలాన్ని నమ్ముకుని జీవిస్తున్న కళాకారుల జీవితం.ఇలాంటి స్థితిగతుల నుంచే వచ్చారు విజయకుమారి. పాశ్చాత్య సంస్కృతి మోజులో పట్టణ, నగర ప్రాంతాల్లో రంగస్థల నాటకాలకు ఆదరణ తగ్గినా.. పల్లె సీమలు అక్కున చేర్చుకున్నాయి. కళాపోషకులు ఔదార్యం చాటుకుంటూ వచ్చారు. ఒడిదుడుకుల జీవితంలో కాసింత ఊరటనందించారు. అదే విజయకుమారికి కొండంత అండగా నిలిచింది. కష్టాల కడలి నుంచి తీరం వైపుగా కుటుంబ నావను నెట్టుకువచ్చే ప్రయత్నంలో ఆమెచివరికంటా సాగిస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. అనంతపురం కల్చరల్: సొంతూరు ఇది అంటూ చెప్పలేను మా సొంతూరు ఏది అంటే నిర్ధిష్టంగా ఇది అంటూ చెప్పలేను. రంగస్థలంపై ఆధారపడి జీవించే కుటుంబం కావడం వల్ల చాలా ఇబ్బందులుండేవి. ఆ రోజుల్లో కాపురాలన్నీ డేరాల్లోనే జరిగిపోయేవి. నాన్న రామారావు ఒంగోలు వద్ద కోటవరంలో జన్మించారని చెప్పేవారు. అమ్మ భవానమ్మ కూడా ఆ చుట్టుపక్కలే జన్మించినట్లు అనుకుంటున్నాం. మాకైతే కచ్చితంగా తెలీదు. నాన్న తబలా వాయిస్తూండేవారు. అమ్మ నాటకాల్లో వేషాలు వేస్తుండేవారు. ముఖ్యంగా భారతీయ నాటక రంగాన్ని మలుపు తిప్పిన వారు సురభి నాటక సమాజంలో వారు కళాకారులు. ఆ రోజుల్లో నాటక సమాజాల్లో అందరమూ కలిసున్నా ఎవరి తిండి, ఎవరి బట్టలు వారివే కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. నన్ను ఫ్రీ హాస్టల్లో చేర్పించి చదివించారు. చిన్నవయసులోనే నటప్రస్థానం సురభి నాటక సమాజంలో పిల్లలు పుట్టారంటే వారు కూడా రంగస్థల ప్రవేశం చేయాల్సిందే. అలా నా 12వ ఏట ‘శ్రీ కృష్ణలీలలు’ నాటకంలో బాలకృష్ణుడి పాత్రలో నేను నటించాను. కిరాయికే నాటకాలు ఆడేవాళ్లు. బుధవారం వచ్చిందంటే జీతాలిచ్చేవారు. ఒకటి రెండు పాత్రల తర్వాత నన్ను నెల్లూరులోని వాకాడ హాస్టల్లో చదువుకోమని వదిలిపెట్టారు. అక్కడ చదువుకుంటూనే పీటర్ మాస్టర్ వద్ద సంగీతం, కృష్ణమాచార్యుల వద్ద భరత నాట్యం నేర్చుకున్నాను. కుటుంబంపై ప్రభావం మేము ముగ్గురం అక్కాచెళ్లలం. నేను పెద్దదాన్ని. 1953లో బాసర క్షేత్రంలో నిండు గర్భిణిగా ఉన్న మా అమ్మ రంగస్థలంపై నర్తిస్తున్నప్పుడు అమ్మవారి సన్నిధిలో నేను జన్మించాను. మా చెల్లెలు మనోహరమ్మ అద్భుతమైన ఆర్టిస్టు. పెళ్లి తర్వాత రంగస్థలానికి ఆమె దూరమయ్యారు. కొన్నాళ్లు హరికథలు కూడా చెప్పేది. మరో చెల్లెలు లీలావతి చిన్నప్పటి నుంచి రంగస్థలానికి దూరంగా ఉండిపోయింది. తమ్ముడు ఆనంద్ మేకప్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. మరో తమ్ముడు రమేష్ కాస్తంత దూరంగానే ఉన్నాడు. ఇక మా ఆయన సెల్వం. ఆయన పుట్టి పెరిగింది తమిళనాడైనా అనంతకొచ్చి స్థి«రపడ్డారు. మా పెళ్లికి ముందు మా పక్కింట్లోనే ఉండేవారు. ఆయన మంచి మేకప్ ఆర్టిస్టే. ఆరేళ్ల కిందట ఆయన చనిపోయారు. మా పెద్ద కూతురు విజయశారదకు పెళ్లయింది. మంచి నటీమణి. ఇప్పటికీ నాటకాలు వేస్తూ ఉన్నారు. ఇంకొక కూతురు రాజేశ్వరికి నాటక విద్య అబ్బలేదు. కొడుకు కిరణ్‌కుమార్ మంచి డాన్సర్. వాడు కూడా రంగస్థలాన్నే నమ్ముకున్నాడు. చిత్రమేమంటే పీజీల దాకా వారంతా బాగా చదువుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక రంగస్థలంపైనే ఉండిపోవాల్సి వచ్చింది. అనంతలో స్థిర నివాసం సురభి నాటక సమాజంలో ఉంటూ దేశ దిమ్మరులుగా ఉన్న మేము 1972లో అనంతపురం వచ్చి స్థిరపడ్డాం. ఇల్లు గడవాలంటే నాటకాలు వేయడం మినహా మాకు మరో గత్యంతరం లేదు. పెళ్లి తర్వాత నేను ముఖానికి మళ్లీ రంగుపూసుకోవాల్సి వచ్చింది. సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల రంగస్థల నాటకాలను చూసేందుకు వచ్చే వారి సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఆ సమయంలోనే రంగస్థలంపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాం. సొంతంగా ఎస్ఆర్కే నాటక సమాజాన్ని స్థాపించి రాష్ట్రమంతటా వివిధ ప్రదర్శనలు ఇచ్చాం. కొత్త ప్రయోగాలతో కళాభిమానులను అలరించాం. 2002లో జిల్లాలో తొలిసారి మేమే పోటీ నాటకాలను వేయించాం. ప్రఖ్యాత నటులు గుమ్మడి గోపాలకృష్ణ, సినీనటులు సుత్తివేలు వంటి వారిని న్యాయనిర్ణేతలుగా ఏర్పాటు చేశాం. మా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘సాయిబాబా విజయ లీలలు’ నాటకం అప్పట్లో అనంత వాసులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అలాగే 2011లో ‘శ్రీనివాస కల్యాణం’ నాటిక సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు మిగిల్చింది. కళా స్రవంతి సంస్థ ద్వారా మరోసారి అనంతపురంలోని లలితాకళాపరిషత్‌లో పోటీ నాటకాలు ఆడించాం. ప్రభుత్వ ఆదరణ అంతంతే.. అనకూడదు కానీ ప్రభుత్వం మాకు ఎన్నో చేయొచ్చు. రూ. లక్షలు ఖర్చు పెట్టి నాటకాలు వేస్తే ప్రభుత్వం కేవలం రూ.8 వేలు, మరోసారి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. న్యాయపరంగా పింఛన్లయినా ఇస్తే అదే పదివేలు. 60 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నామంటారు. నాకిప్పుడు 66 ఏళ్లు. నాకిప్పటికీ పింఛన్ రావడం లేదు. ఈ ఐదేళ్లలో లెక్కకు మించి చాలా సార్లు దరఖాస్తులు అందజేస్తూ వచ్చాను. ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదో స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. 45 ఏళ్లకే పింఛన్, హెల్త్ కార్డులు జారీ చేస్తే కళాకారులకు ఎంతో ఊరటగా ఉంటుంది. పల్లెలు బతికిస్తున్నాయి రంగస్థల కళనే వృత్తిగా మార్చుకుని జీవించే కుటుంబాలు ఈ జిల్లాలో చాలా ఉన్నాయి. తెర లేచినప్పటి నుంచి నాటకం అయిపోయే వరకు ఈలలు వేస్తూ సాగే ఉత్సాహం.. ఆసక్తి ఎంతో పల్లెల్లో మేము చూశాం. టికెట్టు కొని బండ్లు కట్టుకుని వచ్చి నాటకాలు చూసేవారు. పల్లెల్లో ఉన్నట్లుగా కళాపోషకులు పట్టణ ప్రాంతాల్లో కరువయ్యారు. పల్లె వాసుల ఔదార్యమే మమ్మల్ని బతికిస్తోంది. కళాకారుల కాలనీ అద్భుతం నా 53 సంవత్సరాల రంగస్థల అనుభవంతో చెబుతున్నాను. రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా అనంతపురంలో కళాకారులు ఐక్యతతో ఓ కాలనీని ఏర్పాటు చేసుకున్నాం. అప్పట్లో అనంతపురం ప్రజా ప్రతినిధులు కళాకారులను ప్రోత్సహించారు. ప్రస్తుత ప్రజా ప్రతినిధులు కళాకారుల పట్ల సానుభూతి చూపు తున్నారు. కాలనీలో ఎవరైనా కళాకారులు చనిపోతే దహన సంస్కారాలను అందరూ కలిసి చేసుకుంటాం. ఎంతో ఆదర్శంగా జీవిస్తున్న మా కాలనీలో మౌలిక వసతులు లేవు. 40 ఏళ్లకే రోగాల పుట్ట రంగు పూసుకుని, చిరునవ్వులు చిందిస్తూ లేని సంతోషాన్ని కనబరచే కళాకారుల జీవితాల్లో అనేక బాధలూ ఉన్నాయి. ప్రకృతికి విరుద్ధంగా తెల్ల ్లవార్లు మేల్కొనడం... సరైన తిండితిప్పలు లేకపోవడంతో 40 ఏళ్లకే దాదాపు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగుల వల్ల కంటి చూపు దెబ్బ తింటోంది. నిద్ర లేమి వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ముఖానికి వేస్తున్న రంగుల్లో తేడాలొస్తే చర్మవ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాక తరచూ రంగు వేయడం వల్ల ముఖ సౌందర్యం తగ్గి పోతోంది. మైక్ సిస్టం సక్రమంగా లేకపోవడ వల్ల స్థాయికి మించి గట్టిగా అరవడం, రాగాలు తీయడం వల్ల గొంతు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. ఇలాంటి దశలోనే ఒక కిడ్నీ చెడిపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. నాటకాలు ఆపేస్తే పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఎలా చేయాలని మదనపడ్డాను. అలాగే అతి కష్టంపై నాటకాలు ఆడుతూ వచ్చాను. అప్పట్లో ఆరోగ్యశ్రీ నన్ను ఆదుకుంది. విచిత్రమేమంటే మత్తు ఇంజక్షన్ కూడా వేయించుకోకుండా కేవలం సంగీతం వింటూ ఆపరేషన్ చేయించుకున్నా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రెండో కిడ్నీ సమస్య తలెత్తింది. -
అగ్నిపుత్రి మిస్సైల్ తో మైత్రి
ఆమెను చూస్తే మనుషులు ఇంత నిగర్వంగా కూడా ఉండగలరా?అనిపిస్తుంది. ‘మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా’ అంటూ అందరూఆకాశానికెత్తినా, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నా ఆమెసాదాసీదాగానే ఉంటారు. ఇదెలా సాధ్యమని అడిగితే.. ‘నేను నా పనితో బిజీగా ఉంటాను. అంతే..’ అని చెబుతారు డాక్టర్ టెస్సీ థామస్. రక్షణ రంగంలో తొలి మహిళా సైంటిస్ట్‌గా పేరొందిన ఆమె... రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల ఫస్ట్‌లేడీ పురస్కారం అందుకున్నారు. ఈమె సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనం.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. సాక్షి, సిటీబ్యూరో : సిటీలో ఇటీవల జీఈఎస్ సదస్సు జరిగినప్పుడు అత్యధికులు ముఖ్య అతిథి ఇవాంకా ట్రంప్ గురించి మాట్లాడుకుంటే... హాజరైన అతిరథ మహారథులు మాత్రం టెస్సీ థామస్ గురించి గొప్పగా చర్చించుకున్నారు. ఆమె ఉపన్యాసాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. ఎందుకంటే న్యూక్లియర్ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు మన దేశ రక్షణ రంగానికే ప్రతిష్టాత్మకమైన ‘అగ్ని’ క్షిపణి రూపకల్పలోనూ పాలుపంచుకున్న మహిళ ఆమె మాత్రమే కాబట్టి. అంతేనా.. సంప్రదాయంగా పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్న రంగమనే నమ్మకాన్ని పటాపంచలు చేశారు. ఎందరికో రోల్ మోడలైన ఏపీజేఅబ్దుల్ కలాం ఆధ్వర్యంలో పని చేశారు. మరి కొందరు మహిళలు కీలకమైన ఆయుధ ప్రాజెక్టుల్లో కనిపిస్తున్నారంటే ఆమె అందించిన స్ఫూర్తి ఓ కారణం. రాకెట్ వైపు.. నిలిచిన చూపు.. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకుపోయే రాకెట్లను అల్లంత దూరం నుంచి చూసిన టెస్సీ... ఆ తర్వాత వాటితోనే తన జీవితాన్ని ముడివేసుకుంది. 1963లో కేరళలోని అల్లాపుఝా జిల్లాలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆమె.. ఇంటికి దగ్గర్లోని తుంబా స్పేస్ లాంచింగ్ స్టేషన్ నుంచి దూసుకుపోయే రాకెట్లను గమనిస్తూ పెరిగారు. పుణెలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌లో ఎంటెక్ పూర్తి చేసి, గైడెడ్ వెపన్ కోర్సు కోసం నగరంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కి వచ్చారు. 1988లో సైంటిస్ట్‌గా మారి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం డీఆర్డీఓలోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఎదురుదెబ్బలే తిరుగులేని విజయాలు... అగ్ని క్షిపణి ప్రయోగ సమయంలో ఆమె ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఎన్నో బాలారిష్టాలు, వైఫల్యాలు వేధించాయి. అగ్ని మిస్సైల్ 2006లో తన ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఆమె బృందం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆమె దీన్నో చాలెంజ్‌గా తీసుకొనివారాంతాలు సహా రోజుకు 16 గంటలు పని చేశారు. విజయం సాధించారు. హోమ్మేకర్గా, సైంటిస్ట్‌గా జీవితాన్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకోగలిగారు. మతాంతర వివాహం దగ్గర్నుంచి మిస్సైల్ రీసెర్చ్ వర్క్ వరకు అన్నింట్లోనూ తన కుటుంబం మద్దతు మరువలేనిదంటారు టెస్సీ. ఆమే స్ఫూర్తి.. జీఈఎస్ సమయంలో తొలుత టెస్సీ గురించి నీతి ఆయోగ్ ట్వీట్ చేసింది. అది చూసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ఆనంద్ మహీంద్రా ‘మీట్ టెస్సీ థామస్. జీఈఎస్ 2017 స్పీకర్.మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా. దేశంలోనే మిస్సైల్ ప్రాజెక్ట్‌కు సారథ్యం వహించిన తొలి మహిళ’ అంటూ ట్వీట్లో పరిచయం చేశారు. ప్రతిపాఠశాలలో ఆమె పోస్టర్‌ను ఉంచాలని, అది ఆడిపిల్లలకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. వెనుకడుగొద్దు... ‘ఇంటలిజెన్స్‌లో మహిళలు ఒకడుగు ముందే ఉంటారు. అయితే ఎమోషనల్ ఇంటలిజెన్స్ దగ్గరే వీరు ఇరుక్కుపోతారు. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్)ను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు 3డీ (డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్) తప్పనిసరిగా ఉండాలి. సైంటిస్ట్‌గా కొనసాగాలంటే అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయొద్దు. అంకితభావంతో ముందుకెళ్లాలి. ప్రపంచాన్ని ఫేస్ చేయండి.. రిస్క్ తీసుకోండి.. మీ పూర్తి సామర్థ్యాన్ని చూపండి’ అంటూ టెస్సీ జీఈఎస్ సదస్సులో సందేశమిచ్చారు. ఎన్నో అవార్డులు... ♦ డీఆర్డీఓ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2008 ♦ ఇండియా టుడే ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2009 ♦ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2011, 2012 ♦ లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ 2012 ♦ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ స్పెషల్ అచీవ్మెంట్ అవార్డు(సీఎన్ఎన్ ఐబీఎన్) 2012 -
షేర్ మార్కెట్ 'అమ్మలు' వీరే..!
దలాల్‌స్ట్రీట్ అమ్మలు.. అదేంటి ఇలా అంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లకు వీరు అమ్మలా..? అంటే కాదండోయ్. వీరు కూడా సాధారణ మహిళలే. రోజూ ఉదయాన్నే ఐదు గంటలకు లేవడం, ఇంటి పనులన్నింటిన్నీ చకాచకా పూర్తిచేయడం, పిల్లలను సిద్ధం చేసి, బాక్సులతో స్కూళ్లకి పంపించడం.. ఇలా రోజూవారీ పనులు వీరు చక్కబెట్టాల్సిందే. అయితే కుటుంబానికి, పిల్లల వరకే తమ సమయం, ఆసక్తి పరిమితం కాకూదనుకున్నారు. ఇంట్లో ఉండి కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా కూడా ఎలా రాణించాలా అని ఆలోచించారు. ఆలోచనతోనే ఆగిపోలేదు.. తమ బుర్రలకు మరింత పదును పెట్టారు. నిరంతరం ట్రేడింగ్.. లాభాలు, నష్టాలు, విశ్లేషణ.. నిరంతరం ఇదే ఆలోచనతో రాటు దేలారు. అంతే..షేర్ మార్కెట్ రాణులుగా కాదు.. కాదు..అమ్మలుగా మారిపోయారు. అయితే ఇది ఒక రోజులోనో..ఒకనెలలోనో వచ్చి వరించిన విజయం కాదు. ఇంట్రాడేలో తాము చేసిన ట్రేడింగ్‌ను ఎపుడూ సమీక్షించుకునేవారు. కొన్న అమ్మిన షేర్ల వివరాలను రాత్రి పడుకునే ముందు ఒక్కసారి అనాలసిస్ చేసుకోవడం..రివ్యూ చేసుకోవడమనే కార్యక్రమాన్ని ఒక వ్రతంలా చేసేవారు. ఇలా సుదీర్ఘం పయనం తర్వాత తామనుకున్న లక్ష్యాన్ని చేధించగలిగారు. వారిలో ఓ ఇద్దరి గురించి ఇపుడు తెలుసుకుందాం.. అను రాయ్ ప్రమోద్ : అను కంపెనీ సెక్రటరీగా ఉత్తీర్ణురాలయ్యారు. కానీ వివాహ అనంతరం ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. కుంగిపోలేదు.. చుట్టూ ఉన్న పరిస్థితులనుంచే ఎదగడం నేర్చుకుంది. తాను చదివిన చదువుకు సార్థకత కోసం స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ప్రస్తుతం తను ఓ మంచి గృహిణిగానే కాకుండా... ఇన్వెస్టర్‌గా కూడా రాణిస్తోంది. తన పెట్టుబడుల్లో ఎక్కువగా దీర్ఘకాలికమైనవే. అదేవిధంగా రోజువారీ ట్రేడింగ్‌లో పాల్గొంటు కూడా మంచి సంపదను ఆర్జిస్తోంది. ఇంట్లోనే ఉంటూ పలు కంపెనీలతో తాను ఇంటరాక్ట్ అవుతున్నట్టు చాలా గర్వంగా చెబుతారు ఆమె. ఫార్మాస్యూటికల్స్, బ్రెవరీస్, రియల్ ఎస్టేట్, టెలికాం లాంటివి ఆమె ఫేవరేట్ సెక్టార్లు. పరుల్ భార్గవ శర్మ : కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తనకు ఎంతో ఇష్టమైన ఎంబీఏ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఫీసు వ్యవహారాలన్నింటికీ తానే పెద్ద దిక్కైంది. అదే సమయంలో పరుల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అసలే మ్యాథ్స్ అంటే అయిష్టం. పైగా గణాంకాలతో కూడుకున్న పని. భయపడుతూనే స్టాక్ మార్కెట్ పెట్టుబడులోకి దూకేసింది. భర్త, తండ్రి ప్రోత్సహంతో స్టాక్‌మార్కెట్‌పై అవగాహన పెంచుకోవడం ప్రారంభించింది. ఒకసారి తన ఐదో పెళ్లి వార్షికోత్సవం రోజున లంచ్‌కు ల్యాప్‌టాప్ కూడా పట్టుకెళ్లాల్సినవసరం వచ్చిందని, ఆ సమయంలో తన చుట్టూ ఉన్న ప్రజలు చేసిన కామెంట్లు ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతోంది. అప్పటి నుంచి నా లైఫ్‌ను తిరిగి చూసుకోకుండా... కిచెన్‌లో సైతం పురుష ఆధిపత్యం ఉన్న స్టాక్ మార్కెట్లో ఎలా రాణించాలో ఆలోచించే దాన్ని అని చెప్పింది. స్టాక్‌మార్కెట్‌పై తన స్వీయ బోధన ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించిందని, తన క్లయింట్స్‌కు నమ్మదగ్గ సలహాదారిగా రాణిస్తున్నట్టు ఎంతో గర్వంగా ఫీలవుతోంది. ఇలా అవసరానికి ఒకరు.. చదువుకు సార్థకత కోసం మరొకరు స్టాక్మార్కెట్లో రాణిస్తున్నారు. ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం అధైర్య పడకుండా.. తాము సంపాదించిన మనీని పెట్టుబడులుగా ఎలా అభివృద్ధి చేసుకోవాలో ప్లాన్లు కూడా వేసుకుంటున్నారు. ఇలా దలాల్‌స్ట్రీట్ అమ్మలుగా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది కేవలం దేశీయ గృహిణీల స్టోరీ మాత్రమే కాదు. ప్రపంచ స్టాక్‌మార్కెట్లలో అమ్మల స్టోరీ కూడా. కొద్ది మంది గృహిణీలు ఇలా వినూత్నంగా ఆలోచిస్తూ.. ఇంట్లోనే ఉంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లుగా రాణిస్తున్నారు. వీరి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. దానికి ఈ కింది గణాంకాలే నిదర్శనం. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా ఐపీయూఎంఎస్ క్వీన్స్ కళాశాల సోషియాలజీ విభాగం డేటా విడుదల చేసిన అనాలసిస్‌లో 1980లో వాల్‌స్ట్రీట్ అమ్మలుగా 2,980 మంది ఉంటే, 2011 నాటికి వారు 21,617 మంది అయ్యారు. - కొటేరు. శ్రావణి -
కడప గడపలో క్రీడా పద్మం మల్లేశ్వరి
కడప జన్మభూమిగా.. శ్రీకాకుళం కర్మభూమిగా భావిస్తానని.. తెలుగు ఆడపడచుగా తెలుగు క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని.. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రపంచస్థాయి పతకాలు సాధించి చూపుతానంటున్నారు పద్మశ్రీ కరణం మల్లేశ్వరి.. ఒలింపిక్ పోటీల్లో భారతదేశానికి వెయిట్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం తీసుకువచ్చిన వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లేశ్వరి కడప నగరానికి విచ్చేశారు.. ఈమెను సాక్షి పలుకరించగా పలు విషయాలు వెల్లడించారు. కడప స్పోర్ట్స్:అమ్మాయిలకు ఆటలేంటి... అన్న వారే అదరహో.. అన్నారు.. సన్నగా ఉన్నావు బరువులెత్తే వెయిట్లిఫ్టింగ్కు పనికిరావు అన్న వారే.. భారతదేశపు.. పరువు నీవేనన్నారు.. తర్వాత కాలంలో.. ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి.. అర్జున, రాజీవ్ ఖేల్‌రత్న, పద్మశ్రీ వంటి మరెన్నో పురస్కారాలు ఈమెను వరించాయి.. తన మూలాలు ఇక్కడే ఉన్నాయని.. తెలుగు క్రీడాకారులకు తనవంతు సహకారం అందిస్తానని అంటోంది క్రీడా పద్మం కరణం మల్లేశ్వరి. గురువారం కడప నగరానికి విచ్చేసిన ఆమె సాక్షితో పలు విషయాలను పంచుకుంది. సాక్షి :చరిత్రలో నిలిచేలా తొలి ఒలింపిక్ పతకం సాధించిన మహిళా క్రీడాకారిణిగా మీ స్పందన..? మల్లేశ్వరి : క్రీడలు అంటే తక్కువగా తెలిసిన సమయంలో.. ఒలంపిక్స్ అంటే ఏందో సరిగా తెలియని సమయంలో ఎన్నో ఆటుపోట్ల మధ్య క్రీడాసాధన సాగింది. దేశానికి పతకం సాధించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోవడం సంతోషంగా గర్వంగా ఉంది. అయితే అప్పటితో పోల్చితే నేడు మౌలిక సదుపాయాలు పెరిగాయి. సాక్షి :ప్రభుత్వం నుంచి లభించిన ప్రోత్సాహం..? మల్లేశ్వరి :సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించడంతో ప్రభుత్వం రూ.35 లక్షలు నగదు ప్రోత్సాహం అందించారు. హైదరాబాద్‌లో స్థలం కేటాయించారు. అయితే తర్వాత నేను ఏథెన్స్ ఒలింపిక్స్‌పై దృష్టి సారించడంతో స్థలం తీసుకోలేకపోయాను. తర్వాత ప్రయత్నించినప్పటికీ స్థలం లభించలేదు. అప్పట్లో ప్రభుత్వం కనీసం ఉద్యోగం కూడా ఆఫర్ చేయలేదు. సాక్షి :ఇప్పుడు ప్రభుత్వం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి నగదు బహుమతి, గ్రూప్–1 కేడర్ ఉద్యోగాలు ఇస్తోంది కదా.. మీ స్పందన..? మల్లేశ్వరి : క్రీడలను ప్రోత్సహించేందుకు నగదు బహుమతి, స్థలం, ఉద్యోగం ఇవ్వడం సంతోషకరమే. అయితే ఈ ప్రోత్సాహం అన్ని క్రీడల్లో రాణించే వారికి కూడా ఇవ్వడంతో పాటు అన్ని క్రీడలను సమానంగా చూస్తే బాగుంటుంది. సాక్షి :ఆంధ్రా ఆడపడుచుగా తెలుగు రాష్ట్రాల్లో అకాడమీ ఏర్పాటు చేసి వెయిట్‌లిఫ్టింగ్‌ను అభివృద్ధి చేసే ఆలోచన ఉందా..? మల్లేశ్వరి : రాయలసీమలో పుట్టి.. ఉత్తరాంధ్రలో పెరిగిన నాకు ఇక్కడి క్రీడాకారులకు ఎంతో చేయాలని ఉంది. ప్రభుత్వం తగినంత స్థలం కేటా యించి, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే అకాడమీని ఏర్పాటు చేసి సేవలందిస్తా. సాక్షి :రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు కదా.. అక్కడ ఏమైనా అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా..? మల్లేశ్వరి : తొలి పతకం సాధించిన మహిళా వెయిట్ లిఫ్టర్‌ను నేను. అయితే ప్రభుత్వాలు ఈ విషయంలో మమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి మా సహకారం కోరితే తప్పకుండా అందిస్తాం. 20 సంవత్సరాల అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సాక్షి : భవిష్యత్తులో భారత్ నుంచి ఒలింపిక్ మెడల్స్ మరిన్ని ఆశించవచ్చా..? మల్లేశ్వరి : 130 కోట్లు ఉన్న భారతదేశంలో మనకు లభిస్తున్న పతకాల సంఖ్య తక్కువే. దీర్ఘకాలిక వ్యూహంతో పాటు చక్కటి ప్రోత్సాహం ఇస్తే అసాధ్యమేమీ కాదు. రానున్న కాలంలో మంచి ఫలితాలు, పతకాలు వస్తాయనుకుంటున్నా. సాక్షి : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు ప్రభుత్వాలు ఇటీవల తీసుకున్న చర్యలు ఎటువంటి ఫలితాలు ఇస్తుందనుకుంటున్నారు..? మల్లేశ్వరి :కేంద్ర క్రీడల మంత్రి ఒలింపిక్ మెడలిస్టు కావడం సంతోషం. ఇటీవల ఖేలోఇండియాతో పాటు పలు టాలెంట్‌హంట్ స్కీంలు చక్కగానే ఉన్నాయి. ఇందులో సైతం క్రీడల్లో రాణించిన వారినే సభ్యులుగా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నా. సాక్షి : క్రీడలు ముఖ్యమా.. చదువు ముఖ్యమా.. అన్న డైలమా చాలా మందిలో ఉంది.. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటారు..? మల్లేశ్వరి :ఖచ్చితంగా చదువుకు ప్రాధాన్యత ఉంది. 8 నుంచి 25 సంవత్సరాల దాకా చదువుకు, క్రీడల సాధనకు ఎంతో విలువైన సమయం. వారి శారీరక, మానసిక స్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. క్రీడలతో పాటు చదువుకు కూడా ప్రాధాన్యత ఇస్తే కెరీర్ పరంగా ఉపయోగపడుతుంది. సాక్షి : క్రీడల అభివృద్ధికి మీరిచ్చే సూచన..? మల్లేశ్వరి :ప్రభుత్వం క్రీడలను అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన, పతకాలు సాధించిన వారి సలహాలు తీసుకుంటే బాగుంటుంది. రాజధానిలో నిర్మిస్తున్న క్రీడానగరంలో ఏర్పాటు చేసే అంశాలపై కూడా చర్చిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. సాక్షి :మీ పిల్లలు మీ వారసులుగా క్రీడల్లోకి తీసుకువస్తున్నారా..? మల్లేశ్వరి : మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు (10వ తరగతి) రైఫిల్షూటింగ్లోను, చిన్నబాబు (6వ తరగతి) ఫిట్నెస్ సాధించేందుకు జిమ్నాస్టిక్స్ సాధన చేస్తున్నారు. వారికి ఇష్టమైన రంగంలో రాణించేలా స్వేచ్చనిచ్చాం. సాక్షి : క్రీడాకారులకు మీరిచ్చే సందేశం..? మల్లేశ్వరి : మనదేశంలో యువశక్తి చాలా ఉంది. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దానిని సాధించేందుకు కష్టపడాలి. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, ఏకాగ్రతో సాధన చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు తాము అబలం.. కాదు.. ఆదిశక్తి అంశమన్న విషయం గుర్తుంచుకోవాలి. దేశానికి పతకం తీసుకువచ్చిన వారిలో అమ్మాయిలే అగ్రస్థానంలో ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. సాక్షి :మీ అకాడమీ నుంచి ఒలింపిక్స్‌లో పతకాలు ఆశించవచ్చా..? మల్లేశ్వరి :హర్యానాలో నిర్వహిస్తున్న అకాడమీ నుంచి రానున్న కాలంలో మంచి ఫలితాలు వస్తాయనుకుంటున్నా. రానున్న 2024, 2028 ఒలంపిక్స్‌లో పతకాలే ధ్యేయంగా శిక్షణ ఇస్తున్నాం. సాక్షి :కడపతో మీకున్న అనుబంధం..? మల్లేశ్వరి :కడప జిల్లా నందలూరు మండలం ఎర్రిపాపయపల్లె మా అమ్మగారి ఊరు. కాబట్టి కడప జిల్లాను నా జన్మభూమిగా భావిస్తా. నాన్నది చిత్తూరు జిల్లా. శ్రీకాకుళం నేను పెరిగిన ప్రాంతం కాబట్టి అది నా కర్మభూమిగా భావిస్తా. సాక్షి : మళ్లీ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ మెడల్ మనదేశం నుంచి ఆశించవచ్చా..? మల్లేశ్వరి :వాస్తవానికి లైట్ వెయిట్ కేటగిరీలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో ఒలింపిక్ పతకం సాధించడం కాస్త కష్టపడితే సాధ్యమే. ఖచ్చితంగా పతకం వచ్చే విభాగంలో వెయిట్‌లిఫ్టింగ్ ఒకటి. -
ఒకరికొకరు...
తల్లికి 102 ఏళ్లు... కూతురికి 72 ఏళ్లు. తల్లీకూతుళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు నిర్వచనం వీరు. ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్లోని చిన్ని గుడిసెలో నివసిస్తున్న వీరు... ఒకరికొకరు తోడుగా జీవనం సాగిస్తున్నారు. కూతురు జీహెచ్ఎంసీలో ఒప్పంద కార్మికురాలిగా పనిచేస్తుండగా... కూతురికి ఇంట్లో సాయపడుతోంది తల్లి. వృద్ధాప్యంలోనూ ఎలాంటి వ్యాధులూ వీరి దరిచేరలేదు. ఇప్పటికీ పనులు చేసుకుంటూ... ఒకరికి ఒకరై ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారీ తల్లీకూతుళ్లు. వారే లక్ష్మమ్మ, మంగవేణి. బంజారాహిల్స్: లక్ష్మమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు. ఈమెకుఐదుగురు కొడుకులు, ఒక కూతురు(మంగవేణి). వీరిలో ఇద్దరు కొడుకులు మరణించగా, మిగతా ముగ్గురు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఒంటరి అయిన లక్ష్మమ్మ కూతురు చెంత చేరింది. తల్లిని బరువుగా భావించక.. బాధ్యతగా చూసుకుంటోంది మంగవేణి. తల్లికి తోడుగా తనయ... ‘కంటే కూతుర్నే కనాలి...’ అనే దానికి అసలైన నిర్వచనంగా నిలుస్తోంది మంగవేణి. వందేళ్ల వయసు పైబడిన తల్లికి అన్నీ తానైంది. తల్లిని కొడుకులు కాదంటే తానే కొడుకైంది. బతుకుదెరువు నిమిత్తం 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఫిలింనగర్‌లోని మురికివాడల్లో గుడిసె వేసుకున్న మంగవేణి... తల్లికి సొంతూరిలో ఇల్లు కట్టించి కొన్ని రోజులు ఉంచింది. అయితే తల్లికి వృద్ధాప్యం రావడం, తరచూ వెళ్లిరావడం ఇబ్బందవుతుండడంతో తన దగ్గరికే తీసుకొచ్చి సాకుతోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేసింది... మంగవేణికి కూడా ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్త 25ఏళ్ల క్రితమే చనిపోగా, పిల్లల్ని పెంచి పెద్దచేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసింది. ఇప్పుడు తల్లి కోసం కొడుకును కాదని, లక్ష్మమ్మ దగ్గరే ఉంటోంది. భర్త చనిపోవడంతో కుటుంబ భారం మంగవేణి మీద పడింది. 20 ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పని దొరికింది. అప్పటి నుంచి ఆ పని చేస్తూనే జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఇప్పటికీ పనిచేస్తూ నెలవారీ ఖర్చులు చూసుకుంటోంది. లక్ష్మమ్మను చూస్తే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. 102ఏళ్ల వయసులోనూ తన పనులు తానే చేసుకుంటుంది. ఇంటి పనుల్లో కూతురికి సాయం చేస్తుంది. ఇప్పటికీ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని చెప్పే లక్ష్మమ్మ... నవ్వుతూ.. నవ్విస్తూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటే ఎన్నేళ్లయినా బతికేయొచ్చు అంటోంది. టీవీ తెలీదు... కూతురు మంగవేణి స్వీపర్‌గా పనిచేస్తూ పోషిస్తుండగా... ఇంటి పనులు చూసుకుంటూ ఆమె కంటే చురుగ్గా ఉంటోంది లక్ష్మమ్మ. సమయానికి భోజనం.. అదీ మితంగా, ప్రతిరోజు పావుగంట నడక... వీటితోనే తాను ఆరోగ్యంగా ఉన్నానని చెబుతోందీ బామ్మ. ‘షుగర్, బీపీ, దంత, నేత్ర సమస్యలేవీ నాకు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైంది. రాత్రి 8గంటలకు నిద్రపోయి... తెల్లవారుజామున 4గంటలకు లేవడం అలవాటు. మధ్యాహ్నం కూడా కొంతసేపు కునుకు తీస్తాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. ఇప్పటికీ టీవీ అంటే తెలియద’ని చెప్పింది. అదే ఆరోగ్య రహస్యం.. దేవుడి భక్తి ఎక్కువున్న లక్ష్మమ్మకు భజనలు చేయడమంటే ఇష్టం. ఉదయం సూర్యనమస్కారాలు చేస్తుంది. ‘సంపాదనపై అనాసక్తి, ఇతరులపై ఈర‡్ష్య, ద్వేషాలు లేకపోవడం.. అలాంటి ఆలోచనలు కూడా నాదరి చేరకపోవడం.. జీవితంపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడమే నా ఆరోగ్య రహస్యమ’ని చెప్పిందీ బామ్మ. ఇప్పటివరకు జ్వరమంటే తెలీదు. ఒక్కసారీ ఇంజక్షన్ వేయించుకోలేదు. ఏదైనా దెబ్బ తగిలితే, తలనొప్పి వస్తే ఆకు రసం పిండుకొని నెత్తికి రాసుకోవడమే తనకు తెలిసిన వైద్యమని చెప్పింది. తాటిబెల్లం.. జొన్నరొట్టె ‘నేను చాలా రోజులు వ్యవసాయం చేశాను. చిన్నప్పుడు తాటిబెల్లం బాగా తినేదాన్ని. ఈ వయసులోనూ చికెన్, మటన్ తింటాను. కట్టెల పొయ్యిపై జొన్నెరొట్టెలు చేసుకొని తింటాను. అంబలి తాగుతాను. నాకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం. వయసులో ఉన్నప్పుడు సినిమాలు చూసేదాన్ని. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి సినిమాలంటే ఇష్టం. ఇప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తుంటాన’ని చెప్పిందీ బామ్మ. ఆనందం.. ఆరోగ్యం ఈ తల్లీకూతుళ్లకు వృద్ధాప్యం మీద పడినా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కేవలం శారీరక నొప్పులు తప్పితే తనకేమీ తెలియవని చెప్పుకొచ్చింది మంగవే ణి. చేతకాని తనంలో ఇంటి పట్టున ఉండొచ్చు కదా..? అంటే ‘నాకు ఇంకా సత్తువ ఉంది. ఇంట్లో కూర్చుంటే నాకు, నా తల్లికి బువ్వెట్ల వస్తుంద’ని చెప్పింది. మొత్తానికి వందేళ్లు పైబడిన తల్లికి 70ఏళ్లు పైబడిన బిడ్డ చేస్తున్న సేవ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వయసులోనూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి తల్లికింత వండిపెట్టి, చీపురు పట్టుకొని విధులకు హాజరవుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో రోడ్లు ఊడ్చే మంగవేణి.. ఆరోగ్యం బాగోలేదంటూ సెలవు పెట్టింది లేదని అధికారులు పేర్కొన్నారు. ఇంటికివెళ్లగానే తల్లికి స్నానం చేయించి, తినిపిస్తుంది. సాయంత్రానికి తల్లితో ముచ్చట్లు, రాత్రికి మళ్లీ వంట.. ఇదీ మంగవేణి దినచర్య. -
పేదల వైద్యానికి భరోసా
బద్వేలు: మానవ సేవ.. దేవుని సేవ... అని భావించింది వైద్యురాలు సిస్టర్ లిల్లీపుష్ప. తన కుటుంబంలోని అత్తమ్మ, పెద్దనాన్నలు బాటలో నడుస్తూ పేదలకు వైద్యసేవలందిస్తోంది. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచితంగా వైద్యం అందజేస్తూ వారికి అండగా నిలబడుతున్నారు. ఆమె సేవలకు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది క్రిస్మస్ సందర్భంగా విశిష్ట సేవా పురస్కారాన్ని ప్రకటించగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. తన సేవాభావంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సిస్టర్ లిల్లీపుష్ప స్వగ్రామం గుంటూరు జిల్లాలోని నడికుడి. ఆమె తల్లిదండ్రులు మర్రెడ్డి, రెజినా. ఆమె కుటుంబంలోని చాలా మంది క్రైస్త త మతాన్ని ఆచరిస్తూ ప్రజలకు సేవ చేసేవారు. అలానే తన అత్తమ్మ, పెద్దనాన్నలు కూడా పేదలకు సేవ చేసేవారు. వారిని ఆదర్శంగా తీసుకుని తాను కూడా క్రైస్తవ మతానికి అంకితమై సిస్టరుగా మారారు. ఈ దిశగానే పేదలకు విస్తృతంగా సేవలందించాలంటే డాక్టరు కావడమే మార్గమని భావించారు. ఈ కోరికతోనే చదువులో ముందుండేవారు. బెంగళూరులోని సెయింట్ జాన్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. అదే కళాశాలలో ఎంఎస్ జనరల్ సర్జన్ కూడా చదివారు. అనంతరం నెల్లూరు సెయింట్ జోసెఫ్స్ ఆసుపత్రిలో 11 ఏళ్లు పని చేశారు. అక్కడ పని చేస్తూనే తన సిబ్బందితో కలిసి గ్రామాలలో వైద్య శిబిరాలు ఉచితంగా నిర్వహించేవారు. పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పరీక్షలతో పా టు అవగాహన సదస్సులు కూడా చేపట్టేవారు. అనంతరం 2005లో పోరుమామిళ్లలోని ఓఎల్ఎఫ్ ఆసుపత్రిలో వైద్యురాలుగా పని చేస్తున్నారు. వైద్య శిబిరాలు: ఓఎల్ఎఫ్ ఆసుపత్రిలో పని చేస్తూనే వారంలో రెండు రోజులు గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోరుమామిళ్ల పట్టణ చుట్టుపక్కల వందలాది గ్రామాలలో పేదలు ఉన్నారు. వీరందరికి సరైన వైద్యసేవలు అందడం లేదని సిస్టర్ లిల్లీపుష్ప భావించారు. వీరికి అండగా నిలవాలని భావించారు. ఈ నేపథ్యంలో గ్రామాలలోకి వైద్య పరికరాలు సైతం తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిన్న పాటి జబ్బులకు అక్కడే వైద్యం చేసి మందులు అందజేస్తున్నారు. బి.మఠం మండలంతో పాటు నెల్లూరు జిల్లాలోని సీతారామాపురం మండలంలోని పల్లెలు, ప్రకాశం జిల్లాలోని మోటు వరకు ఉన్న గ్రామాలలో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వందలాది శిబిరాలతో పాటు వేలాదిమందికి ఉచితంగా వైద్యం అందించారు. ఈమె సేవలకు మెచ్చి పలు అవార్డులు వచ్చాయి. గతేడాది డిసెంబరులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ విశిష్ఠ సేవా పురస్కారం అందుకున్నారు. పేదల సేవకే అంకితం పేదలకు అండగా నిలిచేందుకే సిస్టర్‌గా మారా. ఇప్పటి వరకు గ్రామాలలో విస్తృత వైద్య సేవలందించా. పోరుమామిళ్లలోని పలు గ్రామాలలో పేదలు సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ అండగా నిలిచేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నా. – డాక్టరు సిస్టర్ లిల్లీపుష్ప -
దటీజ్ మహాలక్ష్మీ..
మహిళలను వివిధ విపత్కర పరిస్థితులనుంచి కాపాడేందుకు పోలీసు విభాగంలో తొలిసారిగా మహిళా బ్లూకోల్ట్స్‌ను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఏర్పాటు చేశారు. అలా మహిళా బ్లూకోల్ట్స్‌గా నియమితులైన కట్టా మహాలక్ష్మి విధినిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తూ పలువురి ప్రశంసలందుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పలువురు మహిళలను ఆమె కాపాడారు. ఈవ్ టీజింగ్ తదితర సమస్యల నుంచి మహిళలను కాపాడుతూదటీజ్ మహాలక్ష్మి అనినిరూపించుకుంటున్నారు. రాజమహేంద్రవరం క్రైం : రాష్ట్రంలోనే తొలి మహిళా బ్లూకోల్ట్స్‌గా నియమితులైన కట్టా మహా లక్ష్మి తన సేవలతో అందరి ప్రశంసలందుకుంటున్నారు. కాకినాడకు చెందిన మహాలక్ష్మి బీఏ బీఈడీ చేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మహాలక్ష్మి తల్లి ఆశయాల మేరకు పోలీసుశాఖలో ప్రవేశించారు. 2014 బ్యాచ్‌కు చెందిన మహాలక్ష్మి ఒంగోలులో శిక్షణ పొందారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో మహిళా పోలీసుగా నియమితులయ్యారు. రాజమహేంద్రవరం త్రీటౌన్‌లో విధులు నిర్వహిస్తున్న మహాలక్ష్మిని అర్బన్ ఎస్పీ రాజకుమారి రాష్ట్రంలోనే మొట్ట మొదటి మహిళా బ్లూ కోల్ట్స్గా నియమించారు. ఆమె అంకితభావంతో విధులను నిర్వహిస్తూ పలువురి ప్రశంసలందుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న పలువురు మహిళలను కాపాడారు. కోరుకొండ మండలం, కణుపురు గ్రామానికి చెందిన శానాపతి వెంకట లక్ష్మి భర్త వేధింపులు తాళలేక ఈ ఏడాది జనవరి 1న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ఆత్మహత్యా యత్నం చేసుకుంటుండగా పసిగట్టిన మహిళా బ్లూకోల్ట్స్ మహాలక్ష్మి ఆమెను రక్షించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించి ఆమెను బంధువులకు అప్పగించారు. అలాగే యానాంకు చెందిన నల్లా దుర్గా దేవిని కూడా కాపాడారు. ఆమె భర్త వికలాంగుడు. ఆమెను ఇరుగుపొరుగు వారు సూటిపోటి మాటలతో వేధించేవారు. దాంతో మనస్తాపానికి గురైన దుర్గాదేవి రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ వద్దకు వచ్చి జనవరి నెలలో ఆత్మహత్యా యత్నం చేసుకోబోయింది. ఆమెను కూడా మహిళా బ్లూకోల్ట్స్ రక్షించి పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆమెను సోదరుడికి అప్పగించారు. ఈవ్‌టీజింగ్ తదితరాల బారిన పడకుండా బాధితుల వద్దకు వెళ్లి వివరాలను సేకరించి మహిళలను ఆదుకోవడంలో ముందుంటూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు మహాలక్ష్మి. -
అనతికాలంలోనే అవార్డులు
పాఠశాలలో విద్యార్థులకు ఆట, పాటలతోపాఠ్యాంశాలను బోధించడంలో ఆమె దిట్ట. చిన్న వయసులోనే ఉద్యోగాన్ని సొంతం చేసుకుని అనతి కాలంలోనే పలు అవార్డులతో పాటు అందరి ప్రసంశలను అందుకుంటోంది టీచర్ శ్రీశైల. వ్రిడవలూరు: సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉంది. అలాంటి వృత్తికి వన్నే తెచ్చిన ఉపాధ్యాయురాలు భూమన శ్రీశైల. నెల్లూరుకు చెందిన భూమన వెంకటసుబ్బయ్య, రాధిక దంపతుల రెండో సంతానం శ్రీశైల. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో తాను కూడా టీచర్‌ను కావాలని చిన్నతనం నుంచే కల కనేది. తన 19వ ఏటాలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమె మండలంలోని దండిగుంట దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా చేసింది. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు తాను ఈ వృత్తిని ఎంచుకున్నట్లు చెప్పింది. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా.. శ్రీశైల పనిలో ఎక్కడా రాజీపడకుండా విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు కృషిచేస్తోంది. ఆట, పాటలతో కూడిన విద్యను అందించడం ఆమె ప్రత్యేకత. అంతే కాకుండా ప్రతి పండగ ప్రాముఖ్యత, ప్రముఖుల జన్మదినాల నాడు వారి జీవిత చరిత్రను వివరిస్తూ విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంచుతోంది. తన సొంత నిధులతో పాఠశాలలో టీవీని ఏర్పాటుచేసింది. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు చెందిన పాఠ్యాంశాలను విద్యార్థులకు ఎలా బోధించాలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది. అంతే కాకుండా ప్రస్తుతం అమలవుతున్న ఆనందలహరి కార్యక్రమానికి జిల్లా మాస్టర్ కోచ్‌గా శ్రీశైల ఎన్నికైంది. ఆమె ప్రతిభను గుర్తించి 2017 మహిళా సా ధికారత అవార్డు, సమత అకాడమీ వా రు 2018లో ఉత్తమ టీచర్ అవార్డులు అందజేశారు. త్వరలో మహిళారత్న అవార్డును అందుకోకున్నారు. కలెక్టర్ ముత్యాలరాజు, పాఠశాల విద్య ఆర్జేడీ శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నుంచి పలుమార్లు ప్రశంసాపత్రాలను స్వీకరించింది. తల్లి స్ఫూర్తితో ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి మా అమ్మ రాధిక ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆమెకు అంగన్వాడీ సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చినప్పటికి మా బాగోగులు చూసుకునేందుకు ఉద్యోగం వదలి గృహిణిగా మారింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈ వృత్తిలో చేరాను. భవిఫ్యత్‌లో ప్రొఫెసర్ కావాలని పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించాను. – భూమన శ్రీశైల -
ఆడపిల్లకు ఆటలు ఎందుకు? అన్నారు..
బాక్సింగ్, కరాటే, కుంగ్ఫు, తైక్వాండో లాంటి క్రీడలు పురుషులకే సొంతం అనుకుంటే పొరపాటే. వీటిలోనూ మగవారికి సమానంగా మహిళలు రాణిస్తున్నారు..తమ ప్రతిభను చూపుతున్నారు. రామంతాపూర్‌కు చెందిన కవిత(23) తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ఐదో డాన్ సాధించి... ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి మహిళగా రికార్డులకు ఎక్కింది. రామంతాపూర్: కవితకు తైక్వాండో అంటే ఆసక్తి. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే ఈ క్రీడను నేర్చుకోవాలని అనుకుంది. శిక్షణకు వెళ్తానంటే.. ‘ఆడపిల్లకు ఆటలు ఎందుకు?’ అని వారించారు. అయినా వినకుండా, వారిని ఎదిరించి గురువు జయంత్, సంపూర్ణ లింగంల దగ్గర శిక్షణలో చేరింది. పదో ఏటనే బ్లాక్‌బెల్ట్ సాధించింది. ఈ క్రీడలో జాతీయ స్థాయిలో ఐదో డాన్ సాధించిన పురుషులే చాలా తక్కువ మంది ఉంటారు. దేశంలోనే ఈ ఘనత సాధించిన ప్రథమ మహిళగా కవిత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళలే ఈ బెల్ట్ సాధించగా... అందులో కవిత ఒక్కరు కావడం విశేషం. 2004లో కొరియాలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలో పాల్గొని మూడో డాన్ విజేతగా నిలిచింది. 2008లో అమెరికాలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలో భారత్ తరఫున పాల్గొని పలు పతకాలు సాధించింది. భారత్‌లో జరిగిన వరల్డ్ తైక్వాండో పోటీలో ఐదో డాన్ విజేతగా నిలిచింది. దేశవిదేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని వందకు పైగా పతకాలు, 30కి పైగా ట్రోఫీలు గెలుచుకుంది. ఐదుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ప్రస్తుతం కవిత రామంతాపూర్‌లో తైక్వాండో అకాడమీని ప్రారంభించి శిక్షణనిస్తున్నారు. ఒలింపిక్స్లోపతకమేధ్యేయం.. 1994 ఒలింపిక్స్‌లో తైక్వాండో క్రీడ చూసి స్ఫూర్తి పొందాను. నేనూ తైక్వాండో నేర్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. పట్టుదలతో ఈ విద్యనభ్యసించాను. ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించడమే లక్ష్యంగా నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నాను. -
పోరాటమే జీవితం
సాక్షి, కామారెడ్డి: బీడీలు చుట్టిన చేతులు పిడికిలి బిగించాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై పోరాటమే ఆమె జీవితంలో భాగమైంది. పోలీసు కేసులు, అరెస్టులకు వెరవకుండా తన జీవితాన్ని మహిళా, కార్మిక పోరాటాలకే అంకితం చేసింది. పాతికేళ్లుగా ఆమె కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతోంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన అనసూయ 1991లో శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్‌లో చేరింది. అప్పటి నుంచి నేటిదాకా ఉద్యమాలకే అంకితమైంది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఆమె ఎన్నో పోరాటాలకు నాయకత్వం వహించింది. చింతకుంటలో మహిళలపై అత్యాచారం, శివాయిపల్లిలో మహిళపై సామూహిక అత్యాచారం తదితర సంఘటనలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో అనసూయ చురుకుగా పాల్గొంది. అంతేగాక బీడీ కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తూ వస్తోంది. కార్మిక, మహిళా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న అనసూయ జనశక్తి నక్సల్ నేత లక్ష్మీరాజం ఉరఫ్ గొడ్డలి రామన్నను వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కూతురు వెన్నెల. అనసూయ భర్త రామన్న 2000 సంవత్సరంలో మర్రిపల్లి ఎన్కౌంటర్లో చనిపోయాడు. భర్త మరణంతో తోడును కోల్పోయిన అనసూయ కూతురి బాధ్యతను మోస్తూనే తాను ఎంచుకున్న మహిళా, బీడీ కార్మిక ఉద్యమాలను వదిలిపెట్టకుండా ఉద్యమాలకు అంకితమైంది. ప్రస్తుతం అనసూయ కూతురు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుతోంది. కాగా మహిళా, కార్మిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న అనసూయపై అప్పట్లో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఓ సారి వరంగల్ జైలులో పది రోజులు, నిజామాబాద్ జైల్లో పన్నెండు రోజులు ఉండాల్సి వచ్చింది.\ అలుపెరుగని పోరు.. మహిళలు, బీడీ కార్మికుల సమస్యలపై అనసూయ అలుపెరుగని పోరాటం చేస్తోంది. పాట, మాటతో మహిళల్ని చైతన్యం చేస్తున్న అనసూయ అలుపెరుగకుండా ఉద్యమాల్లో పాల్గొంటోంది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా మహిళల్ని పోగుచేసి ఉద్యమాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ఐక్యవేదిక ద్వారా రాష్ట్ర సాధనోద్యమంలోనూ అనసూయ చురుకుగా పాల్గొంది. అలాగే గోదావరి జలాల సాధన కోసం జరిగిన పాదయాత్రలు, ఆందోళన కార్యకమ్రాల్లో ఆమె పాల్గొన్నారు. అరుణోదయ విమలక్కతో కలిసి బహుజన బతుకమ్మ వేడుకల్లోనూ పాల్గొని తన వాణిని వినిపించేది. కాగా మహిళలపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాలపై జరిగిన పోరాటాల ఫలితంగా అరెస్టులు, శిక్షలు పడ్డాయి. బతికున్నన్ని రోజులూ ప్రజలతోనే.. బతికున్నన్ని రోజులు మహిళలు, కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తా. ప్రజలతోనే నా జీవితం కొనసాగుతోంది. మహిళలపై ఇప్పటికీ ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాటిని ఎదిరించేందుకు మహిళల్ని చైతన్యం చేస్తూనే ఉంటా. పోరాడితే పోయేదేమి లేదు. సమస్య ఎదురైనపుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా మహిళలకు ఇంటా, బయట అనేకరకాలుగా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు సంఘటితం కావాలి. –అనసూయ, మహిళా నాయకురాలు కామారెడ్డిలో బీడీ కార్మికుల సమస్యలపై నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న అనసూయ(ఫైల్) -
నాన్నకు తోడుగా..
కలిగిరి: మండలంలోని కృష్ణారెడ్డిపాలెం గ్రామానికి చెందిన రావుల దశరథరామిరెడ్డి, పద్మలకు ముగ్గురు కుమార్తెలు. మొదటి కుమార్తె సావిత్రి వివాహం చేసుకుని చెన్నైలో ఉంది. రెండో కుమార్తె సునీత వివాహం చేసుకుని నెల్లూరులో ఉంటున్నారు. చివరి కుమార్తె మాధురి మాత్రం 10వ తరగతితో చదువుకు స్వస్తి పలికింది. అప్పటినుంచి తండ్రికి తోడుగా వ్యవసాయ పనుల్లో సహకారం అందిస్తోంది. కుమార్తె మాధురి సహకారంతో దశరథరామిరెడ్డి సుమారు 10 ఎకరాల మాగాణి పొలంలో సంవత్సరానికి రెండుసార్లు వరి పంటను సాగుచేస్తున్నాడు. వరినారు పోసినప్పటి నుంచి గింజలు ఇంటి వచ్చే వరకు తండ్రితో రోజు మాధురి పొలానికి వెళుతుంది. గ్రామంలో మగవాళ్లకు ధీటుగా వ్యవసాయ పనులు చేస్తుంది. పొలం నుంచి ఇంటికి వచ్చినప్పటికి తర్వాత పశువుల పనిలో బిజీగా ఉంటుంది. సేంద్రియ పద్ధతుల్లో పెరటి సాగు ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో మాధురి సేంద్రియ పద్ధతుల్లో ఆరటి, కూరగాయలు, పండ్ల మొక్కలు సాగుచేస్తోంది. మొక్కలకు పశువుల ఎరువులను మాత్రమే వాడుతుంది. ఇంటి చుట్టు పెంచుతున్న అరటి చెట్లు ప్రత్యేక ఆకర్షణ. కొడుకు ఉన్నా మాధురిలా పనుల్లో సహాకారం అందించేవాడు కాదేమే అని తండ్రి గర్వంగా అందరి వద్ద చెప్పుకుంటుంటాడు. నాన్నకు సహకరించడంతో తృప్తి ముగ్గురు కుమార్తెలను మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచారు. మాకు ఏ లోటు లేకుండా చూస్తున్న తండ్రికి వ్యవసాయ పనుల్లో పూర్తి సహకారం అందించడం సంతృప్తిగా ఉంది. అవకాశం ఉన్న వాళ్లు సేంద్రియ పద్ధతుల్లో ఇళ్ల వద్ద కూరగాయాలు, పండ్ల మొక్కలు సాగు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.– మాధురి -
బైక్ నడుపుతుంటేవింతగా చూసేవారు
కష్టసుఖాల్లో తోడుగా ఉండాల్సిన భర్త.. కుటుంబ పోషణను భారంగా తలచి పిరికి వాడిలా పారిపోయాడు.. ఆమె ఆశలపై దాయాదులూ నీళ్లు చల్లారు. అయినా జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంది. తండ్రి కష్టాన్ని పంచుకుని కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకుంది. ఐదుగురు చెల్లెళ్లను, తమ్ముడిని చదివించడమే కాదు... నలుగురు చెల్లెళ్లకు పెళ్లి చేసి అత్తింటికి సాగనంపింది. వ్యవసాయంపై మక్కువ పెంచుకుని సాగులో రాణిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అనిత విజయగాథ నేటి ‘నేను శక్తి’లో మీ కోసం.. అందరిలాగే ఆమెలో కూడా ఎన్నో ఆశలు. బాగా చదువుకోవాలని, ఉన్నతస్థాయి కొలువులు చేపట్టాలని భావించింది. అయితే అయిన వాళ్లే కాదన్నారు. అండగా నిలుస్తారనుకున్న బంధువులు ఛీదరించుకుని దూరమై పోయారు. వ్యవసాయం తప్ప అన్యమెరుగని తండ్రికి ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడం తలకు మించిన భారమే అయింది. ఇలాంటి తరుణంలో ఆ ఇంటి బరువు బాధ్యతలను ఆమె భుజాలకెత్తుకుంది. ‘నాన్నా.. నువ్వు భయపడొద్దు! నీకు తోడుగా నేనుంటాను’ అంటూ పలుగుపార చేతపట్టి పొలం పనుల్లోకి దిగింది. పంట సాగులోని మెలకువలను అవపోశన పట్టింది. తిరుగులేని మహిళా రైతుగా అతి చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకుని ‘నేను శక్తి’ అని నిరూపించుకున్న అనిత విజయగాథ మీ కోసం.. అనంతపురం , గుమ్మఘట్ట :మాదీ పెద్ద కుటుంబమే మాది గుమ్మఘట్ట మండలంలోని మారెంపల్లి గ్రామం. మా తల్లిదండ్రులు కురుబ మహదేవమ్మ, హనుమంతప్ప.మా నాన్న వాళ్లు ఐదుగురు అన్నతమ్ముళ్లు. మా నాన్నకు మేము మేము ఆరుగురం ఆడపిల్లలం. మాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. మేమంతా కలిసిమెలిసి ఉండేవాళ్లం. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా మారెంపల్లిలోనే కొనసాగింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆవులదట్లలో చదువుకున్నాను. రోజూ మా ఊరి నుంచి మిగిలిన అమ్మాయిలతో కలిసి సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లి వచ్చేదాన్ని. బైక్ నడుపుతుంటేవింతగా చూసేవారు పొలానికి అవసరమైన మందులు, ఇతర పనులకు గ్రామంలోకి వెళ్లి రావాలంటే రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది. ఆ సమయంలోనే మా నాన్న వద్ద ఉన్న బైక్‌ను నడపడం నేర్చుకోవాలని అనుకున్నాను. ఖాళీ సమయంలో దాన్ని నడిపేందుకు ప్రయత్నించి కిందపడి గాయపడేదాన్ని. అయినా అవసరం అన్నీ నేర్పించింది. కొన్ని రోజుల తర్వాత బైక్‌ను సులువగా నడపసాగాను. మా ఊళ్లో ఆడపిల్లలు బైక్ నడిపేవారు కాదు. నేను బైక్ తోలుతుంటే అందరూ ఆశ్చర్యంగా చేసేవారు. దీనిపై చాలా కామెంట్లు కూడా వచ్చాయి. అవి నన్ను కాస్త బాధపెట్టినా.. తర్వాత మెల్లిగా అలవాటైపోయింది. ఇప్పుడు మా అమ్మనాన్ననే కాదు. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారిని దిగబెట్టి వచ్చేంందుకు బైక్‌పైనే తీసుకెళుతుంటాను. ఉండేందుకు ఇల్లు కూడా లేదు ఉమ్మడి కుటుంబంగా ఉంటూ వచ్చిన మేము విడిపోయిన తర్వాత ఒంటరితనం భయపెడుతూ వచ్చింది. ఆ సమయంలో మేము ఉండేందుకు ఇల్లు కూడా లేకుండా పోయింది. భాగ పరిష్కారం కింద మా నాన్నకు వచ్చిన తొమ్మిది ఎకరాల పొలంలో రెండు చిన్న గదులు ఉన్న ఇల్లు ఉండేది. దాంట్లోకి మా నాన్న మకాం మార్చాడు. నిర్జన ప్రదేశంలో ఎప్పడు ఏం జరుగుతుందోననే భయం. ఆయన కష్టం చూస్తున్నప్పుడు లోలోన కుమిలిపోయేదాన్ని. ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారనే ఒకేఒక్క కారణంతోనే కదా మా తల్లిదండ్రులకు ఈ కష్టాలు అని తలుచుకుని కన్నీరు పెట్టేవాళ్లం. ఆ సమయంలోనే మా చెల్లెళ్లు నాకు సపోర్ట్‌గా నిలిచారు. ‘అక్క నీవే ఏదైనా చేయగలవు. మేమింకా చిన్న పిల్లలం. మా వంతు సాయం మేమూ చేస్తాం. ఎలాగైనా ఈ కష్టాల నుంచి మనం బయటపడాలి’ అంటూ వారు అన్న మాటలు నేను ఇప్పటికీ మరిచిపోలేకున్నాను. రాత్రిళ్లు నాన్నకు తోడుగా.. కొన్ని నెలల తర్వాత ఓ అమ్మాయికి నేను జన్మనిచ్చాను. పేదరికం కారణంగా సరైన ఆహారం లేక చాలా నీరసించిపోయాను. ఆ సమయంలోనే నా ఆరోగ్యంతో పాటు పసిగుడ్డు బాగోగులు చూసుకునేందుకు మా తల్లిదండ్రులు మరింత శ్రమిస్తూ వచ్చారు. వారి కష్టాన్ని అతి దగ్గరగా చూసిన దాన్ని నేనే. దీంతో నేను కొంచెం కోలుకున్న తర్వాత నాన్నకు తోడుగా పంటకు నీరు పెట్టేందుకు రాత్రిళ్లు వెళ్లేదాన్ని. అమ్మానాన్న వద్దని వారించేవారు. అయినా నేను వినలేదు. ‘ఎలాగైనా ఈ కష్టాల నుంచి బయటపడాలి నాన్నా.. మనల్ని కాదని ఒంటరిగా వదిలేసి వెళ్లిన వారి ముందు సగర్వంగా మనం తలెత్తుకుని తిరగాలి’ అంటూ ధైర్యం చెబుతూ వచ్చాను. ఆడపిల్లలు ఉన్నారంటూ.. నేను పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత పెద్ద చదువులు అక్కరలేదని మా నాన్నపై ఆయన అన్నతమ్ముళ్లు ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఆడపిల్లకు వెంటనే పెళ్లి చేసి పంపిస్తే మేలని చెబుతూ వచ్చారు. అయినా మా నాన్న వారి మాటలను వినేవారు కాదు. మా నాన్న అన్నతమ్ముళ్లందరి భయం ఒక్కటే. మా నాన్నకు ఆరుగురు ఆడపిల్లలు. వారందరికీ చదువులు చెప్పించి, పెళ్లి చేసి ఇస్తే ఇక ఆస్తులు ఏమీ మిగలవని భావించేవారు. దీంతో ఏదో ఒక విషయంపై ఘర్షణ పడేవారు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయేందుకు అవకాశం కోసం ఎదురు చూసేవారు. భూమిని నమ్ముకుంటే బువ్వపెడుతుంది వ్యవసాయం దండుగని ఎవరన్నారో గాని వారు నిజంగా మూర్ఖులే. మనసుపెట్టి పంట సాగు చేస్తే కాసుల వర్షం కురుస్తుంది. భూమిని నమ్ముకుంటే బువ్వ దొరుకుతుంది. ఒక పంట పోయినా.. మరో పంట ఆదుకుంటుంది. ఆధారం కోల్పోయామనుకుని బాధపడుతూ కూర్చొంటే ఫలితం లేదు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించగలగాలి. వ్యవసాయం ద్వారానే ఇంత మందిని నాన్న బతికించాడు. అంగన్వాడీ కార్యకర్తగా.. మా ఊళ్లోని అంగన్వాడీ సెంటర్‌కు కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందని తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నాను. అన్నీ అర్హతలూ ఉండడంతో 2015లో ఉద్యోగం వచ్చింది. ఓ వైపు పొలం పనులు చూసుకుంటూనే అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. ప్రస్తుతం నాలుగు ఎకరాల్లో దానిమ్మ, ఆరు ఎకరాల్లో వేరుశనగ, ఐదు ఎకరాల్లో వర్షాధారంగా వేరుశనగ సాగు చేస్తున్నాం. పదేళ్ల క్రితం ఒంటరిని చేసి.. నాకు 20వ ఏటా మేనమామతో పెళ్లి చేశారు. పట్టుమని మూడు నెలలు కూడా కాపురం చేయలేదు. ఏవో కారణాలు చూపుతూ మా మామ (భర్త) మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. చాలా కాలం ఎదురు చూశాం. ఆయన రాలేదు. అప్పటికే నేను గర్భవతిని. ఈ విషయం మరింత నాతో పాటు అమ్మనాన్నను మరింత కుంగదీసింది. దీనినే అవకాశంగా తీసుకుని ఒక్కసారిగా మా దాయాదులు చెలరేగిపోయారు. ఆస్తుల భాగ పరిష్కారమంటూ తొమ్మిది ఎకరాలను మా నాన్న పరం చేసి, మమ్మల్ని ఒంటరివాళ్లను చేసి పదేళ్ల క్రితం వెళ్లిపోయారు. మొదట్లో ఇబ్బంది పడ్డా.. మా నాన్నకు ధైర్యం కలిగించేందుకు ఏవో నాలుగు మాటలైతే చెప్పాను. కానీ, నిజానికి పార చేత పట్టుకుని రాత్రిళ్లు పంట పొలంలో నీళ్లు పెట్టడమంటే చిన్న విషయమేమీ కాదు. పురుగు పుట్ర తిరుగుతుంటాయి. దీనికి తోడు చీకటి. బ్యాటరీ వెలుగులోనే పనులన్నీ చక్కబెట్టుకోవాల్సి వస్తోంది. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతు కష్టం మాటల్లో చెప్పలేను. ఆ కష్టాలన్నీ అనుభవించాను. అయితే ఇష్టపడి చేస్తుండడంతో వాటిని ఏనాడూ నేను కష్టంగా భావించలేదు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. తోబుట్టువులను కాపాడుకుంటూ వ్యవసాయ పనులపై నెమ్మదిగా నేను పట్టు సాధించాను. అనుకున్నట్లుగానే మా జీవితాల్లో మార్పులు రాసాగాయి. చెల్లెళ్లు కూడా వారికి చేతనైనా సాయం చేస్తూ వచ్చారు. నాల్గో చెల్లెలు నాతో సమానంగా పొలం పనుల్లో పాల్గొంటూ వచ్చింది. మిగిలిన వారిని చదువులపై దృష్టి మళ్లించేలా చేశాను. ఇక మా అందరిలోనూ చిన్నోడు మా తమ్ముడు. వాడు ఇక్కడే ఉంటే మా లాగే పొలం పనులు అంటూ వ్యవసాయంలో దిగుతాడని భావించి, దూరంగా హాస్టల్లో ఉంచి చదివిస్తూ వచ్చాను. ప్రస్తుతం వాడు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇంజినీరింగ్ చేస్తున్నాడు. చిన్న చెల్లెలు అనంతపురంలో ఉంటూ డిగ్రీ చేస్తోంది. ఇక మిగిలిన చెల్లెళ్లకు పెళ్లి చేసి ఇచ్చాను. ఇవన్నీ చేస్తూనే ఇల్లు కూడా కట్టుకున్నాం. దీంతో పాటు మరో ఆరు ఎకరాల పొలాన్ని కూడా కొనుగోలు చేశాం. -
లోయిటర్ గాళ్స్
వాళ్లు మున్సిపల్ పార్కు పచ్చిక బయిళ్లపై హాయిగా కబుర్లు చెప్పుకుంటారు. నవ్వుకుంటారు. చాయ్ తాగుతారు. సైకిళ్లు అద్దెకు తీసుకుని పొద్దున్నే నగరంలో లాంగ్ రైడ్‌కు పోతారు. ఇవన్నీ సరదా కోసం కాదు.. పబ్లిక్ స్పేస్‌పై స్త్రీలకూ సమాన హక్కులున్నాయనే విషయం చాటి చెప్పడానికి. వీళ్లనే ‘లోయిటర్ గాళ్స్’ అంటున్నారు. ‘లోయిటర్’ అంటే – పనితో నిమిత్తం లేకుండా విశ్రాంతపూర్వకంగా నడవటం, తారట్లాడటం అన్నమాట.‘వై లోయిటర్? విమెన్ అండ్ రిస్క్ ఆన్ ముంబయ్ స్ట్రీట్స్’ పుస్తకాన్ని చదివారు పై మహిళలు. ఆ పుస్తకం స్ఫూర్తితోనే నేహాసింగ్, దేవినా కపూర్ కలసి ముంబయిలో వై లోయిటర్ మూమెంట్‌కి శ్రీకారం చుట్టారు. జైపూర్, అలీఘర్, పుణే మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. పుణే గాళ్స్ స్వాగత్ బస్ స్టాండ్‌లో కబుర్లాడుకుంటారు. అలీఘర్ అమ్మాయిలు మెన్స్ కాలేజీలోని కాఫీ హౌస్‌లో కలుసుకుంటారు. పబ్లిక్ స్పేస్‌లో మరింత మంది స్త్రీలు కనబడటమనేది ఒక చక్కటి మార్పుకు దోహదపడుతుందని ‘లోయిటర్ గాళ్స్’ సహా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు చెబుతున్నారు. ‘గాళ్స్ అట్ దాబాస్’ మూమెంట్ కూడా ఇలాంటిదే. 2015లో కరాచీ యూనివర్సిటీకి చెందిన సారా నిసార్ సహా ముగ్గురు యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉద్యమానికి నాంది పలికారు. -
మహిళా శక్తిని మేల్కొలుపుతూ..
జనగామ అర్బన్: జనగామ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వృత్తిలో రాణిస్తునే సమాజాన్ని మేల్కొలిపేలా కవితలు రచిస్తూ తోటి మహిళకు స్ఫూర్తినిస్తున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన గుంటిపల్లి కళావతి చిన్నతనం నుంచే కష్టాలను అనుభవించింది. సమాజంలో ఆడపిల్లలపై వివక్షను గుర్తించింది. రాజ్యాంగంలోని హక్కులపై బాలికలు, మహిళల్లో అవగాహన కల్పిస్తేనే గానీ ‘మహిళా సాధికారత’ సిద్ధిస్తుందని తెలుసుకుంది. ఇందుకోసం సమాజాన్ని చైతన్యం చేసే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది. 2000 సంవత్సరంలో బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరింది. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతూనే తన రచనలతో విలువైన సందేశాలను ఇస్తోంది. సంపాదకురాలిగా.. సమాజంలో స్త్రీ స్థానానికి ఉన్న గౌరవాన్ని వివరించే ప్రయత్నంలో భాగంగా ‘అన్వేషణ’, ‘ఆమెను చూసారా..!’ పేర్లతో వంద కవితలను రచించింది. ‘అధ్యాపక జ్వాల’ పత్రికకు సంపాదకురాలిగా పనిచేస్తూ పలు పుస్తకాల ఆవిష్కరించింది. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్లో రాష్ట్ర కౌన్సిలర్‌గా వ్యవహరిస్తోంది. బాలల హక్కులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తోంది.ఉత్తమ సేవలకు గానూ కళావతికి 2013లో లయన్స్ క్లబ్ వారు ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును అందజేశారు. అలాగే, 2016, 2017లో సావిత్రిబాయి పూలే అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఆమె జనగామ మండలం లింగాలఘణపురం మండలం నవాబుపేట హైస్కూల్లో విధులు నిర్వర్తిస్తోంది. హక్కులపై అవగాహన పెరగాలి మహిళలు హక్కులపై అవగాహన పెంచుకోవాలి. న్యాయం వైపు ధైర్యంగా నిలబడాలన్న స్పృహ కలిగినప్పుడే మహిళా సాధికారతకు అర్థం ఉంటుంది. సమాజంలో లింగ వివక్షను రూపుమాపాలి. మహిళలకు హాని కలిగించే ఏ చర్యలను ప్రోత్సహించొద్దు. గుంటిపల్లి కళావతి, ప్రభుత్వ ఉపాధ్యాయులురాలు -
కష్టాలే ప్లాట్‌ఫాం.. నవ్య సోపానం
బతుకు బండిని లాగేందుకు ప్లాట్‌ఫాంపై టిఫిన్ బండి నడుపుతున్న తల్లిదండ్రుల కష్టాలు ఆమెలో కసిపెంచాయి. వారి ఆశలను, తన ఆశయాలను నెరవేర్చేందుకు చదువొక్కటే మార్గమని భావించింది. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూనే చదువులో సత్తా చూపింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించి, ప్రస్తుతం చెన్నైలోని ఓ సంస్థలో ఆర్టికల్‌షిప్ చేస్తోంది పాకాల మండలానికి చెందిన వి.నవ్య. ఆమె గురించి ఆమె మాటల్లోనే.. – తిరుపతి ఎడ్యుకేషన్ మాది పాకాల మండలం వల్లివేడు గ్రామం. మా తల్లిదండ్రులు వి.శివారెడ్డి, వి.గోమతిలకు మేం ముగ్గురు సంతానం. అక్క వి.నందిప్రియ నీట్‌కు సిద్ధమవుతోంది. నేను రెండో కుమార్తెను. చెల్లెలు వి.దివ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వ్యవసాయం పెద్దగా అచ్చిరాలేదు. మా ఉన్నత చదువుల కోసం అమ్మానాన్న పొట్ట చేత్తో పట్టుకుని మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చేశారు. రుయా ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై టిఫిన్ బండి పెట్టారు. వచ్చే ఆదాయంతో మమ్మల్ని చదివిస్తున్నారు.– సీఏ–ఐపీసీసీ ఆలిండియా 21వ ర్యాంకర్ వి.నవ్య కష్టాలు కసి పెంచాయి.. మా ముగ్గురిని చదివించేందుకు అమ్మాన్నాన్న ఎంతో కష్టపడుతున్నారు. సొంత ఊరిని వదిలిపెట్టి తిరుపతికి వచ్చారు. ఫ్లాట్‌ఫాంపై టిఫిన్ బండి నడుపుతున్నారు. వారు పడుతున్న కష్టం, బాధ చూసి నాలో కసి పెరిగింది. సీఏ–ఐపీసీసీలో ఆలిండియా 21వ ర్యాంకు సాధించాను. చదువు ప్రస్థానం.. పదో తరగతి వరకు పాకాల మండలం, రమణయ్యగారిపల్లెలోని వశిష్ఠ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నాను. పదిలో 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించాను. మదనపల్లిలోని జవహర్ నవోదయలో ఎంపీసీ చేశాను. 94.4శాతం మార్కులను సాధించాను. సీఏ చేయాలన్న కోరికతో తిరుపతిలోని ఎమరాల్డ్స్ కళాశాలలో 6నెలలు సీఏ–సీపీటీలో శిక్షణ తీసుకున్నా. ఇంటర్ మార్కుల ఆధారంతో సీపీటీలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఈ పరీక్షలో 200కు 177మార్కులు సాధించడంతో సెకెండ్ లెవెల్ అయిన సీఏ–ఐపీసీసీలోనూ ఎమరాల్డ్స్ కళాశాల యాజమాన్యం 9నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించింది. కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 21వ ర్యాంకు సాధించగలిగాను. సీఏ ఫైనల్ చేయాలంటే తప్పనిసరిగా రెండున్నర ఏళ్ల పాటు ఆడిటర్ వద్ద ఆర్టికల్‌షిప్ చేయాలి. దీనికోసం చెన్నైలోని డెలాయిట్ సంస్థలో చేరాను. సీఏ ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకోవాలి. దీనికి అయ్యే ఖర్చును ఎమరాల్డ్స్ కళాశాల యాజమాన్యం భరించింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తల్లిదండ్రులకు సాయంగా.. అమ్మానాన్న ఇద్దరూ టిఫిన్ బండిపై కష్టపడేవారు. వారి కష్టంలో నేను కూడా పాలుపంచుకోవాలని వారికి సాయంగా ఉంటున్నాను. టిఫిన్ బండిపై దోసెలు పోస్తూ, వచ్చిన కస్టమర్లకు టిఫిన్ వడ్డిస్తూ చేదోడువాదోడుగా ఉంటున్నా. ఖాళీ సమయంలో చదువుపైనే దృష్టి పెడుతున్నా. సివిల్స్ సాధించడమే నా కల... సీఏ పూర్తయిన తరువాత సివిల్స్‌కు సిద్ధమవుతాను. సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ కావడమే నా కల. నాలాంటి పేద విద్యార్థులు చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ పరంగా వారికి అండగా నిలవడానికి, మరెందరో పేదలకు సేవ చేయడానికి తప్పకుండా నా కలను సాకారం చేసుకుంటా. నా తల్లిదండ్రుల ఆశలను నెరువేరుస్తా. -
పురుషులకు దీటుగా...
కడప ,ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు మండలంలోని అమృతానగర్‌కు చెందిన కొండిశెట్టి సుధ అనే మహిళ ఆటో నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మగాళ్లకు దీటుగా స్వశక్తితో ఆటో నడపడాన్ని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు. అమృతానగర్‌కు చెందిన సుధాకు రామాంజనేయులుతో వివాహం అయింది. అతను ఎలక్ట్రికల్ ఉద్యోగం నిర్వహించే వాడు. వారికి లహరి అనే కుమార్తె ఉంది. సంతోషంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఆ చిన్న కుటుంబంలో అనుకోని విషాదం నెలకొంది. ఆమె భర్త రామాంజనేయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన 9 ఏళ్ల క్రితం జరిగింది. భర్త మరణంతో కుటుంబ భారం ఆమెపై పడింది. కుమార్తెను బాగా చదివించాలని భావించింది. మో టార్‌సైకిల్‌ను నడపడం నేర్చుకుంది. నిత్యావసర సరుకులు టీవీఎస్‌లో పెట్టుకొని పల్లెలకు వెళ్లి విక్రయించ డం అలవాటు చేసుకుంది. తర్వాత ఆటో కొనుగోలు చేసి నేర్చుకుంది. అందులో తీసుకెళ్లి సరుకులు విక్రయిం చింది. అయితే చాలా మంది అప్పు పెట్టారు. ఇలా రూ.2.50 లక్షల దాకా నష్టపోయింది. ఆటో డ్రైవింగే జీవనాధారం నిత్యావసరాల వ్యాపారం చేస్తే బాకీలు పెరిగిపోతాయని భావించి మానేసింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే సంసారం గడచదని భావించింది. ఎలాగో ఆటో నడపడం వచ్చు కాబట్టి ప్రయాణికుల కోసం తిప్పాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టింది. మూడేళ్ల నుంచి ఇదే ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రోజంతా ఆటో తిరిగితే రూ. 300–400 దాకా సంపాదిస్తోంది. -
ఆమే.. రథసారథి
ఇప్పటి వరకు ఇంటికి పరిమితమైన ఆ వనితలు..ఇప్పుడు నగర రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు.తోటి మహిళా ప్రయాణికులను సురక్షితంగాగమ్యస్థానాలకు చేర్చుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. మహిళా సాధికారతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.వారే ‘షీ క్యాబ్’ డ్రైవర్లు. ఈ రథసారథులకు రాత్రి, పగలు తేడా లేదు.. ప్రతిరోజు 14గంటల డ్రైవింగ్.. అంతకుమించి ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుంటూ వీల్‌పై తమ పవర్‌ను విస్తృతం చేస్తున్నారు.. మహిళా శక్తిని చాటుతున్నారు. సనత్‌నగర్: 2015 నవంబర్‌లో ‘షీ క్యాబ్’ సర్వీస్ ప్రారంభమైంది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వీరు సేవలందిస్తున్నారు. ఆర్టీఏ సహకారంతో 35 శాతం సబ్సిడీపై మొత్తం 10 మంది మహిళలకు క్యాబ్‌లు అందజేశారు. అయితే ఆరోగ్యం, ఇతరత్రా కారణాలతో ముగ్గురు వైదొలిగారు. ప్రస్తుతం ఏడుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు 24గంటలు సర్వీస్ అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ఇద్దరు తప్పనిసరిగా విధుల్లో ఉంటూ మహిళా ప్రయాణికులకు భరోసానిస్తున్నారు. ప్రారంభంలో 24గంటలు విధులు నిర్వర్తించిన మహిళా డ్రైవర్లు... ఆరోగ్యరీత్యా ఇప్పుడు 14గంటలు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకు 300–400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. ప్రోత్సాహమేదీ? మాది మధ్యతరగతి కుటుంబం. నా భర్త రాజు జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటారు. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే ఉద్దేశంతో ‘షీ క్యాబ్’లో చేరాను. రెండేళ్లు గడిచాయి. ప్రతిరోజు రాత్రి 7గంటల నుంచి ఉదయం 9గంటల విధులు నిర్వర్తిస్తాను. ఇలా అయితేనే అన్ని ఖర్చులు(లోన్, డీజిల్, పార్కింగ్, మెయింటెనెన్స్, టోల్ చార్జీలు) పోను రూ.1,000 మిగులుతాయి. ప్రయాణికులతో మాకెప్పుడు ఇబ్బందులు తలెత్తలేదు. కానీ రేట్ల విషయంలోనే అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ రంగంలోకి రావాలని చాలామంది మహిళలకు ఆసక్తి ఉన్నా... ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించడం లేదు. – మంజుల, క్యాబ్ డ్రైవర్ మరెందరికో స్ఫూర్తి... భర్తను కోల్పోయిన వారు కొందరు... ‘ఆమె’ పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉన్న వారు మరికొందరు.. కారణాలేవైనా ఆత్మస్థైర్యమే పెట్టుబడిగా, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వీరందరూ రథసారథులయ్యారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే.. మరోవైపు జీవన‘చక్రం’ తిప్పుతున్నారు. మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడా చిన్నచూపే.! అన్ని రంగాల్లో మాదిరే ఇక్కడా మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. షీ క్యాబ్‌లపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. ఎయిర్‌పోర్టుకు వచ్చే స్వదేశీయులు, విదేశీ ప్రతినిధులు, అతిథులు, ముఖ్యంగా ఒంటరి మహిళలు ‘షీ క్యాబ్’ సర్వీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే ఉండడం, అందులోనూ రాత్రివేళల్లో ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉంటుండడంతో షీ క్యాబ్‌లను ఎక్కువగా ఆశ్రయించే అవకాశం లేకుండాపోతోంది. ఈ రంగంలోకి వచ్చేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నప్పటికీ... ‘ఆ మహిళలు ఏం నడుపుతారులే?’ అని చిన్నచూపు చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా డ్రైవర్లకు ప్రత్యేకించి స్పెషల్ ఇన్సెంటీవ్స్, రేట్స్ మెనూ లేవని వాపోయారు. చార్జీలు పెంచాలి... మాది అంబర్‌పేట. నా భర్త నాగరాజు కార్పెంటర్‌గా పనిచేస్తారు. కుటుంబం గడవాలంటే ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉండడంతో ‘షీ క్యాబ్’లో చేరి సబ్సిడీలో క్యాబ్ పొందాను. మొదట్లో 24గంటలు పనిచేస్తే.. రూ.3వేలు మిగిలేవి. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో 14గంటలు చేస్తున్నాం. ఇప్పుడు రూ.1,000 వస్తున్నాయి. దాదాపు రాత్రంతా క్యాబ్ నడపడమే. ఈ రంగంలో రాణించాలంటే ముఖ్యంగా కావాల్సింది మనోధైర్యం, కుటుంబ సహకారం. అన్ని గంటలు డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలంటే చాలా సహనం అవసరం. ఈ రంగంలో మేము అవార్డులు, రివార్డులు కోరుకోవడం లేదు. కానీ ధరలు పెంచితే బాగుంటుంది. లీటర్ డీజిల్ రూ.48 ఉన్నప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నాం. ఇప్పుడు డీజిల్ ధర రూ.70 అయింది. కానీ మా క్యాబ్ రేట్లు మారడం లేదు. మహిళా క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ప్రత్యేకంగా ధరలు పెంచాలి. – బాలమణి, క్యాబ్ డ్రైవర్ రాయితీ ఇవ్వాలి... మాది ఎల్బీనగర్ కొత్తపేట. మొదట నేను స్టాఫ్ నర్స్‌గా పనిచేశాను. నా భర్త రవీందర్‌రెడ్డి(న్యాయవాది) చనిపోవడంతో కుటుంబ భారం నాపై పడింది. ఎలాగైనా పిల్లలను ఉన్నత స్థితికి చేర్చాలన్నదే నా లక్ష్యం. ప్రయాణికులు మహిళా డ్రైవర్లను ఎంతో గౌరవంగా చూస్తారు. అందుబాటులో లేకున్నా ‘షీ క్యాబ్స్’ వచ్చే వరకు వేచి చూసే ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒంటరి మహిళలు, కుటుంబంతో వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తాం. డ్రైవర్‌గా రాణించాలంటే నిబద్ధత అవసరం. అయితే తమకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం కరువైంది. పార్కింగ్, మెయింటెనెన్స్, టోల్ చార్జీల్లో రాయితీలివ్వాలి, క్యాబ్ ధరలు పెంచాలి. – సుభాషిణి, క్యాబ్ డ్రైవర్ -
అనాథల అమ్మ
నంద్యాలటౌన్: ఆమె గిరిజన మహిళ. చదివింది ఇంటర్. ఆర్థిక, రాజకీయ బలం లేదు. కుటుంబ సభ్యులందరూ కులవృత్తి అయిన బుట్టలు అల్లుకునేవారే. సమాజ సేవ చేయాలన్న తలంపుతో ఆమె స్టార్ సొసైటీ స్థాపించారు. బడి బయట ఉన్న బాల కార్మికులను, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆమె సేవలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అవార్డులు సైతం వరించాయి. అందరిచేత మన్ననలు అందుకుంటున్న ఎరుకలి రాజేశ్వరమ్మ స్ఫూర్తిగాథ ఇదీ.. గోస్పాడు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ, సుబ్బరాయుడుల రెండో సంతానం రాజేశ్వరమ్మ. వీరికి ఎలాంటి ఆస్తులు లేవు. గుడిసెలో జీవనం. బుట్టలు అల్లుకుని జీవించారు. తలిదండ్రుల రెక్కల కష్టంతో రాజేశ్వరమ్మ ఒకటి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ నంద్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఆర్థిక కారణాలతో తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో కొన్ని రోజులు ఇంటి వద్దనే ఉంటూ బుట్టలు అల్లేవారు. ఈ సమయంలో సమాజ సేవ చేయాలనే తలంపు వచ్చింది. తనలాంటి పేదలకు సాయం చేయా లనే ఆలోచనతో తన స్నేహితుడైన సుబ్బరాయుడుతో కలిసి స్టార్ సొసైటీని 2000 సంవత్సరంలో స్థాపించారు. ఈ స్టార్ సొసైటీ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్చేవారు. రాజేశ్వరి సేవలను గుర్తించిన బాలకార్మిక పునరావాస సంస్థ అధికారులు స్టార్ సొసైటీకి ఎన్సీఎల్పీ కింద ప్రభుత్వ నిధులతో బాల కార్మిక పాఠశాలను మంజూరు చేశారు. ప్రస్తుతం 50 మంది బాలకార్మిక విద్యార్థులతో ఈ పాఠశాల నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే అహోబిలం లో మరో పాఠశాలను 50 విద్యార్థులతో ప్రభు త్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్నేహితుడైన సుబ్బరాయుడును 2007లో ఈమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి స్టార్ సొసైటీ సేవలను విస్తరించారు. నిరాశ్రయులకు వసతి గృహం.. నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో 2015లో నిరాశ్రయుల వసతి గృహం ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలందరినీ వసతి గృహంలో చేర్చుకొని వారికి ఉచిత భోజనం, వసతితో పాటు విద్యాబుద్ధులను నేర్పిస్తున్నారు. నంద్యాల డివిజన్లో తప్పిపోయిన పిల్లలు, అనాథ పిల్లలు కనిపిస్తే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు రాజేశ్వరమ్మకు ఫోన్ చేస్తున్నారు. సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న ఈ వసతి గృహం అనతి కాలంలోనే జిల్లాలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇక్కడ 30మంది ఆశ్రయం పొందుతున్నారు. పురస్కారాలివీ.. ♦ 2010లో ఉత్తమ ఎన్జీఓగా గుర్తింపు ♦ 2011లో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ ♦ 2011లో రాజీవ్ విద్యామిషన్ ద్వారా అవార్డు అందజేత ♦ ఉత్తమ మహిళగా గుర్తించి 2017 మార్చిలో అవార్డు అందజేత ♦ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలుగా నియామకం. సేవలు ఇవీ.. స్టార్ సొసైటీ ద్వారా రాజేశ్వరమ్మ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణంలో టైలరింగ్ ప్రోగ్రాం కింద 2 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు. అప్పటి జిల్లా కలెక్టర్ విజయమోహన్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు డీఆర్డీఏ సహకారంతో ఉచితంగా కుట్టుమిషన్లను ఇప్పించారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లె గ్రామంలో వలసల నివారణ ప్రభుత్వం కేంద్రాన్ని స్థాపించగా.. పలువురు విద్యార్థులను రాజేశ్వరమ్మ ఈ కేంద్రంలో చేర్పించి జిల్లా కలెక్టర్ చేత ప్రశంసలు పొందారు. -
అవగాహన కల్పిస్తూ..నాప్కిన్లు అందిస్తూ..
‘ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలలో వారం రోజులు బాలికల హాజరు తక్కువగా ఉండడం గమనించాం. ఇందుకు కారణం ఏంటని విశ్లేషిస్తే... స్కూళ్లలో టాయ్‌లెట్స్, డిస్పోసల్స్ లేకపోవడం, నీళ్లు రాకపోవడం తదితరకారణాలతో విద్యార్థినులు నెలసరి సమయంలో పాఠశాలకు రావడం లేదని తేలింది. దీనిపై మా టీమ్ అంతా కలిసి ఆలోచించాం. శానిటరీ ప్యాడ్స్ అందజేయాలని ‘ప్యూర్ ఫెమ్’ ప్రోగ్రామ్‌ను ఐదు నెలల క్రితంప్రారంభించామ’ని చెప్పారు సిటీ కేంద్రంగా పనిచేస్తున్న ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సంధ్య గొళ్లమూడి. ఈ మంచి పనికి శ్రీకారం చుట్టిన సంధ్య... ‘నేను శక్తి’ శీర్షికతో తమ సేవలను వివరించారు. సాక్షి, సిటీబ్యూరో : మా స్వస్థలం పశ్చిమ గోదావరి. ప్రస్తుతం నగరంలోని సన్‌సిటీలో నివాసం. మా ఆయన బ్యాంక్ ఉద్యోగి. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ కావాల్సి వచ్చేది. ఆ సమయంలో అక్కడి పిల్లలకు నావంతుగా చదువు చెప్పేదాన్ని. ఈ క్రమంలో ఖమ్మంలోని ఓ పాఠశాలలోని పిల్లలు పుస్తకాలు కొనుక్కునే స్థోమత లేక చదువు మానేయడం గమనించాను. ఈ పరిస్థితిపై నా స్నేహితురాలితో చర్చించగా, తాను అక్కడి పిల్లల కోసం పుస్తకాలు, స్టేషనరీ, ప్లేట్లు, గ్లాస్లు ఉచితంగా అందజేసింది. అయితే ఇంకెంతో మంది పేద విద్యార్థులు, కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి కదా! మరి అక్కడ పరిస్థితి ఏంటనే ఆలోచన నన్ను తొలిచేసింది. విద్యాభివృద్ధికి నావంతు సహకారం అందించేందుకు మరికొంత మంది స్నేహితులతో కలిసి ‘ప్యూర్ ఫౌండేషన్’ను ప్రారంభించాను. విద్యార్థులు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ, స్కాలర్షిప్స్ అందజేయడం, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడం తదితర మా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. ఇదీ ‘ప్యూర్ ఫెమ్’ ఉద్దేశం... తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. శానిటరీ ప్యాడ్స్ వినియోగాన్ని వివరిస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నాం. రుతుక్రమం సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో..? ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. నాప్కిన్లు అందజేస్తున్నాం. అవి కూడా సహజ సిద్ధంగా తయారు చేసిన నాప్కిన్లనే ఇస్తున్నాం. ఏలూరులోని ‘ఆశ జ్యోతి’ సంస్థ ఆధ్వర్యంలో అరటి నార, కాటన్లతో ప్రకృతి సహజంగా రూపొందిస్తున్న శానిటరీ ప్యాడ్స్‌ను ‘పరి ప్యాడ్స్’ పేరుతో విద్యార్థినులకు అందజేస్తున్నాం. రూ.5కు రెండు... విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ కోసం పాఠశాలల్లో ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని 58 స్కూళ్లలో వీటిని అందుబాటులో ఉంచాం. వీటిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ పరిధిలోని 18 పాఠశాలలు, రాజేంద్రనగర్ మండలంలోని 14 పాఠశాలలు ఉన్నాయి. ఈ మెషిన్లలో రూ.5 కాయిన్ వేయగానే రెండు న్యాప్కిన్లు వస్తాయి. సోషల్ మీడియా వేదికగానే మేం నిధులు సేకరిస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు కొందరు స్పాన్సర్ చేసేందుకు ముందుకొస్తున్నారు. -
నోటి గీత..మార్చింది రాత
ఆడపిల్ల అంటే ఆధారపడేదని ఎందుకు అనుకోవాలి? వైకల్యం ఉన్నంత మాత్రాన ఎవరో ఒకరి ఆసరా తీసుకోవాల్సిందేనని ఎందుకు భావించాలి? అని ప్రశ్నిస్తుంది శ్రీలేఖ. తన ప్రశ్నలకు తానే సమాధానం.. అంతేనా? మరెందరినో లక్ష్యం వైపు నడిపించే మోటివేషనల్ స్పీకర్. వైకల్యాన్ని జయించి, వైవిధ్యభరితమైన కళలకు ప్రాణం పోస్తున్న ఈ అమ్మాయి ‘అందరితో ఉందాం.. ఆధారపడకుండా ఉందాం’ అంటోంది. సాక్షి, సిటీబ్యూరో: కుంచె నోటితో పట్టుకొని కాన్వాస్‌పై చిత్రాలు గీస్తున్న చందానగర్ నివాసి మందలపల్లి శ్రీలేఖను చూస్తే మన కళ్లు ఆశ్చర్యంతో ఆమెనే చూస్తాయి. పుట్టుకతోనే కాళ్లు, చేతులు పనిచేయకపోయినా తనలోని ప్రతిభ, ఆత్మవిశ్వాసాలనే అవయవాలుగా మలచుకొని... తాను కదలలేకపోయినా ఎందరినో కదిలించే చిత్రాలు గీస్తోంది. ‘మనిషి తలచుకుంటే ఏమైనా సాధించొచ్చు. జీవితమంటే ఎంతో ఉందని తెలుసుకున్నాను. తెలుసుకున్నది నలుగురికి తెలియజేయడమే ఇప్పుడు నా పని’ అంటున్న ఈ యువతి నోటితో కళాత్మక అపురూపాలు ఆవిష్కరిస్తున్న తీరు... విధిపై ఆమె సాధించిన విజయాల ‘చిత్రం’. ‘సాక్షి.. నేను శక్తి’ శీర్షికతో శ్రీలేఖ పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... పుట్టుకతోనేపరీక్ష... పాకడం, తప్పటడుగులు వేయడం, పరుగెత్తడం ఇలాంటివేవీ చిన్నప్పుడు నాకు తెలీదు. నాకు కండరాల క్షీణత వ్యాధి. శరీరం పెరుగుదల, కండరాల్లో పట్టుండదు. కీళ్లు పనిచేయవు. దేహం గాలి ఊదిన బెలూన్లా ఉంటుందని... పుట్టుకతోనే నేను జీవితకాల వైకల్య బాధితురాలని వైద్యులు తేల్చారు. అయితే ‘ఇలాంటి జబ్బున్న పిల్లల్లో మెదడు ఎదుగుదల ఉండదు. కానీ అదృష్టవశాత్తు మీ అమ్మాయికి మెదడు బాగానే పనిచేస్తుంద’ని మా అమ్మానాన్నకు చెప్పారు. ఇక నా తల్లిదండ్రులు చేతనైన చికిత్సలన్నీ చేయించినా ఎలాంటి మార్పు రాలేదు. కూర్చోవడం, పడుకోవడం, తినిపిస్తే తినడం తప్ప మరేమీ చేయలేని నన్ను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. మిగతా ఇద్దరు పిల్లల్లానే చదివించారు. నన్ను ఎత్తుకొని స్కూల్‌కి తీసుకెళ్లి బెంచిమీద కూర్చోబెట్టి వెళ్లేది అమ్మ. మళ్లీ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించి, టాయ్‌లెట్‌కి తీసుకెళ్లి బట్టలు శుభ్రం చేసి, స్కూల్ టైమ్ అయ్యేంత వరకు ఉండి... తిరిగి ఇంటికి తీసుకెళ్లేది. ఇలాగే నానాయాతన పడుతూ డిగ్రీ వరకు చదివించారు. పట్టుదలతో ఫస్ట్‌క్లాస్... ‘చలనం లేని శరీరానికి చదువులెందుకని’ కొందరు... ‘ఏం సాధించాలని?’ అని మరికొందరు ఎద్దేవా చేశారు. ఆ మాటలు నాలో మరింత పట్టుదలను పెంచాయి. కుడి చెయ్యి ఒక్కటి లేపి పుస్తకం మీద పెడితే రెండువేళ్లతో అతి కష్టంగా, చాలా మెల్లగా రాసేదాన్ని. ఆ రాత కోసం రాత్రి పగళ్లు సాధన చేసి నేర్చుకున్నాను. పరీక్ష మూడు గంటల సమయముంటే.. టీచర్లు, లెక్చరర్లు నాకోసం మరో అరగంట అదనంగా కేటాయించేవారు. ప్రతి తరగతిలోనూ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను. డిగ్రీలో 70శాతం మార్కులు సాధించాను. ఉపాధి సృష్టి బీకామ్ పూర్తయ్యాక ఉద్యోగం చేద్దామంటే.. ‘95 శాతం వైకల్యం. ఒకరి అండ లేకుండా కదలలేని వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తాం?’ అని ప్రశ్నించారు. ఉద్యోగం పేరుతో ఒకరిని అడిగే కన్నా.. ప్రతిభకు సానబెట్టి మనమే ఏదో ఉద్యోగం ఎందుకు సృష్టించుకోకూడదు? అని ఆలోచించాను. చిన్నప్పటి నుంచి అమ్మ చీరల మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తుంటే... చూస్తూ కొంచెం నేర్చుకున్నాను. దాన్నే ఆధారం చేసుకోవాలనుకున్నాను. అయితే బరువైన బ్రష్‌లు చెయ్యితో పట్టుకోవడం కుదిరేది కాదు. బ్రష్ తీసి చేతిలో పెట్టినా జారిపోయేది. దీంతో నోటితో పట్టుకున్నాను. ‘నువ్వేం వేయగలవు. చాలా కష్టం’ అని నా పంతం తెలిసిన అన్నయ్య నన్ను మరింత రెచ్చగొట్టేవాడు. నోటితో అన్ని రకాల స్ట్రోక్స్ ఇవ్వడం అసాధ్యమని, క్లాస్ తీసుకోలేనని చెప్పారు టీచర్. ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకున్నాను. సార్ చెప్పినట్టు పెయింటింగ్ వేసి చూపించాను. అలా రోజు ఐదారు గంటలు పెయింటింగ్ ఎగ్జిబిషన్స్‌లో పాల్గొంటున్నాను. అంతర్జాతీయ ఫుట్ అండ్ మౌత్ ఆర్టిస్ట్‌ల కాంటెస్ట్‌కి పెయింటింగ్స్ పంపాను. ఈ మధ్యే ఇంటి దగ్గర చిన్నపిల్లలకు పెయింటింగ్ క్లాస్‌లు కూడా తీసుకుంటున్నాను. అయితే ఇది ఆదాయం కోసం కాదు... నాకు వచ్చిన కళ మరికొందరికి నేర్పడానికి మాత్రమే. వీల్‌చైర్ మీద కూర్చున్నా.. వీలైనంత మందిని మార్చాలని ఉంది. అందుకే మోటివేషన్ క్లాసెస్. -
నాడి పట్టిన నారి
నాడి పట్టి వైద్యం చేసేవారు డాక్టర్లయితే.. కష్టాల నాడి పట్టి మనోధైర్యం నింపేవారు ఈ మహిళా డాక్టర్లు. స్టెతస్కోప్‌తో గుండె పనితీరునే కాదు.. గుండెలో నిండి ఉన్న బాధనూ తీరుస్తున్నారు. సమస్యలతో వచ్చే మహిళా రోగుల్లో మనోస్థైర్యం నింపుతున్నారు. లబ్బీపేట (విజయవాడ తూర్పు): జీవితంపై ఎన్నో గాట్లు పడతాయి.. ప్రసవం కోసం కోసే కడుపు కోత ఒకటైతే..కష్టాల గుండెకోత మరొకటి.. మత్తు మందు ఇస్తే కడుపు కోత నొప్పి తెలియకపోవచ్చు..గుండెకోత నొప్పి మాత్రం ఈ డాక్టర్లకు చెబితేనే తీరుతుంది.ఆ నొప్పికి మంచి వైద్యంలాగే, ఈ నొప్పికి మనోధైర్యాన్ని నింపుతున్నారు ఈ మహిళా డాక్టర్లు. ఆమె వైద్యం.. మానసిక ధైర్యం ‘అమ్మ ఆదరించదు. అత్త పట్టించుకోదు. భర్త మద్యం సేవించి ఇంటికి వస్తుంటాడు. అలాంటి కుటుంబాలు నేటికీ ఎన్నో ఉన్నాయి. అలా ఆర్థిక ఇబ్బందితో పేద కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా మా వద్దకు ప్రసవం కోసం వస్తుంటారు. వారిని చూస్తే జాలేస్తుంది. తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతూ ఇతర సమస్యలతో వస్తుంటారు. వారికి తక్షణమే స్పందించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. కుటుంబ పరిస్థితులు చెబుతుంటే ఆవేదనకు గురవుతాం.’ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో వైద్యవృత్తిని ఎంచుకున్నారు ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ డి.రాజ్యలక్ష్మి. నాన్న దేవరపల్లి అమ్మేశ్వరరావు కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, అమ్మ సరస్వతి గృహిణి. ఉద్యోగంలో నిబద్ధతతో వ్యవహరించే నాన్నను స్ఫూర్తిగా తీసుకున్నారామె. అలా ఎంబీబీఎస్, పీజీ పూర్తిచేసి 1983లో సర్వీస్‌లో చేరారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన రాజ్యలక్ష్మి 1975–81 బ్యాచ్‌లో గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. 1982–84లో అబ్స్టేటిక్స్ అండ్ గైనకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కాగా, పీజీ చదువుతున్న సమయంలోనే ఏపీపీఎస్సీ ద్వారా 1983లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన రాజ్యలక్ష్మి 35 ఏళ్లుగా పేదలకు సేవలు అందిస్తున్నారు. గుడిసెల్లోకి వెళ్లి మరి.. ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేసిన తొలినాళల్లో గుడిసెల్లోకి వెళ్లి నులకమంచంపైనే కాపర్ టీ లాంటివి వేసే వాళ్లమని ఆమె గుర్తుచేసుకున్నారు. గ్రామాలకు వెళ్లి షెల్టర్లలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేవారు. ఇలా.. 35 ఏళ్లు ఎంతోమంది పేదలను చదివారామె. ‘ఇటీవల చుక్కమ్మ అనే గర్భిణీ ప్రసవం కోసం వచ్చింది. వారిది ప్రేమ వివాహం. ఇద్దరు పండంటి శిశులకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు లోకల్ సిండ్రోమ్ ప్రాబ్లమ్ కారణంగా మూడు నెలలుగా వెంటిలేటర్‌పైనే ఉంటోంది. ఇద్దరు పిల్లలకు మూడు నెలలు వయస్సు వచ్చినా తల్లి ఇంకా కోలుకోలేని స్థితిలోనే ఉంది. నా సర్వీసులో ఇలాంటి పరిస్థితి చూడలేదు.’ కుటుంబమంతా డాక్టర్లే మహిళలు ఎప్పుడూ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్లుగా ఉంటారని, తనకు ప్రతి పనిలో భర్త డాక్టర్ నాంచారయ్య సహకారం ఉంటుందని రాజ్యలక్ష్మి తెలిపారు. ఆయన జనరల్ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని, తనకు ఇద్దరు మగపిల్లలని, ఇద్దరూ ఎంబీబీఎస్ పూర్తిచేశారని చెప్పారు. మరింత మంది పేద మహిళలకు సేవచేస్తూ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని డాక్టర్ రాజ్యలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. అక్క వాళ్లు మెడిసిన్ చేసి బిజీగా ఉండటం చూసి ఆ జీవితం వద్దనున్నాను. అమ్మ అందుకు ఒప్పుకోలేదు. నాన్న నిర్ణయం ప్రకారం చేయాల్సిందేనన్నారు. కానీ, ఇప్పుడు ఈ వైద్య వృత్తిలోకి వచ్చి 21 సంవత్సరాలు నిండింది. ఎందరో అభాగ్యులైన మహిళలకు ఓదార్పుగా నిలిచిన క్షణాలు నాకు గుర్తు. సంతృప్తిగా ఉంది. మా నాన్న నిర్ణయం మంచిదని గుర్తించాను. రోగులకు ఆమె మనోస్థైర్యం సాధారణంగా హెచ్ఐవీ సోకినవారిని చాలామంది హీనంగా చూస్తుంటారు. వారి దగ్గరకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. కానీ, హెచ్ఐవీ సోకిన ఎంతోమంది బాధితులకు కంకిపాడు సామాజిక ఆరోగ్యకేంద్రం ఆస్పత్రి సూపరింటెండెంట్ (డీసీఎస్) చిత్రా గురుస్వామి. ధైర్యంగా ప్రసవాలు చేశారు. అంతేకాదు.. భర్త వేధింపులకు గురై శారీరకంగా గాయపడి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, లైంగిక దాడి జరిగిన మహిళలు, చిన్నారులకు ఎంతో సేవ చేశారు. వైద్యం ఒక్కటే ప్రధానం కాదు. మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తన 21 ఏళ్ల కెరీర్లో ఇలాంటి ఎన్నో కేసులను ఆమె పరిష్కరించారు. జీవితంపై విరక్తి చెందకుండా కౌన్సెలింగ్ నిర్వహించి బాధితుల్లో ధైర్యం నింపారు. వద్దనుకున్న రంగంలోనే విజయాలు చిత్రా గురుస్వామి తల్లిదండ్రులు గురుస్వామి, తాయమ్మ. ఐదుగురు అక్కచెల్లెళ్లు. ముగ్గురు వైద్యరంగం, ఇద్దరు ఇంజినీరింగ్ రంగం. చిత్రా గురుస్వామి పుట్టి పెరిగింది అంతా విజయవాడలోనే. ఉన్నత చదువులు అన్నీ మధురైలో కొనసాగించారు. ఇంటర్ పూర్తయ్యే నాటికి అక్కలు మెడిసిన్ చేసి వైద్యరంగంలో స్థిరపడ్డారు. వారి బిజీ జీవితం చూసి అమ్మో ఈ రంగం వద్దనుకున్నారామె. తల్లికి ఈ విషయాన్ని చెప్పారు. చదువు గురించి నాకేమీ తెలీదు. మీ నాన్న ఏం చెబితే అదే నిజం. అదే జరగాలి అని అమ్మ చెప్పింది. నాన్న నిర్ణయం ప్రకారమే మెడిసిన్ పూర్తిచేశారు. కొద్దిరోజులు తమిళనాడులోనూ, ప్రస్తుతం కంకిపాడులో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ‘హెచ్ఐవీ బాధితులు, గర్భిణులు.. ఈ పరిస్థితులు అన్నీ గమనించాక నాన్న నిర్ణయం సరైనదేనని గుర్తించాను. కౌమార దశలో వచ్చే మార్పును బాలబాలికలు గుర్తించి మసలుకోవాలి. మంచి నడవడిక అలవర్చుకుంటే మహిళలు, చిన్నారులపై దాడులు, వేధింపులు జరగవు.’ అన్నారు చిత్ర. – కంకిపాడు (పెనమలూరు) -
మావోయిస్టుల అడ్డాలో మహిళా రిపోర్టర్!
అదొక మారుమూల గిరిజన ప్రాంతం. అరకొరా వసతులు ఉండే ఈ ప్రాంతంలో అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. చదువు, పుస్తకాలు ఇవేమీ వారికి తెలియవు. కానీ బురుడ జయంతి మాత్రం ఇలాంటి అననుకూల పరిస్థితులన్నింటినీ అధిగమించింది.అతికష్టంమీద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. కేవలం గ్రాడ్యుయేషన్‌తోనే ఆగిపోలేదు. జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని, తనలాంటి తనలాగే మరో పది మంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. ఒడిశాలోని అత్యంత నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కన్‌గిరి గిరిజన సమాజంలో తొలి మహిళా జర్నలిస్టుగా అందరి మన్ననలు పొందుతోంది. తన గిరిజన సమాజంలో మార్పు కోసం కలంతో పోరాటం చేస్తోంది. ఇంట్లో తొమ్మిదో అమ్మాయి! పది మంది అక్కాచెల్లెళ్లలో జయంతి తొమ్మిదో అమ్మాయి. గిరిజన కోయ తెగలో అసలు అక్షరాస్యతే తక్కువ. అమ్మాయిలు బడికి వెళ్లడమే అరుదు. ఇక చదువుకోవడానికి సదుపాయాలు సంగతి సరేసరి. కానీ జయంతి తండ్రి ఎన్నో కష్టాలకోర్చి పిల్లల్ని చదివించారు. జయంతి పట్టుదలగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కానీ ఆమె లక్ష్యం కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం కాదు. జర్నలిస్టు కావాలని కలలు కంది. తద్వారా తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటూ, వెనకబడి వున్న తన గిరిజన సమాజంలో మార్పు తీసుకురావాలని భావించింది. పట్టు పట్టి కలం పట్టింది జర్నలిస్టు కావాలన్న తన కలను సాకారం చేసుకోవటానికి ఎన్నో కష్టాలు పడింది జయంతి. ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చింది కానీ, ఇంటికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్సిటీకి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న వ్యవహారం. హాస్టల్లో ఉండి చదువుకునే ఆర్థికస్తోమతా లేదు. ఆ సమయంలో, తన స్నేహితురాలు ఆమెకు అండగా నిలిచింది. తన బంధువు ఇంట్లో ఉండి చదువుకునేలా అవకాశం కల్పించింది. అలా జయంతి జర్నలిజం కోర్సు పూర్తి చేసింది. చదువు అయిపోగానే ఇంటర్న్‌షిప్ కోసం జయంతి భువనేశ్వర్ వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు. ఆమె ప్రతిభను, ఉత్సాహాన్ని, తాపత్రయాన్ని గమనించిన సినీ నిర్మాత బిరేన్ దాస్, జయంతికి గైడెన్స్ ఇచ్చారు. జర్నలిజంలోనూ లింగ వివక్ష ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి, ప్రధాన మీడియాలోకి ప్రవేశించింది జయంతి. ప్రస్తుతం ‘కళింగ’ టీవీలో పనిచేస్తోంది. తన గిరిజన కమ్యూనిటీ మల్కన్‌గిరిలోనే రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. జయంతి కల నెరవేరినప్పటికీ, నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కన్‌గిరిలో కేవలం ఒకే ఒక్క మహిళ రిపోర్టింగ్ చేయడం ఆమెకు సవాల్‌గానే మారింది. అక్కడ కూడా లింగ వివక్ష ఎదురైంది. తన పురుష సహోద్యోగులు జయంతిని వెనక్కి లాగడానికి, భయపెట్టడానికి ఎన్నో పథకాలు వేసేవారు. ప్రతి అడుగును తను సవాల్‌గా తీసుకునేది. పురుష జర్నలిస్ట్‌లకు పోటీగా రాణించడం ప్రారంభించింది. పోలీసుల వేధింపులు వీటన్నింటికీ మించి ఆమెకెదురైన మరో పెద్ద సవాల్ పోలీసు వేధింపులు! ఒక కోయ తెగకు చెందిన అమ్మాయి విద్యాధికురాలిగా ఉండటం, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటంతో పోలీసులు ఆమెపై మావోయిస్టు ముద్ర వేశారు. ఈ క్రమంలో పలురకాల వేధింపులు ఆమెకు తప్పలేదు.ఆ వేధింపులను కూడా జయంతి ధైర్యంగా ఎదుర్కొంది. ఎక్కడా కూడా తాను తలొగ్గలేదు. జయంతి సాహసానికి పోలీసులు సైతం వెనుకంజ వేయాల్సి వచ్చింది. జయంతి కేవలం జర్నలిస్టుగా మాత్రమే కాక, గిరిజన సమాజంలోని బాలికలు చదువుకునేందుకు ఒక ఎన్జీవో సైతం నిర్వహిస్తోంది. ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద అవకాశాలే ఆమె ముందు వచ్చి వాలినప్పటికీ, తాను మాత్రం తన గిరిజన కమ్యూనిటీలోనే సేవలందిస్తోంది. ఒకవేళ తను కనుక ఇక్కడ పనిచేయకపోతే, తన చదువుకు సార్థకమే లేదని అంటోంది జయంతి. – కొటేరు శ్రావణి, ‘సాక్షి’ వెబ్ -
ఆమె ఆశ్రయం గొప్పది
అనంతపురం రూరల్ మండలం కాట్నేకాలువ గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు దేవి. కృష్ణమ్మ. లక్ష్మిరెడ్డిల దంపతులకు ముగ్గురు సంతానం. కాగా ఆమె రెండవ సంతానం. నిరుపేద కుటుంబం కావడంతో అప్పట్లో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది. పూట గడవడమే కష్టంగా మారిన ఆ కాలంలో దేవిని పాఠశాలకు కూడా పంపించలేని పరిస్థితి ఆ తల్లిదండ్రులది. బుద్ధి వచ్చేంత వరకూ ఇంటి వద్ద పనులు చేసుకుంటూ.. ఓ వయస్సు వచ్చాక తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పనులకు వెళ్లేది. ఇల్లు్ల, పొలం పనులు తప్ప మరేవిషయం తెలీదు. ఆ సంఘటనతో మలుపు అనంతపురం సెంట్రల్: 1992లో మేనమామ అయిన కృష్ణారెడ్డితో దేవికి వివాహమైంది. తొలినాళ్లలో వ్యవసాయ పనులపైనే ఆధారపడి భార్యభర్తలు జీవించారు. ఒక రోజు నగరానికి వచ్చిన కృష్ణారెడ్డి జోరువానకు వనుకుతున్న వృద్ధులను చూసి చలించారు. వారికి సపర్యలు చేసి ఇంటికి వెళ్ళాడు. ఆలస్యంగా వెళ్లడంతో ఎందుకింత ఆలస్యమైందని దేవి అడిగింది. అప్పుడు కృష్ణారెడ్డి జరిగిన విషయాన్ని వివరించారు. వయస్సులో సత్తువ ఉన్నన్నాళ్లు కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడిన వృద్ధులు జీవిత చరమాంకానికి వచ్చే సమయానికి రోడ్డు పాలు కావడం బాధాకరమని ఇద్దరూ చర్చించుకున్నారు. అదే వారిని సేవామార్గంలో పయనించడానికి నాంది పలికింది. కొద్దిరోజుల పాటు సేవలందించినా తర్వాత ఏకంగా వృద్ధాశ్రమాన్నే నెలకొల్పి ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని ఓ మహిళ చేసి నిరూపిస్తోంది. అనాథ తల్లిదండ్రులకు అమ్మలా మారి సేవచేస్తోంది. కడుపున పుట్టిన పిల్లలు కాదన్న వృద్ధులను అక్కున చేర్చుకొని వారి ఆలనపాలన చూసుకుంటున్నారు. దేవి సేవలను గుర్తించిన పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ఒడిదుడుకులతో ప్రారంభం దేవీ దంపతులకు స్వగ్రామంలో ఉండేందుకు చిన్న ఇల్లు్ల మాత్రమే ఉంది. ఎక్కడా ఒక్క సెంటు స్థలం కూడా లేదు. ఈ సమయంలో అనాథాశ్రమం నిర్మించాలని తలంచారు. ఏం చేయాలో తెలియక ఎవరైనా స్థలం ఇస్తారా అని ఆరా తీశారు. అయ్యావారిపల్లి వద్ద ఓ వ్యక్తి స్థలం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రూ. 20 వేలు ఖర్చు పెట్టి పనులు ప్రారంభించారు. అయితే అక్కడ కొంతమంది వ్యతిరేకించడంతో సదరు స్థలం యజమాని అనాథాశ్రమానికి ఇవ్వనని చెప్పేశారు. దీంతో స్వగ్రామంలోనే రక్తసంబంధీకులను ఒప్పించి వృథాగా ఉన్న స్థలంలో అనాథాశ్రమం ప్రారంభించారు. అయితే సదరు స్థలంలో పెద్ద పాడుబడ్డబావి ఉండటంతో దానిని పూడ్చటానికి డబ్బులు ఖర్చు అయ్యాయి. అనంతరం ఇళ్లు నిర్మించడానికి అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి పూర్వీకుల నుంచి వస్తున్న సొంతింటిని సైతం వదులుకోవాల్సి వచ్చింది. అనాథాశ్రమం నిర్మాణం కోసం ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారు. ఆ వచ్చిన డబ్బుతో అప్పులు చెల్లించి.. మిగిలిన మొత్తంతో అనాథాశ్రమాన్ని నడపడం మొదలు పెట్టారు. తొలినాళ్లలో ఎవరూ సాయం అందించకపోవడంతో అష్టకష్టాలు పడ్డారు. ఆశ్రమానికి మంచి పేరు రావడంతో ఇప్పుడిప్పుడే సేవలో పాలు పంచుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం దాతల సహకారంతోనే అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు. ఎగతాళులూ ఎక్కువే దేవితో పాటు ఆయన భర్త చేస్తున్న సేవా కార్యక్రమాన్ని చూసిన వారి బంధువులు ఎగతాళి చేశారు. మీకేమైనా పిచ్చి పట్టిందా? మీ తల్లిదండ్రులైతే పట్టించుకోవాలి. ఊరందరి గురించి మీకేం అవసరం అంటూ ఎగతాళి చేశారు. అయితే వారి వాదనలను దేవి సున్నితంగా తిప్పికొట్టారు. అవసరమైతే మీరంతా మా ఇంటికి రాకున్నా పర్వాలేదు అని ఎదురించారు. సేవలోనే పరమార్థం దాగి ఉందని తెలుసుకున్న ఆమె ఏకంగా వృద్ధాశ్రమాన్నే నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. మొక్కవోని దీక్షతో అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చారు. తొలుత ఒకరిద్దరితో ఆరంభమైన అనాథాశ్రమంలో నేడు 35 మంది ఆశ్రయం పొందుతున్నారు. రోజూ వారికి స్నానాల దగ్గర నుంచి అని సపర్యలు దేవీనే చూసుకుంటున్నారు. అన్నీతానై... వృద్ధాశ్రమానికి వస్తున్న వారిలో ఎక్కువశాతం జీవితచరమాంకంలో ఉన్న వారే. మొత్తం 32 మందిలో సగం మంది మంచానికే పరిమితం అయ్యారు. అలాంటి వారికి స్నానం చేయించడం దగ్గర నుంచి స్నానాలు చేయించడం, అన్నం తినిపించడం కూడా చేయాల్సి వస్తోంది. ప్రతిరోజూ 32 మందికి మూడు పూటల భోజనం చేయడం కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ ఏమాత్రం బరువుగా భావించకుండా ప్రతి రోజూ వారికి అన్ని తానై సేవలందిస్తున్నారు. ఎక్కువ మంది రోగాల బారిన పడుతుండటం, మానసికంగా ఇబ్బందులు చెందుతుండటంతో ప్రభుత్వ మానసిక వైద్యులు డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్వద్ద చికిత్సనందిస్తున్నారు. ప్రతి వారం ఆయన ఆశ్రమానికి వెళ్లి వృద్ధులకు ఉచితంగా చికిత్సనందిస్తున్నారు. ఊపిరి ఉన్నంత వరకూ సేవ చేస్తా మలిసంధ్యలో ఏ తోడు లేని వారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. తొలుత నా భర్త చేస్తున్న సేవా కార్యక్రమంలో తాను తోడు అందించాలని భావించా. ఇప్పుడు 35 మందికి ఆశ్రయం కల్పిస్తున్నాను. ఏనాడు బరువుగా భావించలేదు. నా ఊపిరి ఉన్నంత వరకూ సేవా చేయాలని అనుకుంటున్నా. నాతో పాటు నాభర్త, నా ఇద్దరు కూమారులు కూడా వీరిని చూసుకోవడానికే ఉన్నాం. – యర్రగుంట్ల దేవి,ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకురాలు సేవకు సత్కారం వృద్ధులకు సేవలందిస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్న దేవీ సేవలకు గుర్తింపు లభించింది. ఆశ్రయ అనాథాశ్రమం గురించి తెలుసుకున్న పలు స్వచ్ఛంధ సంస్థలు ఆమెను సత్కరించాయి. ఇటీవల సాహితీగగన్మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంత ఆణిముత్యాలు పురస్కారం అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో అవార్డు అందించారు. సహిత మహిళా సమాఖ్య, ఇన్నర్‌వీల్ సంస్థలు సంయుక్తంగా దేవీని సత్కరించాయి. బయోడేటా పేరు : యర్రగుంట్ల దేవి స్వగ్రామం : పాలచెర్ల, రాప్తాడు మండలం తల్లిదండ్రులు : కృష్ణమ్మ, లక్షీరెడ్డి కుటుంబ నేపథ్యం: నిరుపేద కుటుంబంలో జన్మించారు విద్యార్హత : పేదరికంతో చదువుకోలేదు వివాహ నేపథ్యం : 1992లో కాట్నే కాలువకు చెందిన మేనమామ కృష్ణారెడ్డితో వివాహం కుమారులు : రాజశేఖరరెడ్డి, మధుసూదన్‌రెడ్డి (మేనరికం పెళ్లి కావడంతో బుద్ధిమాంద్యంతో జన్మించారు. దీంతో చదువు మాన్పించాల్సి వచ్చింది. ప్రసుత్తం వృద్ధులకు సేవలో కుటుంబంఅంతా పాలుపంచుకుంటున్నారు) -
కలంతోనే కలల పోరాటం
అదొక మారుమూల గిరిజన ప్రాంతం. పట్టణాల ఊసే తెలియదు. అరకొరా వసతులు ఉండే ఈ ప్రాంతంలో అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. చదువు, పుస్తకాలు ఇవేమీ వారికి తెలియవు. కానీ జయంతి మాత్రం ఇలాంటి అననుకూల పరిస్థితులన్నింటినీ అధిగమించింది. అతికష్టంమీద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. కేవలం గ్రాడ్యుయేషన్‌తోనే ఆగిపోలేదు.. .తనలాగే మరో పది మంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుంది. ఒడిశాలోని అత్యంత నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి గిరిజన సమాజంలో తొలి మహిళ జర్నలిస్టుగా అందరి మన్ననలు పొందుతోంది. తన గిరిజన సమాజంలో మార్పు కోసం కలంతో పోరాటం చేస్తోంది. పది మంది అక్కాచెల్లెళ్లలో జయంతి ఒకరు. ఆమె నెంబర్ తొమ్మిది. అంటే తొమ్మిదో అమ్మాయి అన్నమాట. గిరిజన కోయ తెగలో అసలు అక్షరాస్యతే తక్కువ. అమ్మాయిలు బడికి వెళ్లడమే అరుదు. ఇక చదువుకోవడానికి సదుపాయాలు సంగతి సరేసరి. కానీ జయంతి తండ్రి అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించారు. తన ఆడబిడ్డలు చదువుకోవాలని నిర్ణయించారు. అందుకే తన సంతానంలో ఐదుగురిని ఎన్నో కష్టాలకోర్చి బడిబాట పట్టించారు. తండ్రి ఇచ్చిన సహకారాన్ని, ప్రోత్సహాన్ని అందిపుచ్చుకున్న జయంతి పట్టుదలగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కానీ ఆమె లక్ష్యం కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం కాదు. జర్నలిస్టు కావాలని కలలు కంది. తద్వారా తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటూ, వెనకడి వున్న తన గిరిజన సమాజంలో మార్పు తీసుకురావాలని భావించింది. అయితే అనుకున్న కలను సాకారం చేసుకోవటానికి ఎన్నో కష్టాలు పడింది. ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చింది కానీ తన ఇంటికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్శిటీకి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న వ్యవహారం. హాస్టల్ లో ఉండి చదువుకునే ఆర్థిక స్థోమతా లేదు. హాస్టల్లో ఉండి ఎలా చదువుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో, తన స్నేహితురాలు ఆమెకు అండగా నిలిచింది. తన బంధువు ఇంట్లో ఉండి చదువుకునేలా అవకాశం కల్పించింది. అలా జయంతి జర్నలిజం కోర్సు పూర్తి చేసింది. అనంతరం చదువు అయిపోగానే తన ఇంటర్న్‌షిప్ కోసం భువనేశ్వర్ వెళ్లాల్సి వచ్చింది. కానీ మళ్లీ ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చాయి. ఆమె ప్రతిభను, ఉత్సాహాన్ని, తాపత్రయాన్ని గమనించిన సినీ నిర్మాత బిరేన్ దాస్, జయంతికి గైడెన్స్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోనే జయంతి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి, ప్రధాన మీడియాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కళింగ టీవీలో ఆమె పనిచేస్తోంది. తన గిరిజన కమ్యూనిటీ మల్కాన్గిరీలోనే రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. జయంతి కల నెరవేరినప్పటికీ, నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కాన్గిరీలో కేవలం ఒకే ఒక్క మహిళ రిపోర్టింగ్ చేయడం ఆమెకు సవాల్‌గానే మారింది. అక్కడ కూడా లింగ వివక్ష ఎదురైంది. తన పురుష కొలీగ్స్ జయంతిని వెనక్కి లాగడానికి, భయపెట్టడానికి ఎన్నో ప్లాన్స్ వేసేవారు. ప్రతి అడుగును తను సవాల్‌గా తీసుకునేది. పురుష జర్నలిస్ట్‌లకు పోటీగా రాణించడం ప్రారంభించింది. వీటిన్నింటికి మించి ఆమెకెదురైన మరో పెద్ద సవాల్ పోలీసు వేధింపులు. ఒక కోయ తెగకు చెందిన అమ్మాయి విద్యాధికురాలిగాఉండటం,ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటంతో పోలీసులు ఆమెపై మావోయిస్టు ముద్ర వేశారు. ఈ క్రమంలో పలురకాలు వేధింపులు ఆమెకు తప్పలేదు. ఆ వేధింపులను కూడా జయంతి ధైర్యంగా ఎదుర్కొంది. ఎక్కడా కూడా తాను తలొగ్గలేదు. జయంతి సాహాసానికి పోలీసులు సైతం వెనుకంజ వేయాల్సి వచ్చింది. జయంతి కేవలం జర్నలిస్టుగా మాత్రమే కాక, గిరిజన సమాజంలోని బాలికలు చదువుకునేందుకు ఒక ఎన్జీవోను సైతం నిర్వహిస్తోంది. ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద అవకాశాలే ఆమె ముందు వచ్చి వాలినప్పటికీ, తాను మాత్రం తన గిరిజన కమ్యూనిటీలోనే తొలి మహిళా జర్నలిస్టుగా సేవలందిస్తోంది. ఒకవేళ తను కనుక ఇక్కడ పనిచేయకపోతే, తన చదువుకు సార్థకమే లేదని అంటోంది జయంతి. - కె. శ్రావణి రెడ్డి -
శెభాష్.. షహనాజ్
అశ్వాపురం: కనిపెంచిన తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనాథలు, అభాగ్యులైన వృద్ధులను చేరదీస్తూ.. మానవత్వం పంచుతూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.. షహనాజ్‌బేగం. మండల కేంద్రమైన అశ్వాపురంలో 2011 జూన్ 27న మండల పరిధిలోని అమ్మగారిపల్లికి చెందిన షహనాజ్‌బేగం ఆమె సోదరిమణులు వహిదాబేగం, నూర్జహాన్‌బేగం, అరీఫాసుల్తానాలు కలిసి అరీఫా–రోష్ని వృద్ధాశ్రమాన్ని స్థాపించారు. ఆరు నెలలకే ఆమె సోదరిమణులు వ్యక్తిగత కారణాలతో దూరప్రాంతాలకు వెళ్లారు. అప్పటినుంచి షహనాజ్‌బేగమే వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. అభాగ్యులైన వృద్ధులకు అండగా ఉంటోంది. తమ స్వార్థం కోసమే తాము బతుకుతూ ఇతరుల కష్టాలు తమకెందుకని భావిస్తున్న ప్రస్తుత సమాజంలో వృద్ధులను తన కన్నతల్లిదండ్రులలాగా చూసుకుంటోంది. ఆమె సేవా దృక్పథాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు అభినందిస్తున్నారు. 7 సంవత్సరాలుగా వృద్ధాశ్రమం నిర్వహణ వృద్ధాశ్రమం స్థాపించినాటి నుంచి తన భర్త సహకారంతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకుసాగుతోంది. మణుగూరు ఏరియా సింగరేణి అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పురప్రముఖలు, మండల కేంద్ర ప్రజలు, దాతల సహకారంతో వృద్ధులకు ఏడు సంవత్సరాలుగా అన్ని సౌకర్యాలూ అందిస్తోంది. ఒక్కోసారి ఖర్చులు సొంతంగా కూడా భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం అరీఫా–రోష్ని వృద్ధాశ్రమంలో 18 మంది వృద్ధులు ఉన్నారు. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బందులు పడవద్దని ఇటీవల షహనాజ్‌బేగం మండలకేంద్రంలోని మంచికంటినగర్‌లో భూమి కొనుగోలు చేసి వృద్ధాశ్రమం భవన నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, స్థానికుల చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. సేవే.. సంతోషం వృద్ధాశ్రమం నిర్వహిస్తూ.. ఏ దిక్కూ లేని అభాగ్యులైన వృద్ధులకు సేవచేయడం సంతోషంగా ఉంది. నా భర్త ఎస్కే.మెహరాజ్, దాతల సహకారంతో ఇబ్బందులు అధిగమించి ఆశ్రమం నిర్వహిస్తున్నా. అద్దె భవనంలో వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వృద్ధాశ్రమానికి నూతన భవనం నిర్మించేందుకు శంకుస్థాపన చేయించాం. నిర్వహణకు దాతలు çకూడా సహకరించాలి. –షహనాజ్‌బేగం, అరీఫా–రోష్ని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు -
ఘట్టమనేని ఘటికురాలు
అలల రూపంలో ఎగసిపడుతూ వస్తున్న కష్టాలకు ఎదురునిలిచి గెలుస్తూ వచ్చిన ఆ యువతి పేరు ఘట్టమనేని సాయిరేవతి. తండ్రిని కోల్పోయి పేదరికమే పెద్ద దిక్కయిన ఇంట్లో తానే ఓ శక్తిగా మారింది. చిన్న వయసులోనే కుటుంబ భారం తెలిసిన ఆమెకు పవర్ లిఫ్టింగ్‌లో బరువులు తేలికగానే అనిపించాయి. చెదరని ఆత్మబలానికి కఠోర దీక్షను జత చేసింది. అంతే రాష్ట్ర, జాతీయ స్థాయిలో 40కుపైగా స్వర్ణ, రజక పతకాలు ఆమెకు తలవంచాయి. కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు మెడలో మణిహారమయ్యాయి. మరోవైపు చదువుల్లో మేటిగా రాణించి ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగమూ సాధించింది సాయి రేవతి. తెనాలిరూరల్: తెనాలి సమీపంలోని పెదరావూరు సాయి రేవతి నివాసం. చదువులు, బరువుల వేటలో అద్భుతంగా రాణిస్తున్న ఆమె జీవితం చాలా మందిలా వడ్డించిన విస్తరి కాదు. వీరి స్వస్థలం బుర్రిపాలెం. ఆరోతరగతిలో ఉండగా అనారోగ్యంతో తండ్రి మరణించాడు. తల్లి పద్మావతి సాయిరేవతినీ, పెద్దమ్మాయి యామినీజ్యోతిని తీసుకుని పెదరావూరులోని పుట్టింటికి చేరింది. ‘అమ్మమ్మ శాఖమూరి సీతారావమ్మ పెద్దమనసుతో ఆదరించింది. వారికుంది ఎకరం పొలమే. ఆ ఆదాయంతోనే అందరం సర్దుకున్నాం’ అని చెప్పింది సాయిరేవతి. అతికష్టం మీద ఇంటర్ పూర్తి చేసి తెనాలిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరింది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తే, పోలీసు అధికారి కావాలన్న కోరిక నెరవేరుతుందన్న భావన కలిగింది. కాలేజీ యాజమాన్యం ప్రోత్సాహం, వ్యాయామ అధ్యాపకుల పర్యవేక్షణతో సాధన ఆరంభించింది. శరీర గాయాలతో, పౌష్టికాహారానికి తగిన డబ్బులు లేక బాధపడిన సందర్భాలెన్నో! అన్నిటినీ తట్టుకుంటూ చేసిన సాధనకు ఇప్పుడు ఫలితం లభించింది. కామన్వెల్త్లో మెరిసిన రేవతి.. సాధనతో ఎత్తే బరువులనే కాదు, మానసిక బలాన్ని పెంచుకుంటూ వెళ్లింది. దక్షిణాఫ్రికాలో గతేడాది జరిగిన 7వ కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్–2007లో మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అంతకు కొద్ది రోజుల ముందే కేరళలోని అలెప్పీలో ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జాతీయ రికార్డు నెలకొల్పింది. డెడ్‌లిఫ్ట్‌లో 2016లో జమ్ములో తాను నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసి, సరికొత్త రికార్డుతో బంగారు పతకం కైవసం చేసుకుంది. ఓవరాల్ ప్రతిభలోనూ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది. 2015లో ఉత్తరాఖండ్‌లో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో 350 కిలోల విభాగంలొ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓవరాల్‌లో తన ప్రతిభ 360 కిలోలకు పెరిగింది. 2016 డిసెంబరులో జార్ఖండ్‌లోని టాటానగర్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ‘స్ట్రాంగ్ విమెన్’, ‘బెస్ట్ లిఫ్టర్’గా రెండు స్వర్ణ పతకాలను గెలిచింది. ఈ విజయాలతో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ పోటీలకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరు గుంటూరు జిల్లా యువతుల్లో సాయిరేవతి ఒకరు. అంతర్జాతీయపోటీల్లో సత్తా 2014లో థాయ్‌లాండ్‌లోని నార్త్ఛాంగ్మయి యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొంది. 2009–10 నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆరేళ్లు వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ను సాధించింది. ఇందులో 4 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా 3 సార్లు స్ట్రాంగ్ విమెన్‌గా నిలిచింది. కాకినాడలోని జేఎన్టీయూలో చదివేటప్పుడు అక్కడా ఐదేళ్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2 సార్లు బెస్ట్ లిఫ్టర్‌గా, మరో రెండేళ్లు స్ట్రాంగ్ విమెన్‌గా, ఒకసారి బెస్ట్ అథ్లెట్‌గా బహుమతులు గెలుచుకొంది. మరో ఏడాది ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది యూనివర్శిటీ’ అవార్డును అందుకోవటం విశేషం. బీకాం, ఎంబీఏ, ఎంఎస్సీ పూర్తిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీట్ పరీక్షలో టాపర్‌గా నిలిచి, బీపీఈడీ చేసింది. అదే స్ఫూర్తితో ‘నాగార్జున’ పీజీ సెట్ (2015)లో టాపర్‌గా నిలిచింది. లక్ష్యంపైదృష్టి సారించాలి చిన్నతనంలో నాకు ఎదురైన కష్టాలే సవాళ్లను నేర్పించాయి. తండ్రిని కోల్పోయాక ఉద్యోగం సాధించాలని దృఢంగా అనుకున్నాను. వెయిట్ లిఫ్టింగ్ రంగం ఎంచుకున్నాక బాగా శ్రమించాను. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడంతో విజయాలు వాటంతట అవే వచ్చాయి. నేటి యువత సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాలపై పెట్టిన శ్రద్ధ కెరీర్‌పై ఉంచడం లేదు. ఈ ధోరణి మారాలి. లక్ష్యాన్ని ఏర్పరచుకుని శ్రమించాలి. – సాయిరేవతి,కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ -
ఎగిరే మనసు ఆత్మవిశ్వాసమే ఆయుధం
‘‘స్టీఫెన్ హాకిన్స్.. అసాధ్యాలను సుసాధ్యం చేసి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఈ శాస్త్రవేత్త దివ్యాంగుడు. మూడు చక్రాల బండిలో కూర్చొని కదల్లేని స్థితిలోనూ అంతరిక్షాన్ని జయించాడు. కుల వృత్తులు మొదలు.. రాజకీయాలు.. ఉద్యోగాలు.. ఈ రంగంలోనూ తాము తీసిపోమని నిరూపిస్తున్నా ఇప్పటికీ దివ్యాంగులంటే చులకనే. పోటీ ప్రపంచానికి ఎదురొడ్డి రాణిస్తున్నా.. అవకాశాల విషయంలో అవిటితనం అడ్డుపడుతోంది. కాదు.. సాకుగా చూపుతున్నారు. ఈ వివక్ష ఇంకెన్నాళ్లు. ఒక్కసారి ప్రోత్సహించి చూడండి.. వెన్నుతట్టి ముందుకు నడిపించండి. జాలి వద్దు.. ఆటుపోట్లను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఇవ్వండి.’’ – కొప్పుల వసుంధర పోలియో మహమ్మారి రెండు కాళ్లను మింగేసింది. పట్టుదలతో చదువులో రాణించింది. జర్నలిజంలో పీజీ పూర్తి చేసింది. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడవచ్చని భావిస్తే.. అడుగడుగునా వివక్ష ఎదురయింది. అయ్యో పాపం అనే వాళ్లే కానీ.. అవకాశం కల్పించే మనసు ఏ ఒక్కరికీ లేకపోయింది. ఇంతటితో జీవితం అయిపోయిందని బాధపడుతూ కూర్చోలేదు. తనకు తాను అవకాశాలను సృష్టించుకుని, ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. పది మందికి సాయపడాలనే మంచి మనసు స్ఫూర్తి బాటలో పయనిస్తోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన శెట్టూరులో జన్మించిన దివ్యాగురాలు వసుంధర.. మూడు చక్రాల కుర్చీలో నుంచే సొంత ఊరు ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటి భళా అనిపిస్తోంది. శెట్టూరు: కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరుకు చెందిన ప్రమీలమ్మ, ఆనందరావు దంపతుల కుమార్తె కొప్పుల వసుంధర. చిన్నప్పుడు పోలియో సోకడంతో రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. ఆమె జీవితాన్ని వైకల్యం వెక్కిరించింది. అదే సమయంలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రిని కూడా కోల్పోయింది. నేనున్నానని వెన్నుదన్నుగా నిలిచే మనుషులు కరువయ్యారు. అంతులేని వివక్షను చవిచూసింది. సానుభూతి చూపులు తనకు వద్దనుకున్న వసుంధర ఆత్మవిశ్వాసంతో చదువుల తల్లి ఒడిలో ఎదిగింది. జీవితంలో పైకి చేరుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించిన ఆమె పట్టుదలతో జర్నలిజంలో పీజీ పూర్తి చేసింది. ముందుకు నడిపిన సంకల్పం సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని వసుంధర నిరూపించారు. తనకంటూ ఓ కెరీర్‌ని ఏర్పాటు చేసుకునే క్రమంలో అంతులేని వివక్షను ఎదుర్కొన్నారు. తల్లి ప్రమీలమ్మ ప్రోత్సాహం ఆమెను ముందుకు నడిపించింది. జీవితంలో ఏది సాధించాలన్నా చదువు ముఖ్యమని చెప్పిన తల్లి మాటలను గుండెల్లో నింపుకొని అక్షరాలతో చేసిన స్నేహం ఒక్కో మెట్టును ఎక్కించింది. తనను ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న మాతృమూర్తి ఆకాంక్షను నెరవేర్చే దిశగా సీఏ కోర్సులో చేరింది. ఆ సమయంలోనే ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. తనలో దాగున్న రచనా వ్యాసంగాన్ని గుర్తించి జర్నలిజంలో పీజీ చేశారు. ఆ తర్వాత ఉద్యోగాన్వేషణలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో పత్రికా సంస్థలను ఆశ్రయించినా.. ఒక్కరూ అవకాశం కల్పించలేకపోవడంతో ఆమెను కలచివేసింది. చివరకు ఓ లోకల్ చానల్ ఆమెకు అవకాశం కల్పించింది. అలా మొదలైన ప్రస్థానంలో ఆమెను ప్రతిభను గుర్తించి మరికొన్ని సంస్థలు కూడా వెన్నుతట్టి ప్రోత్సహించాయి. మిగిలిన వాళ్లకంటే ఎక్కువగా శ్రమిస్తున్నా.. ‘స్పెషల్ కేటగిరీ’ అనే పదం ఆమెను ఆలోచింపజేసింది. అంధుల కోసం ప్రత్యేకంగా.. మూడేళ్ల తర్వాత 2014లో ‘వీవ్’ అనే మీడియా సంస్థను స్థాపించి ఈవెంట్స్ చేపట్టారు. ఉపాధి కల్పనలో భాగంగా స్థాపించిన సంస్థ కావడంతో ముందుకు నడిపించేందుకు ఎంతో శ్రమించారు. పుట్టిన రోజులు.. పెళ్లిళ్లు.. శుభకార్యాలు, కార్పొరేట్ సంస్థల ప్రారంభోత్సవాల్లో ఈవెంట్ మేనేజర్‌గా రాణించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆమెను చూసిన తొలి రోజుల్లో ‘ఏం చేయిస్తుందని’ చాలా మంది అవకాశాలు ఇచ్చేందుకు వెనుకంజ వేశారు. అయితే ఆమెలోని పట్టుదలను చూసి ఒక్కో అవకాశం ఆమెకు ఎదురేగి స్వాగతం పలికింది. అతనికాలంలోనే 2014లో అంధ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా వీసీసీఎల్ టోర్నీ నిర్వహించారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రూ.3 లక్షల సొంత డబ్బుతో టోర్నీని విజయవంతం చేశారు. ఆమెలోని క్రియేటివిటీని గుర్తించి ఈవెంట్లను ఇచ్చి ప్రోత్సహించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మిస్ ఎబిలిటీ–18’ పేరిట వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో ఘనంగా సన్మానించింది. -
ధైర్యంగా కొన'సాగు'తూ..
ముంచుద్దో లాభమొస్తదో..చెప్పలేని ఎవుసాన్ని మహిళలు ధైర్యంగా చేస్తున్నారు. కుటుంబ భారం మోసేందుకు, తమపై ఆధారపడిన వారికి అండగా నిలిచేందుకు లాభాల ‘పంట’ పండిస్తున్నారు. శ్రమశక్తిని చాటుతూ..పురుషులకు ఏమీ తీసిపోకుండా..కష్టనష్టాలను ఓర్చుకుంటూ నిబ్బరంగాముందడుగేస్తూ శెభాష్అనిపించుకుంటున్నారు. ఖమ్మం, అశ్వారావుపేటరూరల్: మండలంలోని పాత నారంవారిగూడెం గ్రామానికి చెందిన పేరం లక్ష్మి వ్యవసాయం చేస్తూ, లాభాల పంటలు పండిస్తూ ఆ ఇంటికి అండగా మారింది. ఆ ఊళ్లో వారికి మహిళా రైతు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఆమె పేరే. పెళ్లైన కొంతకాలం తర్వాత నుంచి వ్యవసాయంపై మక్కువతో వివిధ రకాల పంటలను సాగు చేస్తోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు దశాబ్దాలుగా వ్యవ‘సాయం’ చేస్తోంది. తెల్లవారుజామున ఇంటి పనులు పూర్తి చేసుకొని రాత్రి వరకు పొలం బాటలోనే ముందుకు సాగిపోతోంది. సొంత వ్యవసాయ భూముల్లో భర్త పేరం కృష్ణ పామాయిల్, వరి పంటలను సాగు చేస్తుంటే ఆమె మాత్రం భూములను కౌలుకు తీసుకొని మరీ అనేక రకాల పంటలను పండిస్తుండడం విశేషం. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉండగా..వీరందరికీ వివాహాలయ్యాయి. పెద్ద కొడుకు తల్లితోపాటు వ్యవసాయం చేస్తుండగా, రెండో అబ్బాయి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్లకు సొంతంగా పూర్వీకుల నుంచి 10 ఎకరాల సాగు భూమి వాటాగా రాగా, పామాయిల్‌ను సాగు చేస్తున్నారు. ఆమె ఇంటికే పరిమితం కాకుండా భర్త, కొడుకుతో పోటీపడి మరి సొంతంగా వ్యవసాయం చేస్తోంది. స్వగ్రామానికి సమీపంలో గల మొద్దులగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో చెరకు పంట, మరో నాలుగు ఎకరాల్లో వాణిజ్య పంటైన మొక్కజొన్న పండిస్తోంది. మరో రెండెకరాల్లో చిక్కుడు, కాకర వంటి కూరగాయలను సాగు చేస్తోంది. ఇంటి వద్ద ఐదు పాడి గేదలను సాకుతూ..పాలను విక్రయిస్తోంది. ఖమ్మంరూరల్: పంటలు కలిసిరాక..చేసిన అప్పులు తీర్చలేక గోళ్లపాడు శివారు ఊటవాగుతండాకు చెందిన రైతు తేజావత్ రాందాసు ఆత్మహత్య చేసుకుంటే..గుండెనిబ్బరంతో అతడి భార్య నీలమ్మ అదే వ్యవసాయాన్ని చేస్తూ ముగ్గరు బిడ్డలను చదివించుకుంటోంది. భర్త పోయాడనే బెంగ ఓ పక్క, చేసిన అప్పులెలా తీర్చాలోననే బాధ మరో పక్క వేధిస్తున్నా కళ్లముందు కనిపిస్తున్న ముగ్గురు ఆడపిల్లలను చదివించేందుకు కష్టాలను ఎదుర్కొంది. పెద్ద కూతురు శ్రావణి ఇంటర్ చదువుతోంది. రెండో కూతురు సంధ్య ఎనిమిది, మరో కూతురు స్వాతి ఆరో తరగతి చదువుతున్నారు. నీలమ్మకు ఉన్న ఎకరం భూమికి తోడు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తోంది. ఈమెకు కూడా కాలం కలిసి రావట్లే. అప్పులు పెరుగుతున్నాయి. కానీ..దశ తిరగకపోతుందా అనే ఆశతో, ధైర్యంతో వ్యవసాయం చేస్తోంది. పిల్లలు కూడా ఖాళీ సమయాల్లో తల్లికి చేదోడువాదోడుగా సహకరిస్తున్నారు. భర్తను మింగిన అప్పులు.. నీలమ్మ భర్త మిర్చి, మొక్కజొన్న పంటలను పండించేవాడు. సాగునీటి కోసం రెండు బోర్లు వేయించినా అందులో చుక్కనీరు రాలేదు. కానీ..రూ.లక్ష అప్పు మిగిలింది. కౌలుకు తీసుకొని సాగు చేసిన ఏడెకరాల్లో మిర్చితోట దిగుబడి రాక ముంచింది. ఇలా మొత్తం రూ.5లక్షల అప్పులు మిగిలాయి. ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో 2011 అక్టోబర్‌లో చేను వద్దనే నీలమ్మ భర్త రాందాసు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కష్టాలను అధిగమిస్తూ..పిల్లలకు తానే పెద్ద దిక్కుగా మారింది. రోజంతా చేను పనే.. ఇంటి నుంచి చేనుకు పోయిందంటే..తిరిగి చీకటి పడుతుండగానే ఇంటికి చేరుతుంది ఈ లక్ష్మి. కూలీలు పొలానికి రాకముందే అక్కడికి చేరుకుని సిద్ధంగా ఉంటుంది. మొక్కజొన్న పంటకు తడి పెట్టడంతోపాటు, మడులు కట్టడం, కలుపు తీసే పనులు చేస్తుంది. చెరకు తోటల్లో చెరకు నరకడంతోపాటు, నాట్లు వేయడం, కలుపు నివారణ మందులు(పురుగుల మందు)సైతం స్ప్రేయింగ్ చేస్తుంది. ఇక కూరగాయాల తోటల్లో చిక్కుడు, కాకర కోతలు, వాటికి వివిధ రకాల మందులను పిచికారీ చేయడం వంటి పనులు కుడా ఆమె సొంతంగా చేస్తుంది. పెట్టుబడి ఖర్చులు పోను..నష్టాలు లేకుండా ఆదాయం పొందుతున్నట్లు ఆమె ఆనందంగా చెబుతోంది. సూపర్‌బజార్(కొత్తగూడెం): భర్త మరణం ఆమెను కుంగదీసింది. ఏం చేయాలో తోచలే. కానీ..పిల్లల కోసం కొత్త పయనం మొదలెట్టింది. వ్యవసాయాన్ని ఎంచుకొని రాజీ పడకుండా ముందుకు సాగింది. రేగళ్ల గ్రామ పంచాయతీ పెద్దతండాకు చెందిన జాటోతు రాజీ భర్త అనారోగ్యంతో చనిపోగా..ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడిని రెండెకరాల్లో వ్యవసాయం చేసి పెంచింది. కలుపు తీయడం, పురుగులమందు కొట్టడం, సాగు పనులన్నీ చేసుకుంటూ పైసాపైసా కూడబెట్టుకొని నిలదొక్కుకుంది. పెద్ద బిడ్డ కవిత, రెండో కూతురు సునీతలకు వివాహం చేసింది. మూడో కూతురు హరిత ఆరో తరగతిలోనే చదువు ఆపేసి..అమ్మకు ఆసరాగా ఉంటోంది. కొడుకు మాదిరిగానే సహకరిస్తోంది. రాజీ కుమారుడు వీరన్న రేగళ్లలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెద్దయ్యాక అమ్మ కష్టాలను తీరుస్తానని చెబుతున్నాడు. -
సాగులో సగం
కడదాకా కలిసుంటానన్న మగ దిక్కు మధ్యలో ‘కాడి’ దింపేశాడు. అప్పులు బాధతో కొందరు, అనారోగ్యంతో మరికొందరు భార్య, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కొంతకాలం ఆ మహిళలు దిక్కుతోచని స్థితి ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వారికి పిల్లల పోషణ, చదువులు, కుటుంబ భారం గుర్తుకొచ్చింది! ఇంకేం భర్త దించిన ‘కాడి’నే ఎత్తుకున్నారు. కుటుంబానికి ఇంతకాలం అండగా ఉన్న, తాము నమ్ముకున్న భూమిలో వ్యవసాయం ఆరంభించారు. నష్టాలు వచ్చాయ్.. లాభాల్ని కళ్ల జూశారు.. అయినా ఎక్కడా ఆ ‘మహిళా మణులు’ తమ ధైర్యాన్ని కోల్పోలేదు. సాగులో ముందుకు సాగుతూ పిల్లలను ప్రయోజకుల్ని చేస్తూ మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి మహిళల్లో కొందరి కథనాలు.. కౌలు భూముల్లో వ్యవ‘సాయం’ మహబూబ్‌నగర్, గట్టు: మండలంలోని సల్కాపురం గ్రామానికి తూము రాములమ్మ భర్త నర్సప్ప 12 ఏళ్ల క్రితం చెరువులో మృతదేహమై తేలాడు. అప్పటికి ఈ కుటుంబానికి ఎకరా పొలం మాత్రమే ఉంది. అదీ కూడా వర్షాధారంగా పం టలు పడే భూమి. భర్త ఉన్న రోజుల్లో సేద్యం పనులు ఆయనే చూసుకునే వాడు. అయితే, ఆయన మృతితో నలుగురు పిల్లల భారం ఆమెపై పడింది. అప్పుడు కూలీ పనులు చేస్తూ ఆమె పిల్లలను పెంచసాగింది. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల చదువు మాత్రం మాన్పించలేదు. ఆ తర్వాత ఎకరం పొలం కౌలుకు తీసుకుని పత్తి, పొగాకు సాగు చేయసాగింది. పిల్లల్లో ఓ కుమార్తె మంగమ్మ వివాహం జరిపించగా, ఓ కుమారుడు తిమ్మప్ప తల్లికి వ్యవసాయ పనుల్లో అండగా ఉంటున్నాడు. మిగతా వారిలో గోవిందు 9వ తరగతి, హైమావతి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ సందర్భంగా రాములమ్మ మాట్లాడుతూ ఎకరం పొ లం కౌలు తీసుకుని సాగు చేస్తూనే.. ఖాళీ సమయాల్లో పక్క పొలాల్లో కూలీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తనలా పిల్లలు కావొద్దనే భా వనతో చదివిస్తున్నట్లు వెల్లడించారు. ‘మగ’రాణులు మహబూబ్‌నగర్, గోపాల్పేట: వ్యవసాయం చేయడంలో మగవారికి సాటి ఎవరూ రారని అనుకుంటారు. కానీ వ్యవసాయంలో సాయంగానే ఉన్న వారిద్దరూ భర్త మృతి చెందాక సొంతంగా మగ వారికి ధీటుగా వ్యవసాయ రంగంలో రాణిస్తూ అందరి చేత ‘మగ’ రాణులు అనిపించుకుంటున్నారు సీత, మంగమ్మ. గోపాల్పేట మండలం బుద్దారం పంచాయతీ పరిధి జాంప్లాతండాకు చెందిన కాట్రావత్ గోపాల్‌కు మొదటి భార్య మంగమ్మ. ఈమెకు సంతానం లేకపోవడంతో సీతను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మంగమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు, సీతకు ఒక కొడుకు జన్మించారు. అప్పటి నుంచి గోపాల్ తనకున్న 10 ఎకరాల పొలంపై ఆధారపడి తల్లిదండ్రులు లచ్యా, దేవ్లీతో పాటు కుటుంబాన్ని పోషిస్తుండగా.. పిల్లల చిన్న వయస్సులో 16 ఏళ్ల క్రితం గోపాల్ అనారోగ్యంతో మరణించాడు. తొలుత ఏం చేయాల్లో దిక్కుతోచక సీత, మంగమ్మ మనో వేదనకు గురయ్యారు. వారిద్దరూ పనుల కోసం ముంబై వెళ్తారని అందరూ భావించినా.. భర్త మరణం తర్వాత బీడు పడిన పొలాన్ని బాగు చేసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకుని పిల్ల లను అత్తామామల పర్యవేక్షణ ఉంచి ముం దుకు సాగారు. వ్యవసాయం చేసుకుంటు పిల్లలను చదివించడం ప్రారంభించారు. బోర్లు ఎండిపోయినా.. ఏటా సీత, మంగమ్మ తమ పొలంలో మొక్క జొన్న, వేరుశనగ, వరి పండిస్తుండగా.. ఉన్న బోరు ఎండిపోవడంతో వరుసగా నాలుగేళ్లు నాలుగు బోర్లు వేయించిన నీళ్లు పడలేదు. అయినా మొక్కువోని ధైర్యంతో ప్రస్తుతం యాసంగిలో నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. రూ.లక్ష ఖర్చు పెట్టి కిలోమీటర్ దూరం నుంచి పైప్‌లైన్ ద్వారా చెక్‌డ్యాం నుంచి పంటకు నీళ్లందిస్తున్నారు. ఇక పిలల్లు తమలా కావొద్దని చదివిస్తుండగా.. మంగమ్మ పెద్ద కొడుకు కురుమూర్తి డిగ్రీ పూర్తయ్యాక పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. రెండో కుమారుడు చందు ఏడో తరగతి పూర్తయ్యాక హైదరాబాదులో ఆటో నడుపుతున్నాడు. కూతురు శారద వనపర్తిలోని మరికుంట గురుకులంలో ఇంటర్ చదువుతుండగా, సీత కొడుకు రాజు బుద్దారం హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం రానున్న పిల్లలను ప్రయోజకులను చేయాలన్న తపన వారిలో కనిపిస్తుంది. భర్త చనిపోయినా ఆగని కాడి నాగర్‌కర్నూల్ రూరల్: ఎప్పుడో 22 ఏళ్ల క్రితం తన భర్త పాముకాటుతో మరణించాడు. అప్పుడు ఆమె చేతిలో నాలు గో తరగతి చదువుతున్న బాబుతోపాటు మరో బాబు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వ్యవసాయం చేస్తూ తన పిల్లలను ఉన్నత చదువులకు పంపించింది నియోజకవర్గంలోని రాయిపాకులకు చెందిన వేనేపల్లి సులోచనమ్మ. ప్రస్తుతం పెద్ద కుమారుడు విజయేందర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసి చైనాలోని సైన్స్ జిన్టెక్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ చదివేందుకు సీటు సాధించాడు. పెద్ద కుమార్తెను డిగ్రీ వరకు చదివించాక ప్రభుత్వ ఉద్యోగితో పెళ్లి చేయగా, ఇటీవలే చిన్న కుమారుడు, చిన్న కుమార్తెకు కూడా వివాహం జరిపించింది. పిల్లలు ప్రయోజకులైనా తాను నమ్ముకున్న వ్యవసాయాన్ని మాత్రం సులోచనమ్మ కొనసాగిస్తుండడం విశేషం. వ్యవసాయం.. ఆమెకు ప్రాణం మదనాపురం: చిన్నప్పటినుండి అనేక రకాల పంటలు పండిస్తూ భూమినే నమ్ముకున్న మదనాపురం మండలం గోవిందహల్లికి చెందిన గౌనికాడి చెన్నమ్మ పలువురికి ఆదర్శంగా నిలుస్తోం ది. భర్త నాగన్న, కొడుకుల సహకారంతో తమకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఏటా ప్రకృతి సహకరించిన, సహకరించకపోయి నా ముందుకు సాగుతోంది. ఉదయాన్నే పొలానికి వెళ్లి పంటలకు నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువుల చల్లడంతో పాటు ఇంటి దగ్గర ఉన్న గేదెకు మేత తీసుకురావడం, పాలు పితకడం వరకు అన్ని పనులు చెన్నమ్మ సజావుగా చేస్తుండడం విశేషం. ఇక పంటలకు ఏదైనా రోగాలు వస్తే ప్రమాదాన్ని గుర్తించి అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తుండడంతో నష్టాలు రావడం లేదు. ఈ సందర్భంగా చెన్నమ్మ మాట్లాడుతూ వ్యవసాయం అంటే చిన్నప్పటి నుండి తనకు ప్రాణమని, వివాహమైన తర్వాత కూడా తన భర్తకు ఉన్న పొలంలో వ్యవసాయం సాగిస్తున్నానని తెలిపారు. సమయం దొరికినప్పుడల్లా గ్రామంలో వేరే రైతుల పొలాల్లో పనులు చేస్తానని పేర్కొంది. పండించడంలో ఉన్న ఆనందం ఎందులోనూ దక్కదని, ఒక్క రోజు పొలానికి వెళ్లకున్నా మనస్సుకు వెలితిగి ఉంటుందని తనకు పొలంపై ఉన్న ప్రేమను ఆమె తెలియజేసింది. కష్టాలకు ఎదురీదిన రాజేశ్వరమ్మ మరికల్: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త కాన్సర్ వ్యాధితో బాధ పడుతూ మృతి చెందాడు.. పుట్టెడు దుఖాన్ని దిగమిగుతూ చేతికోస్తున్న పిల్లలను ఉన్నత చదువులను చదివించేందుకు భర్త చూపిన దారినే ఎన్నుకుంది. వ్యవసాయ పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించింది మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరమ్మ. అంజిల్‌రెడ్డి–రాజేశ్వరమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. వీరికి పది ఎకరాల పొలం వుంది. అంజిల్‌రెడ్డి ఐదేళ్ల క్రితం కేన్సర్ బారిన పడడంతో చికిత్స రూ. 8 లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో అటు భర్త వైద్యం కోసం చేసిన అప్పులు.. ఇటు పిల్లల పోషణ భారం ఒకేసారి మీద పడగా ధైర్యాన్ని కూడగట్టుకున్న ఆమె భర్త చూపిన వ్యవసాయాన్నే నమ్ముకుంది. వరి, వేరు శనగా, పత్తి, కందులతో పాటు వివిధ రకాల తోటలు సాగు చేయగా.. ఓ ఏడాది లాభం, మరో ఏడాది నష్టం వచ్చినా వెనుతిరగలేదు. పంటలు అమ్మగా వచ్చిన ఆదాయంతో భర్త వైద్యం కోసం చేసిన అప్పులు తీరుస్తూ, పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ కుమార్తె అనితను కానిస్టేబుల్‌ను చేసింది ఆ తల్లి.పెద్ద కుమారుడు మురళీధర్‌రెడ్డి హైదరాబాద్‌లో పీజీ చేస్తూ ప్రైవేట్ ఉద్యోగంలో చేరగా, చిన్న కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి నాగార్జునసాగర్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదివుతున్నాడు. వ్యవసాయంతో జీవన పోరాటం వెల్దండ: వెల్దండకు చెందిన గొడుగు యాదమ్మ వ్యవసాయాన్నే నమ్ముకుని ముందకు సాగుతోంది. ఆమె భర్త ఎనిమిదేళ్ల క్రితం, ఆ తర్వాత చిన్న కుమారుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ తర్వాత ఆవేదన చెందినా, కొద్దికాలానికి ధైర్యాన్ని కూడగట్టుకుని తమ నాలుగు ఎకరాల పొలంలో పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం టమాట, వంకాయ, చిక్కుడు తోటలు సాగు చేస్తోంది. -
మాగాణికి మహారాణి
ఆమె స్పర్శిస్తే భూమి పులకరించిపోతుంది. పలకరిస్తే చేను పరవశించిపోతుంది. పంట చెప్పినట్టు వింటుంది. పసిడి పంటను చేతికందిస్తుంది. భూమితోనే సహవాసం. భూదేవి అంత సహనం. ఆమె ఇప్పుడు.. ఇంటికే కాదు.. మాగాణికి కూడా మహారాణి. శక్తియుక్తులతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న ధీశాలి. అలాంటి మగ‘ధీర’ల విజయగాథలకు అక్షర రూపమిది. సాలూరు రూరల్ (పాచిపెంట): కొండకొనలే ఆమె ప్రపంచం. ప్రకృతితోనే సహవాసం. పంట పొలాలతోనే జీవితం. అధిక దిగుబడులు సాధించడంలో అద్భుతమైన నైపుణ్యం. అవే ఆమెను దేశాధ్యక్షుని ప్రశంసలు అందుకునేలా చేశాయి. ఆ ఆదర్శ గిరిజన మహిళా రైతు పాచిపెంట మండలం పణుకువలస గ్రామానికి చెందిన మంచాల పారమ్మ. ప్రయోగాలకు పెట్టింది పేరు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలకు పెట్టింది పేరు పారమ్మ. ఆమె సేంద్రియ ఎరువుల వినియోగానికే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వ్యవసాయాధికారులు చెప్పే సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటించింది. భూమి సారాన్ని బట్టి పంటను సాగు చేస్తూ మెలకువలతో మంచి ఫలితాలు సాధిస్తోంది. పంటల సాగులో ప్రయోగాల వల్లే ఎకరాకు పది క్వింటాళ్లు కూడా రాని రాగులు.. ఎకరాకు 26 క్వింటాళ్ల దిగుబడిని సాధించి రైతులందరికి ఎంతో ఆదర్శంగా నిలిచింది. జాతీయ ఉత్తమ రైతు పురస్కారాన్ని అప్పటి రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకుంది. ఓల్డ్ఈజ్ గోల్డ్ అధిక దిగుబడులు సాధించడం వెనుక విజయ రహస్యం ఏమిటని రైతులంతా పారమ్మను ఆసక్తిగా అడుగుతారు. ‘నాకు తెలిసిన పాత విధానాలే అమలు చేస్తున్నాను. వ్యవసాయాధికారులు చెప్పిన సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటిస్తాను. తోటి రైతులతో కలిసి పొలంలో పనులు చేస్తాను. ఇది ఆరోగ్యానికి మంచిది’.. అని వినయంగా పారమ్మ సమాధానమిస్తుంది. కిచెన్ గార్డెన్లో భాగంగా కూరగాయలను అంగన్వాడీలు, పాఠశాలలకు గతేడాది వరకూ సరఫరా చేసింది. వ్యవసాయంతో పాటు చికెన్మదర్ పౌల్ట్రీ యూనిట్ నిర్వహణ వైపు దృష్టి సారించింది. ధృడమైన సంకల్పం ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించగలమని చెబుతోంది. శభాష్ ఎల్లమ్మా.. గరుగుబిల్లి: అందరూ పంటలు పండిస్తారు. కానీ మిరియాల ఎల్లమ్మ కాస్త భిన్నం. రసాయనాల జోలికెళ్లదు. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తోంది. అధిక దిగుబడులతో ఆదర్శంగా నిలుస్తోంది. సంతోషపురం పంచాయతీ ఖడ్గవలస గ్రామానికి చెందిన మిరియాల ఎల్లమ్మకు మూడెకరాల పొలం ఉంది. భర్త గుంపస్వామి, కుమారుడు సహకారంతో ఎకరాలో అరటి పంట, 1.5 ఎకరాల్లో వరి, 0.50ò సెంట్లలో అన్నపూర్ణ పంటల నమూనాలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు సేద్యం చేస్తున్నారు. ద్రవజీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం తదితర కషాయాలతోనే తెగుళ్లు అదుపు చేస్తోంది. ఎరలు, రంగుపళ్ళాలు వినియోగించి మంచి దిగుబడి సాధిస్తోంది. ఏటా రూ.1.3 లక్షల ఆదాయం కుటుంబంలో ఇద్దరు పనిచేస్తే ఖర్చులు పోను ఏడాదికి రూ.లక్షా 30 వేల వరకు ఆదాయం వస్తుందని ఎల్లమ్మ అంటోంది. జట్టు సంస్థ క్లస్టర్ కో–ఆర్డినేటర్ అన్నపూర్ణమ్మ సూచనల మేరకు మెలకువలు పాటిస్తోంది. -
ధీశాలి 'బహుముఖ ప్రజ్ఞాశాలి'
అది 1980 దశకం..అప్పుడప్పుడే కరాటే అంటే యువతలో ఆసక్తి పెరుగుతోంది. ఒంగోలులో డిగ్రీ చదువుతున్న పద్మజ కూడా ఆ యుద్ధ క్రీడంటే మక్కువ చూపి శిక్షణ పొందడం మొదలుపెట్టారు. క్రమంగా మెళకువలు నేర్చుకుంటూ జిల్లాలో మొట్టమొదటి ఉమన్ బ్లాక్‌బెల్ట్ ఫస్ట్ డాన్‌గా నిలిచారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ పతకాలు కైవసం చేసుకున్నారు. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యను ఇతరులకు కూడా పంచాలనుకుని ఇప్పటి వరకు కొన్ని వందల మంది బాల బాలికలకు, షీ టీంలకు ఆత్మరక్షణ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. కరాటే శిక్షకురాలిగానే కాదు..ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా, చిత్రకారిణిగా, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ చాటుతున్న పద్మజపై ‘సాక్షి’ కథనం. ఒంగోలు వన్‌టౌన్: మేదరమెట్ల నుంచి వచ్చి ఉద్యోగరీత్యా ఒంగోలులో స్థిరపడిన చిలకమర్తి గోపాలకషమూర్తి, రమాదేవి దంపతులకు ఒక్కగానొక్క కూతురు పద్మజ. తండ్రి విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కావడంతో పద్మజ తన అన్న చంద్రశేఖర్ (మ్యాథ్స్ లెక్చరర్, హైదరాబాద్) తమ్ముడు కష్ణమోహన్ (ఫార్మాసూట్ సైంటిస్ట్, న్యూయార్క్)తో సమానంగా పెరిగింది. ఒంగోలు శర్మా కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన పద్మజ 1993లో బీఎస్సీ, బీఈడీ పట్టా తీసుకున్నారు. 1996లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా కొత్తపట్నం మండలం బజ్జిరెడ్డి గమళ్లపాలెం పాఠశాలలో ఉద్యోగినిగా చేరారు. 2009లో స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ రావడంతో ఇంగ్లిష్ టీచర్‌గా మద్దిపాడు మండలం బసవన్నపాలెం ఉన్నతపాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం చిన్నగంజాం హైస్కూల్ నందు ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్నారు. కరాటే పద్మజ 1980 దశకంలో కరాటే శిక్షణ యువతీయువకులను విపరీతంగా ఆకర్షించింది. పద్మజ డిగ్రీ చదివే రోజుల్లో ఒంగోలు మహిళా మండలి వద్ద ప్రతిరోజూ ప్రముఖ కరాటే మాస్టర్ వలిశెట్టి రవి యువకులకు కరాటే శిక్షణ ఇవ్వడం గమనించి, కరాటే నేర్చుకోవాలన్న ఆసక్తిని నేరుగా రవి మాస్టర్‌కి తెలిపింది. అలా యుద్ధ నైపుణ్య విద్యలో తొలి అడుగులు వేసిన పద్మజ 1995లో ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్‌గా, 2017 జనవరి 8న ఉమెన్ బ్లాక్ బెల్ట్ ఫోర్త్ డాన్‌గా నిలిచింది. 2015లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియం (హైదరాబాదు)లో జరిగిన నేషనల్ బూడోకాన్ ఈవెంట్లో ‘కట’ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించింది. ఉద్యోగరీత్యా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పటికీ స్వార్డ్, స్టిక్, నాన్చక్ ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయినిగా ... ♦ తను పని చేస్తున్న చోట పలువురు విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా నవోదయ, గురుకుల పాఠశాలలకు అర్హత సాధించడంలో చేయూతనిచ్చారు. ♦ 2009 నుంచి జిల్లా రీసోర్స్ పర్సన్‌గా కొనసాగుతూ విద్యాశాఖ నిర్వహించిన వివిధ శిక్షణా శిబిరాల్లో ఆంగ్ల బాషా శిక్షకురాలిగా వ్యవహరిస్తున్నారు. ♦ 2016లో బెంగళూర్‌లో రీజినల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లిష్ సౌత్ ఇండియా (ఆర్ఐఇఓస్ఐ) ఆధ్వర్యంలో జరిగిన క్యాంప్‌లో జిల్లా విద్యాశాఖ సహకారంతో సీఈఎల్‌టీ ట్రైనింగ్ తీసుకున్నారు. ♦ 2017 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున స్పాట్ వాల్యుయేషన్‌కి వచ్చిన సుమారు 100 మంది సహచర ఇంగ్లిష్ ఉపాధ్యాయులతో ‘ఇంగ్లిష్–ప్రకాశం’ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 300 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు ఇంగ్లిష్ బోధనలో వచ్చే సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సమన్వయపరచడం. ♦ 2017లో ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, బ్రిటీష్ కౌన్సిల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఇంగ్లిష్ ట్రైనింగ్ క్యాంపులో మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంశంపై రాష్ట్రీయ మాధ్యమిక విద్యా మిషన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) వారు నిర్వహించిన క్యాంపులో మాస్టర్ ట్రైనర్‌గా శిక్షణ పొందారు. ప్రేమ వివాహం కుటుంబంలో అందరూ ఉన్నత చదువులు చదవడం, పద్మజ తండ్రి వత్తి రీత్యా బయటి ప్రపంచంతో మమేకం కావడంతో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ ప్రతి విషయాన్ని అందరూ కలిసి మాట్లాడుకోవటం, కలిసి నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా మారిన నేపధ్యంలోనే పద్మజ తన సహవిద్యార్థి వై.ఎస్.దిగ్విజయ్‌ను మతాంతర వివాహం చేసేకున్నారు. పెళ్లి జరిగిన తొలి రోజుల్లో ఇద్దరి కుటుంబాల భావ సంఘర్షణ వల్ల ఏర్పడిన అరమరికలు అనతికాలంలోనే సమసిపోయి ఇద్దరి కుటుంబాలు ఆదర్శంగా నిలిచాయి. 80 దశకంలో విప్లవ భావాలు యువతలో మెండుగా ఉన్న రోజులు. ప్రేమంటే భావావేశంతో కలిగేదనిపిస్తున్న నేటి ప్రేమ కథలకు భిన్నంగా, భావసారూప్యతతో జీవిత భాగస్వాములైన పద్మజ, దిగ్విజయ్‌లను చూసి నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబం గురించి ఒంగోలు జక్రయ్య ఆస్పత్రి వీధిలో నివసిస్తోంది పద్మజ కుటుంబం. భర్త వై.ఎస్.దిగ్విజయ్ ఒంగోలు నగరంలోని పేస్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలు బయాలజీ సైన్స్ టీచర్‌గా సేవలందించిన దిగ్విజయ్ ఒక లోకల్ ఛానెల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వివేక్ (21) శ్రీకాకుళం డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జన్ (బీడీఎస్) చదువుతున్నాడు. విక్రాంత్ (18) విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్నాడు. తల్లి వద్ద కరాటే శిక్షణ పొందిన ఈ ఇద్దరు పిల్లలు గ్రీన్ బెల్ట్ పొందారు. ‘సమాజం కోసం నా వంతుగా ... ప్రభుత్వంగానీ, వలంటరీ ఆర్గనైజేషన్స్గానీ నగరంలో ఏదైనా వేదిక ఏర్పటు చేయగలిగితే ఉదయం ఆత్మరక్షణ యుద్ధ నైపుణ్యం శిక్షణ, సాయంత్రం ఇంగ్లిష్ మాట్లాడటం, బోధనా నైపుణ్యం, బాషా సమస్యలపై ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’ అంటున్న పద్మజ ఆశ నెరవేరాలని ఆశిద్దాం. ఉపాధ్యాయినిగా.. ఆత్మరక్షణ నైపుణ్య శిక్షకురాలిగా ♦ 1995–96 లో ఖాశీం మెమోరియల్ బాలికలపాఠశాల (దర్శి) విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చారు. ♦ 2006లో ప్రకాశం జిల్లా సర్వశిక్ష అభియాన్ పీడీరఘుకుమార్ ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరంలో ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించారు. ♦ 2012 నిర్భయ ఘటన తరువాత ఒంగోలు వాకర్స్‌క్లబ్ లో మాస్టర్ ఎ.రవిశంకర్‌తోపాటు పలువురికిప్రాక్టీస్లో సేవలందిచారు. ♦ 2014 నుంచి స్థానిక జక్రయ్య ఆసుపత్రి ఆవరణలో డా.జాకబ్ జక్రయ్య, డా.సారా జార్జి ల సహకారంతో స్థానికులకు కరాటే శిక్షకురాలిగా నిలిచారు. డా.సారా జార్జి కూడా పద్మజ వద్ద శిక్షణ పొందుతున్నారు. ♦ 2016లో ఒంగోలులో జరిగిన ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలలో మద్దులూరు (సంతనూతలపాడు) హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఆత్మరక్షణ యుద్ధ విన్యాసాలను ప్రదర్శించారు. ♦ 2016లో తన గురువు వలిశెట్టి రవి స్థాపించిన రుద్రమదేవి డిఫెన్స్ అకాడమీ (హైదరాబాదు) సహకారంతో తెలంగాణలో షీ టీం ఆధ్వర్యంలో అనేక మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్‌కి శిక్షణ ఇచ్చారు. ♦ 2017 నుంచి చిన్నగంజాం ఏడో తరగతి బాలికలకు శిక్షణ ఇస్తున్నారు. చిత్రకారిణిగా ఏకకాలంలో ఉపాధ్యాయినిగా, యుద్ధనైపుణ్య శిక్షకురాలిగా , చిత్రాకారిణిగా ,భార్యగా, అమ్మగా, విభిన్న పాత్రలను పోషిస్తున్న «ఈ ధీశాలి తన భావాలకు రూపాలనిస్తూ అనేక చిత్రాలకు జీవం పోశారు. ఆమెను కలవడానికి వచ్చే మిత్రులు, సందర్శకులను ఇంటిలో గోడలను అలంకరించిన ఆమె పెయింటింగ్స్ కచ్చితంగా ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. 2005లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థాన్ నిర్వహించిన ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కోర్సును ఫూర్తి చేశారు. 2009 మార్చిలో ఫెవీక్రిల్ సంస్థ ఇచ్చిన ఎక్స్పర్ట్ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేశారు. -
ఆదర్శ జ్యోతి
ఇంట్లో మగవారే సంపాదించాలి. ఆడవాళ్లు ఇంటి పనులకే పరిమితమవ్వాలి...చాలా కుటుంబాల్లో కనిపించేది ఇదే. కానీ భర్త ప్రభుత్వోద్యోగి అయినా ఆయనపై ఆధారపడకుండా తనకంటూ ఉపాధి ఉండాలనుకున్నారు కంభానికి చెందిన ఆకవీటి జ్యోతి. ఇంటర్మీడియెట్ వరకే చదువుకున్నా.. పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు నేర్చుకున్నారు. మరికొంత మంది ఆడవాళ్లకు ఉపాధి చూపుతున్నారు. వందలాది మంది రైతులు మల్బరీ తోటలు సాగుచేసేందుకు దారి చూపారు. సాగులో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన ఆకుల దిగుబడి తదితర అంశాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు. ఆమె విజయగాథపై ‘సాక్షి’ కథనం. పట్టుదల, కృషి.. విజయానికి సోపానాలు. ఈ మాటను అనేకమార్లు విని ఉంటారు! ఎన్నో చోట్ల చదివుంటారు! ఆకవీటి జ్యోతి జీవితంలో కృషి, పట్టుదల అడుగడుగునా కనిపిస్తాయి. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి.. ఇంట్లోనే ఉంటూ కుటుంబ ఆలనాపాలనా చూసుకుంటూ కాలం గడిపేయొచ్చు. కానీ ఆమె అలా ఆలోచించలేదు. స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకుంది. తోటి మహిళలకు ఉపాధి కల్పించాలని భావించింది. పట్టుపరిశ్రమ శాఖలో పనిచేస్తున్న తన భర్త నుంచి పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు నేర్చుకుంది. తన లక్ష్యం వైపు అడుగులేసి విజయం సాధించింది. ప్రకాశం , కంభం : పట్టుపురుగుల పెంపకంలో విశేష అనుభవాన్ని గడించడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది కంభం పట్టణానికి చెందిన ఆకవీటి జ్యోతి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్న జ్యోతిది వ్యవసాయ కుటుంబం కాదు. భర్త సుబ్రహ్మణ్యం పట్టు పరిశ్రమల శాఖలో పనిచేస్తుండటంతో ఆ రంగంపై ఆసక్తి పెంచుకుని భర్త ద్వారా పట్టుసాగులో మెళకువలు నేర్చుకుంది. తద్వారా గిద్దలూరు నియోజకవర్గంలో వందల మంది రైతులు మల్బరీ సాగులో సాంకేతిక విప్లవం సాధించడంలో ఎనలేని పాత్ర పోషించింది. మల్బరీ సాగులో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, నాణ్యమైన ఆకుల దిగుబడి తదితర అంశాల్లో సాధించిన ప్రగతికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రశంస పత్రాలు, అవార్డులు అందుకుంది. రైతు సేవలో.. మైసూర్‌లోని జాతీయ పట్టు పరిశోధనా సంస్థలో వారం రోజులపాటు శిక్షణ తీసుకున్న జ్యోతి.. 2005లో కంభంలో పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. రైతులకు అవగాహన కల్పించడం కోసం విజ్ఞాన యాత్రలు, శిక్షణలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నిరంతరం వారి అభివృద్ధికి సహకారం అందిస్తోంది. జిల్లాలో 2 వేల ఎకారాల్లో మల్బరీ సాగవుతుండగా కంభం, బేస్తవారిపేట మండలాల్లో 350 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. హిందూపురం, ధర్మవరం, కదిరి, పలమనేరు, మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం పట్టు క్వింటా ధర రూ.40 వేల నుంచి రూ.50 వేలు పలుకుతోంది. ఈ లెక్కన రైతులు ఒక పంటకు పురుగుల పెంపకం సంఖ్యను బట్టి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. 24 రోజుల్లో పూర్తయ్యే పట్టుపురుగుల పెంపకంలో మొదటి 8 రోజులు పురుగులను పొదిగించి, ఆ తర్వాత వాటికి ఆహారం అందించాలి. నిర్ధిష్టమైన వాతావరణ పరిస్థితులతోపాటు పరిశుభ్రత పాటించడం అవసరం. ఈ విషయాలపై రైతులకు సూచనలివ్వడమే కాకుండా తానూ పాటిస్తుంది. జ్యోతి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల రైతులు రావడం విశేషం. జ్యోతి చాకీ పట్టు పురుగుల కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 15–20 మంది నిత్యం ఉపాధి కల్పిస్తుండగా.. పరోక్షంగా వందలాది మంది రైతు కూలీలకు, రైతులకు ఉపాధి దొరుకుతోంది. పట్టు సాగుపై రైతులు ఆసక్తి చూపాలి నీటి సౌకర్యం కలిగిన రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపాలి. మల్బరీ సాగు వల్ల ప్రతి నెలా ఆదాయం వస్తుంది. ఆసక్తి ఉన్న రైతులకు సహకారం అందిస్తాం. రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుంది. ఆర్కేవీవై పథకం కింద రూ. రూ.1,37,500, సీడీపీవీ పథకం కింద రూ.80,500, ఎస్సీ రైతులకు రూ.2 లక్షలు, పరికరాలకు రూ.20 వేలు, గది నిర్మాణానికి రూ.22 వేలు, కూలింగ్ సిస్టంకు రూ.9,750, మల్బరీ మొక్కలు ఎకరాకు రూ.10,500, వ్యాధి నిరోధక మందులు, వేపపిండికి 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. రైతులు మల్బరీ సాగుకు ముందుకు వస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. – ఆకవీటి జ్యోతి వరించిన అవార్డులు 2007లో జాతీయ స్థాయిలో ఏపీ తరఫున ఉత్తమ మహిళా అవార్డు, 2011లో రైతేరాజు అవార్డు, అదే ఏడాది దూరదర్శన్ సంస్థ నుంచి ఉత్తమ అవార్డు, 2012లో రాష్ట్ర స్థాయి అవార్డు, 2013లో అప్పటి గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ చేతులమీదుగా ఉత్తమ మహిళా అవార్డు, అదే ఏడాదిలో పట్టుసిరి అవార్డు, 2015లో పట్టు పరిశ్రమ శాఖ నుంచి ఉత్తమ అవార్డును జ్యోతి అందుకుంది. -
నెలవారీ పింఛన్ సేవలకే
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోట: సమాజంలో పేదలు, నిస్సహాయుల కోసం పరితపించి తన భర్త మరణానంతరం వస్తున్న పింఛన్‌ను వారికే అందిస్తూ సాంత్వన కలిగిస్తున్నారు ఎమ్వీరావ్ ఫౌండేషన్ నిర్వాహకురాలు ఆదిలక్ష్మమ్మ. భర్త మరణానంతరం తనకు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పేదలకు పంచాలని భావించి.. తదనుగుణంగా భర్త పేరుతో ఫౌండేషన్‌ను స్థాపించి సమాజసేవలో పునీతులవుతున్నారు. కుమారుడు, కుటుంబసభ్యుల అండతో తమ సేవా కార్యక్రమాలను విస్తృత పరుస్తూ అన్ని వర్గాల మన్ననలను పొందుతున్నారు. భర్త ఆశయాలు కలకాలం గుర్తుండాలని మండలంలోని చెందోడుకు చెందిన ఆదిలక్ష్మమ్మ భర్త, దివంగత ముప్పవరకు వెంకటేశ్వరరావు ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయుడు, విద్యావేత్త. పనిచేసిన చోటల్లా అభ్యుదయవాదిగా పేరు గడించారు. సంఘసంస్కర్త, అణగారిన వర్గాల చైతన్యం కోసం పాటుపడ్డారు. అందరూ సంతోషంగా ఉండాలని కష్టనష్టాలను పంచుకుంటూ వారితో మమేకమవుతూ ఆఖరి శ్వాసవరకు జీవించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైరైన అనంతరం స్నేహితులతో కలిసి 2001లో విద్యానగర్‌లో విద్యావికాస్ పాఠశాలను ప్రారంభించారు. విద్యారంగానికి చివరి శ్వాసవరకు సేవచేసి 2008 నవంబర్ 17న మరణించారు. అప్పటి వరకు గృహిణిగా ఇంటిపట్టునే ఉండి కుటుంబబాధ్యతలు నెరవేర్చిన ఆదిలక్ష్మమ్మ తన భర్త ఆశయాలు ప్రజల్లో కలకాలం గుర్తుండాలని సంకల్పించారు. 2009 మార్చిన కుమారుడు, ముగ్గురు కుమార్తెలతో చర్చించి వారి నిర్ణయం మేరకు ఎమ్వీరావ్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఎవరిపై ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో సమాజానికి ఎంతోకొంత సేవ చేస్తున్నారు. తొమ్మిదేళ్ల కాలంలో 2,250కు పైగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కుటుంబసభ్యుల తోడ్పాటు కలిసిరావడంతో సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం లభించింది. రక్తదానంపై విరివిగా ప్రచారం చేస్తూ శిబిరాలను ఏర్పాటు చేయడంతో ఉత్తమ మోటివేటర్‌గా నెల్లూరు రెడ్‌క్రాస్ ద్వారా 8 సార్లు, కలెక్టర్ చేతుల మీదుగా రెండు సార్లు అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం వచ్చే పెన్షన్ రూ.22 వేలు కాగా, గ్రాట్యుటీ రూ.10 వేల మొత్తాన్ని సేవల కోసం కేటాయిస్తున్నాను. వేసవిలో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు విలువైన సేవలందిస్తున్నారు. మారుమూల పల్లెలు, గిరిజన కాలనీల్లో వసతులు కల్పిస్తూ శక్తివంచన లేకుండా చేతనైన సాయం చేస్తున్నారు. తల్లి దారిలోనే కుమారుడు ముప్పవరకు లీలామోహన్ నడుస్తున్నారు. కుల, మత, ప్రాంతీయతత్వం అడ్డురాదని నిరూపిస్తూ ఫౌండేషన్ సేవలను విస్తృతం చేస్తున్నారు. సాయం అందించడమే లక్ష్యం ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. స్వామి వివేకానందుని బోధనల స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. మనుషులు దూరమైనా వారి జ్ఞాపకాలు మంచి మార్గంలో నడిపిస్తాయి. భర్త ఆశయసాధన కోసం పాటుపడుతున్నా. కొన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. దృఢచిత్తంతో ముందుకు సాగుతూ వందలాది సేవా కార్యక్రమాలను నిర్వహించా. కొడుకు, కోడళ్లతో పాటు మనవరాళ్లతో ఆనందమయమైన జీవనం గడుపుతున్నా. – ఆదిలక్ష్మమ్మ -
చీకట్లో తోడేలు
చీకట్లో కుక్క గతికిన చప్పుడు వినిపించింది. కుక్కేనా?కంగారుపడి కళ్లు తెరిచాడు. నల్లటి నలుపు. కారు చీకటి. గదిలో ఏమీ కనిపించడం లేదు. తల దగ్గర పెట్టుకుని ఉన్న టార్చ్‌లైట్‌ను టప్‌మంటూ వెలిగించాడు. ఒక మనిషి నిలబడి ఉన్నాడు– ఆ అమ్మాయి కాళ్ల దగ్గర. ఆ అమ్మాయి విసుక్కుంటూ అటు తిరిగి పడుకోబోతూ అంది– ‘ఏం సార్. నిద్ర పట్టట్లేదా. నన్నుగానీ మీ పెళ్లాం అనుకుంటున్నారా ఏంది?’ లైట్ ఫోకస్ ఆ మనిషి వైపు తిరిగింది. ‘అదీ... దారి ఎటో కనిపించలేదు. నిద్ర పట్టక సిగరెట్ తాగుదామనుకుని లేస్తే ఈ అమ్మాయి కాలు తగిలింది’ నసిగాడు. ఆ అమ్మాయి ఈవైపు పడుకుని ఉంది. తలుపు ఆ వైపు ఉంది. తలుపు వైపు వెళితే అమ్మాయికి కాలెందుకు తగులుతుంది? టార్చ్ వేసి దారి చూపించాడు. అతడు పిల్లిలా బయటకు వెళ్లి అయిదు నిమిషాల సేపు తాత్సారం చేసి తిరిగి వచ్చి గుట్టుగా బెంచీ మీద సర్దుకున్నాడు. పాతకాలపునాటి గవర్నమెంట్ స్కూల్ గది అది. తెల్లవారితే పోలింగ్. ఆ డ్యూటీ మీద సాయంత్రం వచ్చి ఊరివాళ్లు ఇచ్చిన భోజనం చేసి నిద్రపోయారు. పోలింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసరు, హోంగార్డ్‌గా వచ్చిన ఆ అమ్మాయి. జిల్లా హెడ్‌క్వార్టర్స్ నుంచి అందరూ లారీలో బయలుదేరినప్పటి నుంచి గమనిస్తున్నాడు. పోలింగ్ ఆఫీసరు ఆ అమ్మాయితో చనువుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. గొప్పలు చెబుతున్నాడు.గొప్పతనం తనకే ఉన్నట్టుగా దర్పాలు పోతున్నాడు. అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్‌కి ఆ అమ్మాయిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తోంది. తనకు అంత వయసు కూతురు ఉంది. తన కూతురు చదువుకుంటోంది. ఈ అమ్మాయి హోమ్‌గార్డ్‌గా పని చేస్తోంది. తన కూతురు ఈ సమయంలో ఇంట్లో సురక్షితంగా నిద్రపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఈ పాతకాలం నాటి స్కూల్లో కాళ్ల దగ్గర కుక్కలాగా ఒక మగాడు తారాట్లాడుతుండగా.... చీకటి అలాగే ఉంది. మళ్లీ నిద్ర పట్టేసింది. బోరింగ్ శబ్దం వినవస్తుంటే మెలకువ వచ్చింది. కళ్లు తెరిచి చూశాడు. చీకటిగానే ఉంది. టార్చి వేసి టైమ్ చూసుకున్నాడు. ఐదుంపావు. గదిలో ఎవరూ లేరు. ఆ అమ్మాయి గొంతు వినిపించింది– ‘పీవో సారూ... ఇటువైపు రావద్దు. స్నానం చేస్తున్నా. కాసేపు ఆగి రండి. ఇటువైపు రావద్దన్నానా’ లేచి కూర్చున్నాడు. పీవో బూడిదరంగు నీడలాగా గదిలోకి వచ్చాడు. ‘అదీ కడుపులో బాగలేకపోతే లేచానండీ’ నసిగాడు. తెల్లవారిపోయింది. పోలింగ్ మొదలైపోయింది. పీవో ధుమధుమలాడుతూ డ్యూటీ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఓపిగ్గా డోర్ దగ్గర నిలబడి వచ్చే జనాన్ని అదుపుచేస్తూ లోపలికి పంపుతూ ఉంది. నవ్వు ముఖం. లొంగని నవ్వు ముఖం. ఆ నవ్వు చూస్తుంటే పీవోకి ధుమధుమ పెరిగిపోతోంది. డ్యూటీ ముగించుకుని ఆ రాత్రి తిరుగుప్రయాణంలో లారీ ఎక్కారు. పీవో, ఏపీవో, ఆ హోమ్‌గార్డు అమ్మాయి. ఉన్నట్టుండి పీవో వాగాడు– ‘పోలీసులు రేపులు చేశారని వార్తలు వస్తుంటాయి. ఏం... వాళ్లకు ఆడపోలీసులు సరిపోకనా? ఆడపోలీసులు ఉంటారుగా వాళ్లకు’ కచ్చ తీరింది. ఆ అమ్మాయి చురుగ్గా చూసింది. ‘ఏం నోరు సార్ మీది. ఈ మాట అన్న నోటితో మీరు అన్నం ఎలా తింటారు?’ అంది. డిస్ట్రిక్ హెడ్‌క్వార్టర్స్ వచ్చాక పీవో మాటవరుసకు వెళ్లొస్తానని కూడా అనకుండా వెళ్లిపోయాడు. ఏపీవో దగ్గరకు ఆ అమ్మాయి వచ్చింది సెలవు తీసుకోవడానికి. ‘ఎలా చేస్తున్నావమ్మా ఈ ఉద్యోగం’ ‘తప్పదు సార్. బతకాలంటే చేయకతప్పదు కదా.’ ‘మరి ఈ ఇబ్బందులు’ ‘ఇబ్బందులకు బయపడతామా సార్. ఎక్కడకు వెళ్లినా ఇలాంటి కుక్కలు ఉండనే ఉంటాయి’ మళ్లీ అంది– ‘ఆడదంటే నడుమూ వీపూ కండ అని మగాళ్లు అనుకునే వాతావరణం ఉన్నంతకాలం ఇది తప్పదు సార్’ ఆ మాట అంటున్నప్పుడు ఆ అమ్మాయి గొంతులో జీర కదలాడింది. ఏపీవో గుండెలో కూతురుని తలుచుకుని చిన్న భయం తారాట్లాడింది. తన కూతురు సురక్షితంగా తన రెక్కల కింద పెరుగుతోంది అనుకుంటున్నాడు గానీ ఆ రెక్కల బలమెంత... బయట గాలివాన ఎంత? పెద్ద ప్రశ్న. కథ ముగిసింది. కేతు విశ్వనాథ రెడ్డి రాసిన ‘రెక్కలు’ కథ ఇది. లోకం ఇలాగే ఉంటుందా... లోకం ఇలా ఇంకా ఎంతకాలం ఉంటుంది. సంఘంలో ఎందరో మగవాళ్లు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఉద్యోగులు, నాయకులు, సంస్థాధిపతులు, లెక్చరర్లు, టీచర్లు.... పగటి వేళ వాళ్లు మనుషులు కావచ్చు. చీకటి పడితే తోడేళ్లు కావచ్చు. స్త్రీల మాంసం కోసం కాచుకుని ఉండే ఇలాంటి తోడేళ్లను లొంగని ఆత్మబలం అనే చెప్పుతో కొట్టాలి. అలా కొట్టమని చెప్పే పైలం చెప్పే కథ, ఈ కథ– రెక్కలు. - కేతు విశ్వనాథరెడ్డి -
ప్రిన్సిపల్‌లో తేడా
కాలేజీకి కొత్త ప్రిన్సిపాల్ వస్తున్నట్టు ఉప్పందింది. అదీ ఒక ఆడ ప్రిన్సిపాల్ రాబోతున్నట్టు గుప్పుమంది. ఇది తెలిసి ఒక మగాడు ఉసూరుమంటే ఒక మగాడు హుషారు పడ్డాడు. ‘ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్టు ఒక ఆడ ప్రిన్సిపాల్ కింద పని చేయాలా?’ అన్నాడు ఒక మగ లెక్చరర్. ‘అయితే ఏమిటోయ్. మన పని ఈజీ కాలేదూ’ అన్నాడు మరో మగ లెక్చరర్. స్టాఫ్‌రూమ్‌లో అంతా సందడి సందడిగా ఉంది. ‘ఏం ఈజీ’ అన్నాడు మగ లెక్చరర్. ‘వచ్చినామె డ్యూటీ చేస్తుందనుకున్నావా? లీవులు పెట్టడమే సరిపోతుంది’ అన్నాడు ఈ లెక్చరర్. ‘ఎందుకు పెడుతుందండీ’ అన్నారెవరో. ‘మరి? చీటికిమాటికి లీవు పెట్టడమేగా ఆడవాళ్ల పని. పూజలనీ, వ్రతాలనీ, తద్దినాలనీ, పిల్లలకు జ్వరాలనీ, ఊర్నుంచి అత్తగారు వచ్చారనీ... సీటులో ఎప్పుడు ఉండి చస్తారు కనుక. సెలవు ముందుపుట్టి ఆడవాళ్లు ఆ వెంటనే పుట్టారు’ అన్నాడతడు. అంతటితో ఆగలేదు. థియరీ చెప్పాడు. ‘ఇక వీళ్లు టైమ్‌కు రావడం గగనం. పిల్లలను స్కూళ్లకు పంపి, మొగుళ్లను రెడీ చేసి, అద్దం ముందు నిలబడి గంటలు గంటలు సింగారించుకుని వచ్చేసరికి పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఈలోపు మనదే రాజ్యం. మాహిష్మతి మనదే కట్టప్పా’ చాలా హుషారుగా ఉన్నాడతను. కారణం ఉంది. కాలేజీలో ఆల్రెడీ ఒక లేడీ లెక్చరర్ వైస్ ప్రిన్సిపాల్‌గా ఉంది. ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా ఇంకో లేడీ వస్తే అది కోఎడ్యుకేషన్ కాలేజీ కనుక ఇద్దరూ ఆడవాళ్లుండటం సమ్మతం కాదు కనుక వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్ తనకే వస్తుందని ఇతని ధీమా. ‘ఆవిడగారు లీవు పెట్టినప్పుడల్లా నేనే కదా బాసు. అప్పుడు చూపిస్తా తడాఖా’ అన్నాడు. ఈ మాట మగ లెక్చరర్లను ఆలోచనలో పడేసింది. ‘నువ్వే బాస్ అయితే గనక మమ్మల్ని కొంచెం చూసీ చూడనట్టుగా వదిలేస్తావుగా’ అన్నాడొకడు. ‘క్లాస్ సగంలో ఉండగా బయటికొచ్చి సిగరెట్లు కాల్చుకోవచ్చుగా?’ అని అడిగాడు ఇంకొకడు. ‘సంతకం పడేసి క్లబ్బుకు వెళ్లొచ్చు కదా’ అన్నాడు ఒకడు. ‘నేనసలు క్లాసులే తీసుకోను’ అన్నాడు వేరొకడు. ఈ పరిపరి విన్నపాలు విని చిద్విలాసంగా అభయం ఇచ్చాడు లెక్చరర్. శుభముహూర్తం వచ్చింది. మగ లెక్చరర్లకు మళ్లీ ఉప్పందింది. లేడీ ప్రిన్సిపాల్ ఉదయం ఎనిమిది గంటలకే వచ్చేసిందట. బాప్ రే వచ్చేసిందా. ఆ రోజంతా కాలేజీ హడావిడి హడావిడిగా ఉంది. లేడీ ప్రిన్సిపాల్ అసలు తన రూమ్‌లోనే కూచోలేదు. కాలేజ్ అంతా తిరుగుతూనే ఉంది. క్లాసులు మానిటర్ చేసింది. లెక్చరర్లు ఎంతసేపు క్లాసు చెపుతున్నారో గమనించింది. అసలు ఎలా చెబుతున్నారో గమనించింది. దొంగ పర్మిషన్లు బుట్టదాఖలు అయ్యాయి. సిక్ లీవ్‌లో ఉన్న లెక్చరర్ క్లాసును తనే తీసుకుని చెప్పినప్పుడు ఆ వాగ్ధాటికి పిల్లలు రెప్పవేయకుండా విన్నారన్న వార్త కూడా కారిడార్లలో పాకి అక్కడి నుంచి ఒకరిద్దరి వెన్నులో కూడా పాకింది. సాయంత్రం అయిదున్నరకి స్టాఫ్‌తో చిన్న మీటింగ్. ‘ఇన్ని రోజులు ఎలా గడిచాయో తెలియదు నాకు. ఇక మీదట ఇవాళ గడిచినట్టు గడుస్తాయి’ అంది. మగలెక్చరర్ల ముఖాలు మెల్లగా మాడిపోయాయి. వైస్ ప్రిన్స్‌పాల్ పోస్టు ఆశించిన లెక్చరర్ మనసులో ఆశ మినుకుమినుకుమంటోంది. ‘మరి వైస్‌ప్రిన్సిపాల్ సంగతి?’ నసిగాడు. ‘ఏంటి ప్రాబ్లమ్?’ అడిగిందామె. ‘ఇంకా పాత ముతక సామెతల్లోనే ఉన్నారా? రెండు కొప్పులకు పడదని భావిస్తున్నారా? ఇక్కడకు వచ్చేముందే వైస్ ప్రిన్స్‌పాల్ గురించి తెలుసుకున్నాను. ఆమె చాలా బాగా పని చేస్తున్నదని రిపోర్ట్ ఉన్నాయి. వైస్ ప్రిన్స్‌పాల్‌గా ఆమే కంటిన్యూ అవుతుంది. ప్రిన్స్‌పాల్‌గా, వైస్ ప్రిన్సిపాల్‌గా మగాళ్లే ఉండి కాలేజీలు నడుపుతున్నప్పుడు మేమెందుకు నడపకూడదు. ఇంకా బాగా నడిపి చూపిస్తాం’ అంది. మగాళ్లు పూర్తిగా నేల కరుచుకుపోయారు. మెల్లగా లేచారు వెళ్లడానికి. ‘కూర్చోండి. ఎక్కడకు వెళతారు. చాయ్ తాగరా’ అందామె. ‘చాయ్ తాగడానికి ఇంతకుమించిన అకేషన్ ఏముంది?’ అని తిరిగి రెట్టించింది. ‘అవునవును ఏముంది’ అని చతికిలపడ్డారు మగలెక్చరర్లు. ఆనాటి పొగలు కక్కే చాయ్ వాళ్లకు చాలారోజుల పాటు గుర్తుండిపోయింది. కథ ముగిసింది. మృణాళిని రాసిన ‘లేడీ బాస్’ కథ ఇది.బాస్ అంటే ప్యాంటూ షర్టూ వేసుకుని ఉండాలన్న అభిప్రాయం మగాళ్లలో పాతుకుపోయింది. మీసం ఉండాలని, మగవాడు అయి ఉండాలని, మగవాడి కిందే పని చేయాలని.... ఇంట్లో నాన్న పెత్తనం అలవాటయ్యి ఆఫీసులో మగ పెత్తనం ఆశిస్తారు. సంతకం పెట్టే చేయికి, నిర్ణయం తీసుకునే బుర్రకి స్త్రీ, పురుష తేడా ఎందుకుంటుంది అనే ఆలోచన లేదు. డాబా మీద వడియాలు ఆరవేయడానికి వెళ్లినప్పుడు మాత్రమే స్త్రీలు ఆకాశం వైపు చూడాలనుకునే మగవారు అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన సునీతా విలియమ్స్ వంటివారిని మెడనొప్పి పుట్టినా సరే చూడక తప్పదు. రోజులు మారాయి. అదిగో సుఖోయ్ విమానంలో నిర్మలా సీతారామన్. - మృణాళిని