మావోయిస్టుల అడ్డాలో మహిళా రిపోర్టర్‌! | Female reporter in Maoists Adda! | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల అడ్డాలో మహిళా రిపోర్టర్‌!

Published Mon, Feb 19 2018 12:40 AM | Last Updated on Mon, Feb 19 2018 8:23 AM

Female reporter in Maoists Adda! - Sakshi

హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన జాతీయ మహిళపాత్రికేయుల సదస్సులో ప్రసంగిస్తున్న జయంతి

అదొక మారుమూల గిరిజన ప్రాంతం. అరకొరా వసతులు ఉండే ఈ ప్రాంతంలో అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. చదువు, పుస్తకాలు ఇవేమీ వారికి తెలియవు. కానీ బురుడ జయంతి మాత్రం ఇలాంటి అననుకూల పరిస్థితులన్నింటినీ అధిగమించింది.అతికష్టంమీద గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది.

కేవలం గ్రాడ్యుయేషన్‌తోనే ఆగిపోలేదు. జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని, తనలాంటి తనలాగే మరో పది మంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచింది. ఒడిశాలోని అత్యంత నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన మల్కన్‌గిరి గిరిజన సమాజంలో తొలి మహిళా జర్నలిస్టుగా అందరి మన్ననలు పొందుతోంది. తన గిరిజన సమాజంలో మార్పు కోసం కలంతో పోరాటం చేస్తోంది.

ఇంట్లో తొమ్మిదో అమ్మాయి!
పది మంది అక్కాచెల్లెళ్లలో జయంతి తొమ్మిదో అమ్మాయి. గిరిజన కోయ తెగలో అసలు అక్షరాస్యతే తక్కువ. అమ్మాయిలు బడికి వెళ్లడమే అరుదు. ఇక  చదువుకోవడానికి  సదుపాయాలు సంగతి సరేసరి.  కానీ జయంతి తండ్రి ఎన్నో కష్టాలకోర్చి పిల్లల్ని చదివించారు. జయంతి పట్టుదలగా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. కానీ ఆమె లక్ష్యం కేవలం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడం కాదు. జర్నలిస్టు కావాలని కలలు కంది. తద్వారా తన కుటుంబానికి అండగా ఉండటంతోపాటూ, వెనకబడి వున్న తన గిరిజన సమాజంలో మార్పు తీసుకురావాలని భావించింది.

పట్టు పట్టి కలం పట్టింది
జర్నలిస్టు కావాలన్న తన కలను సాకారం చేసుకోవటానికి ఎన్నో కష్టాలు పడింది జయంతి. ఒడిశా సెంట్రల్‌ యూనివర్సిటీలో సీటు వచ్చింది కానీ, ఇంటికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్సిటీకి వెళ్లాలంటే కష్టంతో కూడుకున్న వ్యవహారం. హాస్టల్‌లో ఉండి చదువుకునే ఆర్థికస్తోమతా లేదు.

ఆ సమయంలో, తన స్నేహితురాలు ఆమెకు అండగా నిలిచింది. తన బంధువు ఇంట్లో ఉండి చదువుకునేలా అవకాశం కల్పించింది. అలా జయంతి జర్నలిజం కోర్సు పూర్తి చేసింది. చదువు అయిపోగానే ఇంటర్న్‌షిప్‌ కోసం జయంతి భువనేశ్వర్‌ వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు. ఆమె ప్రతిభను, ఉత్సాహాన్ని, తాపత్రయాన్ని గమనించిన సినీ నిర్మాత బిరేన్‌ దాస్, జయంతికి గైడెన్స్‌ ఇచ్చారు.

జర్నలిజంలోనూ లింగ వివక్ష
ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి, ప్రధాన మీడియాలోకి ప్రవేశించింది జయంతి. ప్రస్తుతం ‘కళింగ’ టీవీలో పనిచేస్తోంది. తన గిరిజన కమ్యూనిటీ మల్కన్‌గిరిలోనే రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. జయంతి కల నెరవేరినప్పటికీ, నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన మల్కన్‌గిరిలో కేవలం ఒకే ఒక్క మహిళ రిపోర్టింగ్‌ చేయడం ఆమెకు సవాల్‌గానే మారింది. అక్కడ కూడా లింగ వివక్ష ఎదురైంది. తన పురుష సహోద్యోగులు జయంతిని వెనక్కి లాగడానికి, భయపెట్టడానికి ఎన్నో పథకాలు వేసేవారు. ప్రతి అడుగును తను సవాల్‌గా తీసుకునేది. పురుష జర్నలిస్ట్‌లకు పోటీగా రాణించడం ప్రారంభించింది.

పోలీసుల వేధింపులు
వీటన్నింటికీ మించి ఆమెకెదురైన మరో పెద్ద సవాల్‌ పోలీసు వేధింపులు! ఒక కోయ తెగకు చెందిన అమ్మాయి విద్యాధికురాలిగా ఉండటం, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటంతో పోలీసులు ఆమెపై మావోయిస్టు ముద్ర వేశారు. ఈ క్రమంలో పలురకాల వేధింపులు ఆమెకు తప్పలేదు.ఆ వేధింపులను కూడా జయంతి ధైర్యంగా ఎదుర్కొంది. ఎక్కడా కూడా తాను తలొగ్గలేదు.

జయంతి సాహసానికి పోలీసులు సైతం వెనుకంజ వేయాల్సి వచ్చింది. జయంతి కేవలం జర్నలిస్టుగా మాత్రమే కాక, గిరిజన సమాజంలోని బాలికలు చదువుకునేందుకు ఒక ఎన్జీవో సైతం నిర్వహిస్తోంది. ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద అవకాశాలే ఆమె ముందు వచ్చి వాలినప్పటికీ, తాను మాత్రం తన గిరిజన కమ్యూనిటీలోనే సేవలందిస్తోంది. ఒకవేళ తను కనుక ఇక్కడ పనిచేయకపోతే, తన చదువుకు సార్థకమే లేదని అంటోంది జయంతి.

 – కొటేరు శ్రావణి, ‘సాక్షి’ వెబ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement