మల్కాన్‌గిరి కోయ తెగలో తొలి మహిళా జర్నలిస్ట్
అదొక మారుమూల గిరిజన ప్రాంతం. పట్టణాల ఊసే తెలియదు. అరకొరా వసతులు ఉండే ఈ ప్రాంతంలో అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. చదువు, పుస్తకాలు ఇవేమీ వారికి తెలియవు. కానీ జయంతి మాత్రం ఇలాంటి అననుకూల పరిస్థితులన్నింటినీ అధిగమించింది. అతికష్టంమీద గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. కేవలం గ్రాడ్యుయేషన్‌తోనే ఆగిపోలేదు.. .తనలాగే మరో పది మంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుంది. ఒడిశాలోని అత్యంత నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి గిరిజన సమాజంలో తొలి మహిళ జర్నలిస్టుగా అందరి మన్ననలు పొందుతోంది. తన గిరిజన సమాజంలో మార్పు కోసం కలంతో పోరాటం చేస్తోంది.
పది మంది అక్కాచెల్లెళ్లలో జయంతి ఒకరు. ఆమె నెంబర్ తొమ్మిది. అంటే తొమ్మిదో అమ్మాయి అన్నమాట. గిరిజన కోయ తెగలో అసలు అక్షరాస్యతే తక్కువ. అమ్మాయిలు బడికి వెళ్లడమే అరుదు. ఇక చదువుకోవడానికి సదుపాయాలు సంగతి సరేసరి. కానీ జయంతి తండ్రి అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించారు. తన ఆడబిడ్డలు చదువుకోవాలని నిర్ణయించారు. అందుకే తన సంతానంలో ఐదుగురిని ఎన్నో కష్టాలకోర్చి బడిబాట పట్టించారు. తండ్రి ఇచ్చిన సహకారాన్ని, ప్రోత్సహాన్ని అందిపుచ్చుకున్న జయంతి పట్టుదలగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కానీ ఆమె లక్ష్యం కేవలం గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం కాదు. జర్నలిస్టు కావాలని కలలు కంది. తద్వారా తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటూ, వెనకడి వున్న తన గిరిజన సమాజంలో మార్పు తీసుకురావాలని భావించింది.
అయితే అనుకున్న కలను సాకారం చేసుకోవటానికి ఎన్నో కష్టాలు పడింది. ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చింది కానీ తన ఇంటికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్శిటీకి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న వ్యవహారం. హాస్టల్ లో ఉండి చదువుకునే ఆర్థిక స్థోమతా లేదు. హాస్టల్‌లో ఉండి ఎలా చదువుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్న సమయంలో, తన స్నేహితురాలు ఆమెకు అండగా నిలిచింది. తన బంధువు ఇంట్లో ఉండి చదువుకునేలా అవకాశం కల్పించింది. అలా జయంతి జర్నలిజం కోర్సు పూర్తి చేసింది.
అనంతరం చదువు అయిపోగానే తన ఇంటర్న్‌షిప్ కోసం భువనేశ్వర్ వెళ్లాల్సి వచ్చింది. కానీ మళ్లీ ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చాయి. ఆమె ప్రతిభను, ఉత్సాహాన్ని, తాపత్రయాన్ని గమనించిన సినీ నిర్మాత బిరేన్ దాస్, జయంతికి గైడెన్స్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోనే జయంతి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి, ప్రధాన మీడియాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కళింగ టీవీలో ఆమె పనిచేస్తోంది. తన గిరిజన కమ్యూనిటీ మల్కాన్‌గిరీలోనే రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. జయంతి కల నెరవేరినప్పటికీ, నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరీలో కేవలం ఒకే ఒక్క మహిళ రిపోర్టింగ్ చేయడం ఆమెకు సవాల్‌గానే మారింది. అక్కడ కూడా లింగ వివక్ష ఎదురైంది. తన పురుష కొలీగ్స్ జయంతిని వెనక్కి లాగడానికి, భయపెట్టడానికి ఎన్నో ప్లాన్స్ వేసేవారు. ప్రతి అడుగును తను సవాల్‌గా తీసుకునేది. పురుష జర్నలిస్ట్‌లకు పోటీగా రాణించడం ప్రారంభించింది.
వీటిన్నింటికి మించి ఆమెకెదురైన మరో పెద్ద సవాల్ పోలీసు వేధింపులు. ఒక కోయ తెగకు చెందిన అమ్మాయి విద్యాధికురాలిగాఉండటం,ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటంతో పోలీసులు ఆమెపై మావోయిస్టు ముద్ర వేశారు. ఈ క్రమంలో పలురకాలు వేధింపులు ఆమెకు తప్పలేదు. ఆ వేధింపులను కూడా జయంతి ధైర్యంగా ఎదుర్కొంది. ఎక్కడా కూడా తాను తలొగ్గలేదు. జయంతి సాహాసానికి పోలీసులు సైతం వెనుకంజ వేయాల్సి వచ్చింది. జయంతి కేవలం జర్నలిస్టుగా మాత్రమే కాక, గిరిజన సమాజంలోని బాలికలు చదువుకునేందుకు ఒక ఎన్‌జీవోను సైతం నిర్వహిస్తోంది. ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద అవకాశాలే ఆమె ముందు వచ్చి వాలినప్పటికీ, తాను మాత్రం తన గిరిజన కమ్యూనిటీలోనే తొలి మహిళా జర్నలిస్టుగా సేవలందిస్తోంది. ఒకవేళ తను కనుక ఇక్కడ పనిచేయకపోతే, తన చదువుకు సార్థకమే లేదని అంటోంది జయంతి. - కె. శ్రావణి రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment